Friday, August 9, 2019

కైలాసం వదలి రావొ శివయ్యా
సకుటుంబ సమేతంగ కదలిరావొ సదయ్యా
నా ఎదలో పదిలంగా కొలువుదీరవయ్యా
నా బ్రతుకును సారథివై నడిపించవయ్యా

1.గణనాథుడు దరినుండగ సంకటములు కలుగవు
గుహనాథుడు దయచూడగ ఏ భయములు చెలగవు
భాగీరథి కృపగనగ కరువులు నను చేరవు
పార్వతీమాత వల్ల దుష్కర్మలు గెలువవు
శంకరా ఇకనైనా నా వంక రా
నువుతోడుగా ఉంటే నాకింక ఏ వంక రా

2.గరళకంఠ నాలోని కల్మషాలు హరించరా
చంద్రచూడ నా చిత్తమునెప్పుడు స్థిరపరచరా
భస్మభూష నా మనసుకు శాంతిని చేకూర్చరా
రుద్రనేత్ర నాలోని అహమును దహియించరా
శంకరా నీ ఎడ లేదు నాకు ఏ శంక రా
వెంటనే నా వెంటనే ఉండవయ్య భక్త వశంకరా
నీ కోవెలలో వెలిగిస్తా నూనె దీపం
నా తలలో వెలిగించు జ్ఞానదీపం
నీగుడిలో వెలిగిస్తా నేతి దీపం
నా గుండెలొ వెలిగించు నీతి దీపం-నిజాయితి దీపం
తిరుమలవాసా ఎంచకు లోపం
తిరువేంకటేశా పరిమార్చర పాపం

1.పూమాల నీమెడలో వేసెద
కామాదులు కడతేర్చగ వేడెద
నామాలు నుదుటన దిద్దెద
ప్రేమానురాగాల నర్థించెద నర్తించెద
తిరుమలవాసా నీరూపం అపురూపం
తిరువేంకటేశా తీర్చర పరితాపం

2.నీ ఆకృతి తన్మయముగ వీక్షించెద
సంస్కృతీ ధర్మాలు సంరక్షించెద
నీమీద కృతులనే రచించెద
నీ గుణగానాల నాలపించెద నీకై తపించెద
తిరుమలవాసా నువు వర్ణనాతీతం
తిరువేంకటేశా నువు కరుణా జలపాతం


నా ప్రేమ కథలో నువ్వే మహరాణి
కాలక్షేపానికి నీకు నేనో పిచ్చివాణ్ణి
నా స్వప్నలోకంలో నీవేగా  దేవేరి
నీ వినోదానికై నే తోలుబొమ్మగ మారి
ఇదేనా ప్రేమంటే ...బ్రతుకు బుగ్గిచేసే మంటే..

1.వగలనొలక బోస్తావు
వలపు వలలు వేస్తావు
అందమైన దీపిక నీవు
నను శలభంగా మార్చావు
పరువాల సాలెగూటిలో
నను కీటకంగ చేర్చావు
ఇదేనా ప్రేమంటే ..మనుగడ ఇక కుంటే

2.నీ చూపులు తూపులు
ఎదలోన దించుతావు
నీ నవ్వులు సిరిమల్లెలు
మత్తులోన ముంచుతావు
నీ ప్రణయమే  మరీచిక
నీ స్నేహం మాయా పాచిక
ఇంతేనా ప్రేమంటే..జీవితమిక వేదన వెంటే
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఎంతగా దృష్టి మరల్చుకున్నా
మరెంతగా నిగ్రహించుకొన్నా
వింత ఎక్కడున్నదో తెలియదుగాని
కవ్వింతవల్లనేకాబోలు ఎరుగముగాని
తరుణీ నీ అందానికి పురుషోత్తములైతేమి పాదాక్రాంతం
సుదతీ నీ సొగసుకు మునివర్యులు సైతం దాసోహం

1.అనిత్యమే బాహ్యసౌందర్యమన్నది సత్యమే
వయసు మీరితే వడలివక్కుతుందన్నది వాస్తవమే
వేదాంత వేత్తలైన వనిత ఎడల చపలచిత్తులు
సర్వసంగపరిత్యాగులైనా కాలేరు కాంతపట్ల నిమిత్తమాత్రులు
తరుణీ నీ అందానికి పురుషోత్తములైతేమి పాదాక్రాంతం
సుదతీ నీ సొగసుకు మునివర్యులు సైతం దాసోహం

2.రాజాధిరాజులు దేశాధినేతలు రమణులకిల గులాములు
యోధానుయోధులు మేధావులంతా పడతిముందు పిల్లులు
నీపరిష్వంగ ఖైదైనా సంతసమే నిత్యయవ్వనులకు
నీ పొందుకు ఉబలాటమె లోలోన గోముఖ వ్యాఘ్రాలకు
తరుణీ నీ అందానికి పురుషోత్తములైతేమి పాదాక్రాంతం
సుదతీ నీ సొగసుకు మునివర్యులు సైతం దాసోహం