Tuesday, November 29, 2022

 

https://youtu.be/Eb0iUQAqhuA?si=iRV0CNzlt5mL61xL

(3)గోదాదేవి మూడవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధన


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:మాయా మాళవగౌళ


మూడడుగులు బలిని దానమడిగినవాడు

చూడముచ్చటైన మన వామన బాలుడు

ఏడేడు లోకాల నాక్రమించి వ్యాపించినాడు

జగన్నాటక సూత్రధారి విరాట్రూపి త్రివిక్రముడు

విశ్వశ్రేయస్సు కూర్చాలి శ్రీకాంతుడు అనంతుడు


1.మార్గళి స్నానమాచరించు వ్రత ఫలమున

మూడు వానలు ఆరు పంటల సమృద్ధిగా

ఇంటింటా గోకులాన కురియనీ వాన సంపదగా

భారమైన గోపొదుగుల కారాలి పాలుధారగా

జగన్నాటక సూత్రధారి విరాట్రూపి త్రివిక్రముడు

విశ్వశ్రేయస్సు కూర్చాలి శ్రీకాంతుడు అనంతుడు


2.పచ్చదనము తో ప్రకృతి కనువిందు చేయగా

జుమ్మను తుమ్మెదలే కలువల ఎదల వాలగా

పెరిగిన పైరుల ధాన్యము అపారమై గాదెలు నిండగా

రెపల్లే బృందావనాల కావాలి అనునిత్యం పండగా

జగన్నాటక సూత్రధారి విరాట్రూపి త్రివిక్రముడు

విశ్వశ్రేయస్సు కూర్చాలి శ్రీకాంతుడు అనంతుడు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:శివరంజని


మనసు పరితపిస్తోంది నిన్ను కలవాలని

కన్ను కాంక్షపడుతోంది నిన్ను కాంచాలని…

గుండె మరిచిపోయింది లబ్ డబ్ శబ్దాన్ని

వందసార్లు స్పందిస్తోంది ప్రేయసీప్రేయసని


1.పదేపదే నీపదం ముద్దాడనీ నను మువ్వనై

అదేవిధిగ మోవినీ అలరించనీ చిరునవ్వునై

నీ ఎదలో సుస్థిర స్థానం ఇకనైనా నను పొందనీ

నీ భావ కవితల్లో నీ హాయి తలపుల్లో నను చేరనీ


2.నీ సమయం నిమిషమీయి మేనుసేవ చేస్తా

క్రీగంట  వీక్షించూ బ్రతుకు ధారపోస్తా

నీ మదిలో మెదిలానా వచ్చి ఎదుట వాలుతా

కోరుకుంటె ప్రాణాలైనా నవ్వుకుంటు వదిలేస్తా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఈ చల్లని సాయంకాలమే

చేసింది ఇంద్రజాలమే

వెలిసింది నీ సుందర రూపమే

ఇంకేది కాదది ఇంద్రచాపమే


1.గాలికి చెలరేగే నీ కురులై మేఘాలు

ముఖ సరసున  కనుల బోలి కలువలు 

నాసికా చెక్కిళ్ళుగ సంపెంగలు రోజాలు 

మురిసే అధరాలై విరిసే మందారాలు


2.గిరులు ఝరులు ప్రకృతి వనరులు

గుర్తు తెచ్చేను చెలి నీ సోయగ సిరులు

చిలుకల పలుకులు హంసల కులుకులు 

పలువన్నెలు దివిచిన్నెలు నీ కలబోతలు

Monday, November 28, 2022

 https://youtu.be/yzNyKKr7wNo?si=JCrC9Vpr6fpIopT9

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఆనంద భైరవి


మంగళ హారతిదే మాధవా

కర్పూర హారతిదే రమాధవా

జయ మంగళ హారతిదే సత్యదేవా

శుభ మంగళ హారతిగొని

శుభములు మాకీవా


1.నియమముతో ఏటేటా చేసెదము సత్య వ్రతము

నీ దయతో దూరమగును గతములోని మా దురితము

ఐదు కథలు గలిగిన నీ మహిమ మహితము

ఇహపర సాధకము స్వావి నీ దివ్యచరితము


2.ధనధాన్యాదులు కురిపించు మా ఇంట సిరులు

ఇడుములు దుఃఖములు కడతేర్చు మా బాధలు

అసత్యమే పలుకము ఆదుకొనగ స్వామీ నీవే గద

శ్రీ సత్యనారాయణ త్రికరణశుద్ధిగా నిన్నే నమ్మెద

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అద్దంలో ప్రతిబింబం అది నీ హృదయం

ఎదురుగా నిలువెత్తు చెలీ నీ సౌందర్యం

నిన్ను నీకు చూపించే నేనే నీ నిజనేస్తం

బహుజన్మల పుణ్యఫలం నాకు నీ సంప్రాప్తం


1.జీవితాన నువులేక జీవితమే కడుచేదు

నీ తోడు లేక  స్వర్గమైనా సఖీ అది ఖైదు

నీ మాట నటనయని ఊహకైనా రాదు

నీ కొరకై భరియిస్తా తెగువతొ అపవాదు


2.నీ సహచర్యముంటె నాకెంతో ధైర్యం

నీ సాంత్వన మాన్పేను నా ఎదగాయం

నీ పెదవుల మధువనిలో నిత్య వసంతం

నీ పలుకే  హాయి గొలుపు మంజుల గీతం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నోచాను నీకై ప్రణయసార వ్రతము

వేచాను విరహాన ఈ సాయంత్రము

కొలను కలువల ఎడబాటు తీరెను

గగనమున జాబిలి ఆగమనమున

అభిసారికనైతి ప్రియా నీరాకను కనరాకను

కామనము తీరక వగచితి నా మనమున


1.ప్రశాంతమైన పూవన ప్రాంతమున

ఏకాంతమే దొరికిన ఈ సమయమున

నిను వలచిన కాంతనై చింతాక్రాంతమున

వలపులు చిలుకు వన్నెల ప్రాయమున

అభిసారికనైతి ప్రియా నీరాకను కనరాకను

కామనము తీరక వగచితి నా మనమున


2.మల్లెల మాలనే వాలుజడలో తురిమి

తెల్లని చీరతో పెంపొందించగ కూరిమి

రమించగ శ్రమించగ నశించు నీ ఓరిమి

లాలించగ పాలించగ చేసుకో నను మాలిమి

అభిసారికనైతి ప్రియా నీరాకను కనరాకను

కామనము తీరక వగచితి నా మనమున

 https://youtu.be/vOEfVUTJ-VE?si=kAJpV6Ws6WQXVscf

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


సతీదేవి గతించగా చలించెగా నీమతి

పరితపించి అయితివిగా నీవొక యతి

మరలా జనియించి వరించినది మా పార్వతి

అర్ధదేహమిచ్చావని తృప్తినొందెనీ శ్రీమతి

హరా హరహరా భవహరా శివశంకరా

పరా పరాత్పరా ప్రణతులివే పరమేశ్వరా


1.గంగని సిగనిడితివి గంగాధరా

సోముని తలదాల్చివి సోమేశ్వరా

మూడుకన్నులున్న త్రయంబకేశ్వరా

నాగులే నగలు నీకు నమో నాగేశ్వరా

హరా హరహరా భవహరా శివశంకరా

పరా పరాత్పరా ప్రణతులివే పరమేశ్వరా


2.గరళము గళమునగల నీలకంఠేశ్వరా

ఉరమున విశ్వమున్న విశ్వేశ్వరా

కరమున శూలముగల రుద్రేశ్వరరా

ఢమరును మ్రోయించెడి నటేశ్వరా

హరా హరహరా భవహరా శివశంకరా

పరా పరాత్పరా ప్రణతులివే పరమేశ్వరా


3.భస్మాంగరాగా భవా రామలింగేశ్వరా

చర్మాంబరధరా  శివా రాజరాజేశ్వరా

మర్మతత్వ బోధకా శంభో మహేశ్వరా

ధర్మస్థల దీపకా శ్రీ మంజునాథేశ్వరా

హరా హరహరా భవహరా శివశంకరా

పరా పరాత్పరా ప్రణతులివే పరమేశ్వరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిండు పున్నమి నిశిలో 

వెండి వెన్నెల శశినీవే

కవన గగన తారా రాశిలో

వెలుగులీను ధృవతారవే

రెప్పలమాటున నను దాచేయగా

స్వప్నలోకాల విహరింపజేతువే హాయిగా


1.అవశ్యమై ఎదనావరించు పారవశ్యము

నీ కవితనుంది మదినేదోచేసే రహస్యము

ఆసాంతం ఆస్వాదింపజేయు బిగువే నీ సొంతం

అభిమానిగ మార్చేసే పాటవమే నీ సహజాతం


2.కవిత్వ మాధుర్యం నీకు కరతలామలకం

నీ మేని సౌందర్యం అప్సరసలకే తలమానికం

రెంటిగొప్ప తేల్చుటలో నా గుండెయె లోలకం

నచ్చుతుంది నాకెపుడూ నగవుల నీ వాలకం

 https://youtu.be/C12ZhlMd9_0?si=8l8n3svtM32hQJcX


1)గోదాదేవి తొలిపాశురగీతం-స్వేచ్ఛానువాదం

30రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధన


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:దర్బార్ కానడ


గొల్లభామలారా-రేపల్లె లేమలారా

మార్గశిర మాసమెంతొ మేలైనది

మన నందబాలునర్చించే వేళైనది

మార్గళి స్నానముకై  చనుచుంటినే నది

చెలులార ఆలకించరో మేలుకొనగ గోదా పిలుపిది


1.ఘనశ్యామ సుందరుడు నంద కిశోరుడు

డెందాలను మురిపించే బృందావిహారుడు

రవి తీక్షణుడు శశి వీక్షణుడు సర్వసులక్షణుడు

అన్యధా శరణం నాస్తి మనకు శ్రీమన్నారాయణుడు

అనవరతము తపించ శ్రీ వ్రతఫలమీయును కృష్ణుడు


2.వలువలు దాచేసే నవనీతచోరుడు

వదులుకొనే తెగువుంటే మదినే దోచువాడు

ఆనందవర్దనుడు అహంకార మర్దనుడు

జగన్మోహనాకారుడు జగదుద్ధారుడు జనార్ధనుడు

అనవరతము తపించ శ్రీ వ్రతఫలమీయును కృష్ణుడు

 

https://youtu.be/C12ZhlMd9_0?si=8l8n3svtM32hQJcX

(2)గోదాదేవి రెండవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధన


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:నీలాంబరి

(రాగ ఆధారం జంటిల్ మెన్ సినిమా పాట- నా ఇంటి ముందున్న పూదోటనడిగేనూ)


ధనుర్మాస శుభవేళ తిరుప్పావై వ్రతదీక్ష

నీమాల నాచరించ నిక్కము ఒక పరీక్ష

పురుషోత్తమ మాధవా పుండరీకాక్ష

శరణంటిమి పరిసమాప్తి చేయగ మాకీవె రక్ష


1. చేసెదము మబ్బుననే కావేటి స్నానము

సతతమూ  రంగనాథ మదిలో నీ ధ్యానము

పలికెదము గోవిందా మా నోట నీ నామము

ఆచరించెదము ఆర్తిమీర మార్గళి సిరినోము


2.కంటికి నిను అంటించి-కృష్ణా కాటుక మానేము

కమలాక్షుడ తలనిడి నిను- పూలకొప్పు ముడువము

నెయ్యిని పాలను నీనెయ్యముకై మేమారగించము

ప్రియమగు సత్యమగు నుడుగులనే నుడివెదము


3.పాలకడలి శయనించే పద్మనాభ మంగళము

విబుధవరేణ్యుల కొసగెదము విరళ దానము

సాధు సంతులకు బ్రహ్మచారులకు నిత్య సమారాధనము

క్రమతను మము నడుపగ స్వామీ నీకు వందనము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సారమతి


నిరంతరం నీగానము

అంతరాన నీధ్యానము

నీ ఎరుకయె నిజ జ్ఞానము

స్వామీ నా ఎడ ఇక వీడు మౌనము

జగన్నాథ జగదీశా జనార్ధనా శ్రీరమణా

తప్పనీకు స్వామీ నను నీ మననము


1.నీకే అంకితము ఈ ప్రాణము

ఉద్ధరించనీ ననునీ కథాశ్రవణము

మది నీవు మెదిలితివా జన్మ ధన్యము

నను గాచు దైవమేది నువువినా అనన్యము


2.నీ మీది భక్తే నాకు ప్రాధాన్యము

భవ జలధిని దాటించగ నీదే ప్రావీణ్యము

నీ మహిమలు నీలీలలు ఎంతో ప్రాచుర్యము

ఇహమున పరమున నీ అండయె నా ధైర్యము

Thursday, November 24, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:భాగీశ్వరి


నీ అభయహస్తము  దీనుల ప్రియ నేస్తము

శ్రీ వేంకటేశ నీ మహిమలు కడు ప్రాశస్త్యము

తరించె నిను సేవించి లోకాస్సమస్తము

గోవింద నీనామ సంకీర్తన కలిగించు పారవశ్యము

గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా


1.నీ దివ్య దర్శనము మహదానందము

నీ పాద తీర్థసేవనము అకాల మృత్యుహరణము

నీ శఠగోప శిరోధారణము అహంకార దమనము

నీ లడ్డూ ప్రసాద స్వీకారము ఆరోగ్యదాయనము

గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా


2.పుష్కరిణీ పుణ్య స్నానము ఘోరపాపనాశనము

తిరుమలలో గడుపు ప్రతిక్షణము మోక్ష కారకము

నీ  సన్నిధి శయనము స్వప్నసాక్షాత్కార అనుభవం

ఆపదమొక్కులవాడవంది నీ సార్థకనామధేయము

గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఊహ ఎంత మధురము

స్వప్నమే సంతోషకరము

అంతులేని స్వేచ్ఛాకాశానా

ఆనందంగా విహరించవశము

కల్పనా ప్రేయసితోను 

పదే పదే విరహించతరము

కలహించతరము కౌగిలించుకొనువరము


1.కీలు గుర్రమెక్కి ప్రియురాలితో

సప్త సాగరాలు లిప్త పాటులో దాటవచ్చు

చెలి మేను మాణిక్యవీణను

మంజుల నిక్వణ మొలుకగ మీటవచ్చు

ఆకలి దప్పుల ప్రసక్తే లేక 

ఏ ఇతరాసక్తీ లేక మనోహరితొ సల్లాప మాడవచ్చు


2.చేజారిన ప్రియసఖినీ చేరదీయవచ్చు

కోహినూరు వజ్రాన్నీ కానుక ఈయవచ్చు

భవ్యంగా రమ్యంగా నవ్యంగా జీవించవచ్చు

సవ్యంగా దివ్యంగా హృద్యంగా భావించవచ్చు

కాలమున్నంత కాలం  కాపురం చేయవచ్చు

కలలే చెదరనంత సమయం కలిసిఉండవచ్చు

Wednesday, November 23, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్భార్ కానడ 


ఎక్కడి నుండి వచ్చావో

ఎందుకు షిరిడీ చేరావో

పన్నాగాలే పన్నావో

కుయుక్తులే యోగించావో

సాయీ బాబా అంటూ పిలుచుకున్నాము

సాయం చేస్తావంటూ నమ్ముకున్నాము

జైజై సాయిబాబా జయహో సాయిబాబా


1.గుండెలో గుడి కట్టాము

బ్రతుకే హారతి పట్టాము

ఆప్తునిగా జమ కట్టాము

గురువుగ నిను చేపట్టాము

వంచించిన దాఖలా ఒక్కటి లేదు

ఒక్కరినీ ముంచావన్న మాటేలేదు

అవధూత నీవే సాయి సద్గురునాథా సాయీ


2.తెలిపిన యోగం మరిచాము

అభియోగాలే మోపాము

మానవతకు నిజరూపం నీవు

విశ్వప్రేమకు నిదర్శనం నీవు

నిను నమ్మితే నిందలెన్నొ వేస్తున్నాము

నువ్వో దోషిగా ప్రచారం చేస్తున్నాము

క్షమియించవయ్యా సాయి దయయుంచు బాబా మాపై

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


ఎన్నెన్ని భావాలో ఎన్ని అనుభవాలో…

కలములో గళములో ఎన్ని హ్లాద సంభవాలో

ఎంత మార్చుకోవాలో ఎలా చేర్చుకోవాలో

మూణ్ణాళ్ళ ముచ్చట బ్రతుకైనా ఎన్నికూర్చుకోవాలో


1.నిబిడీకృతమై మనలో ఎన్ని పాటవాలో

వెల్లడైన వేళలలో ప్రభవించు నెన్ని ప్రాభవాలో

సాధించుటకై అకుంఠిత సాధన ఎంత కావాలో

లక్ష్యాన్ని చేరుటకొరకై ఎంతగా పరితపించి పోవాలో


2.పరికించి చూస్తే ప్రకృతిలో ఎన్నెన్ని రావాలో

అనుభూతులు కలగలిసి ఎలా ఎదనుండి రావాలో

తన్మయమే చెంది ఆలపించు గానం పికముకే సవాలో

నిరూపించు మిత్రమా నీ గాత్రం నా ఆత్రం ఊహలో వాస్తవాలో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తొలి సంధ్యవు నీవై

పొడసూపావు నా డెందమందు

అందాల రాశివి నీవై

నేడు చేసావు నాకు కనువిందు

నా హృదయరాణీ రస గీతపు బాణీ

అలివేణీ విరిబోణీ మధు మంజులవాణీ


1.నా సౌందర్య దేవతా నీ ఆరాధకులెందరో

నిను నిత్యం సేవించే నిజమైన దాసుడనేను

నను కరుణించకుంటె నరకమే నాదవును

నను కానక కాదంటే చెలీ బ్రతుకే చేదవును


నా హృదయరాణీ రస గీతపు బాణీ

అలివేణీ విరిబోణీ మధు మంజులవాణీ


2.నీపదముల మంజీరమై మనినను చాలు

నీ ఎదపై మాంగల్యమవగ నను మనువాడితే జేజేలు

నిన్నంటుకొనుటుకై నన్నవనీ నీ చెవి జూకాలు

ఏదీ కూడదంటె నా తనువిపుడే చితిలో కాలు


నా హృదయరాణీ రస గీతపు బాణీ

అలివేణీ విరిబోణీ మధు మంజులవాణీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చక్రవాకం


మంగళాకారా మంగళ మూరితీ

సర్వమంగళకరా మా కొండగట్టు మారుతీ

ప్రసన్నాంజనేయా నీకు ప్రణతి ప్రణతి ప్రణతి

శ్రీరామదాస ప్రముఖా నీవే నాకిక శరణాగతి


1.సర్వమంగళ మహిజ సీతమ్మకు 

ముదము కూర్చిన హితుడవు ప్రియ సుతుడవు

మంగళాంగుడు మహితుడా రామయ్యకు

జయము కూర్చిన హనుమవు ఆత్మసముడవు

భజియించేను నిజ మనము తోను భజరంగభళీ

భుజియించు స్వామీ అర్పించినాను చక్కెర కేళీ


2.మంగళ వారము ప్రాశస్త్యము నీకు

అంగరంగ వైభవాలే ఇలలో నీ ప్రతి కోవెలకు

అభిషేకం ఆకుపూజ జిల్లేడుమాలలు నీకు

ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందమీయి ఆంజనేయ మాకు

జితేంద్రియా చిరంజీవ అందుకో వందనాలు

నీ కరుణా కటాక్షాలు ఇహపర వరదానాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఆనంద భైరవి


మంత్రముగ్ధవే మహా దేవీ

మనోజ్ఞవే రసజ్ఞవే ఆనంద భైరవీ

సౌందర్య లహరివే మనోహరీ భార్గవీ

సత్య శివ సుందరివే  మాతా శాంభవీ

సరగున దయగనవే సహృదయవు గదనే


1.నినుచూసిన నిమిషాన అనిమేషుడనై

 నిను తలచిన నిశీధిన నిద్రా దూరుడనై

నిరంతరం అంతరాన నీధ్యాన మగ్నుడనై

నీ సన్నధినే కోరుకునే విరహాగ్ని దగ్ధుడనై

సరగున దయగనవే సహృదయవు గదనే


2.సకల కళా స్వరూపిణిగా కళాకారిణిగా

తనువులో సగమైన హరుని తరుణిగా

కలి కల్మష నాశినిగా దురిత నివారిణిగా

శ్రీవాణిగా మణిద్వీప మహరాణిగా శర్వాణిగా

సరగున దయగనవే సహృదయవు గదనే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సిందు భైరవి


ముడివడె ఏడను అంకెతో

నడమంత్రపు  ఈ నరుని బ్రతుకు

ఏడేడు పదునాల్గు లోకాల నేలేటి

వేంకట పతి వందనాలు నీ పదములకు


1.సప్త చక్రాలతో సమన్వితమాయె దేహము

సప్త ధాతువులతో నిర్మితమైనదీ కాయము

సప్త దుర్వ్యసనాలకు ఇది ఆలవాలము

సప్త ఋషుల దీవెనతో అందనీ నీ పదయుగళము


2.సప్తపదే ఆదిగా సాగుతుంది దాంపత్య ప్రగతి

సప్తవర్ణ సమ్మోహితమై చెలఁగేను చంచల మతి

సప్తస్వర సహితమై ఆలపించెదనూ నీ సత్కృతి

సప్త గిరీశా నిర్వృతికై నమ్మిచేసితి స్వామీ వినతి

https://youtu.be/aZz1sBXkvTw?si=70Ps2u0lEk_MW4i5

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ద్విజావంతి


ఆలిని చేపట్టుడే-అర్ద దేహమిచ్చుడే

ఏమీ పట్టనట్టు-మూతికి బట్ట కట్టుడే

హరుడవు నీకు నరుడను నాకు

ఎలా చూసినా మనదొకటే బ్రతుకు

భోలాశంకరా మనకిది చచ్చే చావు కదరా

కడుపు చించుకుంటే పడేది కాళ్ళమీదేరా


1.అన్నీఉన్నా ఏమీ లేనోళ్ళం

ఏది లేనే లేదనీ చెప్పలేనోళ్ళం

మాటిమాటికీ వెయ్యాలి నోటికి తాళం

మాట మాటకీ ఔనంటు తలనూపే గంగిరెద్దులం

భోలాశంకరా మనకిది చచ్చే చావు కదరా

కడుపు చించుకుంటే పడేది కాళ్ళమీదేరా


2.బిచ్చమెత్తైనా గ్రాసం కూర్చాలి

నెత్తినెత్తి బిందెళ్తో నీళ్ళు తేవాలి

తోలును మొలకు చుట్టుకొని పట్టుచీర లివ్వాలి

నాగుల మెడలొ వేసుకొనైనా నగల్నీ కొని ఇవ్వాలి

భోలాశంకరా మనకిది చచ్చే చావు కదరా

కడుపు చించుకుంటే పడేది కాళ్ళమీదేరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:పట్ దీప్


నెలపొడుగునా వెలిగేను నా చెలి

నెలపొడుపై కళలుడిగేను జాబిలి

ఉషోదయ తుషారం నా చెలి సోయగం

వసంత సమీరం నా చెలి అనురాగం


1.పెదవంచులోనా మెరిసేను కెంపులు

పదిలంగా నవ్వినా సొట్టలౌ చెంపలు

చూపులో చూపు కలిపామా వాలనే వాలవు రెప్పలు

ఆపసోపాలు పడినా చెప్పవశమా తన ఒప్పు గొప్పలు


2.ఒక జన్మ చాలదు చెలి మోము వర్ణనకు

పాదాక్రాంత మవ్వొచ్చు తన మోవి చుంబనకు

ముట్టుకుంటె మాసిపోయే ధవళ చర్మ సౌందర్యం

పలుకువింటే పరవశమొందే దివ్య గాత్ర మాధుర్యం

 

https://youtu.be/zPZv2se6Fmc?si=Xz3x5aI9D3kDuoqs

రచన .స్వరకల్పన&గానం:డా.రాఖీ


అజాగళ స్తనాలైనాయి  దైవమిచ్చిన పాటవాలు

దున్నపోతు మీద వాన చినుకులై హితవచనాలు

సార్థకత చేకూరాలి మహోన్నత మానవ జన్మకు

ప్రతిక్షణం వినియోగపరచాలి ఆనంద మందేందుకు


1.ఎవరూ  తోడురారు ఇది  మహాప్రస్థానం

ఏది వెంటరాదు ఐనా ఆగదు ఈ గమనం

వదిలేయటమే అలవాటై సాగిపోవాలి మనం

చరిత్రలో నిలిచిపోవడం ఉత్కృష్ట కామనం


2.ఎంతగా కోరుకుంటే అంతదూరం కోరిక

మనదంటూ లేకుంటే బ్రతుకుంతా హాయిక

నీతో నీవు గడపడానికి చేసుకో క్షణం తీరిక

తెలిసి అడుసు తొక్కడమే నరలోకం తీరిక

Friday, November 18, 2022

 

https://youtu.be/_xNBxT9BET0?si=GIuY_sKvN6318vKn

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మోహన


శ్రీ నివాసం నీ హృదయాన

నీ నివాసం మా హృదయాన

నీవుండేది తిరుపతి కొండనా

బండబారిన మా గుండెనా

తండ్రీ వేంకటేశ భక్తపోషా

కృపా విశేషా శ్రీశా సర్వేశా


1.నవ్వే… బ్రతుకు బండికి

నొగలే విరిచేస్తావు,చక్రపు శీలను తీసేస్తావు

ప్రశాంత సరోవరాన

అశాంతి రేపుతావు అలజడి సృష్టిస్తావు

అర్థం పర్థం ఉంటే గింటే నీకే తెలియాలి

చీకూ చింతా మాకంటించి నీవే మురియాలి


2.మా మానాన మమ్మెపుడూ

మననీయ వేలనో పడద్రోసెద వేవేళనో

విషాదాలనే కుమ్మరించి

వినోదింతువేలనో విపరీతమతి యేలనో

ఇస్తే గిస్తే చచ్చేదాకా హాయిగా ఉండే వరమివ్వు

ఇహము పరము నీ చేరువకే మము చేరనివ్వు

 రచన,స్వరకల్పన&గానం:డా. రాఖీ


సోకేను చందన గంధం నీవున్న తావులో

తాకేను దవన సుగంధం నీమేను రేవులో

చెలీ సఖీ ప్రియా పారిజాత పరిమళమే నీ నగవులో

మనోహరీ  ప్రేయసీ గులాబీ గుభాళింపే నీ కురులలో

మత్తేదొ కలిగించి గమ్మతు చేస్తుంది

మనసు వశ పరచుకొని ననుచిత్తు చేస్తుంది


1.చీకటిలో దాక్కున్నా పట్టిస్తుంది

 నీ ఒంటి నంటుకున్న ఘుమఘుమ వాసన

నీరాకను సైతం తెలుపుతుంది 

దవ్వున నువ్వున్నా మొగిలి తావి నీ తనువున

మత్తేదొ కలిగించి గమ్మతు చేస్తుంది

మనసు వశ పరచుకొని ననుచిత్తు చేస్తుంది


2.మోహాన్ని కలిగిస్తుంది

నీ దేహం వెదజల్లే  కస్తూరి సౌరభం

మైకంలో ముంచేస్తుంది

నీ మెడవంపు విరజిమ్మే జవ్వాజి పరివాసం

మత్తేదొ కలిగించి గమ్మతు చేస్తుంది

మనసు వశ పరచుకొని ననుచిత్తు చేస్తుంది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రేపంటూ ఉంటుందో ఉండదో

మనమంటూ ఉంటామో ఉండమో

ఉన్నంత సేపే ఈ ఆపసోపాలు

చేజారిపోయిందా మేనే బుగ్గిపాలు

స్నేహించుదాం ప్రేమించుదాం

మమతనే పంచుదాం

స్పందించుదాం నందించుదాం

నవ్వుతూ జీవించుదాం


1.సేకరించుతూనే బ్రతుకంతా తేనెటీగలౌతున్నాం

అనుభవించు వేళసైతం ఆర్జనకే తగలేస్తున్నాం

వినోదించలేక ప్రతినిమిషం వ్యర్థంగా గడిపేస్తున్నాం

విలువైన కాలాన్నీ వృధాగా వెళ్ళ బుచ్చుతున్నాం

ఆటల్ని ఆడుదాం పాటల్ని పాడుదాం

సరదా సరదాగా ఉందాం


2.తిరిగి కోరితే సాధ్యం కాదు గతం గతః

భవిష్యత్తుకు రూపులేదు ఎండమావి తరహా

మంచి తరుణం రానేరాదు ఈ క్షణం మినహా

ఆహ్లాద భరితంగా జీవిద్దాం పదిమందితో సహా


తరియించుదాం మనం తరియింజేద్దాం

అంతరాలనే అంతరింపజేద్దాం

 

https://youtu.be/BjwlVDRePYI?si=EqjCFiFe2G3uLCzn

రచన,స్వరకల్పన&గానం:డారాఖీ


చేసిన బాసలు ఆడిన ఊసులు 

రేపిన ఆశలు అడియాసలాయే

ఉసూరని ఉత్సాహమే నీరసమాయే

ఉవ్విళ్ళూరే ఉబలాటమే కరిగి కన్నీరాయే


1.గోరంత ఔనంటే కొండంత సంబరమాయే

మనసే స్వేచ్ఛగ ఎగిరిన పావురమాయే

నీ వాలకం నాకెపుడూ ఓ మహామాయే

చెప్పిన మాట తప్పగ అంతలోనే ఏమాయే


2.చిన్న చిన్న ఆనందాలు నీ వల్లే నీవల్లే

చింతల చీకట్లకైతే నీ నవ్వులు వెన్నెల్లే

ఊపిరులున్నంతదాకా నాకూరట నీవేలే

తేలికగా నను తీసుకోకు నా ప్రాణం నీవేలే

Wednesday, November 16, 2022

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రెక్కలు పుట్టుకొస్తాయి నువు నను రమ్మంటే

గాలి బేలి పోతుంది నీముందు వాలుతుంటే

గుండె వేగం హెచ్చుతుంది నిన్ను చేరుతుంటే

మనసే మయూరమౌతుంది నిన్ను కంటుంటే


1.నా గురించి సమయమిస్తివా మది పరవశమే

హృదయాన చోటిస్తేనో తనువంతా పులకరమే

నీ స్పర్శ పలకరిస్తే రేతిరంతా పలవరమే

నాదానిగ నిను తలపోస్తే కల'యిక ఒక వరమే


2.గులాబీ వన్నె చీరనై నీమేనున తళుకులీననీ

నను నును బుగ్గల ముద్దాడే ముంగురులనై తారాడనీ

నీ పదముల మంజీర మంజుల నాదమునవనీ

పలుచని నీ పెదవుల చిరునగవునై నను మననీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


స్మరామ్యహం భజామ్యహం 

భావయామి తవనామం నిరంతరం

నమామ్యహం వదామ్యహం

భారతీం తవపాద పంకజం మాతరం


1.కృపాజలనిధీం హృదయ సుధాంబుధీం

కవిగాయక వరదాయినీం కరుణాపయోనిధీం

మేధావినీం వేదస్వరూపిణీం పారాయిణీం

సదావీణావాదన ప్రియం వందే వాగ్రూపిణీం


2.బ్రహ్మ రసనాగ్రవాసినీం దేవీం  సుహాసినీం

మాలా పుస్తక ధారిణీం శ్రీ వాణీం సనాతనీం

అజ్ఞాన కృత దోష నివారిణీం జ్ఞానదాయినీం

సర్వార్థ సాధకే శారదే పరవిద్యా సంధాయినీం

Tuesday, November 15, 2022

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


మౌనమా నీ సమాధానం 

గానమేగా మనకు ప్రాణం

నిన్ను గిల్లు తుంటుం దేంటే నా కవితల్లా

నన్నల్లు కుంటుం దేంటే నీ మమత నను లతలా

రాగమే యోగమై కడతేరనీ

భావమే సంభవమై దనివారనీ


1.అనురాగం పలికేదీ భవరోగం బాపేదీ

ఏరాగమైనా రసయోగమౌను

ఎద లయనే తెలిపేది సుధలనే చిలికేదీ

ఏ భావమైనా ఆత్మీయమౌను

రాగమే యోగమై కడతేరనీ

భావమే సంభవమై దనివారనీ


2.మరోజన్మకోసమై మూటగట్టు మరులన్నీ

ఉగ్గబట్టుకొంటాను నిన్నుపొందగా

సంగమించు తరుణంకై ముడుపుగట్టు సిరులన్నీ

మొక్కుదీర్చుకొంటాను  నీ పొందుగా

రాగమే యోగమై కడతేరనీ

భావమే సంభవమై దనివారనీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంత చక్కనమ్మ ఈ చిట్టి గుమ్మ

ఏ పోలికకూ చిక్కనిదోయమ్మ

ఎంతగ ముద్దొస్తోందో ఈ జిలుగు చుక్క

పెట్టరో అమ్మలాల తన బుగ్గన దిష్టిచుక్క


1.తీరైన పొడవాటి పూలజడ

మెడలో మేలిమి ముత్యాల దండ

పట్టుపరికిణీకే సోకు ఈ పసిడికొండ

అద్దమే మెచ్చి అందానికి సాగిల పడ


2.పాపిటి బిళ్ళే చేస్తోంది గారళ్ళు

చారెడేసి కళ్ళు పున్నమి జాబిళ్ళు

ముక్కున ముక్కెరతో చూపెలా మళ్ళు

నవ్వీనవ్వని పెదవుల మురిపాలు తుళ్ళు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందరికీ అభిమాన దేవతవు

ఎల్లరకూ నువు యోగమాతవు

నీవలన మాకు చెప్పలేని గౌరవం

మావద్ద నీవుంటే బ్రతుకంతా ధైర్యం

ధనలక్ష్మీ మాపై దయగనవే ఎప్పుడు

నినదించనీ మాయింట ఘల్ ఘల్లను నీ గజ్జెల చప్పుడు


1.కుబేరుడైనా సరే నీకు దాసుడు

నీవులేక మనగలడా మా శ్రీనివాసుడు

పద్మపత్రాయతాక్షి పద్మావతి అవతారిణి

కొల్హాపూరు లోన విలసిల్లే సంపద సామ్రాజ్ఞి


2.నీ కనుసన్నలలోనే కదలాడును ప్రపంచం

నిర్లక్ష్యం చేసామంటే కలనైనా నినుకాంచం

కాంచనము ద్రవ్యము మాగాణము నీవుగా భావిస్తాం

కుల మత ప్రాంతాలేవైనా నిను మాత్రం పూజిస్తాం


 అతివృష్టి అనావృష్టి ఏదైనా నీ సృష్టి

శీతకన్నువేసిందా మాపై శివా నీ దృష్టి

దుందుడుకు వరుణుడిని చేయవేమి కట్టడి

క్రమబద్ధత నెలకొల్పి కరుణజూపు పదపడి



1.అమర్ నాథ్ కేదార్ నాథ్ క్రేత్రాలలో వరదల విలయం

దర్శించగ నేరమా హర హరా 

నీ పావన నిలయం

అతలాకుతలమాయే భక్తజనుల సముదాయం

ఇడుములు ఇక్కట్లా నిను నమ్మితే ఇదేమి న్యాయం


2.నింగికి చిల్లుబడిన చందాన కుండపోతగా ఉధృత వర్షం

దిక్కూ దెస తెలియకా పిల్లలూ వృద్ధుల వ్యధాభరిత దైన్యం

మరణాలతొ అనాథలై అమాయకుల బ్రతుకులు శూన్యం

గంగాధరా కురిపించు అభాగ్యులందు అపారమౌ హర్షం


Monday, November 14, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏ అర్థం తీసుకున్నా  కోమలమే నీ గాత్రం

ఎలా పరిగణించినా  ఆహ్లాదమె నీ హాసం

నడకల జలపాతానివి పలుకుల పారిజాతానివి

మొత్తంగా నువ్వే ఇంద్రజాలనివి

చిత్తాన్నేదో చేసే  వర్ణ చిత్రానివి


1.కేంద్రకాన సాంధ్రమైన సూర్య గోళానివి

 గ్రహగతుల గతిపట్టించే గుండెల కళ్ళానివి

మతికి స్థిమితం దూరంచేసే గందరగోళానివి

బ్రతుకు నతలాకుతలం చేసే వేళాకోళానివి

మొత్తంగా నువ్వే ఇంద్రజాలనివి

చిత్తాన్నేదో చేసే  వర్ణ చిత్రానివి


2.తళుకులీను తారలైనా నీ చంద్రకళా ప్రీతులు

కలలుకనే చకోరాలూ తనూ చంద్రికా తప్తులు

కార్తీక  కౌముది నీ కౌగిలికీ కారు యతులతీతులు

ఆ రతీ భారతీ నీతో తులతూగక ఎత్తారు చేతులు

మొత్తంగా నువ్వే ఇంద్రజాలనివి

చిత్తాన్నేదో చేసే  వర్ణ చిత్రానివి


https://youtu.be/mCa3FvJYdME?si=Bdx10u7g5PdPq9FQ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిష్టూరమాడడం నీకు పరిపాటైంది

నిర్ఘాంతపోవడం నాకు గ్రహపాటైంది

నిరంతరం బ్రతిమాలుట పొరపాటైంది

నియతి లేని బ్రతుకు నిప్పు చెర్లాటైంది నగుబాటైంది


1.నేను నీకు ఎంతో ప్రత్యేకం 

 కాలేను నేను గుంపులో గోవిందం

నాకైతె లోకానా నువ్వే ఏకైకం

నేనుమాత్రమే నీకనుకుంటే ఆనందం

నీ పంచప్రాణాలు నేనైపోవాలి

నే పంచభూతాలై నీలో కలవాలి


2.నిర్లిప్తత నేమాత్రం నే సైచను

తారస పడితేనే నేస్తమంటే నేనోపను

తళుక్కున మెరవాలి శ్వాస నడుమ నేను

చెలీ ఒదిగిపోవాలి నీ ఎద లయగానూ

భావుకతను పలుచన చేస్తే ఎలా వేగను

నీవంటూ బ్రతుకున లేక ఎలా బ్రతుకను

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మాయామాళవ గౌళ


తందానాలాడే సుందరయ్యా

చిందులేసే తిక్క శంకరయ్యా

అంగలార్చినా తొంగిచూడవు

ఒక్కసారీ… మాదిక్కైన గానవు

మారాజువంటూ నిను నమ్ముకుంటి

మరలైన సూడవె మాదేవ ముక్కంటి


1.సొమ్ములడిగానా సోకులడిగానా

పొలములు పుట్రలు చెలకడిగానా

కమ్మన్ని గొంతుని ఇమ్మనంటిని గాని

నీలకంఠ నీగళమంటిదిస్తివే సామి


మారాజువంటూ నిను నమ్ముకుంటి

మరలైన సూడవె మాదేవ ముక్కంటి


2.ముక్కైన మూసుకొనుంటవు

తైతక్కలైనా ఆడుతు ఉంటవు

చిక్కుల్లొ మేముండి మొక్కుకుంటే

చిక్కవు దొరకవు రుక్కుల్ని బాపవు


మారాజువంటూ నిను నమ్ముకుంటి

మరలైన సూడవె మాదేవ ముక్కంటి

Friday, November 11, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చంద్రకౌఁస్


దేహ పంజరాన నను బంధించినావు

మోహపు జలతారు తెరను దించినావు

ప్రలోభాల తాయిలాలు అందించినావు

ఇంతగనను వంచించి ఏమి సాధించినావు

తిరుమలేశ వేంకటేశ శరణు శరణు స్వామీ

చేరనీ నీ సన్నిధి నను అంతర్యామీ


1.వనిత వలపు వలగా చిక్కుల పడవేస్తివి

ధన సముపార్జనతో బ్రతుకును ముడివేస్తివి

కీర్తి కొరకు ఆర్తినొందు బేలగనూ మారిస్తివి

తగునా  నీకిది నమ్మిన  నను ఏమారిస్తివి

తిరుమలేశ వేంకటేశ శరణు శరణు స్వామీ

చేరనీ నీ సన్నిధి నను అంతర్యామీ


2.నామరూప రహితునిగా నీ సన్నిహితునిగా

జనన మరణ జీవన వలయాతీతునిగా

పరమాత్మా నీలో లయమయే ఆత్మగతునిగా

పరమానందమొంద త్రోసితివే నను పతితునిగా

తిరుమలేశ వేంకటేశ శరణు శరణు స్వామీ

చేరనీ నీ సన్నిధి నను అంతర్యామీ

Thursday, November 10, 2022

శుభాకాంక్షలందుకో మిత్రమా

శుభకామనలు నీకివే నేస్తమా

నేడు నీ పుట్టిన రోజైన సందర్భానా

ఈ నాటినీ జన్మదిన శుభసమయానా


విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

మై డియర్ హాప్పీ బర్త్ డే టూయూ 


1.అంచెలంచెలుగా ఎదిగావు

 ఎదిగినా వినయంతో ఒదిగావు

తలిదండ్రులకు ప్రేమను పంచావు

వంశానికే గౌరవ మందించావు


విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

మై డియర్ హాప్పీ బర్త్ డే టూయూ 


2.స్నేహితులంతా ప్రియతములే

బంధుజనులూ నీ అభిమానులే

మూర్తీభవించిన మూర్తిమత్వానివి

సమాజాన కీర్తిగొన్న విఖ్యాతునివి


విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

మై డియర్ హాప్పీ బర్త్ డే టూయూ

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:హంసధ్వని


ఇదే ఇదే శత చండీ మహా యాగం

చేసినా చూసినా జన్మకు ఒక యోగం

లోక కళ్యాణార్థమై దురిత నివారణార్థమై

పుణ్య సంప్రాప్తమై

జరుపబడుతోంది మహా రుద్ర సహితమై


ఘనమైన చరితగల అఖిల బ్రాహ్మణ సంఘం

చేయగ పూనుకొంది రామచంద్రా పురమండల విభాగం

శ్రీ సీతారామచంద్ర మందిరమే యాగ కార్యస్థలం


1.చతుర్వేద పారాయణ ప్రముఖ  ఘనపాఠీలు

యాజ్ఞికులు ఋత్వికులు ద్విజులుసోమయాజులు

ధర్మ పరిరక్షులు యజ్ఞ దీక్షా దక్షులు ముముక్షులు

 శ్రీ మాధవానంద సరస్వతీ యతివరులే అధ్వర్యులు


2.విఘ్నేశ్వర నవగ్రహాది సకలదేవ హవనాలు

బీజాక్షర మంత్రాన్విత త్రేతాగ్ని ఆహూతులు

మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు అర్చనలు

చండీ సప్తశతీయుత సకలోపచార ఆరాధనలు


3.మహదాశీస్సులు తీర్థ ప్రసాదాల వితరణలు

భక్తజనాళికంతటికీ నిత్యాన్నదాన సంతర్పణలు

తృతీయ దివసాన మహా పూర్ణాహుతి సమర్పణలు

జన రంజకమైన సాంస్కృతిక కళా ప్రదర్శనలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా ఈర్ష్యకు ఆనవాలు-నీలవేణీ నీ శిరోజాలు

ఉక్రోషపు సాక్ష్యాలు-ఊరించే ముంగురులు

తలమీద తగలడకా-ఏల తానా తందనాలు

చెక్కిళ్ళను నిమురుతూ పూస్తాయి చందనాలు


1.గులాబీ అలరించగ తపిస్తుంది ప్రతిఉదయం

మల్లెమాలకు మాపటేల జళ్ళోదూరుటే ప్రియం

చూడామణికీ పాపిటి బిళ్ళకూ ఎంత అతిశయం

ధూళినైన చేరనీదు రుమాలు కూర్చి రక్షణ వలయం


2.పట్టుకుచ్చులు విచ్చుకత్తులు నీకురుల బిరుదులు

ఘనాఘనాలు సుదీర్ఘాలు అంటుకొనగ పిరుదులు

తారాడే కారణాలు కేశాల మిషల వల్ల మదికి క్లేశాలు

అందినంత మేరకు దోచుకొనగ చేస్తాయి తమాషాలు

Wednesday, November 9, 2022

 రచన ,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శిరమున శీతల జ్యోత్స్న

నుదురున రగిలే జ్వాల

జటల గంగ దూకేనంట

కంఠమందు విష 'మంట

భలే భలే స్వామీ ముక్కంటీ

దండాలు దయజూడూ దూర్జటీ


1.దేహమంతా భస్మధారణం

ఐశ్వర్యమెంతైనా నీవిచ్చేవరం

శ్మశానాన చితుల సావాసం

కైలాసం కైవల్యం నీ ప్రసాదం

భలే భలే స్వామీ ముక్కంటీ

దండాలు దయజూడూ దూర్జటీ


2.భయద సర్పాలు నీనగలు

పెదవుల చెదరవు నగవులు

జగతిని జయించగా త్రిశూలం

అశనము భుజించగా కపాలం

భలే భలే స్వామీ ముక్కంటీ

దండాలు దయజూడూ దూర్జటీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చందమామలెన్నో నీ తనువున

చంద్రకళలెన్నెన్నోనీ అణువణువున

చంద్రకాంత సోయగయమే నీ మేనంతా

చంద్రగోళాలు సైతం తరచి కాంచినంతా


1.వదన సదనాన నిండు పున్నమే

నయన ద్వయాన తదియ చిహ్నమే

కపోలాలు పంచుకున్నవి చవితి పంచమిలే 

అధర దరహాసానా విదియా ద్యోతకమే


2.చనుదోయి పూర్ణశశిలై పైటమబ్బు మాటున

నడుమొంపులే నవమిని దశమిని చాటేనా

అరుంధతితారై తారాడుతుందినాభి చాటున

జఘనార్ధగోళాలైన జాబిలి గ్రహణాల చందాన

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కార్తీకదీపమా మా ఆర్తి బాపుమా

అంతరంగ తిమిరాలనోకార్చుమా


1.ధరణికి దీపాలు విశేష రవిచంద్రులు

విశ్వానికి దీపాలు అశేష నక్షత్రాలు

మాలో ఆత్మజ్యోతిగా దీపించుమా

జ్ఞానజ్యోతిగా జగతిన వ్యాపించుమా

నదిలో కొలనులో వదిలే దొన్నెలొ ప్రకాశించుమా


2.కార్తీక పౌర్ణమివేళ పరమభక్తితో జనం 

తులసి ఉసిరిక చెట్లకు వత్తుల నీరాజనం

హరిహరనామ సంకీర్తన రోజంతా భజనం

బంధుమిత్రాదుల సామూహిక వనభోజనం

ఆనందో త్సాహం కూర్చి నేరవేర్చవే ప్రయోజనం

Sunday, November 6, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శంఖనాదమే ఒక గొంతుపాడితే

కోయిల స్వనమే ఒక కంఠం విప్పితే

వీణా వాదన నిక్వణమే ఒక గళం నినదిస్తే

మరంద మార్ధవమే ఒకగాత్రం ధ్వనిస్తే

గాత్రం సర్వత్రా పరమ పవిత్రం

గాత్రం గానానికి ఆకర్షణ సూత్రం


1.భావాన్ని అనుభవించితే

సహానుభూతినే పొందితే

అర్థాన్ని ఆకళింపుచేగొనితే

ఉచ్ఛరింపులో పట్టుసాధించితే

ఆపాత మధురం ఏపాటైనా

అసిధారావ్రతమే ఏపూటైనా


2.శ్రుతి మీద సాగేలా కసరత్తు

లయతో లయమైతే గమ్మత్తు

పాట చల్లుతుంది పరిమళాల మత్తు

శిశుర్వేత్తి పశుర్వేత్తి ఏదైనా చిత్తు

గీతం నవనీతమే ప్రతి గాయానికి

గేయం అనునయమే హృదయానికి

Saturday, November 5, 2022

 రచన,స్వరకల్పన&గాఖనం:డా.రాఖీ


ఎలా తెలుపను నీ పైని ప్రేమను

ఏదని నీకివ్వను ఇచ్చాగా మనసును

దేహభావన వదిలి వేసి

ఎదను ఎదతో జతగజేసి

అవధులేలేని సౌఖ్యన్నే అనుభూతిద్దాం

ఎవ్వరూ లేని లోకాన్నే ఏలుకుందాం


1.లోగుట్టు బయట పెట్టవు

నా జోలి మదిలొ మానవు

కనుతిప్పనీయనీ మెరుపు తీగవు

పలుచని నీ నవ్వైతే అసలాపవు

ఓపలేను నిన్ను కలవకా ఈ తపనను

గుర్తించు ఇకనైనా మన మనో మనువును


2.కనిపించిన కలికల్లా నీలానే

పలకరించబోయి ఖంగుతిన్నానే

అందరిలా నన్నెపుడూ జమకట్టబోకు

నా స్వప్న సుందరివే నను కష్టపెట్టకు

పట్టించుకుంటే సరి పక్కదారి పట్టను

కాదంటు తప్పుకోకు మెతుకు ముట్టను

 

https://youtu.be/6ZEk1VzUyCE?si=oyuBBFDVYLMQnrxa

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నాగ గాంధారి


ఒప్పుకుంటా చెప్పుతుంటా

గొప్పవారికైనా నీకృప కష్టమని

నిను చేరే త్రోవంతా క్లిష్టమని

నీపై దృష్టి పడడం అదృష్టమని

మనసా వాచా కర్మణా నువు నా కిష్టమని

శ్రీనివాసా వేంకట రమణా గోవిందా

సంకటహరణా కరుణాభరణా పాహి ముకుందా


1.కంసాలివి నీవు నను కాల్చుతున్నావు

బుద్దిని శుద్ధిచేసి మేలిమి కూర్చుతున్నావు

ఆభరణంగా రూపొందంగా ఎన్ని దెబ్బలు

నువు తలదాల్చగ పెడుతున్నా పెడ బొబ్బలు

శ్రీనివాసా వేంకట రమణా గోవిందా

సంకటహరణా కరుణాభరణా పాహి ముకుందా


2.వత్తిడి పెంచుతు వత్తిని బాగా పేనుతున్నావు

మతి వెలిగించగ  ఓరిమినూనెలొ ముంచుతున్నావు

నీ స్మృతి జ్యోతిని గర్భగుడిలో దీపించనున్నావు

నేనే దహించి నీవను కాంతిగ వ్యాపించమన్నావు

శ్రీనివాసా వేంకట రమణా గోవిందా

సంకటహరణా కరుణాభరణా పాహి ముకుందా


@everyone

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అల్ప సంతోషులం

కల్పనా చతురులం

కలలలో విహరించే కవులం

ప్రణయ గత ఆశా జీవులం

ఎదవీణ పలికే మంజుల రావాలం


వేదనంతా మటు మాయం

కాలమే మాన్పుతుంది గాయం

చింతించినంతనే అయోమయం

కలగజేస్తుంది యోచనే ఆనందమయం

పాటతోపాటే సాగుతుంది కవి పయనం


ముడివడిన బంధాలే భారమై

సాంత్వననిడ చెలిమే చేరువై

సదా సంతోషమే కలయిక సారమై

వేసే ప్రతి అడుగు అనురాగ తీరమై

పాటుపడగ పాటల తోటై కవి పాటవం

Friday, November 4, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ అధరమందారాలలో

నను గ్రోలనీ మరందాలు

గాఢ పరిష్వంగమందునా

నను చేరనీ స్వర్గధామాలు


1.నను తెలుపనీ ఈ క్షణాన

ప్రణయానికే కొత్త భాష్యాలు

నీ మనఃకుహర కృష్ణబిలాన

శోధించీ ఛేదించనీ రహస్యాలు


2.పయనించనీ గగనాంతరాలకు

విస్మయమనిపించనీ పాలపుంతలకు

ననుగమించనీ రోదసీ పరిధులకు

సుధలే పారే సుదూర వసుధలకు

Thursday, November 3, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: చంద్రకౌఁస్


కనకాభిషేకమా గండపెండేరమా

గజారోహణమా తులాభారమా

కళాకారులడిగే ఘన కానుక లేవని

కవులు ఆశపడే సత్కారాలేమిటని

చప్పట్లు కొడితెచాలు సంబరంతాకు అంబరం

బాగున్నదంటేనే కప్పినంత కాశ్మీరు అంబరం


1.మేధనెంతొ మధించి అనుభూతి రంగరించి

శబ్ధార్థ భావ సౌందర్య మొప్పగా అలంకరించి

కవన కృతిని కమనీయ మలర తీర్చిదిద్ది

హృద్యమౌ నైవేద్యము వాగ్దేవికి నివేదించి

అమ్మవారి ప్రసాదంగా పఠితులకందించగా…


2.రేయి పగలు శ్రమించి పాటవాన్ని మేళవించి

అనితర సాధ్యమౌ కఠిన సాధనతో సాధించి

సప్తస్వరాల నవరస సారాలు కళలోకుమ్మరించి

నటరాజు చరణాలకు నమ్రతగా సమర్పించి

కనువిందుగా మది పసందుగా  ప్రదర్శించగా…

 

https://youtu.be/W-hts27C7Cc

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:హంసానంది


అత్రి అనసూయ పుత్రుడా

త్రిమూర్తి స్వరూపుడా

గురుదేవ దత్తుడా 

అష్టాంగయోగ సిద్దుడా

అభీష్ట వరదుడా సాష్టాంగ వందనం


1.త్రిగుణాతీతుడా పునీత చరితుడా

అవధూతా ఆరోగ్య దాతా వైద్యుడా

దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభుడా

భీమా నదీ తీర గాణుగాపుర వాసుడా

అభీష్ట వరదుడా సాష్టాంగ వందనం


2.శంఖ చక్ర శూలాయుధ ఢమరుధర

దండ కమండల మాలాయుత కర

కౌపీనధారి వనమాలి పరమ యోగీశ్వర

నరసింహసరస్వతీ దివ్యావతారుడా

అభీష్ట వరదుడా సాష్టాంగ వందనం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అలకబూనితే అదో నవ్వులాట నీకు

కినుక వహిస్తే అసలు లెక్కచేయవెందుకు

గమనించవు నా మాటల మాటున గాంభీర్యం

పరికించవు నా మదిలో పేరుకునే నైరాశ్యము

ఈ చిత్రవధ కంటే చంపెయ్యి ఒక్కసారి

ఈ యాతన మనలేను వేచివేచి వేసారి


1.తోసిరాజంటూ బంధనాలు వేస్తావు

తల్లడిల్లి పోతుంటే తమాషాగ చూస్తావు

ఎందుకో మరి నీపై ఇంతటి ఆరాధన

ఎరుగవంటె నమ్మేనా నా ఎద ఆవేదన

ఈ చిత్రవధ కంటే చంపెయ్యి ఒక్కసారి

ఈ యాతన మనలేను వేచివేచి వేసారి


2.ఎందుకు వచ్చావో నా జీవితం లోకి

ఎలా నాలొ సొచ్చావో ఎరుగను ఏనాటికి

నా ఊపిరి గుండె సడి నీవేలే ముమ్మాటికి

చేరవే నా గూటికి కూడదంటే నే కాటికి

ఈ చిత్రవధ కంటే చంపెయ్యి ఒక్కసారి

ఈ యాతన మనలేను వేచివేచి వేసారి

Tuesday, November 1, 2022

 భావకవి కృష్ణశాస్త్రి స్మృతిలో…ఆయన జయంతి సందర్భాన నా భావగీతి…


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆకులు అతిథిగ ఆహ్వానించగా

కొమ్మలు తలలూచి రమ్మనగా

పువ్వులు నవ్వులు కుమ్మరించుగా

వనమును మనమును ప్రేమించగా


1.సీతాకోక చిలుకలే దారితీయగా

శుకము పలుకులే మరి తీయగా

పికము లొలుకు గీతాలు హాయిగా

కపోతమే జతగా చెలిమి చేయుగా


2.మయూరమే వింజామర వీయగా

పారిజాత విరులే పరిమళం కురియగా

కొలను తామర విప్పార విరియగా

మది తేలి తేలి మైమరచి మురియుగా

 https://youtu.be/lvN06Q3UJo0?si=yA8nT--MwBCdpqR7


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పుక్కిట పట్టని సంద్రమే ప్రేమంటే

గుప్పిట ఇమడని మేఘమే మనసంటే

పరస్పరం ఆధారమే ప్రణయ రాగ సారమే

ప్రకృతి కూర్చిన అందము అనురాగ బంధము


1.ఏ క్షణాన పుడుతుందో వీక్షణలో

ఎదనెలా మెలిపెడుతుందో నిరీక్షణలో

తెలియని ఆరాధనే ప్రేమంటే

తీయనైన వేదనే ప్రేమంటే


2.నీడలాగ వెనువెంటే జంటగా ఉంటుంది

వద్దన్నా వీడకుండా మొండిగ వెంటాడుతుంది

ప్రియమైన శత్రువే ప్రేమంటే

సాధించే నేస్తమే ప్రేమంటే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కండ గలిగిన దండి దేవుడవు

కొండగట్టులోన ఉండి నిలిచావు

కొండను అరచేత మోసుకొచ్చావు

కొండంత అంజన్న మాకండనీవు

దండాలు నీకు శ్రీరామ భక్తుడ

మెండుగ మేలుకూర్చు వాయుపుత్రుడ


1.సూర్యణ్ణే మింగిన.శూరునివి నీవు

ఇంద్రునితొ పోరిన వీర హనుమవు

సుగ్రీవునికైతేనో మంచి మిత్రుడవు

గుండెలొ రామునికి గుడి కట్టుకున్నావు

దండాలు నీకు శ్రీరామ భక్తుడ

గండాలెడ బాపర వాయుపుత్రుడ


2.సంద్రాన్ని సైతం దాటిన ఘనుడవు

సీతమ్మకు రామయ్య ఉంగరమిచ్చావు

లంకిణిని కూల్చేసి లంకను కాల్చావు

రావణుని గర్వాన్ని అణచి వేసి నావు

దండాలు నీకు శ్రీరామ భక్తుడ

తండ్రివినీవే మాకు  వాయుపుత్రుడ