Wednesday, August 24, 2011

https://youtu.be/w3ymTtvtvew

వరలక్ష్మీ సుస్వరలక్ష్మీ ఈశ్వరలక్ష్మీ భాస్వరలక్ష్మీ
శ్రీ లక్ష్మీ వాణిశ్రీలక్ష్మీ విజయశ్రీలక్ష్మీ మాతృశ్రీలక్ష్మీ

దండాలు నీకివే దాక్షాయణి
గండాలు తొలగించవె గజవాహిని

1.      శ్రీలలితే -విస్తృత చరితే
మహిమాన్వితే-మహిషాసుర సంహృతే

నమోవాకాలు నీకు కాత్యాయిని
         వందనాలు నీకివే వరదాయిని

2.      ప్రణవప్రభవితే-ప్రమోద విలసితే
ప్రజ్ఞానదాయకే-శ్రీపథ దాయకే

ప్రణతులివే నీకు పరదేవతా
ప్రణుతులివే నీకు లోకపూజితా

3.      జయహే వాజ్ఞ్మయి-హే కరుణామయి
సదా చిన్మయి- సుజన మనోమయి

నమస్తే నమస్తే-నాదమయి
నమోస్తుతే-సచ్చిదానందమయి



https://youtu.be/0Hmz7PSshx0

గళసీమ గరళాన్ని సహియించినావు
శిరమందు నభగంగ భరియించినావు

ఇంతకన్న ఏముంది తార్కాణం
భోళాశంకరా నీది సార్థక నామం

మహాదేవ మహాదేవ నీలకంధరా పాహి
వామదేవ వ్యోమకేశ గంగాధరా దేహి

1. పులితోలు వలువల్లె ధరియించినావు
నాగుల్ని నగలల్లె మెయి దాల్చినావు
భస్మాన్ని ఒళ్ళంత పులిమేసుకున్నవు
వృషభాన్ని తురగంగ ఊరేగినావు

ఇంతకన్న ఏముంది తార్కాణం
భోళాశంకరా నీది సార్థక నామం

సద్యోజాత తత్పురుషా భూతనాథ పాహి
ఈశానా అఘోరా అనాధ నాథ దేహి

2. నిలువనీడలేకనీవు కొండకోననుండేవు
ఊరువాడ విడిచివల్ల కాడున మసలేవు
తపమైన చేసెవు-చితులైన పేర్చేవు
మోదమైన క్రోధమైన చిందులేసి ఆడేవు

ఇంతకన్న ఏముంది తార్కాణం
భోళాశంకరా నీది సార్థక నామం
నిటలాక్ష నటరాజ విరూపాక్ష పాహి
పశుపతి ఫాలనేత్ర కాలభైరవా దేహి

3. ఇల్లిల్లు బిచ్చమెత్తి బొచ్చెలోన తింటావు
నీ కడలేనిదైన ఐశ్వర్యమునిస్తావు
అడిగితెఅనుచితమైనా అర్ధాంగి నిచ్చేస్తావు
అదియిదియనిగాదు ఆత్మనె అర్పిస్తావు

ఇంతకన్న ఏముంది తార్కాణం
భోళాశంకరా నీది సార్థక నామం

జంగమయ్య లింగమూర్తి ఋతంబరా పాహి
చంద్రమౌళి పింగళ పినాకపాణి దేహి