Friday, October 25, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:కాంభోజి

ముక్కోటి దేవతల మురిపెమే నీ రూపు
పదునాల్గు భువనాల పరవశం నీ తలపు
శతకోటి భక్తుల కలా- వరం నీ చూపు
ఏడుకొండలస్వామి నీవెల్లరకు వేలుపు
నీ దృష్టి పడదేల గోవింద నా వైపు
నిను నమ్మి కొలిచేను ప్రతి పొద్దుమాపు

1.ఏ పుణ్యమో స్వామి ద్వారపాలకులది
ఎంత ధన్యమొ జన్మ నీ అర్చకులది
పావనమె ఆ బ్రతుకు పరిచారకులది
భాగ్యమే జీవితము గుడి సేవకులది
నా కీయవైతివే స్వామి నీ ప్రాపు
నిను నమ్మి కొలిచేను ప్రతి పొద్దుమాపు

2.నీ గర్భగుడిలోని దివ్వెదే సౌఖ్యము
నీ పాదపీఠిపై పువ్వుకూ మోక్షము
తరియించి పోతుంది అభిషేక సలిలము
ఆనందమొందేను నిను తాకి మారుతము
చెవిబడలేదా  ఆర్తియుత నా పిలుపు
నిను నమ్మి కొలిచేను ప్రతి పొద్దుమాపు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:భైరవి(హిందుస్తాన్)

అపరంజి బొమ్మవే విరజాజి తీగవే
పట్టుకుంటె రాలిపోయే గులాబి రేకువే
ముట్టుకుంటేగుచ్చుకునే ముళ్ళకొమ్మవే
ముద్దులొలికే ముద్దుగుమ్మవే
హద్దు చెరిపి ఆశగొలిపే చక్కనమ్మవే

1.పాలవెల్లి  తెలుపును తెలుపు నీ మేని సొంపు
మెరుపుకన్న మిరుమిట్లు  నీ తళుకులు
కొండవాగుకన్నా మెలికలు నీ కులుకులు
మనసు దోచే మంత్రగత్తెవే
హద్దు చెరిపి ఆశగొలిపే చక్కనమ్మవే

2.చిక్కకుండ జారే పాదరసం ఊరించే నీ  సరసం
తపనలే పెంచు  ద్రాక్ష పళ్ళు  నీకళ్ళు
మోవి తడి రేపు ఆపిళ్ళు నీ బుగ్గలు
నటనలాడే నంగనాచివే
హద్దు చెరిపి ఆశగొలిపే చక్కనమ్మవే
హంస రాయబారమూ
మేఘ సందేశమూ
పావురాయి చేత ప్రేమ పత్రమూ
ఏలా తెలుపను నా మనసు ఆత్రమూ
చెలీ చేరగలిగిచాలు నీకు మాత్రమూ

1.పాదలేపనమ్ముతో గగనవీథి ఎగిరినిన్ను కలవనా
ఒంటికంటి రాక్షసున్ని మట్టుబెట్టి నిన్ను గెలవనా
మంత్రాలదీవిలోని మర్రిచెట్టు తొర్రలోని చిలకనితేనా
రెక్కల గుర్రమెక్కి దిక్కులన్ని దాటుకొంటు నిన్నెత్తుకరానా
ఏ సాహసాలు నేను చేయనూ నీ కోసమూ
చెలీ ఏ అద్భుతాలు సాధించి పొందనూ నీసావాసమూ

2.ఊర్వశివే నీవు ప్రేయసీ పురూరవుడనై నేపుట్టనా
మేనకవే నీవు కాబోలు సఖీ రాజర్షిగ తపములనొడిగట్టనా
రంభవు నీవైతే నలకుభేరునిగనే అవతారమెత్తనా
మోహినివే నీవు సుమీ శివుడిలాగ నిన్ను మోహించనా
ఏరీతి నిన్నాకట్టుకోను జగదేక సుందరీ
ఏవిధి నీ ప్రణయాన్ని గొనను రసరాగమంజరీ