Monday, May 23, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిదుర లేమి కన్నులతో

కుదురు లేని యోచనతో

పదేపదే పలవరింపుగా

అదేపనిగ కలవరింపుగా

చెలీ చెలీ చెలీ నీవలపుల జడిలో

ప్రతిక్షణం నీ యాదిలో మనాదితో


1.ఊపిరైతె ఆగింది గుండె లయ తప్పింది

నీ ప్రేమలోని నియతే ప్రాణం నిలబెట్టింది

కంటికి నువుదూరమున్నా ఎదలోనె కాపురమున్నావు

మంటలూ రేపుతున్నావు మమతతో ఆర్పుతున్నావు

చెలీ చెలీ చెలీ నీవలపుల జడిలో

ప్రతిక్షణం నీ యాదిలో మనాదితో


2.యాతనెంత పడ్డదో అల దవ్వై కడలి

మదనపడునె కలువ కలువ  పున్నమి జాబిలి

నెర్రెలు బారానే బీడునై తొలకరి నింకనూ నోచక

అర్రులు సాచానే శిశిరమునై ఆమని నావంక ఏతెంచక

చెలీ చెలీ చెలీ నీవలపుల జడిలో

ప్రతిక్షణం నీ యాదిలో మనాదితో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నేస్తమా  నీ మధుర జ్ఞాపకం 

తీపి తలపులకే ప్రేరేపకం

ప్రియతమా నీ సంతకం

చిలిపి ఊహకే ఉత్ప్రేరకం

ఈ రేయి హాయినీ ఇరువురం మోయనీ

సరస రస కావ్యాలనే రసనతో రాయనీ


1.మబ్పు మోసుకొచ్చింది తమకాల జల్లునీ

గాలి పూసివెళ్ళింది తపనలున్న తావిని

వెన్నెలే తెలిపింది నీ తహతహ మనోగతం

తెరిచి ఉంచాను ఎదనీకై చెలికాడా స్వాగతం

ఈ రేయి హాయినీ ఇరువురం మోయనీ

సరస రస కావ్యాలనే రసనతో రాయనీ


2.దేహాలు మోహంతో విరహించినాయి

నయనాలు వేచిచూసి  నీరసించినాయి

అధరాలు చుంబనాలనే ఆశించినాయి

మనసులే జతగా ముడివడి పరవశించినాయి

ఈ రేయి హాయినీ ఇరువురం మోయనీ

సరస రస కావ్యాలనే రసనతో రాయనీ

 https://youtu.be/oERUOxyET58


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పరమార్థమేదో ఎరిగించరా పరమేశ్వరా

పరతత్వమేదో బోధించరా పరమ గురువరా

దక్షిణామూర్తీ ఆది గురుమూర్తీ తీర్చవే నా జ్ఞానఆర్తి 

గమ్యమే రమ్యమౌ   ధ్యానమే ధ్యేయమౌ 

మోక్షమే లక్ష్యమౌ  సర్వం సహా విశ్వైక చక్రవర్తి


1.నీ భాష మౌనము ఆత్మగత భావమై చరియించగా

ఉపదేశ మంత్రము అద్వైత సూత్రమై స్ఫురియించగా

పాంచభౌతిక తాపత్రయాత్మిక దేహమే హరియించగా

బ్రతుకు నైవేద్యమే భవ రుజకు వైద్యమై తరియించగా


2.యోగవాశిష్టమే అనుష్ఠాన సాధ్యంగా అనుభవైకవేద్యంగా

బ్రహ్మ సత్యం జగన్మిథ్య విభూతి యోగంగా అనుభూతి హృద్యంగా

ఏకమేవా అద్వితీయం తత్వమేవాహం గా అహరహం శివోహంగా

ఆది మూల బీజం ఓమిత్యేకాక్షరం ప్రణవంగా 

తత్వమసి పరిణమించి సోహంగా