Monday, December 2, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అలంకారప్రాయమేనా నీ ఆయుధాలన్నీ
పటాటోప భయంకరమేనా నీ విలయనర్తనలన్నీ
రుద్రుడవూ వీరభద్రుడవనునవి నేతి బీరనామాలేనా
మూసుకున్న మూడోకన్ను మదనుని పాలేనా
తలుచుకుంటే శివా జరుగదా ఘోరకలికి న్యాయం
భరతావనిలో భద్రతకరువై ప్రతి కలికి  అయోమయం

1.కుముదాన్ని ఊదితే అవని వణికి ఊగదా
ఢమరునాదమొక్కటే గుండెలదరజేయదా
త్రిశూలాన్ని వాడితే పశుప్రవృత్తి మాయాదా
అనాలంబి మీటితే అనురాగం విరియదా
తలుచుకుంటే శివా జరుగదా  ఘోరకలికి న్యాయం
భరతావనిలో భద్రతకరువై ప్రతి కలికి అయోమయం

2.బుసలుకొట్టు కామాన్ని బూదిచేయవేమయా
గరళకంఠ మద్యమింక ఇల హరించవేమయా
జనులకొకటె మత్తుకలుగ భక్తి ననుగ్రహించవయా
పడతులంత పార్వతీ మాతగ తలపించవేమయా
తలుచుకుంటేశివా జరుగదా ఘోరకలికి న్యాయం
భరతావనిలో భద్రతకరువై ప్రతి కలికి అయోమయం
దిగబడింది గునపమల్లె
గుండెలోతుల్లో గులాబీముల్లు
మరులుగొంటి భ్రమరమల్లె
మధుర సుధలుగ్రోలు కాంక్షమీర
పూవూ తుమ్మెద బంధమేనాటిదో
రెంటి ప్రణయ బంధమే పాటిదో

1.సీతాకోకా చిలుకలతో పోటీ
తేనేటీగలా ధాటిని దాటీ
నల్లనైన తన ఆకృతి తోటి
ఝంకార సరాగాలె మీటి
ఆకట్టుకోవాలి అందాలవిరులను
రసపట్టు పట్టాలి మకరంద ఝరులను

2పంకజాల జాలం మత్తు మందే
పడమటి పొద్దు వాలకముందే
వదిలి వెళ్ళి తీరాలి కౌగిలి పొందే
తృటిపాటి జాప్యమైతె బ్రతుకుఖైదే
నొప్పింపకతానొవ్వక తప్పుకోవాలి
ఏగాయ మవకుండా ఎగరాలి సుమాలవాలి

కన్నీటిని సిరాగా  నింపిన కలంతో
రాస్తే ఏం కనబడుతుంది గుండె కోత కవితగా
కత్తి దింపి స్రవించిన రక్తంలోనో
కాల్చేసిన మసికల్గిన ద్రావకంలోనో
ముంచి లిఖించు ప్రపంచం కాంచకమానదు
ప్రతి రచనను శిరోధార్యంగా ఎంచక మానదు

1.మితిమీరుతున్నది నానాటికీ నాతి అభద్రత
గతితప్పుతున్నది సమాజంలో వ్యక్తి బాధ్యత
తప్పులను కప్పిపుచ్చు కప్పదాటు చట్టాలు
కౄరనేరస్తులనూ సమర్థించు న్యాయపరిధి లొసుగులు
దోషులపాలిటి యమపాశలయ్యేలా తక్షణ తీర్పులు
పెట్రేగే అంగాలను ఖండించే రీతి కఠినాతి కఠిన శిక్షలు

2.పునరావృతమౌతుంటే నిర్భయ దుర్ఘటనలు
ఓట్లు రాల్చగలవా కులమత రాజకీయ నటనలు
స్త్రీజాతికి ఎంతటి దుర్గతి భరతమాత లోగిలిలో
దారుణ మారణ మూలాలు పెకలించగ ఏలమీనమేషాలో
రతనాలు అంగళ్ళలోనాడు మద్యం మాదక ద్రవ్యాలు నేడూ
విద్య వైద్యం విపణిలోనేడు  విచ్చలవిడి విలువల దిగజారుడూ

అందరు నిదురోయాక-మేలుకొంటానేను
కవితలద్వారా జగతికి-మేలుకోరుతాను
ఎప్పుడూ కనుమూయని కవినే నేను
అర్దరాతిరైనా వెలిగే రవినే నేను

1.కడుపులొ ఒకటి బయటకు ఒకటి ఎరుగనివాడను
పర్యవసానం ఏదైనా కుండ బ్రద్దలుకొడతాను
ఇతరులు చూడని కోణంలో వెతలను చూస్తాను
విషయం ఏదైన ఎదలకు హత్తుకునేలా చేస్తాను
చైతన్యం జ్వలించే మిత్రుడనేను
అనునిత్యం సత్యం వచించే పవిత్రుడనేను

2.ఎడారి బ్రతుకుల ఎప్పుడు నిలిచే వాసంతం నేను
మాటపెగలని మనుషుల తరఫున సమర శంఖం నేను
చిరుస్పర్శకే పులకించిపోయే చిగురాకునే నేను
ప్రశంసకే పొంగిపోయే పసి హృదయం నేను
అర్థంకానివారికి పిచ్చి మాలోకం నేను
పరమార్థం గ్రహించువారికి హాయిగొలిపే మైకం నేను