Friday, October 30, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తాతకు దగ్గులు నేర్పితే ఎలా

గురువుకు నామం పెడితే ఎలా

హనుమంతుడి ముందే కుప్పిగంతులా

శ్రీరాముడి ముందే శూర్పణఖ వేషాలా


1.ఉండచోటిస్తే ఇల్లునాక్రమించాలా

పండు తినమంటే గుండెకే ఎసరెట్టాలా

ఏకులాగవచ్చి మేకులాగుచ్చుకోకు

బండారం బయలైతే ఏమాత్రం నొచ్చుకోకు


2.వంచన మించిపోతే సాక్ష్యాలు కోకొల్లలు

తోకఝాడింప జూస్తే ఋజువులు వేనవేలు

బుద్దిగా ఉండేవారికి భవితంతా బంగారం

మాటనిలుపుకునే వారికి లోకమే స్వర్గధామం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చక్రవాకం


అభినుతులో వినతులో

మహిమాన్విత నీ చరితలో

ప్రభవించును నా కవితలలో

నినదించును నా గీతాలలో

వేంకటాచలపతి నా కేల దుస్థితి

నీవేగా నాకిల స్వామీ శరణాగతి


1.ఎలా కాదనగలను నీ లీలలను

ఎలాకొట్టివేయను దృష్టాంతాలను

కనులముందె జరిగిన అద్భుతాలను

అసంభవాలె మార్పుచెంద సంభవాలను

వేంకటాచలపతి నిలువవయ్య నా మతి

నీవేగా నాకిల స్వామీ శరణాగతి


2.నందనవనమునే మసనముగా మార్చినావు

ఆనంద సౌధముకే చిచ్చును రగిలించినావు

స్వప్నాల నౌకనే సాగరాన ముంచినావు

ప్రశాంతమానసాన అలజడి సృష్టించినావు

వేంకటాచలపతి చక్కదిద్దు పరిస్థితి

నీవేగా నాకిల స్వామీ శరణాగతి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మబ్బులమేలిముసుగు చందమామకు

సిగ్గుల జలతారు ముసుగు కలువభామకు

అడ్డుతొలిగితే సులువౌ అనురాగ ధారకు

బిడియమొదిలితే సుగమం ప్రేమసీమకు


1.మొదటిసారి చూడగానె మొదలౌను స్పందన

కనులు కనులు ప్రసరించే అయస్కాంత భావన

ఎదలోన కదలాడు చెప్పలేని అలజడి

ఎరుకపరుచలేక పెదవులు ముడివడి


2.కదలలేక అడుగులు మొరాయించు ఘర్షణ

గుండెను పెకలించి దోచుకెళ్ళు నరకయాతను

వలపుల వలలో విధిలేక చిక్కుబడి

విలవిలలాడునే విరహపు సుడిబడి


PIC courtesy:Sri. Chandra Haasam

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అమ్మచీరకొంగు-బహళార్థాలకే హంగు

అమ్మ చీరకొంగు అనేక సాధనాల ప్రోగు

పట్టుచీర ఐనా నేత చీరైనా 

సంతతి చింతలో అంతా దిగదుడుపే

సిల్కు చీర ఐనా చీనాంబరమైనా

బిడ్డ ఎడల ప్రేమముందు బలాదూరే


1.ఎండ లోన నీడ నిచ్చు మానౌతుంది

వానలోన తడవ కుండ గొడుగౌతుంది

ఉక్కపోతలోన చక్కని వీవెన ఔతుంది

చలినుండి కాచెడి దుప్పటిగా మారుతుంది


2.పాలుపట్టువేళ శిశువుకు పరదా ఔతుంది

నిదురించే పసిపాపకు పట్టుపానుపౌతుంది

బిడియపడే పిల్లలకు అభయహస్తమౌతుంది

కన్నీరు తుడిచి ఓదార్చే ప్రాణనేస్తమౌతుంది

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


కనులు మూసుకున్నాడు కమలనాభుడు

మొహంచాటు చేసాడు  మంగావిభుడు

స్థాణువైపోయాడు పాండురంగడు

వృద్ధుడైపోయాడు నృసింహుడు

ఉన్నదాన్ని గుంజుకున్న నంగనాచులు

తిరిగి సమకూర్చలేని తింగరి బూచులు


1.కడలి పాలు విరుగుతాయి మా కన్నీటి ఉప్పుపొగిలి

యాతన పడతాడు మా గుండెకలత ఉసురు తగలి

ఖైదీఔతాడు మా చిత్తపు చెఱసాలలో నిత్యం రగిలి

సేవలు గొంటాడు చేతకాక గుదిబండగా మిగిలి

ఉన్నదాన్ని గుంజుకున్న నంగనాచులందరూ

తిరిగి సమకూర్చలేని తింగరి బూచోళ్ళు


2.కరకు వాడౌతాడా లక్ష్మమ్మ పాదసేవ చేయుచుండ

కఠినాత్ముడౌతాడా కరుణామయి సిరి ఎద కొలువుండ

కౄరచిత్తుడౌతాడా చెలఁగి రుక్మిణమ్మ చెంతనుండ

దయవిడనాడేనా తల్లి శ్రీదేవి దాపున విలసిల్లుచుండ

ఉన్నదాన్ని గుంజుకుంటే చోద్యమేగా

తిరిగి సమకూర్చకుంటె బ్రతుకు నైవేద్యమేగ