Thursday, May 9, 2019

నీకు సాటి ఎవరయా వేంకట రమణా
కలియుగదైవమీవె కరుణాభరణా
మొక్కులు ముడుపులు తలనీలాలు
లెక్కకు మిక్కిలిగా భక్తులు తండోపతండాలు
ఏడుకొండలవాడా గోవిందా గోవిందా
వడ్డికాసులవాడా గోవిందాగోవిందా

1.పాదచారులౌతారు సప్తగిరులనెక్కుటకై
పడిగాపులు పడతారు నీ  దర్శనానికోసమై
పిల్లాపాపలతో వస్తారు నీ కృపకొరకై
చల్లగచూడమని వేడుతారు నమ్మికతో
ఏడుకొండలవాడా గోవిందా గోవిందా
వడ్డికాసులవాడా గోవిందాగోవిందా

2.పాపాలు తొలగించగ పాపనాశనం
పుణ్యాలనందగ ఆకాశగంగాస్నానం
తిరుమల వీథులే అపర వైకుంఠం
సిరులను కురిపించగ మంగాపట్నం
ఏడుకొండలవాడా గోవిందా గోవిందా
వడ్డికాసులవాడా గోవిందాగోవిందా

అమ్మ అనే మాట ఎంత విలువైనది
అమ్మ ఉన్నచోటి బ్రతుకు సులువైనది
అమ్మ ఎడద ఎంతటి విశాలమైనది
జనమంతా బిడ్డలుగా భావించగలుగునంతటిది
అమ్మంటే అనురాగమూర్తిరా
ప్రేమపంచడానికి అమ్మనే స్ఫూర్తిరా

1.ఆకలేసినప్పుడల్లా అమ్మతలపుకొస్తుంది
దిక్కుతోచనప్పుడల్లా అమ్మగురుతుకొస్తుంది
దెబ్బతాకినప్పుడూ అమ్మాఅని అరిచేము
నొప్పితాళనప్పుడూ అమ్మనే పిలిచేము
అమ్మంటే ఆదుకొనే ఆత్మబంధువు
అమ్మంటే  అంతేలేని అమృత సింధువు

2.చందమామనైనా నేలకు దింపుతుంది
గోరుముద్దలోనా మమత కలిపిపెడుతుంది
కథలెన్నొచెప్పుతూ బ్రతుకు బోధచేస్తుంది
హాయిగొలుపు జోలపాడి నిదురపుచ్చుతుంది
అమ్మ పేగు పంచుకొన్న బంధమురా
సకలజీవరాశుల్లో అమ్మ అద్భుతమ్మురా

3.రాసి రాసి కలం సిరా ఇంకిపోయినా
గుట్టలుగా పుస్తకాల రాశి మారినా
సృష్టిలోని ఘనకవులే ప్రతిభచూపినా
అమ్మ కవన వస్తువుగా అసంపూర్ణమే
అమ్మంటే కమ్మనైన భావనరా
అమ్మంటే దివ్యమైన దీవెనరా
గల గల పారుతోంది సెలయేరు
కళకళలాడుతోంది మన ఊరు
స్వచ్ఛనైన  జలాలతో
పచ్చనైన  పొలాలతో
రారా నేస్తం ఈతలు కొడదాం
సరదాసరదాగా చేపలు పడదాం

వేసవి సెలవులు ఆనందంగా
ఆటల పాటల గడిపేద్దాం
రెక్కలు సాచిన పక్షుల్లాగా
గగనపు వీథుల విహరిద్దాం
రారానేస్తం దోస్తీ చేద్దాం
సరదాసరదాగా కుస్తీ పడదాం

తోటమాలి గన్నుగప్పి
మామిడికాయలు కోద్దాం
మనని పట్టుకోను వస్తే
పరుగులు పెడదాం
దొరికిదొకటైనా పంచుకుందాం
కాకెంగిలి చేసైనా కమ్మగ తిందాం

చెట్టు చెట్టు పైనా
కోతికొమ్మలాడుదాం
పిట్టపిట్టతోనూ
కబురులు చెబుదాం
రారా నేస్తం కోయిలతో పోటీపడదాం
సరదాసరదాగా జాబిలితో జట్టే కడదాం


నా పుట్టుక కర్థమేమిటో
నా జన్మకు పరమార్థమేమిటో
ఎరిగించరా షిరిడిసాయీ
భవజలధిని వేగమె దాటించవోయీ
నా జన్మదినమున తీర్చరా వేదన
నామనసే నీకు  సాయీ నివేదన

1.అడగనిదే ఇచ్చావు ఎన్నో
అడుగడుగున తోడై నిలిచావు
అందలాలనెక్కించావు
అంతలోనె నిర్దయగా పడద్రోసావు
నా జన్మదినాన తీర్చరా వేదన
నామనసే నీకు  సాయీ నివేదన

2.ఎంతమందికో నీవు మహిమలు చూపావు
మరెందమందికో ఆత్మ బంధువైనావు
సడలని విశ్వాసమే ఉన్నది
నను అక్కున జేర్చుకుంటావన్నది
నా జన్మదినాన తీర్చరా వేదన
నామనసే నీకు  సాయీ నివేదన

నా పలుకుల్లో సుధలొలికే జనని
నా కవితల్లో ప్రభవించే తల్లీ
నా పాటకే ప్రాణమైన మాతా
ఏజన్మలోని పుణ్య ఫలమో
ఏకర్మలోని దివ్య బలమో
నన్నాదరించితివే సరస్వతి
నను అక్కునజేర్చుకుంటివే వాణి
ఎలానిన్ను కీర్తించనూ ఏ వరములనర్థించనూ
నమోనమో భారతీ నమోస్తుతే భగవతీ

1.చదువలేదు ఏనాడు ప్రాచ్యకళాశాలలో
పట్టాలు పొందలేదు సాహిత్య శాస్త్రములో
ఛందస్సు వ్యాకరణం చెలగి నేర్వనేలేదు
భాష పట్ల బహువిధముల కృషి సల్పలేదు

ఏ తొలి ఉషస్సులో నీ దృక్కులు ప్రసరించెనో
ఏ శుభ ఘడియలో నీ వాక్కులు ఫలియించెనో

నను కరుణించితివే వేదమయీ
నను దయజూసితివే నాదమయీ
ఎలానిన్ను కీర్తించనూ ఏవరములనర్థించనూ
నమోనమో భారతీ నమోస్తుతే భగవతీ

2.స్వరముల సంగతే ఎరిగింది లేదు
శృతిలయ సూత్రాలు తెలియగలేదు
రాగతాళాలను సాధన చేయలేదు
వాగ్గేయకారుల కృతులను వినలేదు

అమ్మలాలి పాటలోని హాయి ఎదను కదిపిందో
కోయిల గొంతులోని మధురిమ నను కుదిపిందో

నను కృపజూసితివే పాట పల్లవింపజేసి
నా తలనిమిరితివే మనోధర్మ రీతిగఱపి
ఎలానిన్ను కీర్తించనూ ఏవరములనర్థించనూ
నమోనమో భారతీ నమోస్తుతే భగవతీ