Monday, December 19, 2022

 https://youtu.be/UtB6oxI59fw?si=RQ4HOESefvcrc1uC


25) గోదాదేవి ఇరవై ఐదవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:రేవతి


అష్టమ గర్భాన అష్టమీ తిథి రోజున

జన్మించినావు దేవకీదేవికి చెఱసాలన

చేరినావు కృష్ణా యశోదానందుల గృహము నందున

గోలలే చేసినావు లీలలే చూపినావు వారి భాగ్య వశమున


1.మేనమామ కంసుని నిను దునిమే యోచనని

వమ్ము చేసినావు దమ్ముచూపినావు దుమ్మురేపినావు

మీ తలిదండ్రుల ఖైదు చేసిన మథురాధీశుని గని

రొమ్ము చరిచినావు నేలకూల్చినావు చంపివేసినావు


2ఎన్నని కొనియాడెదము నీ లీలని యదుభూషణా

నిన్నే శరణంటిమి బ్రోవగ మాపై ప్రేమగొన్న శ్రీ కృష్ణా

కోరివచ్చినాము వరమీయవయ్య మాకు పురుషార్థాలను

దయచేయవయ్యా మేము చేసెడి వ్రత పరమార్థమిలను

 

https://youtu.be/J96SI_FVyNI

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువ్వు నేనుగా మారిచూడు

నా అడుగులలో అడుగిడి నడు 

నిరంతరం నాఎద ఆరని కాడు

దరికొస్తే తెలుస్తుంది ఆ ధగడు


1.మనస్ఫూర్తిగానే చేస్తా నా ప్రతి చర్య

కోరుకుంటానదే ఎదుటివారి ప్రతిచర్య

నీ పట్ల నా తీవ్రతను అలా తీసి పారేయకు

అందరిలా నను జమకట్టి కొట్టి పారేయకు


2.ఉంటే ఉండాలి ఇరువురమొకటై

వద్దంటే మన ఇంట్లోనే మన ఇష్టమై

బరిలోకి దిగిపోయాకా ఇంకా ఇంత దూరాలా?

పరస్పరం అనవరతం మనమే మది దూరాలా!

 

https://youtu.be/l2cPkRRgKeg

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వాలు కన్నులు నాపై-వాలుతున్నవి

చిలిపి నవ్వులు నన్నే-ఏలుతున్నవి

బిగబట్టిన పెదాల ఎరుపే-మెరుపులీనుతున్నది

పట్టిపట్టి పదేపదే నను-నీ చూపు లాగుతున్నది

నేనోపలేనే ఎడబాటునీ-మన్నించవే నా పొరపాటునీ


1.నా బింకం సడలుతున్నది నీ పొంకం ముందు

నా గర్వం అణుగుతున్నది ఊహించగ నీ పొందు

కైపులో ముంచుతున్నది నీ అందం మత్తు మందు

దాసోహం దాసోహం ప్రేయసీ ఇంతకన్న ఇంకేమందు

నేనోపలేనే ఎడబాటునీ-మన్నించవే నా పొరపాటునీ


2.బెట్టునంత కట్టకట్టి కలిపేసా నది గోదాట్లో

పట్టుబట్టి దూరంపెట్టి నను ముంచకు నట్టేట్లో

మట్టిగొట్టుక పోతానే నన్నంటి ముట్ట నట్టుంటే

కంటికే కనిపించనే  కంటగింపుగా జమకట్టుంటే

నేనోపలేనే ఎడబాటునీ-మన్నించవే నా పొరపాటునీ

 

https://youtu.be/CM-0jPiyKcE?si=ZDvNbWdVTtSIFzes

24) గోదాదేవి ఇరవై నాలుగవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:బృందావన సారంగ


మూడు అడుగులతోటి ముల్లోకములు గొలిచి

కీర్తినొందిన శ్రీ కృష్ణమూర్తీ 

నీ పాదపద్మాలకు ఇదే శుభ మంగళం

ఆజానుబాహులతో శరపరంపర వైచి

లంకేశు కూల్చిన కోదండ పాణీ

నీ బలమైన కరములకు జయ మంగళం


1.చిననాటనే అకటా !శకటాసురుని ద్రుంచి

వాసికెక్కిన వాసుదేవా నీకు సుమ మంగళం

వృత్తాసురుని వడిసెల రాయిగా విసిరిన హరీ

వీరగాథతో అబ్బురపరచిన నీకు కర్పూర మంగళం


2.గోటితో గోవర్ధన గిరినెత్తి గోకులాన్ని కాచినా

గోపాలకృష్ణా నీ అపార కృపకిదే భవ్య మంగళం

కపిత్థాసురాది శత్రువులను వధియించిన

సుదర్శన చక్రధారీ నీ శౌర్యానికిదె దివ్య మంగళం


3.జయమంగళం నిత్య శుభమంగళంబనుచు

నీ లీలలు మహిమల గుణ గానమే మావ్రతం

ఇహపరములందును పరమార్థమొందుచును

తరియించగా సిద్ధింపజేయుమా మా నోము ఫలితం

 https://youtu.be/ovxNA3qH1Rc?si=vVzfj30Ai1ADPIcu

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:శుభ పంతువరాళి


జయ జయ జయ శంభోశంకరా

జయ త్రిపురాసురవిజయ శుభకరా

జయ పార్వతీ వల్లభా మనోహర హరా

జయ గోవిందార్చిత భవహరా పరా


1.నీ పదధూళి మాకు పరమపావనం

నీ తాండవకేళి కనగ తరియించును జీవనం

చంద్రమౌళీ నీ అభిషేకమే కైవల్యదాయకం

శుభపంతు వరాళీ రాగాన్విత గాన ప్రియం


2.పత్రం పుష్పం ఫలం తోయం కావు విశేషం

శివా నీ ఆరాధనకై వలయు నిర్మల మానసం

నిశ్చలమైన భక్తి మూఢమైదైనా కాదు దోషం

శ్రీ కాళ హస్తి చరిత తెలుపునదియె సందేశం

 

https://youtu.be/EO4VgWAKFS8?si=mwlo1Ts9i2pPYx-3

23) గోదాదేవి ఇరవై మూడవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:సింహేంద్ర మధ్యమం


దయచేయవయ్యా నవనీత హృదయా మాపై

దయచేయగ నీతలపులు మదిలో పొద్దూమాపై

వానకారున కుహరాన నిదుర చెదిరిన హరి రూపై

ఒళ్ళు సాగదీసి జూలును విదిలించి గర్జించిన సొంపై

నల్లనయ్యా నీ కృపతో వ్రత ఫలితము దక్కు మా మదికింపై


1.సర్వాలంకార శోభితుడవై  సభ కరుదెంచి

రత్నఖచితమౌ సింహాసనమును అధిష్ఠించి

విన్నపాలనాలకించి ఆపన్నుల అనుగ్రహించి

పరిపాలించెదవు నిఖిల జగతికి శుభములు కూర్చి

నల్లనయ్యా నీ కృపతో సత్ఫలితమునందేము వ్రతమాచరించి


2. నందకిషోర సందడిజేయగ వేంచేయరా

యదుకుల వీర గోవర్ధన గిరిధరా బలరామ సోదరా

పీతాంబరధారి వైజయంతి వనమాలి జగదీశ్వరా

కస్తూరితిలకాంకిత కౌస్తుభాలంకృత మురళీధరా

నల్లనయ్యా నీ కృపతో సత్ఫలితమునందేము వ్రతమాచరించనీయరా