Friday, September 6, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం: ద్విజావంతి

నీ రాధ పిలిచింది రారామ్మని
మాధవా జాగేల ఏలగ రాధమ్మని
ఊదరా వేణువుని శ్రవణపేయముగ
సేదదీరుతు నా ఒడిని తన్మయముగ

1.నవనీతమెంతో నీకు ప్రియం
మిసిమిని మించును నాహృదయం
విరహాగ్నిలో మదివెన్న  ఆజ్యం
ఘృతము తోడవగ ఉధృత ఆవహనీయం
నీలమేఘశ్యామ వర్షించు ప్రణయం
నీతో ఉన్నంత సమయం రసమయం-సరసమయం

2.ఏ నిధి ఉన్నది నా సన్నిధి నీది కానిది
ఏ విధి కాదన్నను  నీవేకద  నా పెన్నధి
నా పిచ్చిగాని నీవూనేనని వేరే ఏమున్నది
నీమాయయే ఇది ఇహము పరమన్నది
ఆత్మనే నీపరమైతే ఈ దేహానిదేమున్నది
పరమాత్మలో ఐక్యమైతే  ఇక మోహమేమున్నది-వ్యామోహమేమున్నది