Wednesday, September 18, 2019

పోరుగడ్డ తెలంగాణ తిరగబడ్డది
విముక్తి కోసమే దేనికైన తెగబడ్డది
బలిదానాలసాక్షిగా సాధించిన ప్రతిబిడ్డదిది
త్యాగనిరతికేనాడూ బహుదొడ్డది
జై తెలంగాణ జయహో తెలంగాణ

1.రజాకార్ల ఊచకోత రక్తపాత మాయెగా
నిజాం నిరంకుశత్వమే బడుగుల తుడిచేయగా
దొరలగడీ చెఱలోన నలిగీ బాంచన్ కాల్మొక్తగా
భూస్వాముల పాలబడి వెట్టిచాకిరితో అశక్తగా

2.నగ్నంగా పడుచులతో బతుకమ్మలాడించగ
కడజాతివారికి శిక్షగ మూత్రాలు త్రాగించగ
నోటికాడి కూడుకూడ ముష్కరమూక కొల్లగొట్ట
కన్యత్వాన్ని తొల్తగ చెఱచి దాసీలుగ మార్చగ

3.కొమురంభీం రాంజీల ఆదివాసి పోరాటం
కాళోజి దాశరథిల అక్షర పోరాటం
దొడ్డికొమ్రయ్య సూరి వంటివారి సాయుధపోరాటం
ముక్కోటి తెలంగాణ ప్రజల నెరవేరిన ఆరాటం
జై తెలంగాణ జయహో తెలంగాణ

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:ధాని

గర్భస్థ శిశువుకూ గ్రాసాన్ని కూర్చుతావు
ఏక కణ జీవినీ లోకానికి తెస్తావు
కాలచక్రమెప్పటికీ ఆగకుండతిప్పుతావు
నీవుండేదేతావు నిఖిలము నిండుతావు
శ్రీలలితే మాతరం భజామ్యహం నిరంతరం
హే భగవతి దేహిమే తవ పాదసన్నిధిం

1.నీడగ తోడుంటావు నిత్యసంతోషిణి
రెప్పగ కాపుంటావు నిర్మలకాత్యాయిని
చరాచర జగత్తునంత నియతిన నడిపిస్తావు
ఏదో పరమార్థము సృజనకు ముడిపెడతావు
శ్రీలలితే మాతరం భజామ్యహం నిరంతరం
హే భగవతి దేహిమే తవ పాదసన్నిధిం

2.సత్వరజస్తమో గుణాతీతవు మాతా గాయత్రి
సత్యసుందర శివంకరివి జగన్మాతా రాజేశ్వరి
నిన్ను తెలియగోరితిని నిరంజని పావని
నీ బాలుడనే జనని అనుగ్రహించు యోగిని
శ్రీలలితే మాతరం భజామ్యహం నిరంతరం
హే భగవతి దేహిమే తవ పాదసన్నిధిం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:శహన

ఎలుకతోలుతెచ్చి ఏడాది తోమినా
ఏమాత్రమైనా అదిమారునా
బోధలెన్నొ చేసి సన్మార్గము చూపినా
ఆత్మ ఏనాటికైనా నిను చేరునా
సాయీ నువు మళ్ళీ అవతరించవోయి
బాబా నువ్వే మము తరింపజేయి

1.రెండురూకలీయగలిగితే చాలన్నావు
దండిగా ఆర్జించి దాచుకొంటున్నాము
సాటి మనిషికించుకైన సాయపడుమన్నావు
అసూయతో మరింత హానిచేయుచున్నాము
సాయీ కాసింత కనికరించవోయీ
బాబా ప్రేమనేర్పి  ఉద్ధరించవోయి

2.మనసారా నిన్నే నమ్ముకోమన్నావు
తటపటాయిస్తూ శరణుకోరకున్నాము
గుండెలోన నిన్ను నిలుపమన్నావు
గుళ్ళూగోపురాలు నిర్మించుతున్నాము
సాయీ మమ్మల్నిక సమూలంగ మార్చివేయి
బాబా మాచేయిపట్టి నీచెంతకు చేర్చవోయి