Monday, February 3, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:దేశ్

అనుభవించడం నేర్చుకో ప్రతీ క్షణాన్నీ
పుణికిపుచ్చుకో నేస్తం ఆస్వాదించు లక్షణాన్ని
రోజూ వండేదైనా రుచీ రుచీ భిన్నమే
రోజూ ఉండేదైనా ఏ అభిరుచీ నూత్నమే

1.కొత్తగా పుట్టుకరావు కొంగ్రత్త జీవితాలు
నిత్య నవీనమై ఉండబోవు అనుభూతులు
మార్చుకుంటె చాలు మనదృక్పథాలు
అగుపించితీరుతాయి ఊహించని కోణాలు

2.అక్షరాన్ని లక్ష్యపెట్టు మంత్రమై ఫలియిస్తుంది
ప్రజ్ఞ మీద దృష్టిపెట్టు  ప్రగతిదారిపడుతుంది
పరిసరాలలోనే స్వర్గం దీక్షతొ నిర్మించుకో
పరస్పరం సహకారం మైత్రితో ఇచ్చిపుచ్చుకో
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:బేగడ

నీ సుందర వదన దర్శనం-నాకు సుప్రభాతం
నీ మందస్మిత అధరం నాకు- మకరంద మందారం
నీ పలుకుల ప్రవాహం-నా జలకములకు జలపాతం
నీ స్నిగ్ధ కుసుమ దేహ స్పర్శం-అపరిమితానంద పారవశ్యం

1.రసమంజరీ మంజులమీ మంజీర నాదం
నవమోహినీ ఆ సవ్వడే నను నడిపెడి జీవనవేదం
నాకోసమే దిగివచ్చిన ఇంద్రచాపమే నీవు
ముంచెత్తే  మత్తుజల్లే  శరశ్చంద్రరూపమె నీవు

2. నీ కనులు నాపాలిటి ఇంద్రనీలమణులు
నాభి మంజూషయై దాచుకొంది నవనిధులు
ఉరోజాలు మేరుగిరులు జఘనాలు హిమనగాలు
నడుము కిన్నెరసానిగ ఒలికేను నయగారాలు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:తిలాంగ్

పూబాలవే అలివేణీ
అపురూప అందాలరాణీ
వదలదు నీ రూపు ఏకవిని
వర్ణించగ వరమీయి, నా మనవిని విని

1.ఎన్నిమార్లు అడగాలో సై యని అనడానికి
ఎంత బతిమిలాడాలో ఒప్పుకోవడానికి
నన్ను కలచివేస్తోంది  తీరని కలవొకటి
పాటగా నిన్ను మలచని నా ప్రతిభ ఏపాటి

2.కనికట్టు ఏదోచేసి ఆకట్టుకున్నావే
మంత్రమేదొవేసినన్ను లోబరచుకున్నావే
కల్పనలోనే  చిత్రిస్తాను ఇక నిన్ను
ఆపతరమా నీకు ఏకమైనా మన్ను మిన్ను
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:ముఖారి

మల్లెలేరి మాలకడతా రాలి పడగ.. నీ నవ్వుల్లో
మరులుగొని మాలపెడతా నీలికురుల నీ తల్లో
కాసింత చూడవె నాకేసి చేపకళ్ళ తల్లో
నీతోటి స్నేహం చేస్తా ఇలలో కుదరకుంటే కల్లో

1.మకరందం గ్రోలుతా నీ మాటల్లో
తన్మయమే చెందుతా నీ పాటల్లో
బ్రతుకంతా విహరిస్తా నీ వలపుతోటల్లో
నీ వెంటే నడుస్తా ఆనందపు బాటల్లో

2.నిను నాయకి చేస్తా నా కవితల్లో
నీ సాంత్వన కోరుకుంట నా వెతల్లో
నిను దేవత చేస్తా నా గుండె గుళ్ళో
నే సేదతీరుతా నీ ఊహల ఒళ్ళో