Saturday, September 21, 2019

"వీడరా దైన్యం-నీవె ఒక సైన్యం"

మ్రోగే బంధూకులు మూగవోయినాయి
ప్రశ్నించే కలాలన్ని విరిచివేయబడినాయి
నినదించే గళాలన్ని నొక్కివేయబడినాయి
అడవితల్లి ఒడిలోనే సమాధులైపొయినాయి
అడిగేవాడెవ్వడు అణచివేయబడినప్పుడు
దిక్కూదెస ఎవ్వరు హక్కుకాలరాచినపుడు

1.నీకు నీవె తోడై నీవే ఒక దండువై
అండదండవై అన్యాయంగుండెలొ నిదురోవాలి
చట్టాలను తెలుసుకొని బాధ్యతగా మసలుకొని
నిఖార్సైన పౌరుడిగా రూపొందాలి
అవినీతి మూలాలను పెకిలించివేయాలి
ప్రజలే ప్రభుతయని ఋజువే చేయాలి

2.కులమతాల మాయలోన ముంచేసే
నేతల తలరాతలు మార్చగ భరతం పట్టాలి
ఓటు నీకు ఆయుధమని నీవే యోధుడవని
గుర్తెరిగి ప్రలోభాల గురికాక పట్టంకట్టాలి
రాజ్యాంగమే దైవంగా భావించాలి
దేశ సమైక్యతె వేదంగా తలపోయాలి
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మోహన

కనురెప్పవేయనీయవు
తలనైన తిప్పనీయవు
చూపేమో సూదంటురాయి
నీఅందం అందానికె గీటురాయి

1.మడిగట్టుక కూర్చుంటే మననీయవు
మనసు నిగ్రహించుకుంటె పడనీయవు
తప్పుకొని పోతుంటే  కవ్విస్తావు
అందీఅందకుండ బులిపిస్తావు
నీ పరువం మదనుడి బాణం
నిను కన్నా కనకున్నా పోతుంది ప్రాణం

2.నీ మేని వంపులే హంపిలోశిల్పాలు
అంగాంగ హంగులే అజంతా చిత్రాలు
నువుకదిలే కదలికలే ఖజురహో భంగిమలు
నీ తనువు వర్ణనలే ప్రబంధకావ్యాలు
నీ వలపే  మోహన రాగం
నీ పొందే ఈ జన్మకు  ఓ రసయోగం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:వసంత భైరవి

కళాకారుల జీవితం
కళామతల్లికె అంకితం
చతుషష్టి కళల నైపుణ్యం
జన్మాంతరాల పుణ్యం
విశ్వకర్మ ఒసగిన వరము
మయబ్రహ్మ అనుగ్రహము

1.ఎక్కడ దాగుందో అంతటి కౌశలం
ఎవ్వరు నేర్పారో జన్మతః చాతుర్యం
సృజనలో బ్రహ్మనే మించిపోయారు
ప్రతిభలో ప్రకృతినే అధిగమించారు
భారతీ దేవీ ఆశీస్సులే అవి
సరస్వతీ మాత ఇచ్చిన దీవెనలే అవి

2.ఊహకైన అందనిది ఆ వైవిధ్యము
చూపుతిప్పుకోనీదా దృశ్యమే హృద్యము
అవకరమేమున్నా అది అడ్డుకానేకాదు
అందలాలు ఎక్కకున్నా చైతన్యమాగిపోదు
సృష్టికి ప్రతిసృష్టి చేసే విశ్వామిత్రులు
రసిక ప్రేక్షక జనులకు అభిమాన పాత్రులు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:హనుమత్తోడి

కపివరా మాకు ధైర్యమునీవేరా
కొండగట్టు దేవరా ఆత్మ స్థైర్యము నీవేరా
సంజీవరాయా సరగున మము బ్రోవరా
అంజనానంద మమ్ము అక్కునజేర్చుకోర
భజింతురానిను రామభక్త హనుమా
నుతింతురా పవనసుతా మము దయతో గనుమా

1.వాగధీశ పలుకులందు తేనె చిలుకనీయరా
జితేంద్రియా చిత్తమునే కట్టడి సేయరా
సింధూర వర్ణాంగా సుందరకాండ నాయకా
జానకి శోకనాశకా దానవాంతకా
భజింతురానిను రామభక్త హనుమా
నుతింతురా పవనసుతా మము దయతో గనుమా

2.చిరంజీవ పీడించే రగ్మతలను మాన్పరా
మారుతీ మానసిక శాంతిని చేకూర్చరా
లక్ష్మణప్రాణదాత ఆపదనెడ బాపరా
ప్రసన్నాంజనేయ మాకండగ నీవుండరా
భజింతురానిను రామభక్త హనుమా
నుతింతురా పవనసుతా మము దయతో గనుమా
పెదవి మీది పుట్టుమచ్చ పెంచె దాహము
చేతిమీది పచ్చబొట్టు తెలిపె మోహము
కనుకలమే రాసెనెన్నొ ప్రేమలేఖలు
మూగసైగలే తెలిపే మనసు ఊసులు

1.ముంగురులే పంపసాగె మేఘసందేశము
బొటనవేలు నేలరాయు అభినివేశము
చీరకొంగు వ్రేలుచుట్టు తీపిబిడియము
తలవంచి మెలిచూపుల ఆహ్వానము

2.మూతివిరుపు ఎఱుకపరిచె మది ఆత్రము
అధరమదుర మధురమాయే మదన శాస్త్రము
గాలిమోసుకొచ్చింది నిట్టూర్పుల ఊష్ణము
ఓపలేని విరహానికి ఇంకేల సాక్ష్యము