Saturday, August 28, 2021

 *తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు*


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ముల్తాన్


అడ్డుపెట్టలేరా  ఆపన్నహస్తాలు

గడ్డుకాలమొస్తోంది మన తెలుగుకు

పెను తుఫాను వీస్తోంది ఆంగ్లభాషగా

కొడిగట్టబోతోంది మనభాష దైన్యంగా

తెలుగు నాదని తెగువ చూపరా

తెలుగు ఖ్యాతిని జగతి చాటరా


1.పాల్కురికి సోమనతో పొందింది ప్రాభవం

నన్నయ్య కవనంతో చేకొంది వైభవం

రాయల ఆస్థానంలో సంతరించె రాజసం

పోతన భాగవతాన చిలికించె మాధుర్యం

తెలుగు నాదని తెగువ చూపరా

తెలుగు ఖ్యాతిని జగతి చాటరా


2.గిడుగువారి నుడుగుల్లో వాడుక కైతైంది

గురజాడ అడుగుల్లో సామాన్యుల చేరువైంది

కాళోజీ కలం బలంతో బడుగులకు గొడుగైంది

మహాకవుల సేద్యంతో మహిలో మహితమైంది

తెలుగు నాదని తెగువ చూపరా

తెలుగు ఖ్యాతిని జగతి చాటరా

 *శ్రీ కృష్ణ జన్మాష్టమి/గోకులాష్టమి ముందస్తు శుభకామనలు*


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: మోహన


మా నవ మోహన కృష్ణా-మానవ మోహన కృష్ణా

మన్మోహన కృష్ణా జగన్మోహన కృష్ణా

నీవే నీవే నా ఏకైక తృష్ణ-తీర్చరా నా బ్రతుకే ప్రశ్న


1.లేత పెదవులతొ-పూతననే-హతమార్చిన-బాలకృష్ణా

వెన్నను మన్నును- సమమని తిన్న -చిన్నారి-చిన్నికృష్ణా

కాళింది మడుగున-కాళీయుపడగల-చిందాడిన-తాండవ కృష్ణా.

గోటితొ కొండను-మేటిగ ఎత్తి-లీలను చాటిన-గిరిధర కృష్ణా

నీవే నీవే నా ఏకైక తృష్ణ -తీర్చరా నా బ్రతుకే ప్రశ్న


2.గొల్లభామల-యమునా స్నానాల-కోకలు దాచిన- తుంటరి కృష్ణా

బృందావనాన-మురళీరవాన-రాధతొ మురిసిన=సారస కృష్ణా

భక్త హృదయాల-సుస్థిర చిత్తాల-మనుగడ సాగించు- మీరా కృష్ణా

అనిమధ్యంబున -జీవన సారం-నరునికై నుడివిన-గీతా కృష్ణా

నీవే నీవే నా ఏకైక తృష్ణ తీర్చరా నా బ్రతుకే ప్రశ్న

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లాలించే కన్నులు

ఊరించే పెదవులు

నీ తనువున అణువణువున

అమర మధువులు ఇంద్ర ధనువులు


1.నగవుల కురిసేను వసంతాలు

నడకల విరిసేను పారిజాతాలు

నీ మేని కదలికల్లో జలపాతాలు

నీ క్రీగంటి చూపుతో తరియించు జీవితాలు


2.ఘనములై ఒప్పారు జఘనాలు

సగర్వంగ అలరారు పయోధరాలు

నడుము మడతల్లో నను ముంచకే తల్లో

ఎంతగా బంధించను నీ అందాలు కైతల్లో

https://youtu.be/wAOREZdUDZQ


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కమ్మగ పాడే తెల్లని కోయిలవే

ఏడాదంతా నవ్వై విరిసే ఆమనివే

స్వఛ్ఛని స్ఫటికపు నిర్మల మానసవే

ఉషోదయాన మెరిసే తుషార బిందువువే


1. పావన గంగా సమమే నీ గళము

నీ హృదయము మమతకు దేవళము

అందానికి నీవే ఇలాతలాన  తరళము

క్షీరనీర న్యాయమందు నీవే మరాళము


2.లతగా అల్లుకోని మన పరిచయము

కవితగా పరిణమించనీ మన స్నేహితము

మంజులమై నినదించనీ ఇక జీవితము

జనరంజకమై అలరించనీ మనగీతము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అలంకారమే అదనపు సొబగు అతివకు

ఆభరణాలే ఆకర్షణలు సుదతి సొగసుకు

నిండైన రూపుతొ రెప్పవాల నీయదు

దబ్బపండు ఛాయతో చూపు తిప్పనీయదు

భారతీయ దీప్తి  వనిత 

చెప్పనలవి కానిది తన ఘనత


1.పాపిట సిందూరం నుదుట తిలకం

సిగలో జాజులు చెవుల జూకాలు

ముక్కున ముక్కెర చెంపసరాలు

మెడలో పచ్చలహారం కటి వడ్డాణం

భారతీయ దీప్తి  వనిత 

చెప్పనలవి కానిది తన ఘనత


2. దండన కేణా  చేతికి గాజులు 

వ్రేళ్ళకుంగరాలు సింగారాలు

జడగంటలు కాళ్ళకు మంజీరాలు

కోకా రైకా కోమలి మేనుకు అందాలు

భారతీయ దీప్తి  వనిత 

చెప్పనలవికానిది తన  ఘనత

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సింధుభైరవి


కొలువై ఉన్నాడు ఏడుకొండలపైన

నెలకొనియున్నాడు మనగుండెలలోన

కడచి చూడవొ ఏడు ద్వారాల

ఎరుక నరయవొ సప్త చక్రాల

దర్శింతువదే వేంకటాచలపతిని

ఛేదింతువికనీ దేహాత్మ భావనని


1.బాహ్యమగు దృష్టి నేత్రానందమే

అంతఛ్ఛక్షు వీక్షణ పరమానందమే

తొలగించినంతనే మనోనిర్మాల్యము

ప్రకటమౌనిక పరమాత్మ రూపము

దర్శింతువదే వేంకటాచలపతిని

ఛేదింతువికనీ దేహాత్మ భావనని


2.సంశయమే వలదు స్వామిని గనుటకు

సాక్షాత్కరించును నిశ్చయమిక నీకు

మనసా వచసా ధ్యానించి నిలువగ

ఏకాగ్ర చిత్తము హరి మీద నిలుపగ

దర్శింతువదే వేంకటాచలపతిని

ఛేదింతువికనీ దేహాత్మ భావనని