Monday, December 23, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ముద్దబంతి పూవులాంటి ముగ్ధత్వం
ముద్దమందారమంటి మృదుత్వం
గులాబీరేకువంటి స్నిగ్ధత్వం
తంగేడు పూవులాంటి నిర్మలత్వం
ఎంతముద్దుగున్నావే మనవరాలా
ఎత్తుకొని ముద్దాడుదు మమతమీర

1.మీ అమ్మలోని సునిశితత్వం
అమ్మమ్మలోని అతులిత లౌక్యం
మీ నాన్నలోని ధీరత్వం
తాతయ్య లోని బోళాతత్వం
పుణికిపుచ్చుకున్నావే చిన్నారి
వృద్ధిలోకిరావాలి మాకోరిక నెరవేరి

2.ముక్కోటి దేవతలు దీవించగా
ఇలవేల్పు దయనీపై వర్షించగా
నువు ఆటపాటలతో అలరించగా
నీముద్దు మురిపాలు మురిపించగా
నిత్యసంతోషిణివై వర్ధిల్లవే
నిండునూరేళ్ళూ వెలుగొందవే
https://youtu.be/FjEGaDM--BA


పుట్టింది మట్టిలో కలిసేది మట్టిలో
మట్టిమనిషివంటారు నిను రైతన్నా
నీ జట్టుపట్టదంటారు వినరోరన్నా
హలం నీది కలం నాది మనిద్దరిదీ వ్యవసాయం
నీకు నేను నాకు నీవు మనకు మనమె సాయం
జోహారు నీకన్నా జేజేలు నీకన్నా

1.జిట్టెడంత పొట్టకొరకు పట్టెడంత పండించి
పూటగడుపనెంచవేల వెర్రెన్నా
కట్టమంత దారవోసి మట్టినే ధాన్యంచేసి
పుట్లకొద్ది పండించ పట్టునీకేల రైతన్నా
నిను పట్టించుకోని జనం సాపాటు కోసం
పాట్లు పడెదవేల అగచాట్లుపడెదవేల

2.ప్రభుత్వాలు మారినా ఏపార్టీ పాలించినా
నువు మోడుగ మారినా నీగోడు వినకుండె
కరువులుకాటకాలు వరదలు తుఫానులు
నిను కబళించగా దిక్కుతోచక నీగుండె మండె
దైవోపహతుడైనా  ధైర్యదాన కర్ణుడవే నీవు
ప్రకృతి పద్మవ్యూహాన అభినవ అభిమన్యుడవీవు

3.జీతబత్యాలులేవు  ఏ పింఛను లెరుగవు
బుద్దెరిగిన నాటినుండి శ్రమనె నమ్ముకొన్నావు
నేలనే తల్లినీకు పైరు పెంచిపోషించగ నీ తండ్రి నీరు
సమయాసమయాలూ లేవు పదవి విరమణలు
ప్రపంచం కడుపు నింపు అపర అన్నపూర్ణవు
ఒడుదుడుకుల వెరవని సమరయోధుడవు
https://youtu.be/lhIQCBee1ec?si=_V7nH7Qwv8qHzcBe

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

జగమేలు శక్తివమ్మా
సుగుణాలరాశివమ్మా
దయగల్ల తల్లివమ్మా
ప్రియమార చూడవమ్మా
నీరాజనాలు జనని
నీ కృపతొ మమ్ము మనని

1.గతినీవెగాదె మాకు
మతినింక వీడబోకు
రుజకీవె మందుమాకు
చేయి నెపుడూ  వదలకు
నీరాజనాలు జనని
నీ కృపతొ మమ్ము మనని

2.ఎదనీకు కోవెలమ్మా
మా కన్నులె దివ్వెలమ్మా
చిరునవ్వులె పువ్వులమ్మా
ప్రాణజ్యోతు లారతులమ్మా
నీరాజనాలు జనని
నీ కృపతొ మమ్ము మనని