Saturday, September 19, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆ రెండు కళ్ళుచాలు నా గుండె ఆగడానికి

ఈ చిలిపినవ్వు చాలు ఎద తిరిగి మ్రోగడానికి

కంజదళాయతాక్షీ  తాళలేను నినుగనక

నా హృదయం ప్రణయం జీవితం నీవే గనక


1.మనిషన్న వాడెవడైనా నీ కనులకే గులాము

కవులందరు చేస్తారు నయనాలకే సలాము

ముందుకెళ్ళలేరెవరూ అందాలు నీకెన్నున్నా

చూపులతో కట్టేసే కనికట్టే నీ ఘనతంటున్నా


1.మీనాలు కలువలు కళ్ళకెన్ని ఉపమానాలు

తూపులు కైపులు చూపుకెన్ని రూపకాలు

రాజ్యమే నాకుంటే చేయగలను పాదాక్రాంతం

 ప్రాణం కంటె విలువైందేదీ  చేసేసా అదినీ సొంతం


Pic courtesy:fb sharing

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


స్ఫురణకు వస్తోంది స్వాతిముత్యం

మనసుకు తోస్తోంది జాతి స్ఫటికం

నీలోని నిర్మలత్వమే మందాకిని సంవరం

నీ పారదర్శకత్వమే మానస సరోవరం

నిన్ను చూస్తె నేస్తమా కలిగేను ఉల్లాసం

నీ నవ్వుకంటుంటే మదికెంతొ ఆహ్లాదం


1. నీ సాన్నిధ్యంలో మలయమారుతం

నీ మేని సౌరభంలో నవపారిజాతం

నీ ఒంటిఛాయలో వెన్నెలా నవనీతం

నువ్వేనువ్వే నేస్తమా మాటల జలపాతం

నిన్ను చూస్తె నేస్తమా కలిగేను ఉల్లాసం

నీ నవ్వుకంటుంటే మదికెంతొ ఆహ్లాదం


2.నీ చూపుల్లో చెలీ చెలిమి వర్షాలు

నీ భావుకతలో అనునిత్యం హర్షాలు

నిన్నుదర్శించి సామాన్యులూ కవులై

సాహితీసేవలోనా కాళిదాసు సములై

నిన్ను చూస్తె నేస్తమా కలిగేను ఉల్లాసం

నీ నవ్వుకంటుంటే మదికెంతొ ఆహ్లాదం


Pic courtesy:FACE BOOK sharing

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాటల్లా పాటౌతోంది మధుసూదనా

పాటే నిత్యం నాకు సాపాటౌతోంది 

పదమల్లా శ్రీ పదమౌతోంది జనార్ధనా

నీ పదపద్మాలచేర్చు బాటౌతోంది

శ్రీధరా శ్రీకరా శ్రీనివాసుడా కనికరించు వేవేగ

తపించనీ తరించనీ నను భవబంధాలు వీడగ


1.అన్నమయ్య పాటలా అలరించనీ

త్యాగయ్య కృతివోలె మైమరపించనీ

క్షేత్రయ్య పదము భంగి సింగారమొలకనీ

శ్యామయ్య కీర్తనయై తత్వంబోధించనీ

శ్రీధరా శ్రీకరా శ్రీనివాసుడా కనికరించు వేవేగ

తపించనీ తరించనీ నను భవబంధాలు వీడగ


2.జయదేవుని అష్టపదిగ పరవశింపజేయనీ

పురంధరుని గీతికగా రంజింపజేయనీ

రామదాసు గేయమై శ్రవణపేయమవనీ

మీరా భజనగా తన్మయమొందించనీ

శ్రీధరా శ్రీకరా శ్రీనివాసుడా కనికరించు వేవేగ

తపించనీ తరించనీ నను భవబంధాలు వీడగ