Thursday, September 19, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:ఆందోళికా

ఉసిగొలిపే నయనాలు-కౌముది వైనాలు
ఊరించే అధరాలు మధురాతి మధురాలు
అలరేగిన నీ కురులు రేపేనెన్నెన్నో మరులు
చెవులకున్న జూకాలు కలిగించె మైకాలు
అణువణువున నీ అందం  చెలీ అమృతభాడం
నిగ్రహించుకొనడమ్మిక నాకు దినదిన గండం

1.నీ కాటుక సోయగమే కిటుకులెరిగి ఉన్నది
నీ నుదుటన తిలకమే అయస్కాంతమైనది
కనుబొమలే ఎక్కిడిన మదనుడి ధనువైనవి
నిగారింపు నీ చెంపలు కెంపుల కింపైనవి
అణువణువున నీ అందం చెలీ అమృతభాడం
నిగ్రహించుకొనడమ్మిక నాకు దినదిన గండం

2.రతీదేవి నిన్నుచూసి అసూయనే గొన్నది
రంభనే తను నీతో  పందానికి తగనన్నది
రవివర్మ కుంచె సైతం నినుదించ తలవంచింది
జక్కన చెక్కిన శిల్పం నీగొప్పను ఒప్పుకుంది
అణువణువున నీ అందం చెలీ అమృతభాడం
నిగ్రహించుకొనడమ్మిక నాకు దినదిన గండం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:హరికాంభోజి

బ్రతుకెంత నరకం
నువు వినా అనుక్షణం
నీ ప్రతీక్షలో ప్రతినిమిషం
మనలేను ఈ విరహం

1.అరచేతిలో స్వర్గంచూపించినావు
ఊహల పల్లకీ నెక్కించినావు
గాలిలో మేడలెన్నో కట్టింపజేసావు
నీటిపై రాతలెన్నో రాసేసినావు
నాదానివేనంటు బాసలే చేసావు
తృటిలోనే మటుమాయమై పోయినావు

2.ప్రేమకు మారు పేరే నమ్మిక
వంచించబోకే నను నీవిక
అంకితమైనాను నీకే ప్రేమిక
శూన్యమయ్యింది నా జీవిక
పిచ్చెక్కిపోతోంది నువులేక నాకు
గోదారె దారాయె కడకు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:ముఖారి

నీ చూపుల వలచిక్కని చేపలు ఏవి
నీ కైపులొ తడిసిపోని తాపసి ఏడి
చెప్పడానికెన్నైనా చెప్పగలరు లోకాన
వనిత వలపు కోరుకోని వారెవ్వరు జగాన
నేనెంతటివాడనే కాంతా దాసోహమనక
కామిగాకమోక్షగామి కాడనునది వాడుక

1.మేనక వెనక బడి చెడె విశ్వామిత్రుడు
ఊర్వశి వశమయ్యీ మురిసె పురూరవుడు
వరూధినీ మోహమున మోసగించె గంధర్వుడు
మోహిని అందానికి మేను మరిచె మహాదేవుడు
నేనెంతటివాడనే కాంతా దాసోహమనక
కామిగాకమోక్షగామి కాడనునది వాడుక

2.హరి ఉరమున ప్రతిష్ఠించె సిరిని ప్రేమ మీరగ
సగమేనునర్పించె హరుడు గౌరి కోరగ
విరించి తరించె వాణి రసనకొల్వుదీరగ
దేవేంద్రుడహల్యకై కుక్కుటముగ మారెగా
నేనెంతటివాడనే కాంతా దాసోహమనక
కామిగాకమోక్షగామి కాడనునది వాడుక