Sunday, June 19, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:భీంపలాస్


ఎంతకూ తీరకుంది నా దాహం గంగాధరా

ఏమిటో ఆరకుంది నా మోహం చంద్రశేఖరా

నా గళముకు నిగళమేల గరళకంధరా

నా కలముకు తపనలేల శూలధరా

వర్షించరా నీ దయ సహృదయా 

నమఃశివాయ ఓం నమఃశివాయ


1.వారాశిగా భావాలనే తలపోసితి

రాశిగా నే కవితలెన్నో వ్రాసి పోసితి

చిత్తశుద్ధిగా శివా నీ పూజనే చేసితి

ఆత్మతృప్తి లేకనే భవా అల్లలాడితి

మెప్పించలేకపాయే నా కావ్యాలు సాహిత్య కారులను

కదిలించ లేకపాయె నా గేయాలు సామాన్య శ్రోతలను

వర్షించరా నీ దయ సహృదయా 

నమఃశివాయ ఓం నమఃశివాయ


2.మార్ధవాన్ని గాత్రంలో కూర్చవైతివి

సంగీతాన్ని శాస్త్రంగా  నేర్పవైతివి

ఊటలాగ కఫమెంతో ఊరజేస్తివి

కంఠనాళాలనే కపర్దీ కరకుజేస్తివి

గొంతు జీరబోవునాయే ఎలుగెత్తి పాడితే

తాళమెచటొ తప్పునాయే ఊపుగా ఊగితే

వర్షించరా నీ దయ సహృదయా 

నమఃశివాయ ఓం నమఃశివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక వెర్రిబాగులోడే నాన్న

స్వార్థపరుడెవరున్నారు తనకన్నా

తన కోర్కెలకోసమే నిను కన్నా

విలనే తానై తన కలల హీరోగా నిను కన్నా

చేతకాని వాడనిపించుకున్న

ఈతరాని వాడని ముద్రవేయించుకున్న


1.తెప్పలు తగలేసే తనయులకై

తీరం చేరవేసే సరంగుతానై

గడ్డాలనాడొక తెడ్డుజూపు కొడుకులకై

అడ్డాలు పడకుండా అరచేతులుంచినందులకై

ఈసడించబడుతున్న

విలువను కోల్పోతున్న


2.బాధ్యతలెరుగని బద్మాషులున్నా

హక్కులు మిక్కిలిగా గుంజుకున్నా

తండ్రిగ చెప్పుకొన్న తలవంపులనుకున్నా

ఎదురుగ కనిపించినా మొకం తిప్పుకున్నా

ఎదను సమాధాన పర్చుకునే

మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నాదను కొంటేనే కలవరం

కాదనుకొంటే మనం ఎవరికి ఎవరం

ఇంతకన్న ఎలా తెలుపను నా ఎద వివరం

అలజడి రేగింది నీవల్లే నా ప్రశాంత మానస సరోవరం


1.నీ తలపులతో ఔతుంది నా మది చిత్తడి

నీ ఊహలకే దూకుతుంది భావావేశం మత్తడి

నీదేలే నా హృదయం మేలిమి పుత్తడి

చేదేలే నువు కాదంటే ఆరదు నా కంటతడి


2.ఎప్పుడు ముడివడిందో మనకీ చిక్కుముడి

ఇచ్చేసా ఏనాడో నీకు నిలువుదోపిడి

ఓపలేను ఆపలేను గుండెలోనీ రాపిడి

త్రెంచుకోకు చంపమాకు మనబంధం పొరబడి