Tuesday, December 21, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎన్ని కుంభకోణాలు పచ్చిదగామోసాలు

మాయోపాయాలు  పలికితె హేయాలు

మనుగడకై రగడలతో విలువలకే తిలోదకాలు 

కుట్రలు కుతంత్రాలు వెరసి నేటి నీచరాజకీయాలు


1.డబ్బుంటే రాజకీయాలు డబ్బుతో గబ్బు రాజకీయాలు

అబ్బోయని తబ్బిబ్బగు డబ్బు కొరకు రాజకీయాలు

పదవి కొరకు రాజకీయాలు పవరు కొరకు రాజకీయాలు

నోట్లు ఫీట్లు ఓట్లు వెరసి నేటి నీచరాజకీయాలు


2.కార్పొరేట్ల  రాజకీయాలు బ్యూరోక్రాట్ల రాజకీయాలు

గుడులు బడులు ఆసుపత్రుల భ్రష్టు పట్టించిన రాజకీయాలు

గల్లీనుండి ఢిల్లీదాక లొల్లిలొల్లి చిల్లర చిల్లర రాజకీయాలు

ఎంతకైన తెగింపులు వ్యవస్థకే తలొంపులు  వెరసి నేటి నీచరాజకీయాలు


3.

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎక్కేస్తుంటారు ఎక్కేటివాళ్ళు

దిగిపోతుంటారు తావొచ్చినవాళ్ళు

ఎక్కడిదాకో ఈ బ్రతుకు బండి పయనం

మలుపులెన్నో మజలీలెన్నో చేరే లోగా గమ్యం


1.ఉండబట్టలేకా ఎందుకో ఆగడాలు

తమకే సొంతమంటు అందరితో జగడాలు

ఉన్నంతసేపే కద గొప్పలకై తిప్పలు

ఊరువచ్చినాక తొవ ముళ్ళ తుప్పలు


2.హాయగ గడపలేక ఎరనబడే చేపలు

పరిధే దాటక తిరిగే బావిలొ కప్పలు

సాలీడు గూటిలొ చిక్కే ఆశపోతు ఈగలు

భూగోళం కబళింపజూచు మూర్ఖపు డేగలు


3.చిరునవ్వుతొ పలకరించె పరిచయస్తులు

పరస్పరం తోడుండే నిజమైన దోస్తులు

బంధాలతొ బంధింపజూసె ధారాపుత్రులు

కడిచాక వెంటరానివి నీ ఆస్తిపాస్తులు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:హిందోళ వసంతం


ఎవరన్నారు నిన్ను శివా

సర్వసంగ పరిత్యాగివని

నమ్మడమెటుల ఉమాధవా

సన్యసించిన యోగివీవని

నమఃశివాయ ఓం నమఃశివాయ

నమఃశివాయ ఓం నమఃశివాయ


1.మోహమొందితివి మోహిని ఎడల

సతికి వసతాయే  సగము నీ ఒడల

గంగ పొంగులకు లొంగి దాస్తివి ఆమెను నీ జడల

తనయ తనయుల నొదలవైతివి చిక్కడి ముడుల

నమఃశివాయ ఓం నమఃశివాయ

నమఃశివాయ ఓం నమఃశివాయ


2.  ధరియిస్తివి నెలవంకను తలను

విహరిస్తివి ధరయందు తరచుగను

అందిస్తివి  జగతికి సంగీత శాస్త్రమును

చిందులేస్తివి ఆనందము ఆగ్రహమందును

నమఃశివాయ ఓం నమఃశివాయ

నమఃశివాయ ఓం నమఃశివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ ఎద కుముదము కోరుకొనే

తుమ్మెదనై పొందెద మోదమునే

గ్రోలెద ప్రణయ మరందమునే

పెదవుల పొరలెడి మాధవినే

నీవే నెచ్చెలి నా మది మెచ్చెడి ఆమనివే


1. వన్నెల చిన్నెల విరుల మంజరి

మత్తిలు వలపుల అత్తరు కస్తురి

తాకిన జినుగుల హాయిడు సుదృతి

తరగక తొరగెడి మధుర సుధాఝరి

నీవే నెచ్చెలి నా మది మెచ్చెడి శర్వరి


2. కన్నుల కురియును కైరవిపాతం

గళమున వరలును సుస్వరపాతం

మనసంతా  మమతాన్వితమౌ నవనీతం

మేను వేణువే ఒలికించు సరసరమ్యగీతం

నీవే నెచ్చెలి నా మది మెచ్చెడి సంగీతం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లోక కళ్యాణకారకం శ్రీ శ్రీనివాస కళ్యాణం

జగదుద్ధార ఉద్దీపనం పద్మావతితొ స్వామి వివాహం

వేలకన్నులు చాలవు తిలకించగా ఆ వైభవం

భాషలేవీ తూగవు కీర్తించగా ఆ దివ్య ప్రాభవం

కమనీయమై రమణీయమై మది పులకాంకితమాయెగా

అమందానందకందళిత హృదయారవిందమాయెగా


1.బ్రహ్మ రుద్రులే పెండ్లి పెద్దలుగ

సకల దేవతలు పెండ్లికతిథులుగ

షణ్ముఖుడే ఆహ్వానము పలుకగ

వకుళమాత మానస తనయుడు

మహా లక్ష్మి ప్రియమైన  వల్లభుడు

వేంకటేశ్వరుడె  వరునిగ వరలగ


2.అశ్వత్థ వృక్షమే సాక్షిగ మారగ

ఉత్తర దిక్పతి అప్పును కూర్చగ

ఆకాశరాజుకు అనుంగు పుత్రిక

పద్మావతీ దేవి  నవ వధువవగ

అంగరంగ వైభోగంగా స్వామి పరిణయం 

కనివిని ఎరుగనిరీతిగా పాణిగ్రహణం

 రచన,స్వరకల్పన&గానం: డా.రాఖీ


వాడిన మాలలేల నచ్చితివో

గోదాదేవి ఇచ్ఛగించి మెడనదాల్చిచ్చిప్పుడు

ఎంగిలి పళ్ళనేల మెచ్చితివో

శబరిమాత వగరుతీపి రుచిచూసిచ్చినప్పుడు

భక్తిభావనే నీకు కడు ప్రీతికరము భౌతికపరమైన చర్యకన్నా

ముక్తినొసగ తగనా కనికరించి బ్రోవగనను తిరుమల వెంకన్నా


1.పక్షిదెంత ఆయమో అందుకొనగ మోక్షము

ఉడతదెంత సాయమో  కీర్తిగొనగ అక్షరము

మార్గమేది ఎంచుకున్నా చేర్చును నీ సన్నిధానము

చిత్తశుద్దితో అర్చన చేయగ ఏదైనా సరె విధానము

భక్తిభావనే నీకు కడు ప్రీతికరము భౌతికపరమైన చర్యకన్నా

ముక్తినొసగ తగనా కనికరించి బ్రోవగనను తిరుపతి వెంకన్నా


2.తులసీదళమెంత బరువని తూచింది నిన్ను సైతం

అటుకులు పిడికెడు ఐతేనేమి తెలిపాయి గాఢ స్నేహం

శేషప్ప కొలిచాడు పద్యశతముల పొగిడీ తెగిడీ

అన్నమయ్య కీర్తించాడు వేలకృతుల పాడీ వేడీ

భక్తిభావనే నీకు కడు ప్రీతికరము భౌతికపరమైన చర్యకన్నా

ముక్తినొసగ తగనా కనికరించి బ్రోవగనను తిరుపతి వెంకన్నా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఊరూరా నీ ఊసాయే-మదిమదిలో నీ ధ్యాసాయే

షిరిడీ చనగ నిను దర్శించగ సాయీమాకు మనసాయే

పరమదయాళా నువు దయగనగ బ్రతుకంతా కులాసాయే

అక్కునజేర్చి చక్కని దెసకు నడిపించమనిమా కాసాయే


1.సాటి మనిషిని ఆదరించని ప్రతివారూ కసాయే

ఆత్మస్తుతి పరనిందలతో ఎప్పుడు ఒకటే నసాయే

విద్వత్తున్నా విజ్ఞతలేకా సంస్కారమంతా మసాయే

అభిశంసలకు ఆక్షేపణలకే వృధా పరిచెడి మా పసాయే

అక్కునజేర్చి చక్కని దెసకు నడిపించమనీ మా కాసాయే


2.స్థాయికి తగని వారైనా ఎదలొ ఎందుకొ జెలసాయే

అనుభవజ్ఞతే ముదిరిన గాని ఎదగని ఒదగని వయసాయే

ఔచిత్యం ఔన్నత్యం లేని వాదమే గురివిందా పూసాయే

మార్మిక పదముల అక్కసుకక్కే తింగరి తింగరి బాసాయే

అక్కునజేర్చి చక్కని దెసకు నడిపించమనిమా కాసాయే