Sunday, August 11, 2019

OK

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మూడు ప్రాంతాలలో కడువింతగా
వెలిసావు స్వామి శయన మూర్తిగా
శ్రీరంగ పట్టణాన ఆదిరంగస్వామిగా
తిరువనంతపురాన అనంత పద్మనాభునిగా
శ్రీరంగం పురమున రంగనాథ స్వామిగా
ఏకాదశి వ్రతమును నీమముతో పాటించగా
భక్తులనుద్ధరించి భవజలధిని దాటించగా

1.శ్రీ వైష్ణవ సాంప్రదాయమునకాలవాలమై
విశిష్టాద్వైత సిద్ధాంతమునకు మూలమై
వైజయంతిమాలతో అలంకారశోభితమై
తిరునామాలతో చిద్విలాస వదనుడవై
కొలువైనావు రంగశాయి సిరి పాదములొత్తగా
సేదదీరుతున్నావు స్వామీ కాసింత మత్తుగా

2.మార్గళివ్రతమునాచరించె గోదాదేవి
తిరుప్పావైని రచించె పాశురాల పద్ధతిని
మును ముందుగ తులసిమాల తానే ధరించి
పెరుమాళ్ళస్వామినీకు  సమర్పించె ఆండాళ్ళు
చేకొంటివి హృదయాన ఆముక్త మాల్యదని
ధనుర్మాసమందున మా కనులవిందుగా

OK
ఇల్లరికపుటల్లుళ్ళ వైభోగము
వింత ఏముంటుంది మామ ఇంట మకాము
ఒకరేమో జగన్నాథుడు మరొకరేమో విశ్వనాథుడు
ఒకరేమో శ్రీనివాసుడు మరొకరోమో అర్ధనారీశ్వడు

1.జలధిజ విభుడు జన్మరాహిత్య వరదుడు
కరుణాసాగరుడు సాగర శయనుడు
లోకపాలకుడు అలౌకికానందకారకుడు
అమందానంద కందళిత హృదయారవిందుడు గోవిందుడు

గిరిజావల్లభుడు కైవల్యదాయకుడు
పరమదయా హృదయుడు హిమవన్నగ వాసుడు
సకలలోకేశ్వరుడు సచ్చిదానందయోగిపుంగవుడు
నిత్యనిరంజన నిర్వికల్ప సంకల్పుడు శివశంకరుడు
జనార్ధనుడొకరు జంగమ దేవర ఒకరు
రమేశ్వరుడొకరు పరమేశ్వరుడొకరు

2.కపటనాటక సూత్రధారి గిరిధారి మురారి
దశావతారధారి  దనుజారి శ్రీ హరి
కరి ప్రాణ సంరక్షక  చక్రధారి గరుడవాహన శౌరి
భక్తమానస విహారీ భవ రోగ హారీ

కాలకాలుడు నీలకంఠుడు నేత్రత్రయుడు నర్తన ప్రియుడు
జంగమవేషధారి వృషభవాహన సంచారి పురహరి
మార్కండేయ ఆయుఃప్రసాది త్రిశూలధారీ
 భోలానాథ మదనారి త్రిగుణాతీత జటధారీ
నాగ తల్పుడొకరు నాగభూషణుడొకరు
పీతాంబరుడొకరు చర్మాంబరుడొకరు