Sunday, April 19, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తపములే చేయాలా నిన్ను రప్పించ
జపములే చేయాలా నిన్ను మెప్పించ
సాధ్యమే కాదు నాకు యాంత్రికుణ్ణి నేను
వాస్తవాలు నిగ్గదీయకు కాస్తనాస్తికుణ్ణి నేను
ఉనికి తెలుపుకోవయ్యా ఉమాశంకరా
పనికిరావేల ఉంటే ఫాలనేత్రుడా

1.అర్చనలూ అభిషేకాలు లంచాలా నీకు
హారతులు నైవేద్యాలు నజరానాలెందుకు
నువ్వు ప్రసన్నం కావాలంటే ప్రదోష దీక్ష చేయాలా
నువ్వు వరములీయాలంటే ముడుపులిచ్చుకోవాలా
బదులు పలుకవేమయ్యా బాలేందు శేఖరా
ఆదుకొనుగ రావయ్యా  అర్ధనారీశ్వరా

2.నీ గుళ్ళూ గోపురాలు నిశ్చయంగ దర్శించాలా
తీర్థాలూ యాత్రలన్ని మేము తిరిగి తీరాలా
కన్నతండ్రి పెట్టగలడా కరుణాకరా ఇలా ఆంక్షలు
ఆత్మలోన కనుగొంటే అవ్యక్తుడా ఏలా పరీక్షలు
చిత్రవధలు మాకేనా చిదానందుడా
ఘోరయాతనకు తుది లేదా నీలకంధరా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చిన్ని చిన్ని చర్యలతో -ప్రయోజనాలెన్నెన్నో
చిరుచిరుచిరు చేష్టలతో -మనసూరటలెన్నెన్నో
గమనించు నేస్తమా - సూక్ష్మంలో మోక్షాన్ని
పాటించు మిత్రమా-బాంధవ్య సూత్రాన్ని

1.దయచేసి వాడాలి తరచుగా దయచేసి అన్న పదాన్ని
సరే అని అనగలిగావా-త్రుంచగలవు వాదాన్నీ వివాదాన్నీ
విచారాన్ని వ్యక్త పరిస్తే-అణచగలవు ఎదుటివారి ఆగ్రహాన్నీ
కృతజ్ఞతలు తెలిపావంటే-పంచగలవు పరస్పరం ఆనందాన్నీ

2.పలకరించినా చాలు-తీర్చేవు కన్నవారి కాస్త ఋణాన్ని
తాజాగా ఉంచగలిగితే-నిలిపేవు నిండైన స్నేహితాన్ని
కర్తవ్యం మీరకుంటే -గెలిచేవు యజమాని విశ్వాసాన్ని
మక్కువను వ్యాఖ్యానిస్తే-ఇచ్చేవు కవులకు ప్రోత్సాహాన్నీ
చప్పట్ల దుప్పట్లతో సత్కరించగలవు కళాకారులందర్నీ