Sunday, January 15, 2023

 https://youtu.be/3EwRhVk0OZQ?si=TQ_1ZONMhkfxh8-S

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:నాట


మనసు నీమీద నిలుపనైతి ఓ మహాదేవ

చిత్తమందు భక్తిభావం అస్థిరమాయే పరమశివా

చేరదీయి ప్రేమమీర నన్ను ప్రభో చంద్రశేఖరా

మార్గదర్శి నీవే నాకు నమో రామలింగేశ్వరా


1.బిల్వదళాలతో కొల్వనైతి ఖట్వాంగధరా

దోసెడు నీరైన నీపై పోయకుంటి గంగాధరా

వేదమంత్రాలతో పూజించకుంటిని విశ్వేశ్వరా

భజన గీతాలతో కీర్తించకుంటిని భీమేశ్వరా


2.గుడిలో నీ లింగాన్ని దర్శించనైతి దూర్జటి

శివ క్షేత్రాల కెపుడు యాత్రగా చననైతి ఝర్ఝరీ

సోమవారమునాడైనా ఉపవసించనైతిని కపర్దీ

శివరాత్రి జాగరణా ఎరుగకుంటి నేను ఉదర్బీ

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:ద్విజావంతి


నాకింతటి అంతులేని దేహ మనో చింత నా

అనంతా అచ్యుతా తిరువేంకటనాథా కొఱవడెనా నీ చింతనా

నను మననీయవైతివే మంగాపతి నీ చెంతన

నిర్మించనీయవైతివే నీకూ నాకూ నడుమన వంతెన


వాసుదేవ గోవిందా వనమాలీ నరహరి

వామన పురుషోత్తమా ముకుంద మురారి


1.మొక్కుబడిగ నిను మొక్కితె చిక్కెడి వాడవేఁ?

మొక్కనుండి విడివడితే నీ తలపుల పూలు వాడవేఁ!

మా మొక్కులు ముడుపులు మిక్కిలై ఏవీ వాడవేఁ?!

మొక్కవోని భక్తితో ఎక్కిన దక్కెడి ఏడుకొండల రేడువే !

వాసుదేవ గోవిందా వనమాలీ నరహరి

వామన పురుషోత్తమా ముకుందా మురారి


2.గరుడాద్రి వృషభాద్రి నధిగమించ మా గండాలు తొలగు

అంజనాద్రి నీలాద్రి నధిరోహంచ నీ అనుగ్రహమే  కలుగు

శేషాద్రి వేంకటాద్రి నెక్కితే మా ఆత్మజ్యోతి వెలుగు

నారాయణాద్రి చేరితే స్వామి నీ దివ్య దర్శనము దొరుకు


వాసుదేవ గోవిందా వనమాలీ నరహరి

వామన పురుషోత్తమా ముకుంద మురారి

 

https://youtu.be/oMcgAGVGonU

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:పీలూ


పౌష్యలక్ష్మి నీకుమా హార్దిక  స్వాగతం

ధాన్యలక్ష్మి నీదయతోనే మా జీవితం

మకర సంక్రాంతి లక్ష్మి మంజుల మానస లక్ష్మీ

ఏతెంచును నీతోనే భువిన ఉత్తరాయణం 

మేమర్పింతుము  పితరులకు తిల తర్పణం

సంకురాతిరి పండుగ మా సంతోష కారణం


1.పాడీ పంటలతో నిండును మా గాదెలు

పిల్లాపాపల సందడితో పండును మా కలలు

అంబరాన ఎగురును రంగురంగుల పతంగులు

పందాలు పరాచికాలు విందులు వినోదాలు

సంబరము సంరంభము  సయామీ కవలలు

సంకురాతిరి పండుగ మా సంతోష కారణం


2.భోగి మంటలు పిండి వంటలు కొత్త జంటలు

సకినాలు చెవోడీలు జంతికలు లడువాలు 

రంగవల్లులు రథం ముగ్గులు పల్లె పడుచుల సిగ్గులు

డూడూ బసవలు రంగని తలచే హరిదాసులు

బంతులు చామంతులు ఇంతుల కనుమ నోములు

సంకురాతిరి పండుగ మా సంతోష కారణం


*సంక్రాంతి శుభాకాంక్షలు*

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగంపహాడి


నరహరీ నీ దయ-మా బ్రతుకే నీదయ

నీ నామమే ధ్వనించు మా ఎద లయ

ఉఛ్వాస నిశ్వాసల నీ  స్మరణమేనయా

నీ నీడలొ కడతేరుట మా ధర్మపురీయుల భాగ్యమయా సౌభాగ్యమయా


1.గోదావరి ఆలపించు నీ సంకీర్తన గలగలరావాలతో

కోనేరు పులకించు తెప్పోత్సవ డోలోత్సవాలతో

వరాహతీర్థము మురిసేను నీవే తనదరి చేరినంతనే

తామర పూలకొలను తరించును ఏటా తనకడ నీవొచ్చినంతనే


2.నీ సుప్రభాత గీతాలు మము మేలుకొలుపును

నదికి పోయి తానమాడ మా పాపాలు తొలగును

మందిరాన నీ సుందర రూపుగని ధన్యత నొందేము

నిత్యము నీ చింతనలో మునిగే మాకందరికీ

వైకుంఠప్రాప్తి తథ్యము