శ్రీ విశ్వేశ్వర వారణాసి పుర (కాశీ నగర ) వైభవం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
శివుడే ఆది దేవుడు-శివుడనాది పరమగురుడు
శివుడే విశ్వనాథుడు-శివుడే కాశీపురాధీశుడు
భవాయనమో భవానీధవాయ
శర్వాయనమో పార్వతీ వల్లభాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓంకారేశ్వరుడు శంకరుడు-
సంధ్యావాటి నర్తన ప్రియుడు
జ్యోతిర్లింగ స్వరూపుడు నభవుడు
ప్రళయకాల జ్వాలి కపాలి శంభుడు
గంగాధరాయనమో గజచర్మాంబరాయ
అంగజహరాయనమో సాంబశివాయ
భగీరథుని మనోరథము నెరవేర్చగా
దక్షిణవాహినియై ఉత్తమగతులీయగ
ఇలవంక వదిలీ గంగ కడకొంగు వీడక
కాశీయే కడయాత్రకు పావనస్థలిచేయగా
వెలసినాడు కాశీలో విశ్వేశ్వరుడై
అన్నపూర్ణ విశాలాక్షి సమేతుడై
గంగాతరంగాలు మృదంగాలుగా
జపమాలల సవ్వడులే మంజీరనాదాలుగ
నమఃశివాయ ధ్వానాలతొ పురము మారుమ్రోగగా
చతుర్వేద పారాయణ శంఖారావముగా
నటరాజే కనువిందుగ చిందేయగా
వారణాసి అపరకైలాసమై వెలిసెగా
గంగలోన మునకలేయ పునీతులవగా
డూండీ గణపతినర్చించి అనుమతి బడయ
కాశీపురపతి విశ్వపతి మందిరమరయ
నమకచమకస్తోత్రాల అభిషేక పూజలు సేయ
కరుణించు భోళా శంకరుడు
వరములిచ్చు లీలా విలాసుడు
అన్నపూర్ణ భవానిమాతను దర్శించగా
అన్నవస్త్రాలకెప్పుడు కొదవరాదుగా
విశ్వజనని విశాలాక్షిని అర్థించగా
విజయమే కలుగజేయుచు రక్షించుగా
వందనాలివిగొ మముగన్నతల్లీ అన్నపూర్ణా
హారతులు గొనుము కల్పవల్లీ విశాలాక్షీ
కనురెప్పలా కాపుకాయును కాలభైరవుడు
పరాన్నదోషము నివారించు పరాన్నభుక్తేశుడు
సప్తమోక్షద్వారాలకు శ్రేష్ఠతమమీ వారణాసి
ఉత్తరాదిన బనారసను నామమే కడు వాసి
కాశీ దర్శన ఫలప్రాప్తి పూర్వపుణ్యమే
కాశీలో మరణిస్తే శివ కైవల్యమే
సురలకు నరులకు ముక్తిధామము
దేశవిదేశీ భక్తుల కాలవాలము
సనాతన సంస్కృత విద్యా పీఠము
ప్రాచీన సంస్కృతీయుత ప్రాభవము
కాశీనగరము విశ్వానికి కేంద్రము
కాశీ స్మరణయు భాగ్య విశేషము
ఎనుబది నాలుగు లక్షల రకాల జీవరాశి
ఎనుబది నాలుగు గంగాఘాట్లతో కాశి
అస్థికాభస్మాలకు గంగానిమజ్జనమే స్వస్తి
మనిషి జన్మ పరమార్థ సార్థకతకది సంప్రాప్తి
శవభస్మవిలేపనయే ఈశ్వరునికి తృప్తి
కాలకాలుడే ప్రసాదించును జన్మ నివృత్తి
నవరంధ్రాల కాయం అనూహ్యమై మటుమాయం
నవరాత్రులు కాశీపుర శయనం గంగాతోయం
నవవిధ భక్తుల అనుభవం శవం శివమైతే నయం
నవధాన్యాల నవరత్నాల కైంకర్యం కమనీయం
నవనవోన్మేషం నేటి కాశీ పట్టణం
భువి అభినవ కైలాసం వారాణసి పురం
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ