Friday, January 21, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అన్నీ తెలిసీ తెలియనట్టుంటావు

మా మనసెరిగీ ఎరగనట్టుంటావు

వలలెన్నొ పన్నేవు వలపుల్ని రువ్వేవు

వెర్రిగా నీ వెంటపడితే కన్నెర్ర జేసేవు

మమ్ము మా మానానా మననీయవైతివే మానినీ

నీవిలాసానా వశపరచుకొందువే జగజ్జననీ


1.వ్యామోహమేల పురుషులకు మాత్రమే

వనితలవనీతలాన ఆసాంతం పవిత్రమే

పక్షపాతమేల నీకు పడతి ఎడల పరాశక్తీ

ఇనుపమతి మాకు సుదతికి సూదంటుశక్తి

మమ్ము మా మానానా మననీయవైతివే మానినీ

నీవిలాసానా వశపరచుకొందువే జగజ్జననీ


2.చంచలవు నీవైనా వెంటతిప్పుకుంటావు

నశ్వరపు అందాలైనా లోబరచుకుంటావు

ఆత్మసౌందర్య మర్మం అంతుబట్టనీయవు

అంతచ్ఛక్షువన్నది మాకు తెరుచకోనీయవు

మమ్ము మా మానానా మననీయవైతివే మానినీ

నీవిలాసానా వశపరచుకొందువే జగజ్జననీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వెన్నెలనే చీరగా కట్టుకున్నావే

కన్నులలో చుక్కలనే నిలుపుకున్నావే

పెదాలపై చంద్రవంక నుంచుకొన్నావే

చెంపలపై సొంపులెన్నొ వంపుకొన్నావే

కలల్లోన కవ్వించే గంధర్వకన్యవే

కళ్యాణివై  మురిపించే రాగరమ్యవే


1.నీ స్నేహమె నాకు అపురూప బహుమానమె

నీ చెలిమే నాపాలిటి జన్మాల తపఃఫలమె

నీ మైత్రి ననుమెచ్చి దైవమొసగినట్టి వరమె

నీతో అనుబంధమే అనన్యమౌ రాధామాధవమే 

సౌందర్యవతివై పాలించే చంద్రకళవే

మధ్యమావతివై లాలించే మంజుల రవళివే


2.ఎడారిలో ఏకాకికి ఒయాసిస్సువైనావే

నా చీకటి జీవనాన ఉషస్సువై వచ్చావే

కడదాకా చేయిపట్టి నడిపించే దేవతవే

కడతేరగ నను వీడక తోడొచ్చే నా జతవే

పావనగంగవై భంజించవే మదమునే

శివరంజనీ రంజింపవే నా మనమునే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాయీ అని ఒకరంటారు బాబా అని ఒకరంటారు

మా తండ్రివి నీవంటారు మా తాతవు నీవంటారు

బాంధవ్యమేలయ్యా భవబంధం త్రెంచేవాడికి

చుట్టెరికమేలయ్యా గట్టునెక్కించేవాడికి

గుట్టు విప్పవయ్యా సాయీ ఈ మర్మము

ఎరుకపరచుటేకాదా నీ ధర్మము


1.అనాథవీవని అంటారు ఫకీరు నీవని అంటారు

అవథూత నీవని అంటారు సద్గురువీవని అంటారు

మందిరాలు నీకేలా శిథిల మసీదులో ఉండేవాడికి

వైభవాలు నీకేలా చిరుగుల కఫ్నీ ధరించువాడికి

గుట్టు విప్పవయ్యా సాయీ ఈ మర్మము

ఎరుకపరచుటేకాదా నీ ధర్మము


2.అందరితో ఉన్నావు అందరిలో ఉన్నావు

అందరికొరకు తపియించావు అందరికొరకె జీవించావు

ఎవరెక్కడ పోతే ఏంటి ముక్కుమూసుకున్న మునివే 

బోధించి సాధించేదేమిటి నిజమైన నిష్కామునివే

గుట్టు విప్పవయ్యా సాయీ ఈ మర్మము

ఎరుకపరచుటేకాదా నీ ధర్మము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎగిరిపోవే సిలకా ఏమాత్రం ఆలసింపకా

ఎందుకు వచ్చావో ఇలకిక నీకేమైనా ఎరుకా

ధర పంజరాన బానిసవై ఉరఃపంజరాన బంధివై

ఆర్జించినాగాని ఆంక్షలెన్నో ఖర్చుచేసినాగాని కట్టడులెన్నో

పరులకొరకు అక్కఱరాక నీకోసం నీవైనా లేకా

స్వేఛ్ఛలేని బ్రతుకెంతదాక అనుక్షణం చచ్చాక


1.మనిషిగా నిను మసలనీరు వ్యక్తిగా ఎవ్వరు గుర్తించరు

కులమతాల బురదను పూసి మానవతను మసిజేసి

కట్టుబాట్లనెన్నో అంటగడతారు ఇరుకైన చట్రాల్నే ఒంటబెడతారు

నిన్ను నిన్నుగా ఎపుడూ ఉండనివ్వరు నిశ్చింతగా రోజూ పండనివ్వరు

పరులకొరకు అక్కఱరాక నీకోసం నీవైనా లేకా

స్వేఛ్ఛలేని బ్రతుకెంతదాక అనుక్షణం చచ్చాక


2.గాలికోయే కంపలెన్నో కొంపలోన వేస్తారు

బట్టగాల్చి మీదవేసి వినోదాన్ని తిలకిస్తారు

మౌనంగాఉందామంటే ఊరుకోరు మాటల్తో ముంచేస్తే తట్టుకోరు

సంసారిగాను వేగనివ్వరు సన్యాసిగాను సాగనివ్వరు

పరులకొరకు అక్కఱరాక నీకోసం నీవైనా లేకా

స్వేఛ్ఛలేని బ్రతుకెంతదాక అనుక్షణం చచ్చాక