Thursday, August 25, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మనసు చూరగొనని కవితా ఓ కవితేనా

మేధను మురిపింపజేయలేనిదీ గేయమేనా

కదిలే కళ్ళను ఠక్కున ఆపగలుగు ఆరంభం

ఆసాంతం వదలక చదివించే శైలీ శిల్పం


కవితంటే వెంటాడి వెంటాడి వేధించాలి

పాటంటే పెదాలపై సతతం నర్తించాలి


1.వ్రాసిన వారెవరనేది కాకుండా అలరించాలి

వాసిగల భావాలు కవనాన పరిమళించాలి

ఆనోట ఈనోట నాని నాని విశ్వవ్యాప్తి నొందాలి

విరోధులైనా సరే ప్రశంసించగలిగేలా చిందాలి


కవితంటే పదపదము గుండెను పిండాలి

పాటంటే ఒడలంతా పరవశాలు నిండాలి


2.పటాటోపాలు లేక సత్తా ప్రదర్శించగలగాలి

చిత్రపటాలనే ఎద ఎదలో చిత్రింపజేయాలి

ముఖ చిత్రాల చిత్రాలు లేక పదచిత్రణ విరియాలి

చదివిన మది  తనదిగా కవితను  అనుభూతించాలి


కవితంటే కడదాకా విడవని హస్తం కావాలి

పాటంటే కలలోనూ మరవని నేస్తమవ్వాలి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిరీక్షణే  క్షణం క్షణం నరకం

ప్రతీక్షయే ప్రతిక్షణం ప్రత్యక్ష నరకం

నిర్దుష్ట కాలానికీ ఎదిరిచూపు కష్టసాధ్యం

అస్పష్టపు గడువుకైతె నాదృష్టిలో అసాధ్యం

క్షణమొక యుగమౌతుంది చెలి విరహంలో

యుగమే క్షణమై కరుగుతుంది సమాగమంలో


1.పదునాలుగు వర్షాల వనవాసం

పన్నెండు వత్సరాల అరణ్యవాసం

తడబాటు లేక ఎడబాటెలా సైచారో

విసుగన్నదే లేక అంతగా ఎలా వేచారో

క్షణమొక యుగమౌతుంది చెలి విరహంలో

యుగమే క్షణమై కరుగుతుంది సమాగమంలో


2.ఒక యాతన గొంగడిక్రిమి సీతాకోక చిలుకవగా

ఒక వేదన  రామకథే బోయనోటి పలుకవగా

గర్భస్థ శిశువు తపన నవమాసాలూ ఓర్పుగా

శతమానం భవతియే ఈ నర జన్మకు చాలింపుగా

క్షణమొక యుగమౌతుంది చెలి విరహంలో

యుగమే క్షణమై కరుగుతుంది సమాగమంలో