Friday, June 11, 2021

 


ఆశని కలిగిస్తావు బంగారు భావి ఎడల

ఆ శనినే తగిలిస్తావు బ్రతుకున మేము కుముల

ఆషామాషా స్వామీ మా మానవులంటే

దోషాలన్నీ నీవే ఖుషీగ మేము లేమంటే

కలికల్మషనాశా శ్రీశా తిరుమల వేంకటేశా

నిజభక్తజన పోషా సర్వేశా సుందరవేషా


1.నమ్మిక వమ్ము చేస్తావు నీవున్నావని నమ్మితే 

నట్టేట్లో ముంచేస్తావు మము దాటిస్తావని ఎంచితే

దగా చేయడమే  సరదాగా ఆటలాడెదవేల

వేధించడమే వేడుకగా  వినోదింతువేల

కలికల్మషనాశా శ్రీశా తిరుమల వేంకటేశా

నిజభక్తజన పోషా సర్వేశా సుందరవేషా


2.విసుగే చెందినాను వారం వారం నిను పొగిడి

ఇడుములు పొందినాను అడుగడుగు నీ నుడి నుడిగి

తస్కరించినావా స్వామీ మా సంతసాలను

తిరస్కరించినావా ప్రభో మా విన్నపాలను

కలికల్మషనాశా శ్రీశా తిరుమల వేంకటేశా

నిజభక్తజన పోషా సర్వేశా సుందరవేషా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిందించలేనూ ఎవ్వరినీ

ఆనందించలేను ఈ ఉరిని

ఆఖరి కోరికైనా ఈడేరని నా దుస్థితిని

విధివంచితిడినై ఈడుస్తున్నా ఈ జన్మని

                                    ఈ దురదృష్ట జన్మని


1.అన్నీ ఉన్నాయి నా బ్రతుకు విస్తట్లో

ప్రతి బుక్క మట్టిగా చేరుతోంది నా నోట్లో

సైంధవులెందరో శల్యులు ఎందరో

శిఖండి శకునిల ప్రతినిధులెందరో 

మూకుమ్మడిగా నాకు వ్యతిరేకులై

పక్కలో గుచ్చుకునే వాడిబాకులై


2.విఫలమైన ప్రతిసారి నాకుగా నొచ్చుకుంటూ

ఉన్నదానితోనే ఎపుడూ సరిపుచ్చుకుంటూ

నాగజెముడు ముళ్ళమధ్య పువ్వునై నవ్వుతున్నా

మొదలంటా నరికిన గాని చివ్వున చివురేస్తూ ఉన్నా

చరమాంకమే కదా ఓరిమి నా కూరిమి

ఏకాంతమంటే  సదా నాకెంతో  పేరిమి