Friday, December 20, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:కల్యాణి

నీ పదముల నా మది కొలిచేను
నా పదముల నీ కృతి మలిచేను
తిరుపతి పుర గోవింద హరీ
శరణు శరణు సప్తగిరీ  ముకుంద మురారీ

1.అక్షర లక్షలు నీకర్పించెద
కవితల కోటి నీకందించెద
గీతమాలికల అలరించెద
కావ్యశతముల కానుకలిచ్చెద
తిరుపతి పుర గోవింద హరీ
శరణు శరణు సప్తగిరీ  ముకుంద మురారీ

2.నిత్య నరకము ఈ నరలోకము
నీ సన్నిధియే భూతల నాకము
తొలగించర నా అవిరళ శోకము
కావించర  కర్మల పరిపాకము
తిరుపతి పుర గోవింద హరీ
శరణు శరణు సప్తగిరీ  ముకుంద మురారీ
విచ్చుకోనీ విరిలా మోవి
విరజిమ్మనీ పలుకుల తావి

దైవాన్ని నమ్మితే మానవుడే మాధవుడు
మనిషినే నమ్మితే మనిషి దైవమౌతాడు

రాగానిదేముంది అనురాగం పంచితే
ఇష్టపదులు వింతకాదు కోయిలనే మించితే

సాగర వైశాల్యం ఎంతుంటే ఏమిటి
నావ  దరిని చేర్చదా ఆటుపోట్లు దాటి

కన్నెంత కార్చినా కన్నీరు దోసిట
గుండె చెలమె తోడితే ఒడవదు ఊట

చిమ్మచీకటైతెనేమి చిరుదివ్వెతొ తొలగదా
కఠిన హృదయమైతేమి రాఖీ చిరునవ్వుతొ కరుగదా
భావనంతా నీదే భాష మాత్రం  నాది
ఊహలన్నీ నీవే అక్షరాకృతి నాది
మనసు మనసుతొ మాటలాడితె
ఉప్పొంగవా మధురానుభూతులు
తత్వమొకటిగ సాగిపోతే
రవళించవా మన స్నేహగీతులు

1.కనురెప్ప మాటున ఒదిగిపోతా
నిదుర చాటున  కలగమారుతా
ఉదయింతునే పెదవిపై చంద్ర హాసమునై
అలరింతునే హృదయమ్మునే ఇంద్రచాపమునై
నేస్తమా నీ జ్ఞాపకాలే చెఱకు గడలు
ప్రియతమా నీతో క్షణాలే పాలమీగడలు

2.అభిరుచుల మాధురి ఒకటిచేసే
అభివ్యక్తులె అనుబంధమై పెనవేసే
ఇవ్వలేనిది ఏదిలేదు ప్రాణమే నీపరం చేసా
కోరగలిగిదేది లేదు నీ ప్రేమనే చవిచూసా
నేస్తమా నీ జ్ఞాపకాలే చెఱకు గడలు
ప్రియతమా నీతో క్షణాలే పాలమీగడలు