Sunday, January 28, 2024

 

https://youtu.be/ztusU0r9o_o

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:ఆనంద భైరవి

పదునాల్గు భువనాలు పసిడి ఊయల చేసి
నాల్గు వేదాలను చేరులుగ సమకూర్చి
అందాల తొట్లొలో సుందరా నిన్ను బజ్జుంచి
లాలిజోయనుచునూ ముదమార ఊపెదను

లాలిజో లాలిజో శ్రీ రఘు వంశతేజా
నీ బోసినవ్వులే హాయి యువరాజా

1.స్ఫూర్తినిచ్చెటి పేరునే నీ చెవిలొ చెప్పెదను
నినుగన్న  అమ్మయూ నాన్నయూ ఒప్పగను
కీర్తితేవాలి నువు  మునుముందు గొప్పగను
ప్రగతి నొందగ జగతి మలుపు తిప్పగను

2.తరచి తరచి నీకు తగు పేరును ఎంచి
బియ్యపు పళ్ళెంలో ఉంగరంతొ రాయించి
సంప్రదాయముగనూ నామకరణం జరిపించి
ఆనందమొందారు ఇంటిల్లిపాదీ తమ మేనుమరచి

3.బావిలోనుండి మీఅమ్మతో నీటినే చేదించి
నానిన శనగలను అచటి వారికంతా పంచి
వస్త్ర తాంబూలాలు వచ్చిన వనితలకునిచ్చి
జరిపిరి నీ బారసాలను కడువైభోగమొనరించి

 


https://youtu.be/l1NkXAuNqh0?si=uRe4ISemRb3Cse0r

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

అమ్మతనము అతివకెంతొ అపురూపం
అమ్మలార చేయరో సుదతికి సీమంతం
గర్భాలయములో కొలువు దీరె శిశుతేజం
దీర్ఘాయురస్తుయని దీవిస్తూ ఈయరో నీరాజనం

1.షోడష సంస్కారాలలో ఉత్కృష్టమైనది
సతి సంతతి బడయుటలో అదృష్టమైనది
వేదోక్త మంత్రపూత దృష్టిదోష హారకమే ఇది
పతి శ్రీమతి నతిగా లాలించడమే వేడుకైనది

2.ముంచేతికి గాజులను నిండారగ తొడగరో
పాదాలకు పసుపూ పారాణియు పూయరో
చెక్కిళ్ళకు శ్రీగంధం మురిపెముగా నద్దరో
చక్కని చక్కెర బొమ్మను   మక్కువ సింగారించరో

3.ముత్తైదువులంతా ముదముగ ఏతెంచి
ఉల్లాసము కలిగించగా ఆటలాడీ పాడీ
సుఖప్రసవ మొందుటకు సుద్దులు బోధించి
అక్షతలే చల్లాలి మనసారా ఆశీస్సుల నందించి