Tuesday, July 17, 2018

పలుకుతోనె జీవితం
మాటతోనె మనుగడ
నా వాక్కున తేనియలే చిలికించవె శ్రీవాణి
నా నుడుగులు మీగడలా తలపించవె గీర్దేవి


1.శరముల కానీయకు నాఅక్షరమ్ముల
ఎదుటివారి గుండెలను గాయపరచగ
పదముల నను పదిలముగా వాడగజేయి
ఎద ఎద కవి నవనీతముగా తోచగా

వందనాలు గొనవే వీణాపాణి
నా నాలుక  స్థిరవాసము చేసుకోగా
ప్రణతులందుకొనవే వేదాగ్రణి
నా గళమే అవనీ ఇక నీ దేవళముగా

 2.నా కవనము నువు మనియెడి పూవనమైపోనీ
పాఠకులకు సుమగంధము మకరందము పంచగా
నా గీతములన్ని నీకు నగలై ఒప్పారనీ
సాహిత్యము సంగీతము ధగధగలతొ మెరియగా

నమస్సులివిగో సారస్వత సామ్రాజ్ఞి
క్రీగంటనైన నన్ను నువుకాంచగా
చేజోతలందుకోవె పారాయణి
నాతలపై చేయుంచి దీవెనలందించగా