Sunday, October 27, 2019

ఓ అభినవ వరూధినీ
నీ మానస సరోవరతీరముకే చనీ
నీ హృదితో సంగమించు కోర్కె మించనీ
త్రికరణశుద్ధిగా మన ఎదలే రమించనీ
ఇహలోక భావనలే ఇకపై విరమించనీ

1.విరించినై ప్రణయ కృతులు రచించనీ
విపంచియై  నీమేని జతులు ధ్వనించనీ
రాయంచలా క్షీరధారలారగించనీ
రాచిలుకలా ఫలములాస్వాదించనీ
గెలుపోటమేలేక ఇరువురమూ నెగ్గనీ

2.మనమనమే నందనవని అవని
అవనీ తలమే భూతల స్వర్గమవని
స్వేఛ్ఛగా యధేఛ్ఛగా నను విహరించనీ
నీ మనసూ తనువూ సర్వం హరించనీ
నీవే నేనై నేనే నీవైన మిథునమై జీవించనీ
యవ్వనాన విరిసాయి సోయగాల విరులెన్నో
పరిమళాలు విరజిమ్మాయి పలువన్నెల కుసుమాలెన్నో
పయ్యెదనే పరిచాను పవళింపు సేవకొరకు
నా అంగరంగాన  క్రీడించు గెలిచే వరకు

1.కనుసైగలతోనే ఆహ్వానమందించేను
చిరునవ్వులు వెదజల్లి స్వాగతాలు పలికేను
కోటగోడలన్ని దాటుకరా బ్రద్దలుకొట్టి
అంతరంగ అంతఃపురమే ఉంచాను తెరిచిపెట్టి
నన్నేలుకోరా రారాజు నీవేరా
మురిపాలు గ్రోలరా మోజుతీరా

2.మూలబడి పోయింది వాత్సాయన కావ్యము
మామూలైపోయింది ఖజురహో శిల్పము
సింగారమంతా చిలుకరా నవ్యంగా
రసరమ్య గ్రంథమే రాయరా రమ్యంగా
మలుచుకో మోవినే లిఖించే కలంగా
నామేనే నీకికమీదట శ్వేతపుటల పుస్తకమవగా

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

పెద్దపులి తోలు కట్టకున్నోడా
పుర్రె బొచ్చె చేత బట్టెటోడా
ఇల్లిల్లూ బిచ్చమెత్తెటోడా
ఎద్దునెక్కి వాడ వాడా ఊరేగే వాడా
జంగమయ్య నీకు నా దండాలయ్యా
లింగమయ్య నీకు పూల దండాలయ్యా

1.వల్లకాడే నీకు నివాసమైనదట
చితిలో బూదినే పూసుకుంటావంట
కపాలమాలనే వేసుకుంటావంట
కాలకాలుడను పేర వరలుదువంట
జంగమయ్య నీకు నా దండాలయ్యా
లింగమయ్య నీకు పూల దండాలయ్యా

2గిరిజమ్మకే నీవు పెనిమిటి వంట
గంగమ్మనైతే నెత్తికెత్తుకుంటవంట
ఆడంబరం లేని దిగంబరుడవు
అందరినీ ఆదరించేటి హరుడవు
జంగమయ్య నీకు నా దండాలయ్యా
లింగమయ్య నీకు పూల దండాలయ్యా