Sunday, January 31, 2021

 https://youtu.be/u94_9l0MTj8?si=R3yjUPBo0jOwACjS

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బూడిద బుశ్శన్నవే-కాడున విశ్శెన్నవే

భోలానాథుడవే-నీలకంధరుడవే

ఐశ్వర్యమీయగలవా ఈశ్వరా

నా శంకమాన్పగలవా శివశంకరా

హరహరహర  నమః పార్వతీ పతి

శివశివశివశివ శివ ఓం ప్రమథాధిపతి


1.యోగివందామంటే ఆదిదంపతులు మీరు

 సుముఖుడు షణ్ముఖుడు నందనులిరువురు

భోగివందామంటే సచ్చిదానందమై తాపసి తీరు

దేహ మోహ భావాతీతమై నీవాలక మలరారు

తామరాకుమీది నీటిబొట్టులాగ నీతత్వం

భ్రమలకు లోనుచేసే కనికట్టుగుట్టు నీ సూత్రం


2.పూజించ చూడబోతే లింగమే కదానీ  విగ్రహం

ధ్యానించ పూనుకుంటే చూడచక్కనిదాయె నీరూపం

నాగాభరణా ఢమరుకహస్త గంగాధర హే చంద్రమౌళీ  

ఫాలనేత్ర శూలపాణీ భస్మవేష నమో చర్మాంబరధారీ

అలంకార శోభిత మూర్తివె మోహనాకారుడవే

ఆర్ధనారీశ్వర స్ఫూర్తివె అనంగ ప్రేరితుడవే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొంచంకొంచంగా నీగురించి

బంధం కలిపాడు ఆ విరించి

స్నేహం మోహం ఎంతో కొంత రంగరించి

పరస్పరం ఒకరిని ఒకరం కాస్తోకూస్తో భరించి


1.ప్రతిక్షణం నీ ఊహలనే పలవరించి

ఆడుకొన్న ఊసులనే కలవరించి

తలపుకు రాగ వెంటనే కన్నులు చమరించి

మనదైన కవితల ఇలలో ఈలోకాన్నే విస్మరించి


అడుగులు తడబడ నాకు నీవు ఆసరాగ

తోడుగ నీడగ కలకాలం నీకు ఆలంబనగా

రైలుపట్టాలం మనం  వదలము చెట్జపట్టాలం

ఏ రక్త బంధాలు లేకున్నా దైవంకలిపిన చుట్టాలం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


స్వేదంతో రాసేస్తున్నావు సరసవేదం

మైకంగా ఒలికిస్తున్నావు నవరసనాదం

కొత్తకొత్తలోకాలకు దారులువేస్తున్నావు

వింతైన అనుభవాలకు తెఱలే తీస్తున్నావు

గజగామిని నీవే తొలి యామిని తేవే

రసమాధురి నీవే రతి ఆకృతి కావే


1.ఉగ్గబట్టుకున్నాను ఉద్వేగాన్ని

మగ్గబెట్టుకున్నాను నా తమకాన్ని

నను చేరవచ్చు శుభతరుణం కోసం

నువు కోరివచ్చు క్షణమే మధుమాసం

అభిసారిక నీవే అభిహారిక నీవే


2.తరువుగా నేను తపములో ఉన్నాను

తనూలతిక నీవై నన్నల్లుకున్నావు

పరువుగా నేను బ్రహ్మచర్యమున్నాను

విరహిణివి నీవై రమించగానున్నావు

మధూళిక నీవే సురతగుళిక నీవే

 అమ్మయాదిలో నీలో(అనంతా చార్యలో) పరకాయప్రవేశం చేసి          -డా.రాఖీ



కార్చగలను కడలెడు కన్నీళ్ళైనా

అంగలార్చగలను అమ్మకై ఎన్నేళ్ళైనా

అమ్మను నాకిమ్మను కిమ్మనక ఏదేవుడినైనా

జన్మనే ధారబోసెద అమ్మప్రేగు ముడి కిప్పటికిప్పుడైనా

మరలిరావే ననుగన్న తల్లీ ప్రార్థిస్తున్నా నీకు ప్రణమిల్లీ

మరణాన్నీ తరుణమే జయించీ అజరామరమై జీవించీ


1.కళ్ళలో వత్తులేసుకొని చూసుకొన్నది

కంటికి రెప్పలా ననుకాచు కొన్నాది

అందరిలో ఒక్కడినని అపురూపం చేసింది

నందుడనేనని ఇంటికే యువరాజుగ చూసింది

ఋణముతీర్చుకోలేను ఎన్నిసార్లు పుట్టినా

ఇంత ప్రేమ పొందలేను ఇంకెవరి కడుపునా

మరలిరావే ననుగన్న తల్లీ ప్రార్థిస్తున్నా నీకు ప్రణమిల్లీ

మరణాన్నీ తరుణమే జయించీ అజరామరమై జీవించీ


2.ఆడింది ఆటగ నను గారాబం చేసింది

పాడిందె పాటగా వెన్నుతట్టి మురిసింది

నా కాలున ముల్లు దిగితె అమ్మ కంట చెలిమె ఊట

కాస్తనాకు సుస్తిచేస్తె అమ్మకు శివరాత్రేనట

నా సేవల విలువ ఎంత అమ్మ ఊడిగానికి

నే చూపిన శ్రద్ధ ఎంత అమ్మ ముదిమి తనానికి

మరలిరావే ననుగన్న తల్లీ ప్రార్థిస్తున్నా నీకు ప్రణమిల్లీ

మరణాన్నీ తరుణమే జయించు అజరామరమై జీవించు

Saturday, January 30, 2021



పాలకడలి ఎండిపోతుందేమో

పాదాల గంగ ఇంకిపోతుందేమో

వేంకటరమణా శంఖచక్రకరభూషణ

గొంతులో ఊరే కఫముకు అంతులేదురా

గళములో చేరే శ్లేష్మం ఆగిపోదేమిరా


1.ధన్వంతరినీవే కదరా దయజూడరా

హయగ్రీవ అవతారా జాలిగనుమురా

వేంకటరమణా శంఖచక్రకరభూషణ

పగవాడికైనా ఈ హింస వలదురా

హాస్యానికైనాఈ యాతన వద్దురా


2.అనుభవించి చూడు ఈ నరకము

ఊహకైనా నీవు తాళలేవు ఈ రకము

వేంకటరమణా శంఖచక్రకరభూషణ

అడుగంటి పోతోంది నీవంటె నమ్మకము

నిరూపించుకోకుంటే నీవా ఓ దైవము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


దూరం పెంచే గౌరవాలు మాకనవసరం

భారమనిపించే మరియాదలే కొసరం

ఒకరికి ఒకరం అపురూపంగా దొరికి వరం

 ఎప్పటికీ తానంటే నాకెంతో పావురం

నేనంటే తన ఎదలో విప్పలేని వివరం


1.పరిచయమందామంటే అంతకు మించి స్నేహం

స్నేహితమందామంటే అంతకు మించిన ఆత్మీయం

పుస్తకాలలో ఎవ్వరు రాయని వింత బంధం మాది

అనుభవాలలో ఎవ్వరు ఎరుగని ఆత్మబంధం మాది

గుండెలు రెండై ఇద్దరిలోనూ ఒకే స్పందన

 కన్నులు నాలుగు ఒకేచూపుగా మా పంథా

 

2.కారణాలు దొరకనివెన్నో మా మైత్రి లాగ

ఊహలకైనా సాధ్యం కానివెన్నో మా చెలిమిలాగ

ఇవ్వడమంటూ ఉండదు నచ్చితే తీసేసుకోవడమే

అడగడమంటూ ఉండదు మనకు మనం ఇవ్వడమే

దేహాలు వేరైనా భావాలన్నీ ఒకటే

శ్రుతి లయ రెండైనా పాటమాత్రం ఒకటే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చెఱకుగడ నీ కవిత్వం-పాలమీగడ నీ తత్వం

తోచదెందుకో నేస్తం-నీలోకి తొంగి చూడక నాకు నిత్యం

వానవెల్లువ భావుకత్వం-రెల్లుగడ్డీ నా వస్తుతత్వం

కవితామయం సమస్తం-నిన్నలరించుటె నా పరమార్థం


1.అక్షరాలు దోసిటపట్టి-పదములుగా మూట కట్టి

అందిస్తా గీత నిధులనే-నీకు నా బహుమతిగా

వెన్నెలనే పోగుచేసి-చుక్కలనే ఏర్చికూర్చి

ఊలుతో షాలువ నేసి-సత్కరిస్తా కడుప్రీతిగా


2.నీకు నచ్చితె నా కవిత-ఔతుంది చరితార్థం

నువు మెచ్చుకున్నావంటే-ఆ ప్రశంస అపురూపం

మన'సు'కవనమెప్పటికీ-అజరామరమవనీ

మనసు నుండి మనసులోకి-జీవనదిగ ప్రవహించనీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అతను :వసంతం వచ్చివాలింది

ఆమె     :తనంత తానై మోడైన నా మదిమానున

అతను :మధుస్వరం ఆలపించింది

ఆమె     :సాంత్వన గీతమైనా ఎదగాయం మానున

అతను :వసంతమే నీ స్నేహితం

ఆమె     : ప్రతిగీతం నీ ప్రోద్బలం


1.అతను  :నీ నవ్వులన్నీ అందం గంధం కలిగిన విరులే

ఆమె          :నీ చేరువ వల్ల మరులే రేపే వెచ్చని ఆవిరులే

అతను      :నీ ఊపిరిలో ఊపిరినై కవితలు మొలిపిస్తా

ఆమె           :గళమున గమకాలొలికిస్తూ మాధురి చిలికిస్తా

అతను       :నీ గానమే నా ప్రాణము 

ఆమె           :నీ నీడగా నా జీవితం


2.ఆమె  :గులాబీలనే నువు నడిచే దారంతా పరిచేస్తా

అతను  :అనుక్షణం కనిపెట్టేలా నా చూపులు నీ కాపరిచేస్తా

ఆమె      :హితమును కూర్చే గతులకు మార్చే సూచికనౌతా

అతను  :బడలిక తీర్చి ఉల్లాసమిచ్చే మలయామల వీచికనౌతా

ఆమె      :నా ఆశయం నీ ఉన్నతి 

అతను  :కర్తవ్యమైంది నీ ప్రగతి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాముడెలా వగచాడో

కృష్ణుడెంత వేచాడో

తన సీతకోసం ఒకరాధకోసం

మించిన విరహాన ప్రతినిముసం

నిదురలేమితొ నేను నీకోసం నీ కోసం


1.జాలిలేదు జాగుసేయ

ఝామాయే జాబిలిగని

నా వరాల జవరాల 

ఎడబాటు బాటలేల


2.ప్రతీక్షయే నీ పరీక్షగా 

ప్రతీక్షణం నాకొక శిక్షగా

జీవిత లక్ష్యమే మోక్షమై

దీక్షగా నిరంతరం నిరీక్షణం

Thursday, January 28, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వికసించనీ ఎదసుమం నీ అనురక్తితో

ముకుళించనీ కరద్వయం నీపై భక్తితో

తిలకించనీ నీ రూపమే ఆసక్తితో

పులకించనీ నా మది కడుప్రీతితో

సాయీ దయచేయి సాయీ వరమీయి

సాయీ వందనమోయీ సాయీ ఆనందమీయి


1.నిను నమ్మితే కొదవుండదు

నిను వేడితే భయముండదు

నిను శరణంటే నిశ్చింత

చోటీయీ పదముల చెంత

సాయీ దయచేయి సాయీ వరమీయి

సాయీ వందనమోయీ సాయీ ఆనందమీయి


2.సాయి రాం నాకూతపదం

సాయి నీ స్తోత్రమే భువివేదం

నిను తలవగనే మది మోదం

సాయి నీనామం ఆహ్లాదం

సాయీ దయచేయి సాయీ వరమీయి

సాయీ వందనమోయీ సాయీ ఆనందమీయి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వానకెంత ఆతురత -జాణా నీమేను తడమాలని

తన చినుకుల కనులతో 

జ్యోత్స్నదెంత చతురత-తరుణీ నిను కౌగిలించ

తన శీతల చేతులతో

నేనాగలేను నేవేగలేను రమించగ 

రమణీ నే విరమించగా

నేనోపలేను నేసైచలేను రతికుతి మించగ 

ప్రకృతిగ పరిణమించగా 


1.జలపాతానికీ ఉత్సుకత-నీ ఒళ్ళంతా ముద్దాడగ

తన తుంపరలతొ వింతగ

ఇంద్రచాపానికి ఒక కలత-నిలువెల్లా నిన్నలుకోవాలని

ఏడురంగులున్న చీరగా

నేనాగలేను నేవేగలేను రమించగ 

రమణీ నే విరమించగా

నేనోపలేను నేసైచలేను రతికుతి మించగ 

ప్రకృతిగ పరిణమించగా


2.మల్లికలకు ఎంతటి ఆశ-నీ వీనులకడ ఊసులాడాలని

మాలలొ దారం ఊపిరాడనీకున్నా

అందియల కొకే ధ్యాస-నీ పదాలనే అంటి పెట్టకోవాలని

దుమ్ముధూళీ తమపై రాలుతున్నా

నేనాగలేను నేవేగలేను రమించగ 

రమణీ నే విరమించగా

నేనోపలేను నేసైచలేను రతికుతి మించగ 

ప్రకృతిగ పరిణమించగా

Wednesday, January 27, 2021

 రచన,స్వరకల్పన&గానం :డా.రాఖీ


అంతా నార్మల్ ఐతే-అంతకన్న ఏముంది

ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తే-ఆనందం మనదౌతుంది

 నిన్న చేదు రేపు రాదు-నేడే మనదనుకొంటేనే

సంతోషమే సౌఖ్యమన్నది మననెప్పుడు వీడదు


1.హాప్పీ అడ్రస్ ఎంతవెతికినా బయట దొరకదు

ఎంజాయన్నది మనసులో మినహా ఇలలో ఉండదు

ఎప్పటికప్పుడు మనని మనం రివ్యూచేసుకోవాలి

ఎదుటివారికి నిర్మలంగా లవ్యూ చెప్పుకోవాలి


2.కూలిన సౌధం నిలుపుట అన్నది సాధ్యమే కాదు

పూరిగుడిసెలో ఉంటేనేం సంతృప్తితొ లోటే ఉండదు

నవ్వుల పువ్వులు పూయించాలి పెదాల మీద

మమతల జల్లులు కురిపించాలి ఎదుటి ఎదల్లోన

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బ్రహ్మ పదార్థమా 

దేశమన్న మాట వ్యర్థమా

నేటి యువత మనసులో అదే అంతరార్థమా

తమ స్వార్థం తమ ఆర్జన తమదైన జీవితమే పరమార్థమా


1.దేశభక్తి యన్న పదమే  ఎదల్లో  ఎంత వెతికినా మృగ్యం

జాతీయభావనంటె కొందరు యువకుల్లో చిత్రమైన వైరాగ్యం

ఇకనైనా మేలుకోకో ఓ యువతా నీదే ఈ దేశం ఇది నీకోసం

ఇకనైనా తెలుసుకో ఓ భవితా ఇది సత్యం  ఇది తథ్యం


2.స్వాతంత్ర్య యోధుల ప్రాణత్యాగాల విలువ తెలియదు

ఉద్యమాలలో బలిదానాలతో సాధించిన ఘనత లెరుగరు

కేంద్రంలో రాష్ట్రంలో ప్రముఖులెవరో వారి ఊసేపట్టదు

గంజాయి మత్తులో పబ్బల గమ్మత్తులో దేశపు ధ్యాసే గిట్టదు


3.భారతదేశమే ఇండియా అంటే కొందరికొక వింత

జాతీయగీతాలాపన ఇంకొందరికెందుకో కడు రోత

తల్లిపాలు తాగిరొమ్ముగుద్దు వైఖరితో విద్యావంతుల నడత

స్వదేశానికతిథులవలె డాలర్లకోసమే విదేశాల వలస


4..వాడుకొనుట ఎరుకె కాని మనదను భావన లేదు

కలర్లకో రిపేర్లకో ఇల్లంటే ఇసుమంతైనా శ్రద్ధలేదు

జీవితాలు కాపురాలు యువతరంకు తృణప్రాయం

బ్రతుకును నిమ్మళంగ ఆస్వాదించగ ఏదీ సమయం

Tuesday, January 26, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తారకాసుర హర హరోంహర హరహర

కృత్తికానందన కుమారా పార్వతీ వరపుత్రా

నమోనమః నమోనమః శివాయసూనవే నమః

శూలధరాయ నమో శిఖి వాహనాయ నమో నమః


1. విఘ్నేశ్వరానుజాయ అగ్నితేజాయ నమో

వల్లీ దేవసేన పతయే నమో సురవందితాయ నమః

పాలకావడి నీకు పరమ ఇష్టమటస్వామి

పళనిమల బాలసుబ్రహ్మణ్యస్వామి నమో నమామి


2.చిన్మయానందుడవు సచ్చిదానందుడవు

కచ్చ ఏలనీకు మామీద నిత్య లీలావినోద

షణ్ముఖుడవునీవు అరిషడ్వర్గము నిర్జించేవు

వేడినంతనె వేగమె ఆయురారోగ్యలిచ్చేవు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చక్కెర కర్మాగారం నాదేహం

పంచదార సంచుల గోదాం

పలుకులే పటిక బెల్లాల తీరు

పాటల్లొ తేనె ఊటలై పుసిపారు

చొరబడుతోంది త్వరితంగా మధుమేహం

ఆరోగ్యవంతమైన మేనుకెంతటి ద్రోహం


1.తీయనైన వస్తువులతొ నోరూరు

భక్షపాయసాలతో మనసు బేజారు

పిండిపదార్థాలంటే జిహ్వకెంత జోరు

ఏలికైన నా నాలుకా నీకు జోహారు

చొరబడుతోంది త్వరితంగా మధుమేహం

ఆరోగ్యవంతమైన మేనుకెంతటి ద్రోహం


2.ఐదు రుచులు మాత్రమే ఇకనుండి రసనకు

మరిచే'దై'పోయింది మధురమే బ్రతుకునకు

తీపి రోగమొకటిచాలు కబళించేటందుకు

ఒకసారి వచ్చిందా బ్రహ్మతరమా వదిలేందుకు

చొరబడుతోంది త్వరితంగా మధుమేహం

ఆరోగ్యవంతమైన మేనుకెంతటి ద్రోహం

Monday, January 25, 2021

 (నా సాహితీ అభిమానులకు,బంధుమిత్రులకు,సమస్త నా దేశ పౌరులకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో)


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హలం చేతబట్టి పొలం దుక్కిదున్ని

ఆహార సృష్టి చేసే రైతన్నే భారత రత్న

తుపాకి చేతబూని సరిహద్దు కాపుకాచి

దేశాన్ని రక్షించే సిపాయన్నకే పరంవీరచక్ర

వందనాలనందుకో సైరికుడా గణతంత్ర దినోత్సవాన

జోహారులు నీకివే సైనికుడా సమగ్రభరత మహోత్సవాన


1.అన్నం పెట్టి అందరి ఆకలి తీర్చే అమ్మరా కిసాను

బ్రతుకును తాకట్టుపెట్టి కాపాడుకొనును తన జమీను

ఫలసాయం చేకూర్చి ఉత్పత్తులనందించి

ఎందరికో దేశాన ఉపాధులెన్నొ కలుగచేయు

కారణభూతుడు కృషీవలుడు-కారణజన్ముడీ క్షేత్రకరుడు

వందనాలనందుకో సైరికుడా గణతంత్ర దినోత్సవాన

జోహారులు నీకివే సైనికుడా సమగ్రభరత మహోత్సవాన


2.చలికి ఎండకు వానకు మననికాచు నాన్నేరా జవాను

బ్రతుకునే ఫణం పెట్టి పోరాటం చేసేటి ప్రాణమున్న మిషను

కంటినిండ మన నిద్రకు కునుకులేని రాత్రులె తనకు

ఇంటాబయటా సింహస్వప్నమే అరాచకమూకలకు

ఆపద్భాంధవుడే సేనాచరుడు-ఆదరణీయుడా క్షేత్రజ్ఞుడు

వందనాలనందుకో సైరికుడా గణతంత్ర దినోత్సవాన

జోహారులు నీకివే సైనికుడా సమగ్రభరత మహోత్సవాన

 రచన.స్వరకల్పన&గానం:


ప్రణవానికి పూర్వం మౌనం

ప్రళయానంతరం మౌనం

జననానికి తొలుతగ మౌనం

మరణానికి అవతల మౌనం

మౌనమే గానానికి ముందుగా

మౌనమే సంతృప్తికి సాక్షిగా


ఆత్మను అల్లుకున్నది మౌనం

పరమాత్మను ఆవరించెనుమౌనం


1.మౌనమే మనిషికి పెట్టని అలంకారం

మౌనమే వ్యక్తిత్వాన్ని తూచే తులాభారం

నీలోకి నీవే తొంగిచూడు అంతా మౌనమే

కన్నులతో మాటాడగలిగే వింతా మౌనమే


2.కంచు మ్రోగేలాగ కనకం మ్రోగదు

మౌనం దాల్చావంటే కలహం ఉండదు

ఎల్లలు లేని విశ్వభాష ఏకైక మౌనమే

అక్షరమాల లేనిభాష లోకాన మౌనమే


3.మనసుకు మనసుకుమధ్యన వారధి మౌనమే

మనోరథాన్ని నడిపించే గీతాసారథి మౌనమే

ఎన్నో చిక్కు సమస్యలకు మౌనమే సమాధానం

ఆత్మజ్ఞానం పొందే క్రమాన మౌనం ధ్యాన సాధనం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గాలిలో తేలిపోతోంది నీ ఊహకే నా ఒళ్ళు

ఎన్నాళ్ళు ప్రియతమా నా యవ్వనానికి సంకెళ్ళు

ఎంతగా అలిసాయో ఎదిరిచూసి చూసి నా సోగకళ్ళు

ఎద గోదారిలోనా ఉద్వేగాల పరవళ్ళు


1.రెక్కలే కట్టుకొని ఎగిరిరానా  నీ దరికి

రెప్పలే మూసుకొని కలల ప్రపంచానికి

రెండు కలిసి ఒకటయ్యే కొత్త గణితం మన ఉనికి

ఏకాంతమే లోకమయ్యే రసరమ్య మధువనికి


2.తెల్లచీర ఉల్లమంతా తెలుపుతోందిగా

మల్లెతావి మనసునంతా నలుపుతోందిగా

పల్లెసీమ పంటచేలు మంచెనే మన పడక

అల్లరే చేస్తోంది ఆకతాయి మది వశపడక

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ యాదే నాకు మనాది

నీ చెంత నిత్యం ఉగాది

నీపేరే అనూ అనూ అంటోది నా హృది

మనకలయిక  కింకా ఎంతుందో వ్యవధి

మేఘాలలో తేలితేలి రావే చెలి

కరిగిపోగ కాచుకుంది బిగి కౌగిలి


1.కటిక చీకటి రాత్రులే లోకమంతా నువులేక

చందమామ వెన్నెల మానేసే పున్నమైనా నిను కనక

కాస్త ఎక్కువైందనిపించినా ఇదే నాకు నిజం కనుక

ఇకనైనా వీడవే  ప్రేయసీ నా ఎడల నీ కినుక

మేఘాలలో తేలితేలి రావే చెలి

కరిగిపోగ కాచుకుంది బిగి కౌగిలి


2.కొత్తగా మొదలెడదాం మనదైన జీవనం

సంతోషాలే తొణికిసలాడే అపురూప భావనం

నవ్వుల పువ్వులతో  దారంతా నందనవనం

రాధాకృష్ణుల  ప్రేమలాగా మన వలపూ పావనం

మేఘాలలో తేలితేలి రావే చెలి

కరిగిపోగ కాచుకుంది బిగి కౌగిలి

Sunday, January 24, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శివుడే ఆది దేవుడు

శివుడనాది పరమగురుడు

శివుడే విశ్వనాథుడు

శివుడే కాశీపురాధీశుడు

భవాయనమో భవానీధవాయ

శర్వాయనమో పార్వతీ వల్లభాయ


1.ఓంకారేశ్వరుడు శంకరుడు

సంధ్యావాటి నర్తన ప్రియుడు

జ్యోతిర్లింగ స్వరూపుడు నభవుడు

ప్రళయకాల జ్వాలి కపాలి శంభుడు

గంగాధరాయనమో గజచర్మాంబరాయ

అంగజహరాయనమో సాంబశివాయ


2.భగీరథుని మనోరథము నెరవేర్చగా

దక్షిణవాహినియై ఉత్తమగతులీయగ

ఇలవంక వదిలీ గంగ కడకొంగు వీడక

కాశీయే కడయాత్రకు పావనస్థలిచేయగా

వెలసినాడు కాశీలో విశ్వేశ్వరుడై

అన్నపూర్ణ విశాలాక్షి సమేతుడై


3.గంగాతరంగాలు మృదంగాలుగా

జపమాలల సవ్వడులే మంజీరనాదాలుగ

నమఃశివాయ ధ్వానలతొ పురము మారుమ్రోగగా

చతుర్వేద పారాయణ శంఖారావముగా

నటరాజే కనువిందుగ చిందేయగా

వారణాసి అపరకైలాసమై వెలిసెగా


4.గంగలోన మునకలేయ పునీతులవగా

డూండీ గణపతినర్చించి అనుమతి బడయ

కాశీపురపతి విశ్వపతి మందిరమరయ

నమకచమక అభిషేక పూజలు సేయ

కరుణించు భోళా శంకరుడు

వరములిచ్చు లీలా విలాసుడు


5.అన్నపూర్ణ భవానిమాతను దర్శించగా

అన్నవస్త్రాలకెప్పుడు కొదవరాదుగా

విశ్వజనని విశాలాక్షిని అర్థించగా

విజయమే కలుగజేయుచు రక్షించుగా

వందనాలివిగొ మముగన్నతల్లీ అన్నపూర్ణా

హారతులు గొనుము కల్పవల్లీ విశాలాక్షీ


6.కనురెప్పలా కాపుకాయును కాలభైరవుడు

పరాన్నదోషము నివారించు పరాన్నభుక్తేశుడు

సప్తమోక్షద్వారలకు శ్రేష్ఠతమమీ వారణాసి

ఉత్తరాదిన బనారసను నామమే కడు వాసి

కాశీ దర్శన ఫలప్రాప్తి పూర్వపుణ్యమే

కాశీలో మరణిస్తే శివ కైవల్యమే


7.సురలకు నరులకు ముక్తిధామము

దేశవిదేశీ భక్తుల కాలవాలము

సనాతన సంస్కృత విద్యా పీఠము

ప్రాచీన సంస్కృతీయుత ప్రాభవము

కాశీనగరము విశ్వానికి కేంద్రము

కాశీ స్మరణయు భాగ్య విశేషము


8.ఎనుబది నాలుగు లక్షల రకాల జీవరాశి

ఎనుబది నాలుగు గంగాఘాట్లతో కాశి

అస్థికాభస్మాలకు గంగానిమజ్జనమే స్వస్తి

మనిషి జన్మ పరమార్థ సార్థకతకది సంప్రాప్తి

శవభస్మవిలేపనయే ఈశ్వరునికి తృప్తి

కాలకాలుడే ప్రసాదిస్తాడు జన్మ నివృత్తి


9.నవరంధ్రాల కాయం ఎపుడో మటుమాయం

నవరాత్రులు కాశీపుర శయనం గంగాతోయం

నవవిధ భక్తుల అనుభవం శవం శివమైతే నయం

నవధాన్యాల నవరత్నాల కైంకర్యం కమనీయం

నవనవోన్మేషం నేటి కాశీ పట్టణం 

భువి అభినవ కైలాసం వారాణసి పురం


ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మనసుల్లో వేరే ఏదోగా

మనషులెంతొ హుందాగా

తలపుల్లో ఎంతో తేడాగా

దాగుడుమూతల్లో స్నేహంగా


1.ఆకర్షణ చూపు తిప్పుకోనంతగా

అనుబంధాలే తెంచుకోలేనంతగా

ఒకరిష్టం మరొకరికి ఆమోదయోగ్యమై

పరస్పరం అభిరుచులే గౌరవించదగినవై

నీకోసం నేనుగా నీ బ్రతుకే నాదిగా

అనురాగమంటె ఇదేగా అనాదిగా


2.తెలుపలేకపోతే తిరిగిరాదు సమయం

తెలుసుకోక పోతే ప్రణయమెలా రసమయం

మాటలకందనపుడు భావం మాట్లాడును మౌనం

మౌనం రవళించి పాడుతుంది హృదయగానం

ముసుగులన్ని తొలగించి పారదర్శకంగా

లొసుగులేవి లేకుండా మార్గదర్శకంగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ కళ్ళలో మధిర నిషా

నీ చూపులో కైపు హమేషా

ముగ్గులోకి లాగడం నీకు తమాషా

మొగ్గలోన త్రుంచేయకు ప్రేమంటే ఆషామాషా


1.నా మగటిమికి నిగ్రహమే ఓ పరీక్ష

నీ సొగసులు ప్రకటిస్తూ నా కెందుకే శిక్ష

తాళజాల బాలా లిప్తైనా ఈ ప్రతీక్ష

వేగిరమే వేయవే నీ వలపులనే భిక్ష


2.ఉండాలా కూడదా నా కంటూ ఒక రేపు

ఊరించే నీ పెదాలే ఎదలోన మంటలు రేపు

గాలిలోన తేలేలా చేస్తుంది నీ ప్రతి తలపు

స్వర్గసుఖాలందేలా ఈ క్షణమే నను చంపు

Saturday, January 23, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సంకటములు బాపరా వేంకటాచలపతి

ఆపదమ్రొక్కులవాడా అలమేలు మంగాపతి

ఎంతగానొ చేసితి నీ   గుణగణాల సన్నుతి

వింతదేమొగాని నిన్ను మెప్పించగ విఫలమైతి


1.పలుమార్లు పొగిడితి సైచక నే తెగిడితి

చలనమే కనరాని శిలవైతివ శ్రీపతి

అన్నమయ్య చేసుకున్న పున్నెమేమిటో మరి

పురంధరునికీ అంతటి భాగ్యమెలా శ్రీహరి

అజ్ఞాన కృతదోషములన్ని మన్నించరా

సుజ్ఞాన మార్గానికి నను మళ్ళించరా


2.తాయిలాల నడుగులాగ మాయలొముంచేవు

ఐహిక వాంఛలపై మోహాన్ని పెంచేవు

వీలైనంతగా మమ్ముల దూరంగా ఉంచేవు

తాత్కాలిక సుఖాలకై పరుగెత్తించేవు

పక్షివాహన నా లక్ష్య మింకనీవేనురా

సాక్షాత్కరించి నాకు మోక్షపదము నీయరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంత చెప్పినా ఒడవని రామాయణం

ఎంత వగచినా మారని భారతం

ఇంటింటా ఉన్నదే ఈ భాగోతం

ఇలా కూడ ఉండేదే జీవితం


1.గిల్లికజ్జాలు చిరుచిరు కలహాలు 

ఎంత కీచులాడినా వీడని మోహాలు

ఎవ్వరూ ఇవ్వకూడదు ఉచితసలహాలు

సంసారాలు అంటేనే నాకం నరకం తరహాలు


2.పగలంతా పగలౌతూ యుద్ధభేరీలు

రాత్రైతే  సంధి కోరుతు కాళ్ళబేరాలు

మనసు మనసుకు చేరువకాని వింతదూరాలు

లోకులకోసం వేసుకొనెటి  ముసుగుల మమకారాలు

Friday, January 22, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ ఊహే ఎంత హాయి

కదలనంది మరి ఈ రేయి

వలపు సాచింది నీకై చేయి

కలల సీమకిక విచ్చేయి


1.అల్లంత దూరాన నీవు

కంటికైనా కనరావు

కవుల కల్పనవైనావు

ఎదలొ నీవే దేవతవు


2.మన దివ్య సంగమం 

సదా హృదయంగమం 

మేని మిథున మథనం

గ్రోలగ తరగని అమృతం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏమని రాయను నా కవిత

దుఃఖం గడ్డకట్టిన వెత

చేజారినే చెలిమి జత

అశ్రువులే సిరాగ మారిన కత


1.ఏడంటే ఏడే అడుగుల పయనం

మూడంటే మూన్నాళ్ళైన జీవనం

సుడి గాలి చెలరేగి చెదిరిపోయింది

వడగళ్ళ వానలోనా కమిలిపోయింది


2.చిన్నారి గూడు ఛిద్రమై పోయింది

అందాల లోగిలి వన్నె కోల్పోయింది

జంట పక్షి ఎక్కడికో ఎగిరిపోయింది

ఒంటరి తల్లేమో పిల్లల పొదివి పట్టుకుంది

Thursday, January 21, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా తనువే తెరిచిన పుస్తకం

నువు చదువుకో ఆపాదమస్తకం

నా మనసే ప్రణయ ప్రబంధం

పఠించుకో పరవశాన ఆసాంతం


1.చుంబనాల సొంపైన చంపకమాలలు

ఆలింగనాల ఇంపైన ఉత్పలమాలలు

మధించతగిన మత్తేభకుంభస్థలాలు

జయింపదగిన శార్దూల విక్రీడితాలు

మేధకు పదనుపెట్టు ఛందో గంధాలు

అంగాంగం ఊరించే అనంగ రంగాలు


2.సరిక్రొత్త అర్థాల విస్మయ శబ్దావళులు

తమకాల గమకాల సమ్మోహన జావళీలు

అలంకార రహితమైన రహస్య దృశ్యాలు

అనాఛ్ఛాదితాలుగ  అసూర్యంపశ్యలు

రాసుకో తరచితరచి ఎన్నైనా భాష్యాలు

చేసుకో నీదైన భాషలోకి అనువాదాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పరస్పరం ఆత్మీయ పలకరింపు 

హాయెంతగానొ గొలుపు

నేస్తాలమైన  మనకదియే

పన్నీటి చిలకరింపు


1.ఒంటరినేనని తలపుకొస్తే

గురుతుకొస్తుంది నీ చెలిమి

నా కంట నీరు చిప్పిల్లితే

తుడిచివేస్తుంది నీ కూరిమి


2.దేహాలు వేరైనా ఒకే ప్రాణము

మనం శ్రుతి లయల మధుర గానమ

బొమ్మబొరుసులున్న ఒకే నాణెము

అక్షరాలు రెండున్నా ఒకే స్నేహము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అవధూతవు నీవని అననా దత్తావతారమె నీదని

ఫకీరు నీవని ఎంచనా అల్లాహ్ మాలిక్ అంటావని

ఏసుగ నిను భావించన మరణించీ బ్రతికొచ్చావని

మానవతా వాదివననా నిస్వార్థపు సేవలు చేసావని

సాయిబాబా షిరిడి బాబా-సాయిబాబా సద్గురు బాబా


1.కులమతాలు మాకెందుకు బ్రతుకు తెరువు నిస్తెచాలు

వేషభాషలేవైనా మా ఆశలు నెరవేర్చు చాలు

నీ పలుకులననుసరిస్తె హితమనిపిస్తె చాలు

నీ బోధలు పాటిస్తే మహిత తత్వమిస్తె చాలు

సాయిబాబా షిరిడి బాబా-సాయిబాబా సద్గురు బాబా


2.గుడులనింక  వదిలివేసి మా గుండెలొ కొలువుండు

ఊరూరూ షిరిడీగా మారిపోతే బాగుండు

మనిషి మనిషి లో నీవే అగుపిస్తే కడుమెండు

శరణాగతి మా కొసగితె మా జన్మలు పండు

సాయిబాబా షిరిడి బాబా-సాయిబాబా సద్గురు బాబా

Wednesday, January 20, 2021

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


నెలవంక తలనున్న శివశంకరా

నా వంకలెంచక అనుకంపగనరా

గరళాన్ని మ్రింగినా భోళాహరా

అజ్ఞాని నేనని అలుసేలరా

పశుపతి గిరిజాపతి కైలాసపురపతి

నాకీయరా సద్గతి కపర్దీ శరణాగతి 


1.లింగరూప గంగాధర జంగమదేవర

త్ర్యంబకా కంకటీక  అంతకాంతకా

కపాలీ శూలీ భగాలీ పింగళీ అస్థిమాలీ

నా గుణదోషాలు నీవే కరుణాకర కనికరించరా


2.వృషవాహన ఋతధ్వజా దూర్జటీ

త్రిపురారి భృంగీశా సితికంఠా ముక్కంటీ

మృత్యుంజయ భస్మాంగ సంధ్యావాటి

నా భవతాపాలు నీవె పరిహరించరా ఉద్ధరించరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నవ్వే నీ మోముకు నవరత్నాభరణం

నీ మంజుల హాసానికి నా ప్రాణాలే తర్పణం

ఎంతని పొగడను నీ అందం చర్విత చరణం

 అందాన్ని మించి అపురూపమే నీ సౌశీల్య గుణం


1.చూపుల్లో మెరిసె నిశి రాతిరి చుక్కలు

చుబుకానికె సోయగమా చిన్నారి నొక్కులు

చెంపలకే ఇంపైన  విన్నాణపు సొట్టలు

వంకీల ముంగురులే విలాసాన దిట్టలు


2.సన్నధిలో పరిమళించు  మధువన గంధాలు

వాగ్ఝరిలో ప్రవహించు మందార మరందాలు

సఖ్యతలో పొంగిపొరలు అతులిత ఆనందాలు

సౌమ్యతలో హాయిగొలుపు వీరంధర చంద్రకాలు

Friday, January 15, 2021



సప్తగిరి శ్రీపతి 

గొను భక్తకోటి హారతి

నీవే శరణాగతి

మాకీయగ నిర్వృతి


1.శేషాద్రి పదపీఠము

నీలాద్రి మంజీరము

గరుడాద్రి కటి చేలము

అంజనాద్రి కౌస్తుభము

శిలశిలలో నీరూపము

తిరుమలయే అపురూపము


2.వృషభాద్రి వక్షము

నారాయణాద్రి వదనము

వేంకటాద్రి తిరునామము

వేంకటాచలపతీవె కలి దైవము

మోకాళ్ళసోపానాలు ముక్తిదాయకాలు

తిరుకోవెల భువి వైకుంఠ ఆనవాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ తడి తనువును చూడగనే

చిత్తడిరేగెను చిత్తములో

తహతహ తపనల రాపిడిలో

మత్తడి దూకేను తమకములే


1.రెచ్చగొట్టుతావే పచ్చిపచ్చిగా వచ్చి 

చిచ్చుపెట్టుతావే వెచ్చవెచ్చగా కాల్చి

నచ్చాననుకోనా నను మెచ్చావనుకోనా

పిచ్చిపట్టే నీ పొంకాలతొ రచ్చచేయకె లచ్చమ్మా


2.మత్తులొ ముంచబోకే నిను గుత్తగా నాకిచ్చి

చిత్తుచేయబోకే పోట్లగిత్తనేనని మరిచి

ఇద్దరి సుద్దుల పొత్తు పొద్దుకు మాపుకు గమ్మత్తు

హద్దులు దాట నీ ముద్దు తీర్చగ ఆపద్దు ఆ పద్దు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పుట్టుకలో పోరాటం-బ్రతుకంతా ఆరాటం

అనునిత్యం మృత్యువు చెలగాటం

అనుభవాలే మనిషికి గుణపాఠం

నేస్తమా ఈ క్షణమే తరగని ఆనందం

చెరగని నవ్వులె పెదవులు పంచే మకరందం

హాప్పీ బర్త్ డే టూ యూ-విష్యూ హాప్పీ బర్త్ డే టూ యూ


1.వదలకు దొరికిన మంచి అవకాశం 

మరవకు చేయగ పరులకు చిరుసాయం

ప్రతి మనిషీ పుట్టుకకు ఉంటుందొక పరమార్థం

విజ్ఞత కలిగి చేసుకో నీ జన్మ సార్థకం

నేస్తమా ఈ క్షణమే తరగని ఆనందం

చెరగని నవ్వులె పెదవులు పంచే మకరందం

హాప్పీ బర్త్ డే టూ యూ-విష్యూ హాప్పీ బర్త్ డే టూ యూ


2.ధీరత్వం వీడకపోవుటె విబుధుల సుగుణం 

విధికైనా ఎదురీదడమే యోధుల  లక్షణం

మననం చేసుకొ మధురానుభూతుల నీ గతం

ఆదర్శంగా మారాలి లోకానికి నీ జీవితం

నేస్తమా ఈ క్షణమే తరగని ఆనందం

చెరగని నవ్వులె పెదవులు పంచే మకరందం

హాప్పీ బర్త్ డే టూ యూ-విష్యూ హాప్పీ బర్త్ డే టూ యూ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


స్నిగ్ధవై ముగ్ధవై ఉద్విగ్నవై

చొరబడతావే నా తలపులలోకి

శశివై పున్నమి నిశివై తరగని ఖుషీవై

లాగేస్తావే నను వలపులలోకి

నన్ను నా మానానా బ్రతుకనీవెందుకే

ఊరించి చంపేవు అందాల విందుకే


1.కిసలయాలు కొసిరేటి కోయిల పాటవై

కరిమబ్బుల మురిసేటి మయూరపు ఆటవై

పలు వన్నెలు విసిరేటి విరిసిన విరితోటవై

వయారాలు వంపులతోటి కులికే సెలయేటివై

మురిపించబోకే నన్ను ఆణిముత్యాల సరమై

ఉడికించమాకే నన్ను ఎదదాగిన కల'వరమై


2.వాలుజడలో పూలుబెట్టి మది కట్టివేయకే

వాలువాలు చూపుల తోటి కనికట్టుచేయకే

పరువాలు ఎరవేసిమరీ ఈ పసిచేపను పట్టకే

అనుభవాలు జతజేసీ నను గురిచూసి కొట్టకే

సూదంటురాయిలాగా నన్నుంటుకోకే

వేధించు హాయిలాగా నా జంటకాకే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వలపు నేరమయ్యింది

చెలిమి దూరమయ్యింది

మనసు భారమయ్యింది

బ్రతుకు ఘోరమయ్యింది

వెతల జీవితంలో మతుల కతలు ఎన్నో

కలత నిదురలోనా కరిగిన కలలెన్నో


1.కొత్తదనం ఏమీలేదు అనుభవాలలో

భావుకతకు జాడేలేదు వాస్తవాలలో

జ్ఞాపకాలు ఊపిరాడనీయకుంటే

అనుభూతులు గొంతునులుముతుంటే

క్షణక్షణం మరణమై నీరీక్షణయే రణమై


2.ఎదురు పడితె మాత్రమేమి తలతిప్పుకుంటుంది

తన ప్రపంచమంతా పంజరమనుకుంటుంది

ఎంత బాధపడుతుందో విధికైనా తెలిసేనా

జీవశ్చవమల్లే బ్రతికేదీ ఓ బ్రతుకేనా

దినదినమూ దైన్యమై భవిష్యత్తే శూన్యమై

Tuesday, January 12, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆనందం అంతరంగాన

ఆందోళన జీవిత చదరంగాన

నీతోనే పోరాలి నీలోనే పోరాలి

నిన్ను నీవే గెలవాలి 

గెలవాలన్న తలంపుని సైతం గెలిచితీరాలి


1.క్షణికమైన గెలుపుకోసం వెంపర్లాట

గుర్తింపు కీర్తింపుకై దోబూచులాట

మన ప్రతిభకు మనకన్నా నిర్ణేతలెవ్వరు

మంచిచెడ్డల ఎంపికకు మనం వినా చక్రాంగమెవరు


2.జిహ్వకో రుచిలాగా చిత్తప్రపృత్తి

మనిషికి మనిషికీ తనదైన అభిరుచి

ఒప్పించుట కొందరిని నొప్పించుట కొందరిని

ఆత్మ తృప్తికన్న మిన్న చేర్చదేది నిను దరిని

 

https://youtu.be/8QwshHfvSfA?si=BUMSlXgVCB8KKCSE

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఇచ్చినా నువ్వే మా ఇలవేల్పువి

నొప్పిచ్చినా నువ్వే నా ఇఛ్ఛాదైవానివి 

గుండెన గుడికట్టితి కొలువై నిలువరా

కొండగట్టు కపివరా వేగమె నను కావరా

శ్రీ రామదూతం శిరసానమామి

శ్రితపారిజాతం సతతం భజామి


1.మహాబలుడవే నీ శక్తి అతులితమే

వాయునందనుడవే వాలాసనుడవే

శ్రీరామ బంటువే నీ భక్తి అపూర్వమే

సీతమ్మకు ముదమొసగిన పుత్రసముడవే

నువు దృష్టి పెడితె చింతలన్ని చిటికెలొ మటు మాయం

నువు వెన్నుతడితె గెలుచుటయే సదా మాకు ఖాయం


2.  రవిశిష్యా అవలీలగ  సాగరాన్ని దాటావే

     పింగాక్షా రాక్షసల  దుంపతెంచినావే

   లంకాదహనమే జంకక కావించినావే

   రావణుడి దర్పాన్ని అణచివేసినావే

నీ పేరు చెబితె చాలు స్వామి భూతప్రేతాలు హతం

నిను దర్శిస్తె చాలు ప్రభూ భయాలు బాధలు ఖతం

Monday, January 11, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చెప్పడమెంతో తేలిక

వాస్తవాలే మ్రింగుడు పడక

నాదీ అని ప్రేమ పెంచుకొన్నాక

వదలుకోవడమే ప్రహేళిక

మనదనుకొన్నదేదీ దొరకదు చేజారితే

పుణ్యకాలం గడిచేపోతుంది ఏమారితే


1.వాడి త్రోసివేసే జీవితాలు కావు మావి

మమతానురాగాలతొ పెనవేసుకొన్నవి

ఒకే కంచం లో పంచుకుంటు తినడం 

ఒక మంచంలో ఒరుసుక పడుకోవడం

తలనొప్పికి చనువుగ రాసే జండూబామ్ లు 

బడలిక తీరేదాకా పెద్దల ఒళ్ళుపట్టడాలు

మనదనుకొన్నదేదీ దొరకదు చేజారితే

పుణ్యకాలం గడిచేపోతుంది ఏమారితే


2.చిరిగితేనో అతుకులు చిరుచిరు మా బ్రతుకులు

మరమ్మత్తులు చేస్తూనే వాడుకొనే వస్తువులు

అనుబంధం పెంచుకుంటూ ఆప్యాయత నంజుకుంటూ

మూగజీవాలనైనా ఇళ్ళూ పొలాలు ఊళ్ళపైన

మాఊరు మాజిల్లా మా రాష్ట్రం మా దేశంగా

మావిగా అనుభూతి చెందే విశాల హృదయంగా

మనదనుకొన్నదేదీ దొరకదు చేజారితే

పుణ్యకాలం గడిచేపోతుంది ఏమారితే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీవే మ్రింగావో నాకే పంచావో

గరళమే నిండింది నా గళములో

మాధురే కొఱవడింది గాత్రమ్ములో

నీలకంఠ కాలకూట విషతుల్యమాయే నా గానము

కపర్దీ  కఫమే ఊరుతు కర్ణకఠోరమాయె నా కంఠము


1.కమ్మగ పాడనాయే ఈ జన్మకు

శ్రోతల నలరించనాయె ఏ పాటకు

శ్రావ్యము మార్దవము శ్రవణపేయమే కాదాయే

భావ రాగ తాళ యుక్తమై ఏదీ ఒప్పారదాయే


2.గరగరలే గొంతులో లాలాజలం నోటిలో

పాటపాటకూ ఆగని ఊటలా ఆటంకమై

జన్మతః నోచుకోని గీతం జీవితపు లక్ష్యమై

అమృత సమగానమే బ్రతుకునకే మోక్షమై


3.పికమేమి పూజచేసి మెప్పించిందో

మైనా ఏమైనా మంత్రజపం చేసిందో

సెలయేరు వరమడిగి అభిషేకమొనరించిందో

పర్జన్యం మౌనంగా తపమెంత చేసిందో


4.సంగీత శాస్త్రరచన చేసిన వాడవే

నటరాజ లయాత్మకంగా తాండవమాడావే

నామీద నీకేల ఇసుమంతయు దయలేదా

కరుణా సముద్రా ఆర్ద్రతే కరువయ్యిందా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బాంధవ్యము నెరుగవా శివా

భార్యాద్వయాన్విత గంగాధరా గౌరీవరా

వాత్సల్యము లేదనా అభవా

కుమరులిరువురౌ గజముఖషణ్ముఖ ప్రముఖ

నీదైతే పరివారమా మాదైతే ప్రవ్రాజ్యమా

పరితోషము మాకీయగ నీకేదో వ్యాజ్యమా


1.తలమీద నీకు గంగ కంటిలో నాకు గంగ

నిరంతరం తడుపుడే నిండా మునగంగ

గణాధిపత్యమొకరికి చేయగ ధారాదత్తం

సేనాధిపత్యాన్ని చేసితివింకొకరి పరం

నా పుత్రులు సైతం నీకాప్తులు కారా

పరమపితవు నీవుకదా నీదే  నా అగత్యం


2.మందుమాకులేనివైన వ్యాధులతో మాదైన్యం

వైద్యనాథుడవీవాయే  మీకంతా ఆరోగ్యం

యాతన మాకెంతనొ లేక ప్రత్యామ్నాయం

మృత్యుంజయుడవీవు ఉండదుగా ఏ భయం

మేమంతా నీ వారము మేమూ నీ పరివారము

విశ్వనాథ చూడవేల మా యోగ క్షేమము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆదివారం ఆనందతీరం

అలుపు తీరగ పరిహారం

నిద్రలేచుట ఎంతో భారం

కోడికూరతొ యవ్వారం

నోరూరించే మాంసారం మైకమిచ్చే విస్కీ రం

ఆదివారమంటేనే విలాసం విలాసాలకే విలాసం


1.మందు విందు ఫ్రండ్స్ తో దినమంతా పసందు

వారంమంతా చేసిన శ్రమకు రోజంతా ఆటవిడుపు

ఉరుకుల పరుగుల ఉద్యోగానికి ఊరట కలిగింపు

సండే అంటే ఎందరికో ఎంజాయ్ దొరికే తలంపు

ఆదివారమంటేనే విలాసం విలాసాలకే విలాసం


2.ఇంటిల్లి పాదికీ సండేనే సరదా పంచే హాలీడే

ఇల్లాలికి మాత్రం రుచురుచులన్నీ  వండే చాకిరే

కాలైనా కదపకుండా కాఫీ టీ టిఫిన్ల అర్డర్లిచ్చుడే

ఓపిక గలిగిన అమ్మకు ఆలికి తప్పక సలాం చేసుడే

ఆదివారమంటేనే విలాసం విలాసాలకే విలాసం


(నేను స్వచ్ఛమైన శాఖాహారిని-మందు,దమ్ము లాంటి ఎటువంటి అలవాట్లు లేవు,ఐనా కవి అన్నవాడు ప్రతి హృదయాన్ని ప్రతి ఫలింపజేయగలగాలి అనే ఉద్దేశ్యంతో)

Saturday, January 9, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రెచ్చగొట్టకే నచ్చినదానా

పిచ్చిపట్టు నీ సొగసును నే కన

పచ్చి ప్రాయమౌ చిత్తములోన

మచ్చిక చేయగ  నను దేవాంగనా


1.అచ్చికబుచ్చిక లాడుదువే

వెచ్చని కౌగిట చేర్చుదువే

ముద్దూముచ్చట తీర్చుదువే

బానిసగా నను మార్చుదువే


2.మూడుముడుల బేరంపెట్టి 

ఏడడుగుల దూరం నెట్టి

ఏమార్చి నా ఎదను కొల్లగొట్టి

కొంగునకట్టేవు చుక్కల చూపెట్టి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పువ్వునేర్పుతుంది మనకు నవ్వడం ఎలాగో

దివ్వె తెలుపుతుంది మనకు వెలగడం ఎందుకో

పిట్ట ఎరుకపరుస్తుంది బ్రతుకు విలువ ఏమిటో

పిల్లి బోధచేస్తుంది తల్లి ప్రేమ ఎంతనో


1.పికము పాట పాడుతుంది మొహమాటం లేకనే

నెమలి నాట్యమాడుతుంది మైమరచి లోకమే 

ఎదిరిచూపు మాధురికి చకోరమే ఒక పోలిక

తేటతెల్ల పరచుటకు మరాళమే తగు తూనిక


2.తరువు గురువు త్యాగమెలా చేయాలో చెప్పుతూ

చిరుగాలి ఘనఘనము స్నేహంలో కరుగుతూ

నదీ కడలి సంగమం అనురాగ రాగమవుతు

పిపీలికం పట్టుదలకు పట్టదగిన యోగమవుతు

Friday, January 8, 2021


భక్త వరదుడవే ఆర్తత్రాణ బిరుదుడవే

శరణాగత వత్సలుడవే కరుణాంతరంగుడవే

తిరుమల గిరిరాయా జాగేల సరగున అరయా

మకరి బారి కరి కరిగాచిన సిరి పరిణేతా నీకిది సరియా

నమో వేంకటేశ నమో శ్రీనివాసా

నమోనమో బాలాజీ తిరునామ విరాజీ


1.ఎలా పరిష్కరిస్తావో జటిల సమస్యల ద్రోసి

ఎలా సంస్కరిస్తావో భవబంధాలు వేసి

సరసిజ నాభా మనలేను ఇకపైన నిను బాసి

ఉపేంద్రా ఉద్ధరించు ఉపేక్షింపక దయచేసి

నమో వేంకటేశ నమో శ్రీనివాసా

నమోనమో బాలాజీ తిరునామ విరాజీ


2.ఒకటిని మించి ఒకటి వెతలెన్నని కోటి

దుఃఖమందె నినువేడుట మాకెపుడు పరిపాటి

నటన సూత్రధారీ నీవాటలొ ఘనాపాఠి నేనేపాటి

జగన్నాథ జనార్ధనా అజన్మమీయ నీకెవరు సాటి

నమో వేంకటేశ నమో శ్రీనివాసా

నమోనమో బాలాజీ తిరునామ విరాజీ

 రచన,స్వరకల్పన&గానండా.రాఖీ


చనుబాలను అందించి-మురిపాలను చిందించి

అరచేతికి హాయినిచ్చి-శిశువుకు పరవశమిచ్చి

కృతార్థతనొందేటి ప్రలంబమా

స్త్రీత్వానికి అర్థమైన పయోధరమా

ఎన్నటికీ మగజాతి నీకు బానిస

ఎంతవారికైనా నీమీదే ధ్యాస


1.పసి ఆకలి తీర్చే అమృత భాండమా

మాతృత్వ మధురిమలో బ్రహ్మాండమా

కోడెవయసు కోర్కె రేపు అగ్నిగుండమా

జగజ్జెట్టినీ పడగొట్టే వలపుకోదండమా

ఎన్నటికీ మగజాతి నీకు బానిస

ఎంతవారికైనా నీమీదే ధ్యాస


2.త్రిమూర్తులే దత్తుడై గ్రోలిన చందమా

శివభక్తుడు లింగమని పూజించిన వైనమా

పురుషుని చూపులాగు అయస్కాంతమా

సేదతీర్చి ఊరడించు పరమ ఔషధమా

ఎన్నటికీ మగజాతి నీకు బానిస

ఎంతవారికైనా నీమీదే ధ్యాస

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎవరు చెక్కినారమ్మా ఇంత చక్కటి శిల్పాన్ని

భువికి ఎవరు దింపిరమ్మ నీ సజీవ రూపాన్ని

శివుడే పరవశుడైన ఆకాశ గంగవా

కౌశికుడే వివశుడైన అప్సరాంగనవా

అందానికి ఇంతకన్న ఏదీ నిదర్శనం

సౌందర్యానికే నిలువెత్తు నిర్వచనం


1.రతిని మతిని తలవడు నిను గంటే మదనుడు  

రాధనెదను నిలుపడు నినుగాంచ మాధవుడు

బ్రహ్మమానస పుత్రికవో

నవ మోహిని చిత్రికవో

అందానికి ఇంతకన్న ఏదీ నిదర్శనం

సౌందర్యానికే నిలువెత్తు నిర్వచనం


2.అతిలోక సుందరి నీ జతకు తూగరతివలు  

మదగజగామిని నీ హొయలెరుగరు ముదితలు

అంగనగా మారిన సింగిడి నీవు

మెలికల మేని కిన్నెరసాని వీవు

రెప్పలైనవాలవు నిను తిలకించినంత

జన్మలెన్ని చాలవు వలపు చిలకరించినంత

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సిగ్గేలనే ఓ చినదానా

నను ముగ్గులోకి లాగి వలచినదానా

ఎన్నాళ్ళుగానో నాకై వేచినదానా

నన్ను నన్నుగా ప్రేమించినదానా 

నాకై కలవరించినదానా,నన్నే వరించినదానా


1.తల ఎత్తి తరుణి వైపు చూడని వాడను

పల్లెత్తి పరపడతితో ఎన్నడు మాటాడను

అల్లసానివారి అభినవ ప్రవరాఖ్యుడను

నిగ్రహ పరిగ్రహాన మునిజన ముఖ్యుడను


2.అమ్మ కొంగు చాటుమాటు పిల్లవాడినే

కొమ్మా నను పడగొట్టి కొంగున కట్టావే 

నువు గీచిన గీతను జవదాటకుంటినే

నీమాటనెపుడు మీరక నడుచుకుంటినే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లోపమేదొ తెలియకుంది నా కవనంలో

శాపమేదొ తగులుకుంది నా జీవనంలో

ఎంత వైవిధ్య భరింతంగా కవితలున్నా

భావుకతను ఎంతగానొ కుమ్మరిస్తున్నా

ఆదరణకు నోచుకోవు కైతలెందుకో మరి

ఎదలను కదిలించవేమొ కొసరి కొసరి


1.లలితమైన హృదయమే నాకు లేకుందో

అనుభూతి చెందడమే అసలు రాకుందో

సరళమైన పద పొందిక కొఱవడి పోయిందో

వాడుక భాషలోన నా సాహితి సాగకుందో

ఆదరణకు నోచుకోవు కైతలెందుకో మరి

ఎదలను కదిలించవేమొ కొసరి కొసరి


2.పరులను విరివిగా ప్రశంసించ లేదేమో

స్పందించే మిత్ర తతి మెండుగ లేదేమో

ఆర్భాటం హంగామా నాకు చేతకాదేమో

అసలు సిసలు కవిత్వమే నాది కాదేమో

ఆదరణకు నోచుకోవు కైతలెందుకో మరి

ఎదలను కదిలించవేమొ కొసరి కొసరి

Thursday, January 7, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సారంగ


నా నాలుక కుంచెగా -నీ తనువున దించునే

ముద్దుల తైలవర్ణ చిత్రాలెన్నో

నీ మేనే వీణియగా-పెదవులు పలికించునే

తమకాల గమకాల రాగాలెన్నో

 ప్రియసఖీ నీవే శృంగార దేవతవు

ప్రేయసీ నీవే మదన కదన గీతవు


1.అజంతా చిత్రాలను కపోలాన ఆత్రంగా

ప్రత్యూష చిత్రాలను పదముల పాత్రంగా

రామప్ప శిల్పహోయలు నూగారుమాత్రంగా

ఖజురహో భంగిమలే రతికేళీ శాస్త్రంగా

చిత్రించెద రసనతో అసిధారావ్రతంగా

శ్రమించెద  విరమించక విశ్వకర్మ సాధనంగ


2.కలశస్తన మర్ధనలో రమ్య కామవర్ధినిని

వ్యూహరచనలో కదనకుతూహలాన్ని

పరిష్వంగ ప్రమోదాన బృందావన సారంగని

సంగమక్షేత్రాన తారాస్థాయిగ ఆనంద భైరవిని

రవళించెద సరసరాగ సమ్మోహనంగా

కురిపించెద ఎదను తడుప సురగంగా

Wednesday, January 6, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చంద్ర కౌఁస్


రమ్మంటే రావేలా పడకటింటికి

గంధర్వకాంతలా కనిపిస్తూ నా కంటికి

తలనిండా మల్లెదండ తహతహ పెంచ

న్యాయమా అర్ధాంగీ నన్నుడికించ


1.ఎప్పుడొస్తానా అని ఎదిరిచూపు నా కొరకు

అభిసారికవై  సాయంత్రం నేనిల్లు చేరే వరకు

వచ్చీరాగానే జాప్యానికి హెచ్చిన అలకలై

ఉవ్విళ్ళూరే యవ్వనమే ఉసూరనగ కలై

తెల్లచీర ఉల్లమందు ఉద్విగ్న పరచ

ధర్మమా శ్రీమతి నా మదిని దోచ


2.సత్యభామ పదములొత్తు కృష్ణుడకానా

మోహినినే బ్రతిమాలెడి శివుడనేనైపోనా

కట్టుకున్ననాడె నీ దాసుడనై పోయానే

బెట్టేజేయ తగదు సఖీ నీ ప్రియపతినికానే

ఓరచూపు మూతివిరుపు నీకందమే

ప్రేయసీ ఊర్వశీ ఇకనైనా అందవే



ఎవరిని అడిగి చేరావు షిరిడి

ఏమాశించి పంచావు ప్రేమని

తొలగించావు తీవ్రమైన బాధలని

ప్రవచించావు ఉచితమైన బోధలని

సాయిబాబా దత్తావదూత నమస్సులివే

నీపద పుష్పాలుగ మా మనస్సులివే


1.అందరినీ ఆదరించు ఆత్మబంధువైనావు

 అంతెరుగని అనురాగ సింధువైనావు

దీర్ఘకాల వ్యాధులకు నీవే మందువైనావు

దివ్య దర్శనమ్మీయగ కను విందువైనావు

సాయిబాబా దత్తావదూత నమస్సులివే

నీపద పుష్పాలుగ మా మనస్సులివే


2.చెబితేనే చూస్తావా మా శ్రేయస్సు

కోరితేనె ఇస్తావా మాకు జ్ఞాన రుచస్సు

దశదిశలా వ్యాపించె నీ లీలల యశస్సు

పొందిన ప్రతి ఉన్నతి నీవొసగిన ఆశీస్సు

సాయిబాబా దత్తావదూత నమస్సులివే

నీపద పుష్పాలుగ మా మనస్సులివే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అభావమయ్యింది మనసెందుకో 

కలతచెందింది కలమెందుకో

కవితకొరకు వస్తువులేకా

ఏ ఘటనకైనా ఎద చలించకా

రాయడానికేముంది నవీన కోణం

చెప్పిందే చెప్పుతూ చర్వితచరణం


1.తాదాత్మ్యత లోపించింది ఆధ్యాత్మికతన

సర్వస్యశరణాగతిలేదు భక్తితత్వాన

ఢాంభికాలు ప్రదర్శనలు అట్టహాసాలు

ఆత్మలోకి అవలోకించక పరమత పరిహాసాలు

రాయడానికేముంది నవీన కోణం

చెప్పిందే చెప్పుతూ చర్వితచరణం


2.పూలుపళ్ళు పోలికతో వనితల ఒళ్ళు

ప్రేమా ప్రణయం అనురాగం శృంగారాలు

విరహాన వేగిపోయే ప్రేమికుల వేదనలు

అనుభవైక వేద్యమైన అను నిత్య భావనలు

రాయడానికేముంది నవీన కోణం

చెప్పిందే చెప్పుతూ చర్వితచరణం


3.కంఠశోష మినహాయించి మంచిమార్పు సాధ్యమా

పుర్రెకో బుద్ది తరహా వైవిధ్య ప్రపంచమా

ప్రవక్తలు సంస్కర్తలస్వప్నం ఈ సమాజమా

భ్రష్టుపట్టి పోతున్న  మానవ భవితవ్యమా

రాయడానికేముంది నవీన కోణం

చెప్పిందే చెప్పుతూ చర్వితచరణం

Monday, January 4, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మది గదిలో ఏదో మౌన గీతం

పాడుతోంది నా శూన్య జీవితం

శిశిరాన ఆశలు ఆకులై రాల

ఎండమావులే ఎదురేగి రాగ


1.వసంతమే సొంతమయ్యే దారి కనరాక

గగనాన  మేఘం వర్షించు వైనం తెలియక

సాగుతోంది బ్రతుకు పయనం సాగరాన

తీరమేది కనుచూపుమేర  అగుపించక


2.నిర్మించుకున్న హర్మ్యాలు సైతం నేల కూల

ఊహించుకున్న స్వర్గాలు కూడ నరకాలై పోగ

చేయూత కోసం వగచేది లేక నడిపేను నావ

కాలం చేసే మాయాజాలం వేయాలి పూల త్రోవ

పలుకుటకే పరిమితమై పరమత సహనం

ఎద ఎదలో బుసలుకొట్టే పరమత హననం

ఆచరణకు నోచుకోని లౌకికత్వ విధానం

వేదికలకె భాషణలకె సమైక్యతా నినాదం

మరలిరా మహాత్మా సమసమాజ నిర్మాతా

తిరగరాయి మహాశయా రాజ్యాంగ నిర్ణేతా


1.చర్చ్  ల దర్శనాలు ఫాదర్ ల దీవెనలు

దర్గాలకు మొక్కులు గురుద్వార యాత్రలు

సంకుచితం కానరాని హైందవ ధర్మాలు

అన్యమతం అతిహేయం మునుగడకే తావీయం

ప్రసాదమే విషతుల్యం ఈసడించు మతమౌఢ్యం

తిన్నింటి వాసాలకు లెక్కలు హక్కుల వితండం

మరలిరా మహాత్మా సమసమాజ నిర్మాతా

తిరగరాయి మహాశయా రాజ్యాంగ నిర్ణేతా


2.రంజాన్ వేడుకలు విందుల వాడుకలు

ఏ ఈద్ కైనా శుభాకాంక్షల వెల్లువలు

అలయ్ బలయ్ హత్తుకునే ఉత్సాహాలు

గంగా జమునా తహజీబ్ భావన తరహాలు

క్రిస్మస్ కానుకలు న్యూ ఇయర్ సంబరాలు

పడిపడి చెప్పుకునే విశాలహృదయ విషెస్ లు

తిలకించు మహాత్మా సమసమాజ నిర్మాతా

పులకించు మహాశయా రాజ్యాంగ నిర్ణేతా


3.దైవాల దూషణలు పురాణాల హేళనలు

అవకాశం అంటుఉంటే అంతానికె సవాళ్ళు

బలవంతపు మార్పిడులు వింతైన ప్రచారాలు

ఇతరులెవరు ఇలలోనే కూడదనే బోధనలు

అనైక్యతే బలహీనత సనాతన ఉదాసీనత

అంతరించు దిశగా నిర్వేదగా అనాథగా ధార్మికత

ఉద్భవించు మహాత్మా సమసమాజ నిర్మాతా

శాసించు మహాశయా శాసన నిర్ణేతా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఇదేనా నీ దయాపరత్వము

ఇదేనా భక్తపరాయణత్వము

ఇదేనా భోళాశంకర తత్వము

ఇదేనా జగతఃపితరః ఔచిత్యము

శివా నీ లీలలు అవగతమే కావా

భవా నీ మహిమల అనుభవమీవా


1.ధర్మపత్ని నిచ్చావట ఆత్మలింగ మొసగావట

పాశుపతాస్త్రమునే పార్థుకు ప్రసాదించావట

గరళము మ్రింగావట గంగను దాల్చావట

గజాసురుని కడుపులో వాసమున్నావట

కోరనైతి నేను గొంతెమ్మ కోరికలు

వైద్యనాథ మాకీయి ఆయురారోగ్యములు


2.చిరంజీవిగా మార్కండేయుని జేసి

సిరియాళుని సైతం పునర్జీవింపజేసి

 కరినాగులు సాలీడుకు సాయుజ్యమిచ్చేసి

కన్నిచ్చిన తిన్ననికీ కైవల్యము నందజేసి

వినోదింతువేలమమ్ము వెతల పాలబడవేసి

ఆనందమునొందేవా దేవా మా బ్రతుకులు బుగ్గిచేసి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కూలగొట్టితేనేం ఎవరిదో ఒక దేవళం

కాలబెట్టితేనేం ఏదైనా అది దైవ విగ్రహం

కొల్లగొట్టితేనేం మనదైన దేశ సంపద

తలబెట్టితేనేం సాటివారి బ్రతుకులకాపద

మౌనమే సర్వదా మా విధానం

సహనమే మాకు సాంప్రదాయం


1.తురుష్కులానాడు శిథిలపరచలేదా

మొగలాయిలు సైతం మంటబెట్టలేదా

ఆంగ్లేయులు మన సంస్కృతిని మట్టుబెట్టలేదా

అరచేత బెల్లం పెట్టి మతమంటగట్టలేదా

అనైక్యతే కదా మా బలహీనత

నైరాశ్యమే సదా మా అశక్తత


2.కులలా పేరిట నశింపచేస్తాం బలాలు బలగాలు

మతాల పేరిట బలిచేస్తాం ప్రేమ మానవత్వాలు

మత గ్రంథం బోధిస్తుందా ప్రవక్తనే ప్రవచిస్తాడా

లౌకికత్వ దేశంలో అమానవీయ కృత్యాలు

సామాజిక దురాచారమే మా అపచారం

జాతీయభావన కొఱవడుటే మా గ్రహచారంP

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆనందం వర్షించనీ

అనుదినమూ హర్షించనీ

అందరిలో మానవత్వం దర్శించనీ

అనురాగం ఎద ఎదనూ స్పర్శించనీ

శుభోదయం శుభోదయం నేస్తమా

మహోదయం జగానికవనీ మిత్రమా


1.వ్యక్తిత్వం యుక్తమై వికసించనీ

సమానత్వం మానవాళిలో వ్యాపించనీ

స్నేహతత్వం జీవితాంతం ప్రభవించనీ

దాంపత్యం అన్యోన్యమై పరిమళించనీ

శుభోదయం శుభోదయం నేస్తమా

మహోదయం జగానికవనీ మిత్రమా


2.జాతీయతే పౌరులలో పెల్లుబుకనీ

సమైక్యతా రాగమే నినదించనీ

లౌకికతత్వం దేశమంతా వెల్లివిరియనీ

విశ్వైకభావన ప్రపంచమంతా పరిఢవిల్లనీ

శుభోదయం శుభోదయం నేస్తమా

మహోదయం జగానికవనీ మిత్రమా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వచ్చెటప్పుడేం తెచ్చామని

కొనిపోవడం జరగని పని

పదవులు పేరు ప్రతిష్ఠలన్నీ

ఊరువాడ ఇల్లు పట్టులన్నీ

ఉన్నదంతా వదిలివెళ్ళడమే

కన్నవాళ్ళనైన విడిచి పోవడమే


1.పోగుచేసుకున్న సంపదనంతా

కూడబెట్టుకున్న ఆస్తిపాస్తి అంతా

నూలుపోగైనా మేనలేకుండా

పుట్టినప్పుడున్నట్టి వైనంగ

తెలియని ఏవేవొ దారులగుండా

మరలిరాలేని లోకాలె గమ్యంగా

ఉన్నదంతా వదిలివెళ్ళడమే

కన్నవాళ్ళను విడిచి పోవడమే


2.బొందిలొ ప్రాణం ఉన్నంత వరకే

నా తల్లి నా చెల్లి నా నాన్న నా అన్న

చివరి నిద్దుర పోనంత వరకే

నా భర్త నా భార్య నా కొడుకు నా బిడ్డ

బంధాలన్నీ వట్టి నీటి మూటలే

బతుకు నాటకాన ఆడేటి పాత్రలే

ఉన్నదంతా వదిలివెళ్ళడమే

కన్నవాళ్ళను విడిచి పోవడమే


(ముఖ్యంగా ఘంటసాల భగవద్గీత అంతిమ యాత్రా గీతంగా పరిణమించడాన్ని నిరసిస్తూ- తగిన  ఓ పది వరకు గీతాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో )

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఊహలేవొ రేపెను ఉదయాన్నే

ఊదారంగు రంజిల్లి నా హృదయన్నే

మంజుల రవళులె వీనుల విందుగ

మదివీణియ అనురాగము చిందగ


1.తెలుపు తెలుపు శాంతి సహనాన్నీ

నలుపు నలుపు జీవితాన ఉత్సాహాన్ని

ఎరుపు అరుపు జాగృతించు ఉద్యమాన్ని

పసుపు చూపు సంస్కృతి సాంప్రదాయాన్ని


2.హరితమే జగతికి నవ చేతనము

నీలమే నింగికి ఘన ఆఛ్ఛాదనము

నారింజ వర్ణమే త్యాగనిరతి కేతనము

హరివిల్లు అందాలతొ అలరారు జీవనము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఖజురహో శిల్ప భంగిమలే

ఆంధ్రభోజు కావ్య వర్ణనలే

ప్రతి రాతిరి రతి పాఠాలై

దంపతులే మొండి ఘటాలై

సాగుతుంది పోటీ గెలుపుకోసం

ఓడిపోయినాగాని అధర దరహాసం


1. ఎలనాగ ఒళ్ళే ఎక్కిడిన హరివిల్లు

నారి నారి సారించ  రసన నా'రసముల్లు

ఎక్కడో తాకుతుంటే ఎదలొ సరస జల్లు

గుట్టు వీడిపోతుంటే మేనుమేనంత ఝల్లు

సాగుతుంది పోటీ గెలుపుకోసం

ఓడిపోయినాగాని అధర దరహాసం


2.వలకాని పరవళ్ళు అలవికాని తిరునాళ్ళు

ఊపిరాడనీయని ఉద్వేగ బిగికౌగిళ్ళు 

తట్టుకోనంతగా చుంబనాల వడగళ్ళు

తనువుల సంగమాన స్వర్గాల లోగిళ్ళు

సాగుతుంది పోటీ గెలుపుకోసం

ఓడిపోయినాగాని అధర దరహాసం



శ్రీనివాస హే మురహరి  గోవింద 

వేంకటేశ మాం పాహి ముకుందా

చిద్విలాస వదనారవింద

చిన్మయానంద నమో భక్తవరద


1.మా దుఃఖాల అభిషేకాలు

నిందలే అష్టోత్తరాలు

ఆవేదనలన్నీ నివేదనలు

నిరసన జ్వాలలు హారతులు

నీకే సమర్పితం నీ ఈ ప్రసాదాలు

ఎంతకూ ఒడవని మా విషాదాలు


2.నిత్యం గొడవలు నీ భజనలు

మా నిట్టూర్పులె స్తోత్రాలు

మా మొరలే నీకై కీర్తనలు

చావో రేవో మా ప్రార్థనలు

నీకే అంకితం మా జీవితాలు

కొఱవడిపోయిన సంతసాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిను చూసిన వెంటనె రెప్పలల్లార్చి

కలయా నిజమాయని ఒంటిని గిచ్చి

తెప్పరిల్లి మళ్ళీమళ్ళీ మైకం వచ్చి

గుండె ఆగిపోయింది ఒక్కక్షణం నువు పిచ్చిగ నచ్చి

పొగడలేక తడబడుతున్నానే ఓ అప్సరస

కవులెవ్వరు కాంచి ఉండరు నీఅంతటి మిసమిస


1.పాతబడ్డ ఉపమానం చంద్రవదనం

 రివాజైన ఉత్ప్రేక్షే హరిణి వీక్షణం

నీ రూపానికి ఇలలోలేదు తగిన రూపకం 

నీవే విరహాగ్నికి ప్రేరేపకం ఆ అగ్నిమాపకం

పొగడలేక తడబడుతున్నానే ఓ అప్సరస

కవులెవ్వరు కాంచి ఉండరు నీఅంతటి మిసమిస


2. నా అపూర్వ నాయిక వీవే  ఓ అవంతిక

నీవేలే  నన్నలరించెడి మనోజ్ఞ గీతిక

కరకరలాడుతు నోరూరించే కమ్మని జంతిక

నిను ఆరాధించుట ఒక్కటే నావంతిక

పొగడలేక తడబడుతున్నానే ఓ అప్సరస

కవులెవ్వరు కాంచి ఉండరు నీఅంతటి మిసమిస

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


జాగో జాగో సాహెబా

నీకున్న ఈ ఈగో సబబా

అడ్జస్ట్ మెంట్ లేక స్టంట్లు

ఫ్యూచర్ని ఏమరచి జడ్జ్ మెంట్లు


1.తొలి అడుగే తప్పటడుగు

బ్రతుకు కన్నీటి మడగు

కార్తీకదీపాలు కంటికి వెలుగు

భరోసాకు డౌటేలా భవితకు


2.చక్కని జీవితాన్ని అక్కున జేర్చుకో

ముళ్ళదారి వదిలేసి రాదారిని ఎంచుకో

ఆచితూచి అడుగేసి అనుకున్నది సాధించు

గతం మరచి హితం నేర్చి ఆనందించు



https://youtu.be/32DqXvk7WgU?si=t3EmLl-GMUMNaOWt

 "హాప్పీ(?) న్యూ ఇయర్"


నిరుటికి నేడే చెప్పేసెయ్ బై బై

కొత్తేడాదిని ఇప్పుడే ఇన్వైట్ చెయ్

నిన్నటి చేదు అనుభవాలకు సమాధికట్టేసెయ్

రేపటి కమ్మటి ఊహలనే మొదలెట్టేసెయ్

ఫ్రష్ట్రేషన్ ఉంటేగింటే పక్కకి నెట్టేసెయ్

అనుక్షణం ఎంజాయ్ కే ఫస్ట్ ఓటేసెయ్

హాప్పీ న్యూ ఇయర్ బాసూ

పెంచేసెయ్ ఉత్సాహం డోసూ


1.కరోనా కాటు వేయ నందుకూ సంతోషించు

చలానా దాట వేసి నందుకూ ఆనందించు

పరీక్షలే లేకుండా పదిపాసైనందుకు నీకూ నాకు హైఫై

వర్క్ ఫ్రం హోమైనందుకు వైఫ్ కు నాకూ వైఫై

ఫ్రష్ట్రేషన్ ఉంటేగింటే పక్కకి నెట్టేసెయ్

అనుక్షణం ఎంజాయ్ కే ఫస్ట్ ఓటేసెయ్

హాప్పీ న్యూ ఇయర్ బాసూ

పెంచేసెయ్ ఉత్సాహం డోసూ


2.ఓటీటీలో నీటుగా ఘాటైన మూవీలెన్నోచూసేసాం

ఇంటిపట్టున ఉంటూ వండుకుంటూ తింటూ వొళ్ళు పెంచేసాం

ఆన్లైన్లోనే అనవరతం గడిపేస్తూ బ్రతికేసాం

డబ్బుకన్నా సబ్బే గ్రేటని ఏడాదంతా కడిగేసాం

ఫ్రష్ట్రేషన్ ఉంటేగింటే పక్కకి నెట్టేసెయ్

అనుక్షణం ఎంజాయ్ కే ఫస్ట్ ఓటేసెయ్

హాప్పీ న్యూ ఇయర్ బాసూ

పెంచేసెయ్ ఉత్సాహం డోసూ


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:హిందుస్తాన్ భైరవి


నీ దయా భిక్షనే తల్లీ నా కవిత్వము

పూర్వపుణ్య సమీక్షయే నా సారస్వతము

శ్రీ వాణీ వేదాగ్రణి పారాయణీ భగవతి

హే భారతి బ్రహ్మసతీ నాకీవే శరణాగతి


1.నీవల్ల నీచేత నీకొఱకే నా గీతా మకరందము

నావి అనుకొనేవన్నీ నీవై అవతరించు చందము

వినితీరాలి కల్పించగ కవితకు పరమార్థము

కవిని ఆదరించకుంటె నీవైనా  బ్రతుకే వ్యర్థము

శ్రీ వాణీ వేదాగ్రణి పారాయణీ భగవతి

హే భారతి బ్రహ్మసతీ నాకీవే శరణాగతి


2.సరసత యున్నచోట సమయము లేదు

సమయము కలిగియున్న సరసత లేదు

రాయలు రసరాజులు నిజ భోజుల ఆచూకి లేదు

అష్టదిగ్గజాలకు నవరత్నాలకు ఆలన పాలన లేదు

శ్రీ వాణీ వేదాగ్రణి పారాయణీ భగవతి

హే భారతి బ్రహ్మసతీ నాకీవే శరణాగతి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీవే ఒక అద్భుతము నా జీవితాన

నీ స్నేహమె ఒక వరము నా అనుభవాన

ఏదో తెలియని ఆత్మీయ బంధము

ఎద మాత్రమె ఎరిగిన పరమానందము


1.వెయ్యేనుగుల బలం కవితకు నీ ప్రోద్బలం

అలుపెరుగక సాగుతోంది అందుకే నా కలం

నీ పలుకులు ఎనలేని స్ఫూర్తికి ఆలవాలం

నీ ప్రశంసలే నా ఆర్తికి పావన గంగాజలం


2. కష్టసుఖాలు పంచుకునేవు నా ప్రాణనేస్తం

వెదకబోయిన తీగలాగ ఎదురై నువు ప్రాప్తం

ఆలోచన ఏదైనా తెలిపేవు నాకు యుక్తాయుక్తం

యుగ యుగాలు సాగేటి  మన మైత్రే అవిభక్తం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:శుభపంతువరాళి


నెత్తురు చిక్కనైతె అది దుఃఖం

ఊపిరి వెక్కుతుంటె అది దుఃఖం

ఆశలు ఎక్కువైతె అది దుఃఖం

బ్రతుకులు బిక్కుమంటె అది దుఃఖం

దుఃఖం సర్వ వ్యాపి  దుఃఖం విశ్వ రూపి

దుఃఖం మహామాయ దుఃఖం అద్వితీయ


1.హరిహరాదులెవ్వరినీ వదలలేదు దుఃఖం

రాముడికీ కృష్ణుడికీ తప్పలేదు దుఃఖం

జననంలో దుఃఖం మరణంలో దుఃఖం

జీవితాంతం వెంటాడుతు వేధిస్తూ దుఃఖం

దుఃఖం సర్వ వ్యాపి  దుఃఖం విశ్వ రూపి

దుఃఖం మహామాయ దుఃఖం అద్వితీయ


2.సంసారం కడు దుఃఖం సన్యాసం బహు దుఃఖం

కాలచక్ర భ్రమణంలో విధి  విన్యాసం పెను దుఃఖం

ప్రకృతి ప్రళయం దుఃఖం మానవ క్రౌర్యం దుఃఖం

స్వార్థం జడలువిప్పి చేసే కరాళ నృత్యం దుఃఖం

దుఃఖం సర్వ వ్యాపి  దుఃఖం విశ్వ రూపి

దుఃఖం మహామాయ దుఃఖం అద్వితీయ