Wednesday, May 20, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:గానమూర్తి

ఎరుగవైతివే మనసా
ఎంతటిదే నీ భరోసా
ఇపుడైతె కాదని
నా కడకు రాదని
నిర్లక్ష్యము నీకిక తగదే
చరమాంకమేదో చిత్తముకానదే

1.రేపనుకున్నది చేయవె నేడే
నేడనుకున్నది కావించు ఇపుడే
మించును తరుణము
మరణమనూహ్యము
తాత్సారమికపై కూడదే
తనువు తపనల  వీడదే

2.దాచినదంతా దానమీయగ
భవబంధములే వదులవగ
తామరాకు పై నీటిబొట్టువై
ఆనందానికి ఆటపట్టువై
పరచింతనలో చింతలు వీడి
పరవశించవే నీవై సిద్ధపడి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:శుభ పంతువరాళి

చలనము లేదా చక్రధరా
ఉనికే వికల్పమ ఉరగ శయనా
నిజస్తుతి జేసినా జాడే కనరాదు
నిందాస్తుతికీ స్పందనయే లేదు

1.లేవనుకుంటే ఒకటే నిశ్చింత
కలవనుకుంటే కలతలె చెంత
బలమేనీవూ బలహీనతవూ
కర్మఫలమువై ఇల వరలెదవు
పొగడినా ఆచూకి కనరాదు
తెగడినా ఏ అతీగతి లేదు

2.ఆస్తికతకు నీ కథలెన్నెన్నో ఎన్న
నాస్తికతకు నీవున్న గతి సున్న
ప్రత్యక్షమవరా ప్రహ్లాద వరదా
ప్రత్యక్షరమిక నిను స్మరించెద
తప్పదు స్వామీ ఇదె తరుణము
నీ మనుగడకై ఆవిష్కరణము
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కళ్యాణ వసంతం

నీకిది తగదమ్మా పలుకుటెలనాగ
మాయలొ ముంచగ మాటలమిటారి
అద్దమునందు చంద్రబింబం
అరచేతిలోనే అలవైకుఠం
కోరితినానిను కోర్కె మీరగను
గుణరహిత కవితను రసహీనతను

1.ఆకలితీర్చగ అప్పచ్చులేల
ఊరడించగ తాయిలమేల
గాఢత గలిగిన కవనమునీయవె
సారమున్న సారస్వతమొసగవే
కోరితినానిను కోర్కె మీరగను
గుణరహిత కవితను రసహీనతను

2.అగణితమౌ తాలేల కాగితాల
అనుచితమౌ సోదేల నా గీతాల
గాయము నయమౌ గేయము రాయనీ
మనసుల నలరించు సాహితి నీయనీ
కోరితినానిను కోర్కె మీరగను
గుణరహిత కవితను రసహీనతను