Sunday, November 14, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మౌనం ఎందులకూ- కాదని చెప్పలేక 

మౌనం మరి ఎందులకు వాస్తవమొప్పలేక

మౌనమింకెందులకూ సమాధానమెరుగక

మౌనం ఎందులకూ విధానమింక నచ్చక


1.మౌనేన కలహం నాస్తి- మౌనంతో మనశ్శాంతి

  భాషే చాలని భావానికి మౌనమే  వారధి

  మౌనం పరిణితినొందిన మనః స్థితి

  మౌనం అంతర్ముఖమైతే చేరగలుగు సదాగతి


2. బ్రతుకు పాడె చరమగీతి మౌనమే

మరణాంతర సంతాప సూచి మౌనమే

విశ్వాంతరాళమంతా వినిపించు మౌనమే

తాపసుల ఉపానంతా తలపించు మౌనమే


రాగం:మాయామాళవగౌళ


కడుపునొచ్చినోడే ఓమ బుక్కుతుంటడు

కష్టమొచ్చినోడే నిన్ను మొక్కుతుంటడు

అందుకా ఈశ్వరా నాకిన్ని ఈతిబాధలు

అవేకదా సదాశివా నీ పురాణ గాధలు

ముక్కంటే తలచుట్టూ తిప్పెందుకు చూపుడు

ముక్కంటి శరణంటి అక్కున ననుజేర్చుకొ ఇప్పుడు


1..కడుపు చీల్చుకున్నాడు నీకై నాడు గజాసురుడు

ప్రాణభయం పెట్టావు నీ పదాల పట్టగ బాలుడు

కన్ను కోరుకున్నావు తను పెకిలించీయగా తిన్నడు

తిండి పెట్టినాడు నీకై సుతుని వండి  శిరియాలుడు

ఇన్ని చేయు తెగువలేదు నిను తలుచుడు దప్ప

నన్ను కూడ బ్రోచినపుడె ఎరుకౌను నీ గొప్ప


2.శ్రావణమాసాన దండిగా అభిషేకాలు

కార్తీక మాసాన  విశేష మానస పూజలు

ప్రతి సోమవారం ప్రదోష కాల అర్చనలు

శివరాతిరి జాగారం ఉపవాస దీక్షలు

ఇన్నిచేసినా గాని నన్ను జాలిగొనవాయే

పరమదయాళువీవన్నది మరచితివాయే

 రచన,స్వ కల్పన&గానం :డా.రాఖీ


చుట్టూరా గట్టే కనరాని సంద్రం

లోతెంతో అంతే తెలియని అగాథం

అనుభవాన ఛిద్రమైన వాస్తవ జీవితం

కన్నీరు తుడిచే చేయి దొరికెనా ఒక అద్భుతం

ఆశావహ దృక్పథమంటే నాకు హాస్యాస్పదం

యథాతథ స్వీకారమే చేర్చును ఆనంద పథం


1.కాళ్ళక్రింద నేలనే కంపించిపోతుంటే

గగన గండమాయే నిలువడమైనా ఉన్నచోటున

పక్కా భవంతులే కుప్పకూలిపోతుంటే

మేడలెలా కట్టగలను వింతగా గాలిలోన

ఆశావహ దృక్పథమంటే నాకు హాస్యాస్పదం

యథాతథ స్వీకారమే చేర్చును ఆనంద పథం


2.పాంథునికి ముగిసేనా పయనమెన్నడైనా

చేరాల్సిన గమ్యమన్నది మిథ్యా దిక్చక్రమైతే

తడారినగొంతే తడిసేనా ఎడారిలో బాటసారికి

ఎదురైన ఎండమావినే మంచినీరని ఎంచితే

ఆశావహ దృక్పథమంటే నాకు హాస్యాస్పదం

యథాతథ స్వీకారమే చేర్చును ఆనంద పథం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఔను నిజం ఔను నిజం 

నా ఊహే నీవై వెలిసావన్నది నిజంగా నిజం

వలపు నిజం తలపు నిజం 

నా మనసే నీదన్నది నీవెరిగిన అసలు నిజం


1.కొలను నిజం కలువ నిజం 

జాబిల్లిని కన్నంత మురియుట నిజం విరియుట నిజం

మబ్బు నిజం గాలి నిజం

గాలి తనని తాకినంత కరుగుట నిజం కురియుట నిజం


2.వెదురు నిజం పెదవి నిజం

మోవి స్పర్శతో నే పిల్లన గ్రోవై మ్రోగుటే తీపినిజం

నా రాధవె నీవునిజం నీ బాధయు నిజం నిజం

మనసంగమ ప్రతిసమయం రసమయమగునన్నదే కదా నిజం


3.నీవు నిజం నేను నిజం

ఒకరిలో ఒకరున్నది మనమొకరికి ఒకరన్నది నిజం

నీ అందం నిజం మన బంధం నిజం

నీతో జీవిత బంధమే ఆనందమన్నది పరమ నిజం



ఎవరికైనా పెట్టావా ఇంతటి క్లిష్ట పరీక్షలు

ఎవరికైనా వేసావా నాకన్న నికృష్ట శిక్షలు

చదవలేదు నేనే ఇతిహాసాన

వినలేదు ఏ పురాణ మందున

వేంకటేశ సంకటనాశా ఏమిటీ తమాషా

నా వెతలను భరించడం హమేషా ఆషామాషా


1.వేలు నొప్పి తగ్గేలోగా కాలు మెలిక పెడతావు

మెడపట్టు వదిలినంతనే నడుం పని పడతావు

కన్నుమూసి తెరిచేలోగా వెన్నపూస నలిపేస్తావు

నువు తలపుకు రాకుండా తలనొప్పులెడుతావు

వేంకటేశ సంకటనాశా ఏమిటీ తమాషా

నా వెతలను భరించడం హమేషా ఆషామాషా


2.మందులేని రోగాలన్ని నాకై కనిపెడతావు

ఊపిరాగి పోయేలాగా కఫం గొంతునింపుతావు

వాతం మితిమీరజేసి సతమత మొనరించుతావు

బ్రతుకు కన్న చావేమరి మేలనిపించుతావు

వేంకటేశ సంకటనాశా ఏమిటీ తమాషా

నా వెతలను భరించడం హమేషా ఆషామాషా