Friday, July 29, 2022

 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా "ఆజాదీక అమృత మహోత్సవ్"తరుణాన


నా దేశభక్తి గీతం

"కర్మ వీరులు"


చావుకు సవాలు విసురుతూ

వైరికి సత్తా చాటుతూ

దేశం కోసమే పుడుతూ దేశం కోసం బ్రతుకుతూ

దేశం కోసమె అసువులు బాసే సైనికులారా

మీకు సలాం

జాతిపతాకను నింగిలొ నిలిపే జవానులారా

మీకు జోహార్


1.సరిహద్దు వద్దా  కదం తొక్కుతుంటారు

దేశ అంతర్గత భద్రత సరిదిద్దుతుంటారు

యుద్ధమంటె అనవరతం సిధ్దంగా ఉంటారు

శత్రుమూక ఎంతటిదైనా ఛెండాడుతుంటారు

కర్తవ్యపాలనయే మీకు వేదవాక్కు

భరతమాత రక్షణయే ఏకైక హక్కు


2.కులమతాలతో ఏ నిమిత్తమూ లేదు

ఫలితాల కోసం ఆయత్తమూ లేదు

పదవుల కోసం నానా గడ్డీ కరిచేది లేదు

ప్రకీర్తికోసం ఎటువంటి ప్రయత్నమూ లేదు

సమ్మెలు ఎరుగని కర్మవీరులు మీరు

భగవద్గీత నిత్యాచరణులు మీరు

 నింగిలోకి తొంగి చూస్తా నిను చూడగతోస్తే

నీలినీలి మబ్బుల్లో నీ నీలికురులు తిలకిస్తా

కొలను కేసి వెళతాను నీ మోము కనగ నేను

విచ్చుకున్న అరవిందంలో దర్శించుకుంటాను


అణువణువున నీవే ఉంటే ఆరాటమెందుకంట

అడుగడుగున ఎదురౌతూ నిలిచేవు నా కంట


1.అల్లనేరేడు పళ్ళు అపూర్వమే నీ కళ్ళు

నోరూరు సిమ్లాఆపిళ్ళు నీ సొట్టల చెక్కిళ్ళు

కోటేరు  నీ ముక్కు లేవు వేరు ఆనవాళ్ళు

ఎర్రనైన చెర్రీ పళ్ళు నిగారించె నీ అధరాలు


అణువణువున నీవే ఉంటే ఆరాటమెందుకంట

అడుగడుగున ఎదురౌతూ నిలిచేవు నా కంట


2.శంఖాన్ని కాంచినంత నీకంఠం తలపొచ్చేను

కొండల్ని చూసినంత నీ గుండెలె స్ఫురియించేను

వాగులో వంకేందైన లాగును నడమొంపు వంకే

మైదానపు చిన్నిదొనైనా గుర్తుతెచ్చు నీ నాభినే


అణువణువున నీవే ఉంటే ఆరాటమెందుకంట

అడుగడుగున ఎదురౌతూ నిలిచేవు నా కంట






 

https://youtu.be/W7c_9foeHL8

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాల కడలిలో పుట్టిన తల్లి

ఫణిపతి శయనుని గాదిలి

శుభదాయిని శుక్రవార లక్ష్మి

వరదాయిని శ్రీ వరలక్ష్మి

మంగళమిదిగో మహాలక్ష్మి

వందనాలమ్మా వైభవలక్ష్మి


1.హరినేత్ర వాహిని 

శ్రీహరి సమ్మోహిని

డోలాసుర మర్దిని

లీలా వినోదిని

మంగళమిదిగో మహాలక్ష్మి

వందనాలమ్మా వైభవలక్ష్మి


2.పద్మముఖి పద్మాక్షి

పద్మకర విలాసిని

పద్మచరణ శోభిని

పద్మ ప్రియే పద్మాసని

మంగళమిదిగో మహాలక్ష్మి

వందనాలమ్మా వైభవలక్ష్మి

 నీ మరపు పొరల అట్టడుగున నేను

సమాధియౌతున్నాను

నీ నిర్లక్ష్యపు నిర్లిప్తపు విస్పందనకు

కాలిబూడిదౌతున్నాను

మౌనంగా కలిసిపోతున్నాను కాలగర్భంలో

మంచుగా కరిగిపోతున్నాను కవోష్ణ విరహంలో



1.పెరుగున్న దూరానికి జరిమానా నా జీవితం

చెలగుతున్న ఆశలకు జైలుఖానా నా స్వగతం

గొంతులోన దాచుకున్నా ప్రణయ హాలాహలం

పంటనొక్కి ఆపుకున్నా ఆగకుంది అధర రుధిరం

మౌనంగా కలిసిపోతున్నాను కాలగర్భంలో

మంచుగా కరిగిపోతున్నాను కవోష్ణ విరహంలో


2,కంచెల్ని కూల్చివేసి కాలుమోపు నా ఎద గుమ్మం

అవధుల్ని అధిగమించి వెలిగించు నా గృహ దీపం

కొంగుముడిని వీడకుండా చేరుకుందామీ యుగాంతం

పరస్పరం తోడునీడగ అడుగేద్దాం ఏడు జన్మలు సాంతం

మౌనంగా కలిసిపోతున్నాను కాలగర్భంలో

మంచుగా కరిగిపోతున్నాను కవోష్ణ విరహంలో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నట భైరవి


చేజార్చకు ప్రతిక్షణం విలువైనదే

ఏమార్చకు అనురాగం అమూల్యమే

ఉన్నదైతె ఒక్కటే జీవితం ప్రియతమా

మరలిరాదు మరలరాదు గ్రహించుమా అనుగ్రహించుమా


1.రేపని మాపని వేయకు వాయిదాలు

చీటికి మాటికి చెప్పకు కారణాలు

రోజుకో సారైనా తలుచుకుంటె చాలుగా

వారానికోమారు కలుసుకుంటె మేలుగా

ఉన్నదైతె ఒక్కటే జీవితం ప్రియతమా

మరలిరాదు మరలరాదు గ్రహించుమా అనుగ్రహించుమా


2.యానకాలు చేర్చలేవు ఎదలోని భావన

మాధ్యమాలు కూర్చలేవు ఎడబాటుకు సాంత్వన

మాటలు ప్రవహింపగలవు చూపులు మెరియ

ఆశలు చిగురించగలవు నవ్వులు కురియ

ఉన్నదైతె ఒక్కటే జీవితం ప్రియతమా

మరలిరాదు మరలరాదు గ్రహించుమా అనుగ్రహించుమా