Thursday, April 29, 2021

 హృదయవీణ మీటితే ..పలుకుతుంది అనురాగం

పెదవి వేణువూదితే కలుగుతుంది ప్రేమ యోగం

గీతం నీవు సంగీతం నీవు నా జీవితానికి సంకేతం నీవు

ఆ రాధనే నీవు ఆరాధన నోచేవు  

మరపురాని ప్రణయ గాధవైనావు



1.కను కలువలు విచ్చినంత మందహాసం

సంపంగి నాసిక పూయగ వింతహాసం

చెంపల రోజాలు విరియగ దరహాసం

అధర మందారాలు మురియగ చిరుహాసం

మొత్తంగా మోమంతా  వెలిసింది పూవనమై

చెలీ నీవు చేరువై  నీవైనావు నాజీవనమై


2.పదహారు ప్రాయమై పరవశించెనీ పరువం

ప్రేమైక లోకమై పరిమళించెగా మరువం

తాకితే మాసిపోయె అపరంజి నీతనువు

మన్మథుడే ఎక్కిడిన పంచబాణ ధనువువు

మన కలయిక కానీయకు ఎన్నటికీ మరీచిక

నిస్సారపు నా బ్రతుకున నీవే నాకు వేడుక



 


Tuesday, April 27, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏమీ తోచడం లేదు-నోచినదానికై వేచివేచి

ఏదీ సైచడం లేదు- నీ పెదవుల నే రుచి చూచి

జాబిలిదీ అందమనగలేను నీ మోమును కన్నాక

వెన్నెలా చల్లగ అనిపించలేదు నీ చేరువ నున్నాక


1.మబ్బులకూ అబ్బురమే నీ కురులు రేగ

చుక్కలూ మిణుగురులే నీ చూపుల తూగ

రోజాలకిష్టమే నీ బుగ్గల సిగ్గులై మెరవగ

మల్లెలకదృష్టమే నీ నవ్వులకవి పోలికవగ


2.నీ నడుం మడతలు గోదారిసుక తిన్నెలు

వయారాల నడకలు కిన్నెరసాని మెలికెలు

దృష్టి దాటి పోనీని నీ సుందర మందర గిరులు

సృష్టికి ప్రతిసృష్టిగా మరులురేపు నీ పురులు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కాలుకు దూరమైనా -నాకంటికి భారమైనా

మానసాన్ని దర్జాగా ఆక్రమించినావే

మెదడునే దౌర్జన్యంగా కబ్జా చేసినావే

అబ్జదళనేత్రి అభిమాన అభినేత్రి

సుమ సమ కోమల దివ్యగాత్రి నా ప్రియమైత్రి


1.మేని పై నీ మెరుగులే ఎరలాయె దక్కేటందుకు

నీ చిలిపి చేష్టలన్ని వలలాయే చిక్కేటందుకు

ప్రయోగించినావే నీ మంత్రదండాన్ని

ప్రదర్శించినావే ఏదో ఐంద్రజాలాన్ని

ప్రస్తుతం నేను ఐనాను నీ దాసుడను

వస్తుతః నేను నిఖార్సైన బానిసను


2.నర్మగర్భముంటుంది వింతగ నీ పలుకులలోనా

అంతరార్థముంటుంది నీ మూగ సైగల్లోనా

కట్టిపడవేసావే కనికట్టుతొ నీఎదవాకిట

గారడేదొ చేసావే కళ్ళుమూసి తెరిచే లోపట

అయస్కాంతమల్లే నన్నులాక్కున్నావే

ఇనుపముక్కలాగా నిన్నతుక్కున్నానే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చిత్రం: Sri.Agacharya Artist 


శ్రీరామ బంటువని నిన్నంటే మారుతి

పులకరించి పోయెదవు నీ కెంతటి ప్రీతి

శ్రీరామ గానమే నీకు నిత్య నిర్వృతి

ప్రత్యక్షదైవమ హనుమా నీవే శరణాగతి


1.వాయుతేజస్సుగల వరపుత్రుడవు

సాక్షాత్తు పరమేశ్వర అంశవే నీవు

అంజనాదేవీ కేసరి నందనుడవు

దినకరునికి నీవు ప్రియమైన శిశ్యుడవు


2.వజ్రాయుధ ఘాతానికి హనుమవైనావు

బ్రహ్మాస్త్రానికి నీవు బద్ధుడవైనావు

ధర్మానికి రామునితో తలపడనిలిచావు

రామనామ మహిమను లోకానికి చాటావు


3.సకల శాస్త్ర కోవిదుడవు సంజీవ రాయుడవు

సంగీతంలో నారదు గర్వభంగమొనర్చావు

భీముని కావరాన్ని అణచి దీవించావు

పార్థుని పతాకవై విజయము నందించావు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


రప్పించెద నిన్నూ రామనామ భజన చేసి

మెప్పించెద నిన్నూ సిందూరము మేన పూసి

కుప్పించి ఎగసి కడలిని దాటిన లంకాదహి పావని

చప్పున నను భవజలదిని కడతేర్చర పాహిపాహి

శ్రీ ఆంజనేయా  జయమంగళం

శ్రితపారిజాతా  శుభమంగళం


1.నీ జయంత్యుత్సవము నేడు మదికెంతో ఉత్సాహము

హనుమశ్చరితమున నీ కీర్తి గానము శ్రవణ పేయము

భక్తి ముక్తిదాయం నీ సుందరకాండ పారాయణం

నీదివ్య దర్శనముతొ దీర్ఘ వ్యాధులే మటుమాయం

శ్రీ రామదూతా అభివందనం

జైజగజ్జేతా హస్తార్పణం


2.రవిని ఫలమని మ్రింగిన ఘనుడవు బాలాంజనేయ

యయాతికండగనిలిచిన బలుడవుఅభయాంజనేయా

రోమరోమమున రామునిగన స్వామిదాసుడవు భక్తాంజనేయా

భక్తులపాలిటి కల్పతరువువు జయహో ప్రసన్నాంజనేయా

కపివర్యుడా  నీకు  కైమోడ్పులు

వాగధీశుడా నీకు వందనశతములు


శ్రీ రామదూత హనుమజ్జయంతి శుభకామనలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాపిట మెరిసే సింధూరం

నుదుటన కుంకుమ తిలకం

కంటికి దిద్దిన అంజనము

వనిత వదనానికే సింగారము

భారతీయ సంస్కృతికి నెలతే నిదర్శనం

సాంప్రదాయ మనుగడకు మగువే కారణం


1.సీత సింధూర ధారణ మహిమనెరిగి మారుతి

మరుచెదమా తన మేనంతా పులుముకొన్న సంగతి

కుంకుమ ధరించినంతనే దిష్టి దోషానికి దుర్గతి

పసుపు కుంకుమలతొ పడతికి ఆయురారోగ్య ప్రాప్తి


2.ఆకట్టుకొనుగ అరచేతుల గోరింట  అరుణకాంతి

ప్రమద పాదాలకు పారాణే నిత్య సౌందర్య దీప్తి

నిండుగా చేతికి వేసుకొన్న గాజులే చూపరులకు రక్తి

పద్దతైన చీరకట్టులో పూబోడి అందమే ప్రశస్తి

Monday, April 26, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిను రమ్మన్నానా మతిమాలి

మనసిమ్మన్నానా బ్రతిమాలి

నీ మాయలొ పడ్డానే ఖర్మకాలి

నీ మత్తులొ మునిగానే నామీద నాకే జాలి


1.ఊడిపడ్డావే నాపై ఉల్కలా ఉన్నట్టుండి

ఉప్పెనై నను ముంచావే తెంచుకొని గండి

విందునందమన్నావే  సొగసులన్ని వండి

పొందు పొందమన్నావే వలపుపంట పండి


2.సరళహృదయవనిపించే కఠినాత్మురాలివే

మంజులసడిగా తోచే సాగర ఘోషవే

ఊరించినావే కలనైనా ఎన్నడూ ఎంచనట్టుగా

వంచించినావే ఉత్తుత్తి ఊహవై  కనికట్టుగా

Sunday, April 25, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఖరహరప్రియ


కైలాసగిరి వాస-కాశీపురాధీశ

వేములాడ శ్రీరాజ రాజేశ్వరా

 శ్రీరాజ రాజేశ్వరీవరా

బేడిసములందుకో భీమేశ్వరా

నమసములు నీకివే నగరేశ్వరా

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


1.నందివాహన నీకు కోడెనిచట కట్టింతు

గంగాధరా నీకు అభిషేక మొనరింతు

మారరిపుడవు నీకు మారేడు నర్పింతు

జంగమయ్యానీకు సాగిలబడి నతియింతు

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


2.మాసిద్ధి గణపతిని తొలుతనే దర్శింతు

మాత బద్ది పోచమ్మను తప్పకనే పూజింతు

మావాడివి రాజన్నాయనుచు వేడుకొందు

మహాలింగా నిన్ను ఆలింగనమొనరింతు

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మధువొలుకు పాత్రలే నీ నేత్రాలు

చూపులతో గ్రోలగా నాకు ఆత్రాలు

సుధ గుళికలే నీ అరుణ అధరాలు

నే జుర్రుకోగా అత్యంత మధురాలు

ముక్కెఱతొ చక్కదనం అక్కెఱే తీరేను

చెక్కిళ్ళ మెరుపు గుణం కొక్కెమే వేసేను


1.అపరంజి జిలుగులు చిలికే సాలభంజికవు 

అవనీతలాన వెలసిన గంధర్వకన్యవు

సౌరభాలు విరజిమ్మే కస్తూరి గంధం నీవు

మంజులనాదాలు పలికే సంతూర్ వాద్యం నీవు

ఏపూర్వపుణ్యమో నీవు నా పరమైనావు

ఏ తపఃఫలమోగాని నా పాలిటి వరమైనావు


2.నాగావళి కులుకులన్నీ నీ నడకలో

కిన్నెరసాని వంపులన్నీ నీ నడుములో

వంశధార సుడులెన్నొ నీ నాభిలోయలో

వింధ్యా మేరులు చిరుగిరులే నీ జఘన సీమలో

నీతో సహజీవనాన  బ్రతుకంతా నిత్య వసంతం

నీ సంగమక్షేత్రాన ఆనందమె మనకాసాంతం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అలా చూస్తుండి పోయా-శిలా ప్రతిమనై

కోలుకోలేకపోయా నే మంత్ర ముగ్ధుడనై

ఏమందం నీఅందం ప్రస్తుతించగా అందం

నీ తనువున అణువణువూ పారిజాత సుగంధం


1. ముక్కు ఒక్కటే నా గుండెను నొక్కేయసాగే

చూపపుడే సూటిగ ఎదపై  తూపులు వేయసాగే

అరనవ్వేమో నన్నుక్కిరిబిక్కిరి చేయసాగే

ఎక్కడ నిలపాలో నాదృష్టి తికమకపడసాగే


2.పండునిమ్మవంటి మేను వెన్నెలగా తోచే

నునుపుదేలి దేహమంత సృశించ మది వగచే

స్వప్నమందైననూ మనసు సంగమాన్నిఆశించె

అద్వైత స్థితి గురించి జీవితమే పరితపించె

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కనికరమున ననుబ్రోవుమ

ముకుళిత కరముల నీకు నమః

అన్యథా శరణమని  వేడేద

వరమీయగ నీచరణ యుగళి వేంకటనాయకః


1.పంచేంద్రియముల పంచన చేర్చుకో

నా చపల బుద్దిని నీ..వైపుగ తిప్పుకో

నా గతిని ప్రగతిని నీదిగా మార్చుకో

నా మదిలో స్థిరవాస మేర్పర్చుకో


2.ఎందఱిని దరి జేర్చినావో నన్నొదిలితివే

ఏ విధి మెప్పించిరో తెలుపక పోతివే

దిక్కులేని వాడినై నీ దెస మరలితినే

అక్కున ననుజేర్చి ఆదరించవైతివే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


యోధులం మేము ఆశావాదులం

తలపడతాం వైరులతో వైరస్ లతో

తలపెడతాం పులి నోటైనా కరోనా కాటైనా


1.రక్షణ కవచం మాకు మాసిక

బ్రహ్మాస్త్రమె సానిటైజరిక

పద్మవ్యూహమె స్వగృహనిర్బంధం

భౌతిక దూరమె విజయ నినాదం


2.వంటింటి చిట్కాలే వారుణాస్త్రాలు

యోగాభ్యాసాలే సమ్మోహనాస్త్రాలు

ముక్కు గొంతుల ప్రక్షాళణ పాశుపతాస్త్రం

ఆత్మనిర్భరతే అపూర్వ నారాయణాస్త్రం

 రచన,స్వరకల్పన:డా.రాఖీ

సంగీతం,గానం:లక్ష్మణ సాయి


ఏ కానుకలందీయను ఎంత ఘనంగా జరుపను

మాకతిముఖ్యమైన పండగ నీ పుట్టిన రోజును

ప్రేమమీర ప్రకల్పించు నీ జన్మదిన వేడుకను


"హ్యాప్పీ బర్త్ డే టూ యూ హరీష్ భరద్వాజ

విష్ యూ హాప్పీ బర్త్ డేటూయూ మా యువరాజ"


1.వెలిగిస్తాము  మాచూపుల దీపాలను

దిద్దేస్తాము నుదుటన మురిపాల తిలకమును

తలను చల్లెదము మా దీవెనాక్షంతలను

ఆశీర్వదించేము వర్ధిలగ ఆయురారోగ్యాలను


2.కన్నుల నిను నిలిపేము మా కనుపాపగ

ఎదలోన నింపేము అనురాగపు రూపుగ

తోడుగ నీడగ నీతో నడిచేము నీకు కాపుగ

నువు వృద్దిచెందాలి భవితన తోపులకే తోపుగ


3.ముక్కోటి దేవతలు నిలవనీ నీ అండగా

కొండగట్టు హనుమ నిన్ను కరుణించనీ మెండుగ

ధర్మపురి నరహరి దయగననీ నిను దండిగ

సిద్దీశుడు సోదరునిగ ఎంచనీ నిను తన గుండెగ


మా అబ్బాయి జన్మదిన సందర్భంగా తమ శుభాశీస్సులందజేసిన పెద్దలకు,మిత్రులకు మా హరీష్ భరద్వాజ నమస్సులు!

నా కృతజ్ఞతాభివందనములు..💐😊🌹🙏

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏముని వాకిటనో తారాడే వనకన్యవో

రాముని పదతాడన వరమైన మునిపత్నివో

దేవతలకె మతిచలించు సౌందర్యవతి దమయంతివో

శృంగార రంగాన అంగాంగ ప్రేరకమౌ దేవత రతివో

కవులు నిన్ను పోల్చంగ చవులూరుదురే

లోకాన ఏ పోలిక నీతో సరితూగ బలాదూరే


1.చందమామలోని తునక శ్రీచందన తరువు ముక్క

సింధుభైరవి రాగ రసగుళిక సుధామాధురీ కలయిక

మయబ్రహ్మ హొయలెన్ని ఏర్చికూర్చెనో నీకు లతిక

విశ్వకర్మ అవయవాల మర్మమెంత పేర్చెనో గీతిక

కవులు నిన్ను పోల్చంగ చవులూరుదురే

లోకాన ఏ పోలిక నీతో సరితూగ బలాదూరే


2. చిలుక పలుకు పలుకులనే అందించిరి నీ నోటికి

హంసకున్న వయ్యారాన్ని అమరించిరి నీ కటికి

దృష్టి లాగు అయస్కాంతమతికించిరి నీ నాభికి

కనికట్టుతొ మత్తుచిమ్ము మైమ నిచ్చిరి నీ కంటికి

కవులు నిన్ను పోల్చంగ చవులూరుదురే

లోకాన ఏ పోలిక నీతో సరితూగ బలాదూరే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కరోనా కనుమరుగైతే శుభోదయం

భరోసా బ్రతుకు పట్ల కలిగితే శుభోదయం

జనులంతా జాగ్రత్తలు పాటిస్తే శుభోదయం

అవనియంత ఆరోగ్యమయమైతే శుభోదయం


1.పార్టీలు పదవులనక ప్రజాశ్రేయమెంచితే శుభోదయం

రోజువారి కూలీలకు చేతినిండ పనిదొరికితె శుభోదయం

సరకులలో కల్తీలేక ఆహారం లభియిస్తే శుభోదయం

ఏ లంచం ఇవ్వకున్నా ఆఫీసు పనులైతే శుభోదయం

చక్కని పుస్తక మొక్కటి చదివితె మిక్కిలిగా అది శుభోదయం


2.నిర్భయంగ ఆడవారు ఉద్యోగం చేసొస్తే శుభోదయం

అత్యాశకు పోకుండా మోసాల పాలవకుంటే శుభోదయం

చిన్ననాటి మిత్రులంత అనుభూతులు నెమరేస్తే శుభోదయం

వేచిచూచు లబ్దియేదో ఆపూటనె అందుతుంటె శుభోదయం

మోవిపైన చిరునవ్వు విరిసిన ప్రతి ఉదయం శుభోదయం


సాయీ అన్నాగాని బాబా అన్నాగాని

నువ్వే మా తండ్రివని మేము నీ పిల్లలమేయని

ఆమాత్రమైనా ఎరుగవేలనూ

ఏ మాత్రమైనా ప్రేమ చూపనూ


1.కాదల్చుకొని మమ్ము కష్టాల పాల్జేతువా

కనికరించి ఇకనైనా స్పష్టమైన మేల్జేతువా

నిన్ను చూస్తే మమ్ము చూడటమేమిటి

నీ పిల్లల పాలించగ షరతులేమిటి

కన్న తండ్రి అనురాగం అంతేనా

మా అండనీవని నమ్మితె వింతేనా


2.రెండు రూకలెందుకు గుండెనే నీదైతే

పండో దండో ఎందుకు ఇచ్చేదే నీవైతే

కాలుకు మట్టంటకుండా నీవె మము సాకాలి

మాకంటికి రెప్పలాగ మమ్మలనిక కాచాలి

అనాథలం ఔతామా అక్కున మము జేర్చగా

తప్పులంటు చేస్తామా మా చిత్తమునే మార్చగా

Thursday, April 22, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాధ బాధనెరిగితిని

ఆ బాధనే నే మరిగితిని

శ్యామసుందరుని సన్నధికఱుగని

నందనందనుని కౌగిట కరుగని

బ్రతుకే శూన్యమనీ కడు దైన్యమని


1.అందింతును నాడెందము నవనీతముగా

నివేదింతును నా సర్వము  కృష్ణార్పణముగా

నా పెదవులనే మురళిగ వాయించుమనెద

నా మేని మెరుపులు పింఛముగా తలదాల్చమనెద

ప్రార్థించెదన నే పదదాసిగ అర్థించెద నే ఆశగ


2.బాలకృష్ణుని పాలుచేసెద నాక్షీరభాండాలను

మోహనకృష్ణుని పడక చేసెద నా దేహభాగాలను

రతికేళి సలుపగ సతతము నా మతిలోను

సద్గతులేవొ చేరెద సత్యము శివము సుందర స్థితిలోను

ధ్యానించెద లయమై తన్మయమై ఆనంద నిలయమై

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పనికి పోక పోతె నేమో పస్తులాయే

పనికి పోవు తెగువజేస్తే కరోనా కాటాయే

దినదిన గడం నూరేళ్ళ బ్రతుకాయే

పొరపాటు ఎవరిదైనా ప్రాణానికి వేటాయే

బతకలేక చచ్చుడాయే ఏనాడు

చావలేక బ్రతుకుడాయే నీతోడు


1.మాస్క్ తో మూస్కున్నా ముక్కూమూతిని

సానిటైజర్ తో పదేపదే కడుక్కున్నా  చేతిని

రోగాల పాలవడమే బయటి తిళ్ళన్ని తిని

కరోనాకు బలియవడమె తిరుగుళ్ళు తిరిగితిరిగి

బతకలేక చచ్చుడాయే ఏనాడు

చావలేక బ్రతుకుడాయే నీతోడు


2. క్లబ్బులు పబ్బులు వదిలించవ డబ్బులు

పెండిండ్లు సినీహాళ్ళు అంటించగ జబ్బులు

ఎలక్షన్లు మీటింగులు పెట్టగ పెడబొబ్బలు

పండుగలు పబ్బాలు ఆరోగ్యానికే దెబ్బలు

బతకలేక చచ్చుడాయే ఏనాడు

చావలేక బ్రతుకుడాయే నీతోడు


3.ప్రభుత్వాలు చేతులెత్తె తోచినంత చేసి

ప్రజలేమో విధిలేక బ్రతుకు తెరువు మానేసి

ఆస్పత్రులు ఎంతగవీలైతే అంతా దోచేసి

మందులు టీకాలకు బ్లాక్మార్కెట్ రాజేసీ

బతకలేక చచ్చుడాయే ఏనాడు

చావలేక బ్రతుకుడాయే నీతోడు

 

https://youtu.be/evUHLQslWDw?si=Oo3Zm_g0VaTeQ5PF

#EarthDay2021  శుభాకాంక్షలతో


రచన,స్వరకల్పన&గానం:రాఖీ


చల్లని తల్లి మన పుడమి

జీవులకే కల్పవల్లి మన భూమి

విశ్వంలో జలరాశి కలిగినదై

ప్రాణవాయు ఉనికికి ఆలవాలమై

కారణభూతమైంది మానవ మనుగడకు

ఆరాధ్య యోగ్యమైంది యుగయుగాలకు


1.వరాహస్వామి కావ ఇల్లాలుగ మారింది

సీతమ్మ తల్లికే తను జనని అయ్యింది

సూర్యమండలానికే తలమానిక మైనది

నరసంచారమున్న ఏకైక గ్రహమిది

కారణభూతమైంది మానవ మనుగడకు

ఆరాధ్య యోగ్యమైంది యుగయుగాలకు


2.వృక్షజాతి వ్రేళ్ళూనగ ఆధారభూతమైంది

పంటలనందించే మనిషికలల పంటైంది

ప్రకృతినంత సమతుల్యత నొనరింపజేస్తుంది

పర్యావరణం పాడైతే నొచ్చుకుంటుంది

కారణభూతమైంది మానవ మనుగడకు

ఆరాధ్య యోగ్యమైంది యుగయుగాలకు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


మొఱనాలించరా, పరిపాలించరా

చెఱవిడిపించరా, దరి చేర్పించరా

రఘుపతి ఎదగల మా మారుతి

గొనుమిదె ప్రణతి వినుమిదె వినతి

నువు తలుచుకుంటే కానిదియేది

నువు కరుణజూడగ బ్రతుకే పెన్నిధి


1.బ్రహ్మ రూపుడవు శివాంశయేనీవు

విష్ణుతేజమును దాల్చినవాడవు

వేదవేదాంగ పారంగతుడవు

సంగీత శాస్త్రాన ఘనకోవిదుడవు

నువు తలుచుకుంటే కానిదియేది

నువు కరుణజూడగ బ్రతుకే పెన్నిధి


2.జితేంద్రియుడవు దివ్యదేహుడవు

మహాబలుడవు దనుజాంతకుడవు

రోమరోమమున రామ ధ్యానమే

భక్తుల ఎడ నీకు కడు వాత్సల్యమే

సంజీవరాయా నీ దయతొ స్వాస్థ్యము

చిరంజీవా చిదానందా నీవే నీవే శరణము

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


"జనులకు శుభకామనలు-రాముని శుభ దీవెనలు"


ధర్మానికి నిలువెత్తు రూపంగా

వెలిసాడు శ్రీరాముడు హైందవ దీపంగా

సహనానికి సరికొత్త భాష్యంగా

అవతరించె సీతమ్మ ఉత్తమ సాధ్విగా

భరతావని రామాయణ చరితమే ఉత్ర్రేరకంగా 

శ్రీరామనవమి హిందువులందరి ఉత్సవంగా

జనులకు శుభకామనలు రాముని శుభ దీవెనలు


1.పితృవాక్య పరిపాలన కర్తవ్యమన్నాడు

సార్వభౌమత్వాన్ని తృణంగా గణించాడు

వనవాసమైనా శిరోధార్యమన్నాడు

 ఆలితో అడుగులేసి మాటచాటుకున్నాడు

భరతావని రామాయణ చరితమే ఉత్ర్రేరకంగా 

శ్రీరామనవమి హిందువులందరి ఉత్సవంగా

జనులకు శుభకామనలు రాముని శుభదీవెనలు


2.సౌమిత్రి తోడుగ పర్ణశాల వసించాడు

మాయలేడి యని ఎరిగీ సీతకోర్కె వహించాడు

వైదేహి ఎడబాటులో  పరితాపం చెందాడు

జానకి జాడకొరకు హనుమను పంపాడు

భరతావని రామాయణ చరితమే ఉత్ర్రేరకంగా 

శ్రీరామనవమి హిందువులందరి ఉత్సవంగా

జనులకు శుభకామనలు రాముని శుభదీవెనలు


3.లక్ష్మణున్ని బ్రతికించగ సంజీవని తెచ్చె హనుమ

అక్కున జేర్చెను మారుతిని రాముని ప్రేమ

దశకంఠుని దునుమాడెను రామబాణ గరిమ

ప్రకటితమాయే పట్టాభి రాముని ప్రజారాజ్య పటిమ

భరతావని రామాయణ చరితమే ఉత్ర్రేరకంగా 

శ్రీరామనవమి హిందువులందరి ఉత్సవంగా

జనులకు శుభకామనలు రాముని శుభదీవెనలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:వసంత


పరమ దయాళా పరమ శివా

సరగున నను పరిపాలించవా

నా ఉరమున ప్రియముగ కేళించవా

నీ కుమరునిగా నను లాలించవా

శంభో మహాదేవ గంగాధరా

సాంబమూర్తీ సాగిలపడెదర 


1.నీవే ఇచ్చిన ఈ జన్మము

నీవే మలచిన నా జీవితం

నీకొఱకే…హరా… నా దేహము ప్రాణము

ఉఛ్వాస నిశ్వాసలందున నీ స్మరణము

శంభో మహాదేవ గంగాధరా 

తీరగ నా ఆర్తి కావర వేగిర


2.ఐశ్వర్యమాశించ ఆరోగ్యమీయర

ఆస్తులుకోరను స్వస్థత కూర్చర

పదవుల నడగను నీ పదముల దయసేయ

యశమును కొసరను నువు వశమవగ

శంభో మహాదేవ గంగాధరా

కైవల్యమీయర కైలాసపురహరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:శివరంజని


రాబోయే రోజులైతె అతిదారుణం

కరోనా మరణాలిక సాధారణం

మనుషుల పెడ చెవిన పెట్టు దుర్గుణం

నరజాతికి పాడుతుంది చరమగీతం


1.జబ్బు అంటుకోకుండుటె అదృష్టం

వైద్యసేవలందబోవు నన్నదే సుస్పష్టం

పరిమితమౌ ఆస్పత్రులు మనపాలిటి దురదృష్టం

ఆక్సీజన్ గాలికైన నోచుకోక ఎంతటి కష్టం


2.ఉధృతంగ చేస్తోంది కరోనా కరాళనృత్యం

నేనైతే అతీతుణ్ణి అన్నదే మన పైత్యం

అజాగ్రత్త మనుజల స్వీయమైన అకృత్యం

ఏ ఒక్కరు పాటించక  నరకమే ఇక నిత్యం


3.తను మినహా పరుల చావు మామూలై

వ్యాధివల్ల బాధవల్ల బతుక్కన్న చావే మేలై

శ్మశానాల్లొ శవాలదిబ్బలు అనాథలై

కడతేరక కళేబరాలు రాబందుల పాలై


4.టీకామందె ఇప్పటికొకటే ఉపశమనం 

మాస్క్ లు ముక్కు మూయ కడు శ్రేయం

ఒక్క క్షణం ఒక్క తప్పిదం చావుకు మూల్యం

సానిటైజర్ వాడుక భౌతిక దూరమిక అనివార్యం

Saturday, April 17, 2021

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎవరోవస్తారని  ఏదో మనకు చేస్తారని

ఎదిరిచూచి మోసపోవుటెందుకని

నిజం మరచి నిదురపోకూడదని

ఏనోడో తెలిపినాడు మహాకవి

తలదాల్చక తప్పని మాటలు మనకవి


1.ప్రజలకొఱకు ప్రజలచేత ప్రజలకై ప్రభుత పాలనం

నీ కొఱకు నీచేతనె నీకునీవు మనగలిగే జీవనం

నీదైన బ్రతుకు తెరువు నీదైన సంక్షేమం

నీదైన ఆరోగ్యం నువు పొందే వికాసం

ప్రభుత్వాలకొకటే ప్రాధాన్యత

ప్రణాళికా బద్ధమైన సాధికారత


2.చప్పట్లు తప్పెట్లు జనతను జాగృత పరిచేట్లు

దివ్వెల దీపాల వెలుగులు జాగ్రత్తల నెరిగేటట్లు

ప్రకటనలు నియమాలు పెడచెవిపెట్టి

తేలికగా తీసుకునే నైజాన్ని తలపెట్టి

నిర్లక్ష్యం వహిస్తే చావైనా బ్రతుకైనా నీది

ఎవరికి వారయే తీరు నేటి సమాజానిది

Friday, April 16, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఊపిరే భారమై

గొంతునొప్పి క్రూరమై

దగ్గు తెరతొ హాహా కారమై

ఒళ్ళంతా నలతగా నరకమై

బలహీనత ఆవరించ హృదయవిదారకమై

అతలాకుతలమౌను బ్రతుకంతా

కరోనా మహమ్మారి ఆవరించినంత

ముందు జాగ్రత్తలే కరోనాకు పరిహారం

మందులే లేవన్నది కాదు వాస్తవదూరం


1.శ్వాసకోశాలనే ఆవాసం చేసుకొని

నాడీవ్యవస్తనే ఆక్రమించేసుకొని

తనువులోని అవయవాల నిర్వీర్యం చేయబూని

కరోనా చేయుదాడి ప్రత్యక్షర మరణమని

వైద్యసాయమందుట ఒక అదృష్టమేనని

తమకైతే రాదనే నిర్లక్ష్య మేమాత్రం తగదని 

ఎరిగి మెలగకున్నచో ఎవరు కాచలేరు మనని


2.తుమ్ములు దగ్గులవల్లనే కరోనాకు వ్యాప్తి

నోరు ముక్కుల ద్వారా వ్యాధి సంప్రాప్తి

సరి మాస్క్ ధారణొకటె సంరక్షణా యుక్తి

భౌతికదూరం పాటిస్తే బ్రతుకులకే దీప్తి

సానిటైజర్ వాడితే అదికరోనాకు స్వస్తి

ప్రతి ఒక్కరు అరికడితే కరోనా పరిసమాప్తి

టీకామందు పొందు ముందు కరోనాకది మిత్తి

ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతిః

Thursday, April 15, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చంద్రకౌఁస్


భువనైక మాత విశ్వవ్యాపిత

ప్రాణికోటి జీవనగీత సకలలోక పూజిత

పాహి పాహి దేవీతవ పద పద్మయుగ్మం

దేహిమే జననీ తవ చరణయుగళ సన్నిధానం

నువు వినా గతిలేదు కరుణజూడవే తల్లీ

సత్వరమే మముకాచి దరిజేర్చు కల్పవల్లి


1.నీ కను సన్నలలో చరాచరజగత్తు

నీ చిరునవ్వులలో అపూర్వమైన మహత్తు

నీ దయాదృక్కులలో మా బంగరు భవిష్యత్తు

నీ పరిపాలనలో తొలగును మా ప్రతి విపత్తు

నువు వినా గతిలేదు కరుణజూడవే తల్లీ

సత్వరమే మముకాచి దరిజేర్చు కల్పవల్లి


2.మనుజ జాతి మనుగడకే ముప్పువాటిల్లెనే

దిక్కుతోచనట్లుగా మా శక్తి సన్నగిల్లెనే

స్వేఛ్ఛగా గాలైనా పీల్చ వీలులేదాయే

మానవ బంధాలే పెనుమంటల పాలాయే

నువు వినా గతిలేదు కరుణజూడవే తల్లీ

సత్వరమే మముకాచి దరిజేర్చు కల్పవల్లి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక తల్లికి ఆరాటం

ఒక చెల్లికి అనుమానం

చెలియకు చెలగాటం

బొట్టికి ఉబలాటం

ఎన్ని కోణాలో అన్నులమిన్నలకు

ఎన్నగ ఎవరితరము అతివల మతులను


1.పట్టించుకోకుంటే పరమకష్టము

చొరవచూపబోతే అది అయిష్టము

పరులచూపుకొరకే పడతి అలంకరణం

చూపు తిప్పుకోనీయని వస్త్రధారణం

అయస్కాంతమే పురుషులకిల కాంత

ఔనన్నా కాదన్నా మగవాడికే చింత


2.అందాల కేంద్రాలన్నీ ప్రదర్శించడం

గుడ్లుమిటకరిస్తేనో విమర్శించడం

స్త్రీపురుషుల  ఆకర్షణ పరస్పరం సహజం

మనసుముసుగు తొలగిస్తే బయటపడును అసలు నిజం

హద్దులు మించనపుడు ఏదైనా ముద్దే

మగవారినె నిందించుట అన్యాయపు సుద్దే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రతి గీతానికీ.. నీవే శ్రుతిలా

నా గాత్రానికి నీవే ఊపిరిలా

నా స్వప్నాలకు సాకారంగా

నా స్వర్గాలకు ప్రాకారంగా

అలజడిరేగే ఎద లయ సైతం నీలా మంజులమై

చంచలమైన చిత్తమంతా నీవే కేంద్రకమై

అంకితమైతేనె కదా జీవితం

పంచుకుంటేనె కదా స్నేహితం


1.మది తేలిపోతుంది నీ ఊసు మెదలగనే 

కైత వాలిపోతుంది నీ ఊహకలగగనే

నను నడిపించే చోదక శక్తిని

నను కదిలించే నా అనురక్తివి

తట్టిలేపుతుంటావు నిద్రాణమైనపుడు

మార్గదర్శివౌతావు దారితప్పినప్పుడు

నాలో కవికి స్ఫూర్తివి నీవై ప్రేరణ నిస్తావు

నాలో రగిలే ఆర్తే తీరగ కారణమౌతావు


2.వరదవై ముంచెత్తావు చినుకులా రాలి

శరత్తుతో జతకట్టావు చకోరిలా వాలి

మనసునే అల్లుకున్నావ్ మల్లెతీగలా

వయసునే గిల్లుతున్నావ్ కందిరీగలా

మూడునాళ్ళు చాలవా మూడుముళ్ళరాగానికి

ఏడు జన్మలెత్తాలా ఏడడుగుల యోగానికి

కల్పనలకు ఇక స్వస్తి కనులెదుట కనిపించు

కనీవినీ ఎరుగని రీతి అనుభూతులందించు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సవా లక్ష సవాళ్ళు బ్రతికినన్నాళ్ళు

సాధించడంలొనె గెలుపు ఆనవాళ్ళు

వడ్డించిన విస్తరైతె జీవితమే చేదు

కాలుకదుప పనిలేదన అదే కదా ఖైదు


1.నిస్సారమౌతుంది మార్పన్నది లేకుంటే

నిర్వీర్యమౌతుంది బుద్దిని వాడకుంటె

చలనం లేకుంటే తిమ్మిరెక్కుతుంది చేయి

తిన్నదరిగిపోకుంటే అదే పెద్ద రోగమై

వడ్డించిన విస్తరైతె జీవితమే చేదు

కాలుకదుప పనిలేదన అదే కదా ఖైదు


2.పిచ్చెక్కిపోతుంది వ్యాపకమే లేకుంటే

విసుగుకలుగుతుంది పాడిందే పాడుతుంటె

తేరగదొరికే విజయమూ ఓటమి సమమట

మలుపులు మజిలీలు బ్రతుకుదారికూరట

వడ్డించిన విస్తరైతె జీవితమే చేదు

కాలుకదుప పనిలేదన అదే కదా ఖైదు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆదర్శవంతమట నీ జీవితం

అనుసరణీయమట సదా నీ పథం

ఆచరణీయమట నీ ఏకాదశ సూత్ర వ్రతం

అభివాదనీయమంటి నీ పదం సతతం

సాయీ సాయీ గొను వందనం

సద్గురు సాయీ నీకిదె సాష్టాంగ వందనం


1.చిరుగులదొక కఫ్నీ తలచుట్టు రుమాలు

పాదరక్షలైన లేని నీ పవిత్ర పాదాలు

పూటగడవడానికై చేసావట భిక్షాటనాలు

పాడుబడ్డ మసీదే వసతైన నీ ఇల్లు 

ఎందుకు పడతారో జనం నీకు బ్రహ్మరథం

ఎరుగలేరు ఎవ్వరు నీ భక్తుల మనోరథం

సాయీ సాయీ గొను వందనం

సద్గురు సాయీ నీకిదె సాష్టాంగ వందనం


2.మహిమలేం చేసావో మాకు సందేహమే

లీలలేం చూపావో అసలు నమ్మశక్యమే

బూడిద నొసగెదవది సంపదనా  భాగ్యమా

వేడితేం పొందెడిది సౌఖ్యమా ఆరోగ్యమా

అనుభవైకవేద్యమైందె విశ్వసనీయము

మా వ్యాధుల వైద్యమైందె పరమౌషధము

సాయీ సాయీ గొను వందనం

సద్గురు సాయీ నీకిదె సాష్టాంగ వందనం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:బౌళి


ఇచ్చినవాటికి నే తృప్తినొందనా

నోచనివాటికి ఆరాటమొందనా

అమందానంద కందళిత అరవిందాననా

చకోరికా వరదాయిక శరదిందు వదనా

అంజలింతు మంజులభాషిణి

ఆశ్రయింతు నీ చరణయుగళిని


1.తల్లివి నీవని తలపోతును కాదే

నా క్షుద్బాధ నెరుగవంటె  మది నమ్మదే

అర్ధాకలితో నన్నుంచగ న్యాయమదేఁ

దేహిమే కవనగాన ద్వయాన్విత క్షీరదే

అంజలింతు మంజులభాషిణి

ఆశ్రయింతు నీ చరణయుగళిని


2.మెరుగు పరచు భావ లాలిత్యము

ఇనుమడించు ప్రతీకాత్మ సాహిత్యము

ఒనగూర్చవె నా గాత్రమందు మాధుర్యము

పరిమార్చవె నా గళ గరళ వైపరీత్యము

అంజలింతు మంజులభాషిణి

ఆశ్రయింతు నీ చరణయుగళిని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వాడొక్కడే కారకుడు

వాడొక్కడే కార్యకారణ సంబంధితుడు

వాడొక్కడే ఉన్నఫళంగా బ్రతుకు కుదిపివేసేది

వాడొక్కడే ఓడలు బళ్ళుగ బళ్ళు ఓడలుగ మార్చేది

పనికిరాని ఆటలెందుకు ఆడుతాడో

ఏ పావునెలా కదుపుతూ ఎందుకు మట్టుబెడతాడో


1.పట్టకొనగ ప్రయత్నిస్తే పారిపోతాడు

పట్టించుకోకపోతే మరీగుర్తుచేస్తాడు

అంతతిక్కలోడు లేడెవడూ లోకానా

అంత తింగరోడు కానరాడు జగానా


పనికిరాని ఆటలెందుకు ఆడుతాడో

ఏ పావునెలా కదుపుతూ ఎందుకు మట్టుబెడతాడో


2.చేయి పట్టినడిపించే తండ్రి తానే

పాఠాలు బోధించే గురువు తానే

ఏమరుపాటుకు గుణపాఠం నేర్పేది తానే

జీవితాన్నే మూల్యంగా గైకొనెది తానే


పనికిరాని ఆటలెందుకు ఆడుతాడో

ఏ పావునెలా కదుపుతూ ఎందుకు మట్టుబెడతాడో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


జిట్టెడు పొట్టకోసం

పట్టెడు బువ్వకోసం

పుట్టెడు పుట్టెడు దుఃఖం

శోకమె నిండిన లోకం


ఆ రడ్గుల జాగకోసం

ఆనంద నిద్దుర కోసం

పుట్టెడు పుట్టెడు దుఃఖం

శోకమె నిండిన లోకం


పట్టుకొచ్చిందైతేమి లేదు

పట్టుకెళ్ళ వీలైతె కాదు

నడుమన నాదను దుఃఖం

శోకమె నిండిన లోకం


మూణ్ణాళ్ళ ముచ్చట అందం

మూడే నిమిషాల కామం

మైథునయావతొ దుఃఖం

శోకమె నిండిన లోకం


తప్పని మరణంకోసం

నానా వ్యాధుల పీడనం

పుట్టెడు పుట్టెడు దుఃఖం

శోకమె నిండిన లోకం


https://youtu.be/db493H0yqdo?si=IkDYui_xYIMUgTF_

 రచన,స్వరకల్పన&గామం:డా.రాఖీ 


పేటలు పట్టణాలు కడచి వచ్చినాను

నీ చరణాలనెప్పుడో శరణుజొచ్చినాను

ఏనాటికి మాపురవేల్పువు నీవేస్వామి

సంకటములనిక మాన్పర పాహిపాహి

ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి

మా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి


1.నీ సుందర రూపాన్ని కనుల ముందు చూపు

నీ మంగళ విగ్రహాన్ని నా తలపున నిలుపు

నీ ఉగ్రరూపంతో అరివర్గము నెడబాపు

నీ శాంత స్వరూపమే సర్వదా నాకు ప్రాపు

ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి

మా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి


2.మా ఈతి బాధలన్ని ఏ రీతి తొలగింతువొ

మా లోన జ్ఞానజ్యోతి ఎప్పుడు వెలిగింతువో

బ్రతుకంతా వ్యాధులతో పోరాటమె సరిపోయే

నీ సన్నిధి చేరినంత మనసుకెంతొ ఊరటాయె

ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి

మా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి



పన్నగేంద్రునిపైన పవళించియున్నావొ

శేష తల్పము మీద సేదదీరుతున్నావొ

మా యమ్మ అలమేలు సేవగొనుచున్నావొ

మామేలుకూర్పగా ఆదమఱచి యున్నావొ

ఏడుకొండలవాడ ఏమిటో నీమాయ

యతిరాజుకైనను గతిగానరాదాయే


1. కాలైన కదపక నీ గుడికి రాలేక

పేరైన పలకక నీ నామమనలేక

కళ్ళున్నవేగాని నిను కాంచలేక

నా దేహమెప్పుడు నా మాట వినక

ఏలదిగజార్చావొ జీవచ్ఛవమల్లె

నువులేక నాకేల ఈ బ్రతుకు డొల్లే

ఏడుకొండలవాడ ఏమిటో నీమాయ

యతిరాజుకైనను గతిగానరాదాయే


2.పక్షివాహన నీవు పక్షపాతివి స్వామి

ఆపేక్ష నెరవేర్చ నీకు ఆక్షేపణయేమి

ముంచగా ఎంచితివి నా జీవనావను

దరిజేర్చ దయలేద నను ఇకనైనను

నీ పాదపద్మాలె నెరనమ్మితి

ఎదలోనె నిన్నింక స్థాపించితి

ఏడుకొండలవాడ తాళరా నీమాయ

యతిరాజుకైనా దొరుకునా నీదయ

 రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్( రాఖీ)


"ప్లవించనీ 'ప్లవ ఉగాది' జీవ గోదారిగా.."


ఓ కవి ప్లవ సరస భావనా ఉగాది

ఒక విప్లవ శోభన కవన  నాంది

నవ జీవన  పరిపుష్ట భవనపునాది

అశాస్త్రీయ విధానాల కిది సమాధి


విరులు పూయ ఎద ఆమని వనవాటిగా

గొంతు పెంచు కోయిలవై నిలదీయ సూటిగా

పచ్చడిచేయాలి  వైరులార్గురుని ధాటిగా

జాతకాలనే మూఢంగా  పాటించని మేటిగా


తెగులు తొలగ తెలుగులు తెగువ మీరగా

తెలుగువారి హక్కులకై ఎడతెగక పోరగా

తెలుగు భాష తెలుగుజాతి వెలుగు తీరుగా

తెరలు తీసి తెలుగు మనసు లొకరికొకరుగా


కరోనా నేపథ్యం ఆరోగ్యమె ప్రాథమ్యం

వ్యాయామం వదలక తెమలే దినచర్యం

అలవాట్లు మేలుకూర్చ మనకదే మహాభాగ్యం

అనందమె పరమావధి పొందవలదు వైరాగ్యం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వెలవెల బోతోంది పండువెన్నెలే

మిలమిలలాడుతుంటే నీ మేని వన్నెలే

ప్రౌఢగా మారిన కొలది ఇనుమడించె నీ అందం

ఎలా నిలుప గలిగేవో నిత్య నూత్న యవ్వనం


1.తపనలే పెరిగేను తలతిప్పి చూస్తేనూ

చూపులతొ తెలిసేను ప్రేమలేఖ రాస్తేనూ

పెదవులే పంపేను చిరునవ్వు స్వాగతాలు

కలలు కల్పించేను కలయికల ఆనందాలు


2.చెంపకున్న సొట్టలు వేయిస్తాయి లొట్టలు

చెవులకింపు జూకాలు కలిగిస్తాయి మైకాలు

ఉల్లిపొరల వస్త్రాలు మన్మథుని పుష్పాస్త్రాలు

వెన్నముద్ద మెత్తదనం తనువు తడుమ తన్మయం

 జయహో తెలుగు సినీ కళామతల్లి నీకు జయం

జగన్మోహనుడే కొనితెచ్చె నీకు పూర్వ వైభవం

పసిపాపకు చందమామ నందించిన చందంగా

సామాన్యుడి వాకిటిలొ నిను  ఆడిపాడ నిలిపెనుగా

అభినవ శ్రీ కృష్ణ దేవ రాయలుగా

అండగనిలిచాడు జగన్నీకు అపూర్వ కళాభిమానిగా


1.పాలాభిషేకాల ఉత్తుత్తి హీరోలు జీరోలౌతూ

అభిమానుల గుండెలపై తన్నేలా బాక్సాఫీసు రాజేస్తూ

వీక్షకుణ్ణి నిర్లక్ష్యం చేస్తూనే తాము ఎదిగేస్తూ

దారుణానికొడిగట్టారు ఫ్యాన్స్ నే పావులుగా ఎరవేస్తూ

వాస్తవాల నెరిగినపుడె అభిమానికి కనువిప్పు

గుడ్డిగా నమ్మితే ఎప్పటికైనా తప్పదు ముప్పు


2.వినోదాన్ని వ్యాపార పరం చేసే గుత్తాధిపత్యం

 ఒకరిద్దరి కబంధ హస్తాల్లో చిక్కెను నీ భవితవ్యం

టికెట్టు రేటు శాసిస్తూ థియేటర్లుదాచేస్తూ పరిశ్రమను చేసారు అయోమయం

సామాన్యుడికెన్నటికి అందుబాట్లొ లేకుండా సిన్మా అయ్యింది  ఓ గగనసుమం

గుప్పిటిలో నొక్కేసి లాభాలే ధ్యేయంగా నిను చేసిరి  విషమయం

కరవాలం ఝళిపించి కట్టడి చేసె జగన్ మించనీక సమయం


3.సినిమాఫియా కోఱలు పెరికినాడు జగన్ జడవక

లోకాన నిజమైన హీరోగా వెలిసాడీ cm మడమతిప్పక

చిన్నా పెద్దా అనికాక ప్రతి సినిమాకొకే రీతి టికెట్టుగా జారీ చేసాడు హుకుం

విర్రవీగు సినీముఠాకు బుద్ధివచ్చునట్లుగా నేర్పాడు చక్కని గుణపాఠం 

కళాకారులెందరి కృషితోనో వెలిగె నీ తెలుగు సినీ ఖ్యాతి

పేదోడికి ఏకైక ఊరటగా సేదదీర్చగా చల్లనైన నీ సన్నిధి