Thursday, September 24, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చెప్పుకొంటె ఎంతైనా తక్కువే

చెప్పు చేయు సేవ కడుగొప్పదే

ముల్లైన గుచ్చకుండ కాచును పాదాలను

కాలకుండ ఎండనుండి అరయును అరికాళ్ళను

చెప్పులే లేకపోతే చెప్పరాని తిప్పలు

కొత్తప్పుడైనా తెగినప్పుడైనా- చెప్పుతొ తప్పవింక ముప్పుతిప్పలు


1.చెప్పులేకదయని కించపరచకవి పాదరక్షలు

కాళ్ళను నాన్నలై నడిపించునెపుడు మేజోళ్ళు

పూజలుగైకొంటాయి పరివ్రాజుల పాదత్రలు

అయోధ్యనేలినాయి శ్రీరామని పాదుకలు

చెప్పుకుంటుబోతే చెప్పుల ఘనతలు

ఒడవనే ఒడవవు చెప్పుల పలు గాథలు


2.చెప్పలేనన్ని రకాలు ఇప్పటి చెప్పులలో

స్లిప్పర్లు బూట్లు ఎత్తు మడమ చెప్పులుగా

ఎన్నలేనన్ని ప్రయోజనాలు నేడు చెప్పులతో

క్రిములను నలుపగ చెంపలు పగలగొట్టగా

చెప్పుకుంటుబోతే చెప్పుల ఘనతలు

ఒడవనే ఒడవవు చెప్పుల పలు గాథలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అంధకారమందున దారినెరుగకున్నాను

అంధుడనై గతిగానక తిరుగాడుతున్నాను

సద్గురువు నీవె సాయి జగద్గురువు నీవే

ప్రేమతొ నను శిష్యునిగా స్వీకరించరావే

సమర్థ సద్గురు సాయినాథా

యోగిమహారాజా అనాధనాథా


1.ఏకాకిని నేను ద్విజుడను

తాపత్రయములు చతురాశ్రమాలు

పంచేంద్రియాలు అరిషడ్వర్గాలు

సప్తవ్యసనాలు అష్టదరిద్రాలు

నిను దరిజేరగ నాకు అవరోధాలు

నవవిధాల భక్తితో నిను సేవింతును

దశవిధ బలములొసగి ఉద్ధరించుమా

సమర్థ సద్గురు సాయినాథా

యోగిమహారాజా అనాధనాథా


2.శ్రవణం కీర్తనం పరీక్షిత్తు శుకులుగా

స్మరణం అనవరతం ప్రహ్లాదునిలాగా

పాదసేవనం మహాలక్ష్మి మాదిరిగా

అర్చనం వందనం పృథు అక్రూరులుగా

నీ పాదదాసుడనై రామభక్త హనుమగా

నరుడనై సఖుడిగా నిన్ననుసరింతుగా

ఆత్మనే నివేదింతు బలిచక్ర వర్తిగా

సమర్థ సద్గురు సాయినాథా

యోగిమహారాజా అనాధనాథా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:శుభ పంతువరాళి


ఎంత పొరపాటు చేసావో ప్రభూ

గొంతు కొందరికి కమ్మగ  నువ్విచ్చి

అపాత్రదానమెందుకు చేసావో స్వామీ

వృధాపరచు ప్రతిభను వరమిచ్చి

పాడడానికెందుకో పడరాని పాట్లు

పికమల్లె పాడాలి జగతి పరవశించునట్లు


1.సహజమైన ప్రజ్ఞ నెపుడూ-దాచుకోవు తావిని విరులు

దాహార్తి తీర్చగ నదులూ-మార్చుకోవు తీయని రుచులు

దైవదత్తం వదులుకొనీ-అల్పచిత్తులౌతారు

కొత్తమత్తుకోరుకొని-గమ్మత్తుగ చిత్తౌతారు

పాడడానికెందుకో పడరాని పాట్లు

పికమల్లె పాడాలి జగతి పరవశించునట్లు


2.మనసంతా అందం పైనే-విద్వత్తుకు తిలోదకాలే

కలలన్నీ విలాసాలవే-సాధన బూదిలొ పన్నీరే

బలిమీటికి లింగం కడితే చాటుకెళ్ళివిప్పేస్తారు

పట్టిపట్టి నామం పెడితే పక్కకొచ్చి చెరిపేస్తారు

పాడడానికెందుకో పడరాని పాట్లు

పికమల్లె పాడాలి జగతి పరవశించునట్లు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువ్వేమనుకుంటున్నావో  అపరంజి

అనీ  నేనుకుంటున్నా అనుక్షణం నీగురించి

నువ్వే ఏకైక లోకమైనావే నిన్నే కలవరించి

బ్రతుకు నీ పరమైపోయే నాదిగా అంతరించి

మెదడునంత తొలిచేస్తున్నావే నన్నే వరించి

నీకు నాకు భలే కుదిర్చాడే ఆ విరించి


1.నీ ఊహలతోనే మనసు పులకరించి

నీ తలపులతోనే కాలాన్ని కరిగించి

అద్దానికి ముద్దెడతా నన్నే నీవుగ ఎంచి

జాబిలితొ కబురెడతా నిను స్వాగతించి

మెదడునంత తొలిచేస్తున్నావే నన్నే వరించి

నీకు నాకు భలే కుదిర్చాడే ఆ విరించి


2.నన్ను నేను మరిచానే నిన్ను ప్రేమించి

ఎలా వేగుతున్నానో నిన్ను విరహించి

నీ వెలితి గుండెకోత సాంతం భరించి

నా వెత నెలా చెప్పనే నీకు వివరించి

మెదడునంత తొలిచేస్తున్నావే నన్నే వరించి

నీకు నాకు భలే కుదిర్చాడే ఆ విరించి


FOR audio :contact with whatsapp number 9491042010

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


సజీవ శిల్పానివి

త్రిమితీయ చిత్రానివి

గంధర్వ గాత్రానివి

అందానికి సూత్రనివి

నా కలల సామ్రాజ్ఞివి మనోజ్ఞవి


1.అభిజ్ఞవి రసజ్ఞవి ప్రజ్ఞవి ప్రాంజలివి

మంజులవి మంజరివి మంజూషవి

సుధామాధురివి మధుర రసధునివి

మోదినివి వినోదినివి వయ్యారివి మయూరివి

నా కలల సామ్రాజ్ఞివి మనోజ్ఞవి


2.రాగిణివి యోగినివి చింతామణివి

రాధవి సరసగాధవి తీయని బాధవి

రమ్యవి స్నిగ్ధవి ప్రతీక్షవి మోక్షవి

ఊహవి కల్పనవి అనల్ప సౌందర్యరాశివి

నా కలల సామ్రాజ్ఞివి మనోజ్ఞవి