Friday, January 8, 2021


భక్త వరదుడవే ఆర్తత్రాణ బిరుదుడవే

శరణాగత వత్సలుడవే కరుణాంతరంగుడవే

తిరుమల గిరిరాయా జాగేల సరగున అరయా

మకరి బారి కరి కరిగాచిన సిరి పరిణేతా నీకిది సరియా

నమో వేంకటేశ నమో శ్రీనివాసా

నమోనమో బాలాజీ తిరునామ విరాజీ


1.ఎలా పరిష్కరిస్తావో జటిల సమస్యల ద్రోసి

ఎలా సంస్కరిస్తావో భవబంధాలు వేసి

సరసిజ నాభా మనలేను ఇకపైన నిను బాసి

ఉపేంద్రా ఉద్ధరించు ఉపేక్షింపక దయచేసి

నమో వేంకటేశ నమో శ్రీనివాసా

నమోనమో బాలాజీ తిరునామ విరాజీ


2.ఒకటిని మించి ఒకటి వెతలెన్నని కోటి

దుఃఖమందె నినువేడుట మాకెపుడు పరిపాటి

నటన సూత్రధారీ నీవాటలొ ఘనాపాఠి నేనేపాటి

జగన్నాథ జనార్ధనా అజన్మమీయ నీకెవరు సాటి

నమో వేంకటేశ నమో శ్రీనివాసా

నమోనమో బాలాజీ తిరునామ విరాజీ

 రచన,స్వరకల్పన&గానండా.రాఖీ


చనుబాలను అందించి-మురిపాలను చిందించి

అరచేతికి హాయినిచ్చి-శిశువుకు పరవశమిచ్చి

కృతార్థతనొందేటి ప్రలంబమా

స్త్రీత్వానికి అర్థమైన పయోధరమా

ఎన్నటికీ మగజాతి నీకు బానిస

ఎంతవారికైనా నీమీదే ధ్యాస


1.పసి ఆకలి తీర్చే అమృత భాండమా

మాతృత్వ మధురిమలో బ్రహ్మాండమా

కోడెవయసు కోర్కె రేపు అగ్నిగుండమా

జగజ్జెట్టినీ పడగొట్టే వలపుకోదండమా

ఎన్నటికీ మగజాతి నీకు బానిస

ఎంతవారికైనా నీమీదే ధ్యాస


2.త్రిమూర్తులే దత్తుడై గ్రోలిన చందమా

శివభక్తుడు లింగమని పూజించిన వైనమా

పురుషుని చూపులాగు అయస్కాంతమా

సేదతీర్చి ఊరడించు పరమ ఔషధమా

ఎన్నటికీ మగజాతి నీకు బానిస

ఎంతవారికైనా నీమీదే ధ్యాస

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎవరు చెక్కినారమ్మా ఇంత చక్కటి శిల్పాన్ని

భువికి ఎవరు దింపిరమ్మ నీ సజీవ రూపాన్ని

శివుడే పరవశుడైన ఆకాశ గంగవా

కౌశికుడే వివశుడైన అప్సరాంగనవా

అందానికి ఇంతకన్న ఏదీ నిదర్శనం

సౌందర్యానికే నిలువెత్తు నిర్వచనం


1.రతిని మతిని తలవడు నిను గంటే మదనుడు  

రాధనెదను నిలుపడు నినుగాంచ మాధవుడు

బ్రహ్మమానస పుత్రికవో

నవ మోహిని చిత్రికవో

అందానికి ఇంతకన్న ఏదీ నిదర్శనం

సౌందర్యానికే నిలువెత్తు నిర్వచనం


2.అతిలోక సుందరి నీ జతకు తూగరతివలు  

మదగజగామిని నీ హొయలెరుగరు ముదితలు

అంగనగా మారిన సింగిడి నీవు

మెలికల మేని కిన్నెరసాని వీవు

రెప్పలైనవాలవు నిను తిలకించినంత

జన్మలెన్ని చాలవు వలపు చిలకరించినంత

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సిగ్గేలనే ఓ చినదానా

నను ముగ్గులోకి లాగి వలచినదానా

ఎన్నాళ్ళుగానో నాకై వేచినదానా

నన్ను నన్నుగా ప్రేమించినదానా 

నాకై కలవరించినదానా,నన్నే వరించినదానా


1.తల ఎత్తి తరుణి వైపు చూడని వాడను

పల్లెత్తి పరపడతితో ఎన్నడు మాటాడను

అల్లసానివారి అభినవ ప్రవరాఖ్యుడను

నిగ్రహ పరిగ్రహాన మునిజన ముఖ్యుడను


2.అమ్మ కొంగు చాటుమాటు పిల్లవాడినే

కొమ్మా నను పడగొట్టి కొంగున కట్టావే 

నువు గీచిన గీతను జవదాటకుంటినే

నీమాటనెపుడు మీరక నడుచుకుంటినే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లోపమేదొ తెలియకుంది నా కవనంలో

శాపమేదొ తగులుకుంది నా జీవనంలో

ఎంత వైవిధ్య భరింతంగా కవితలున్నా

భావుకతను ఎంతగానొ కుమ్మరిస్తున్నా

ఆదరణకు నోచుకోవు కైతలెందుకో మరి

ఎదలను కదిలించవేమొ కొసరి కొసరి


1.లలితమైన హృదయమే నాకు లేకుందో

అనుభూతి చెందడమే అసలు రాకుందో

సరళమైన పద పొందిక కొఱవడి పోయిందో

వాడుక భాషలోన నా సాహితి సాగకుందో

ఆదరణకు నోచుకోవు కైతలెందుకో మరి

ఎదలను కదిలించవేమొ కొసరి కొసరి


2.పరులను విరివిగా ప్రశంసించ లేదేమో

స్పందించే మిత్ర తతి మెండుగ లేదేమో

ఆర్భాటం హంగామా నాకు చేతకాదేమో

అసలు సిసలు కవిత్వమే నాది కాదేమో

ఆదరణకు నోచుకోవు కైతలెందుకో మరి

ఎదలను కదిలించవేమొ కొసరి కొసరి