Monday, January 21, 2019

పలుక తగని పలుకులెన్నొ పలికినాను
చేయకూడని పనులెన్నో చేసినాను
అహంకార భావనతో విర్రవీగినాను
కన్నుమిన్నుగానక ప్రవర్తించినాను
దురితములెంచకురా రత్నగర్భ గణపతి
నను మన్నించరా కన్నిమూల గణపతి

1.పిట్టకైన వేయలేదు పిడికెడు మెతుకులు
సాయపడుటె ఎరుగని స్వార్థపు బతుకులు
అవగుణాలు నిండిన మా దారంతా గతుకులు
న్యాయానికి ధర్మానికి పేర్చాము చితుకులు
నేరములెంచకురా కాణిపాక గణపతి
కనికరమున కావరా వాతాపి గణపతి

2.గతజన్మ పాపాల సంచిత ప్రారబ్ధము
తెలిసితెలిసి చేసిన దోషాల ఫలితము
నీ దయావిశేషమె ఈ పశ్చాత్తాపము
నీ కృపాకటాక్షమే ఈ ప్రాయశ్చిత్తము
సన్మార్గము నను నడపర సిద్ది గణపతి
సంకటముల నెడబాపర విఘ్న గణపతి



Saturday, January 19, 2019

కరుణకు సాకారమే నీవు
భక్తుల ప్రాకారమే నీవు
కపర్దీ కపాలీ కామారి
ఝర్ఝరీ దూర్జటీ కేదారి
నన్నెరుగవనా నీకు విన్నపాలు
ముంచినా తేల్చినా వదలను నీ పాదాలు

1.నా చిన్ని జీవితాన ఎన్నెన్ని అనుభవాలు
వెలుగు నీడలై...    వెంటాడె కష్ట సుఖాలు
సదాశివా  భవానీధవా-
సాంబశివా  శివానిప్రభువా
నన్నెరుగవనా నీకు విన్నపాలు
ముంచినా తేల్చినా వదలను నీ పాదాలు

2.కాలకూట విషము మ్రింగి కాచావు లోకాన్ని
కన్నతండ్రి వని నమ్మితి మాన్పవేల శోకాన్ని
నిటలాక్ష నీలకంఠ నిరంజనా-
జటదారి శశిధర నాగభూషణా
నన్నెరుగవనా నీకు విన్నపాలు
ముంచినా తేల్చినా వదలను నీ పాదాలు




Wednesday, January 16, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

దోచేయడం ఏదేదో చేయడం నీకు పరిపాటేగా
ఎదనేదో చేయడం మదినే దోచేయడం నీకు అలవాటేగా
నవనీతచోర నందగోపాల గోపీలోల గోకులబాల

1.తెరలే తీసాను తలపులకు
తెరిచే ఉంచాను తలుపులను
ఎత్తుకెళ్ళు స్వామి నా మొత్తమంతా
ఆక్రమించు స్వామి నా చిత్తమంతా
అడ్డుకొనువారు అసలేలేరు
 ఒంటరి నేను తుంటరినీవు
నవనీతచోర నందగోపాల గోపీలోల గోకులబాల

2.మనసు చిలికి వెన్ననంత ప్రేమగ ఉంచాను
విరహంతో వేగిఉన్న తనువు సిద్ధపరిచాను
దొంగిలించ పనిలేదు నీ పరమే చేసాను
మత్తుజల్ల పనిలేదు నీ మాయలోనె ఉన్నాను
పట్టించుకోవేల జాలిమాని మానినిని
జాగుసేతువేల కరుగనీకు యామినిని
నవనీతచోర నందగోపాల గోపీలోల గోకులబాల

Monday, January 7, 2019

నా దేశం  హిమవన్నగ సమున్నతం
నా దేశం గంగా యమునా నదీ పునీతం
నా దేశం చతుర్వేద యుత సకల శాస్త్ర సంశోభితం
నా దేశం తలమానికమౌ నాగరికత గల భారతం
జై హింద్ జై హింద్ జైహింద్ జై హింద్

1.పరదేశీయుల దండయాత్రలకు చెక్కుచెదరని దేశం
పరవ్యాపారుల మాయోపాయపు పాలనలో చిక్కిన దేశం
ఆటుపోట్లు చెలరేగిన గాని సంస్కృతి చెదరని దేశం
వెన్నుపోట్లు కడు తగిలినగాని భారతీయతను బాయని దేశం
జై హింద్ జై హింద్ జైహింద్ జై హింద్

2.గోవును సైతం తల్లిగ తలచే జీవకారుణ్య దేశం
తల్లి దైవమని నిత్యం కొలిచెడి మానవతాసందేశం
పలు కుల మతముల  మనుగడ గలిగిన సమైక్య దేశం
భిన్నత్వంలో ఏకత్వంగా అలరారే విశిష్ట విశాల దేశం
జై హింద్ జై హింద్ జైహింద్ జై హింద్

3.భాషలనెన్నో కలిగినగాని భావన ఒకటిగ మసలే దేశం
ప్రాంతాలుగ ఎన్నున్నా ఆసేతు హిమాచల అఖండ దేశం
పురోగామిగా పరుగెడుతున్న ప్రపంచఖ్యాతిగన్న దేశం
నాడు నేడు ఏనాడు జగతికి దీపిక నా దేశం భారతదేశం
జై హింద్ జై హింద్ జైహింద్ జై హింద్

Sunday, January 6, 2019


ఏముంది చెప్పడానికి.. నీగురించి కొత్తగా
ఏముంది విప్పడానికి ..నీ గుట్టు తెలియనట్టుగా
యదుకులబాలా..హే నందలాలా
గోపీలోలా గిరిధరగోపాలా

1.చిన్ననాట నీనోట జగతిని చూపావట
వెన్నముద్దలన్నీ వేడ్కగ దోచావట
జలకమాడు పడతుల వలువలు దాచావట
ప్రార్థించిన పాంచాలికి చీరలిచ్చి కాచావట
మధుసూదనా హే వాసుదేవా
పురుషోత్తమా పాండురంగ విఠలా

2.కుచేలుణ్ణి ఆదరించి మైత్రి విలువ నిలిపావట
కుబ్జను కనికరించి మానవతను చాటావట
రాధతోడికూడినీవు పరమ ప్రేమ నేర్పావట
బ్రతుకుసారమంతనీవు గీతలోనె తెలిపావట
అచ్యుతా అనంతకృష్ణ హేమాధవా
గోవిందా హరి ముకుంద జగన్నాథ జనార్ధనా
వాలుచూపుల నెరజాణ
వాలుజడనూ వాడకుమా
వాలిపోయెద నీఒడిలోనా
నీ వాడినయ్యీ తడిసేను
నీ వలపుల జడిలోనా

1.ప్రత్యూషపు తుషారమీవు
ప్రదోషాన సింధూరమువు
పారిజాత పరిమళమీవు
మంజీర నాదము నీవు
పంచభూతాత్మకమైన
నా ప్రాణ పంచకమీవు
వాడబోకు నీచిరునవ్వు
అది మదనశరములు రువ్వు

2.శ్రీనాథుడు వ్రాయగలేడు
అల్లసాని తెలియగ లేడు
కాళిదాసు వర్ణించలేడు
రవివర్మ చిత్రించగలేడు
జక్కనైన చెక్కని శిల్పం
బ్రహ్మ సృష్టించని అందం
నాకు దక్కిన భాగ్యం
వద్దని వారిస్తా వరమిస్తే స్వర్గం
జాబిలి నీ సిగ పూవు
చీకట్లను పారద్రోలు నీవున్న తావు
జాలిగుండె దేవుడవు
ఇక్కట్లను కడతేర్చి కాపాడుతావు
మల్లన్నగా రాజన్నగా మహిలొ కొలువు దీరినావు
భక్తులపాలిటి పెన్నిధిగా వెలుగొందుతున్నావు
ఓం నమఃశివాయ వందనమందుకోవయ్యా
నమో నమఃశివాయ మా మతిలొఉండి పోవయ్య

1.లోపాలనెంచక నీ చూపు మాపై నిలుపు
తప్పిదాలు మన్నించి ఇకనైనా కనికరించు
కానుకగా నీకు మా మనసునర్పించెదము
కన్నతండ్రి నీవని నమ్మి నిన్ను కొలిచెదము
లింగయ్యగా జంగయ్యగా జగతినేలుతున్నావు
భక్తులపాలిటి పెన్నిధిగా వెలుగొందుతున్నావు
ఓం నమఃశివాయ వందనమందుకోవయ్యా
నమో నమఃశివాయ మా మతిలొఉండి పోవయ్య

2.మంచిరోజులొస్తేనే మెదులుతుంది నీతలపు
కర్మపండిపోతేనే అందుతుంది నీ పిలుపు
మా ఈతిబాధలకు ఈయవయ్య ముగింపు
చెరిగిపోని నగవును మా పెదవులపై నిలుపు
శివయ్యగా సాంబయ్యగా  ఇలన నిలిచి ఉన్నావు
భక్తులపాలిటి పెన్నిధిగా వెలుగొందుతున్నావు
ఓం నమఃశివాయ వందనమందుకోవయ్యా
నమో నమఃశివాయ మా మతిలొఉండి పోవయ్య


Saturday, January 5, 2019

రాఖీ"తెలుగింటి ఇంతి -వెలుగుల సంక్రాంతి"

కళ్ళాపి జల్లిన లోగిళ్ళు
ముత్యాలముగ్గుల ముంగిళ్ళు
గోమయపు తీరైన గొబ్బిళ్ళు
సంక్రాంతి శోభతో తెలుగిళ్ళు

పంటసిరులతో నిండిన గాదెలు
గంగిరెద్దుల ఆటల వీధులు
హరిదాసు పాడే తత్వగాథలు
సంక్రాంతి సంబురాల తెలుగిళ్ళు

కోనసీమ పచ్చని అందాలు
కోరికోరి ఆడే కోడిపందాలు
పల్లెపడుచు పరికిణీ ప్రబంధాలు
సంక్రాంతి సంతసాల తెలుగిళ్ళు

ఉత్తరాయణ శుభ పర్వదినాలు
పితరులకిల తిలతర్పణాలు
నోములు వ్రతముల భక్తిభావనలు
సంక్రాంతి వైభవాల తెలుగిళ్ళు

చిటపట చిటపట భోగిమంటలు
సకినాలర్సెల పిండివంటలు
పండగ నిండగు కొత్త జంటలు
సంక్రాంతి సరదాల తెలుగిళ్ళు

చిన్నారులపై భోగిపళ్ళు
నింగిలొ ఎగిరే పతంగులు
బంధుమిత్రుల సందళ్ళు
సంక్రాంతి లక్ష్మి తో వెలుగిళ్ళు మన తెలుగిళ్ళు

Friday, January 4, 2019



రచన,స్వరకల్పన&గానం:రాఖీ

కొలిచినవారికి కొంగు బంగారమీవు
నమ్మినవారికి కొండంత అండనీవు
వరములనిచ్చేటి కోనేటిరాయుడవు
ననుదయగనగఏల జాలిమానినావు
తిరుమలతిరుపతి వేంకటేశ్వరా
ఆపదమొక్కులవాడ అడుగడుగు దండాలవాడ

1.తలపుల నిను నిలిపెద- తలనీలాలిచ్చెద
ఏడుకొండలుకాలి నడకతొ నే నెక్కెద
నీగుడిముందే జోలె తెరచి నిలిచెద
మనసావాచాకర్మల నిను మ్రొక్కెద
గొంతెమ్మకోర్కెలేవి కోరను సుమ్మీ
నా సతిసుతులను చల్లగ చూడుము స్వామీ

2.నీ సుప్రభాతముతో- నేనిద్రలేచెద
నిండుమనసుతో నిన్ను-నిత్యము అర్చించెద
శనివారము నీ ధ్యాసతొ ఉపవసించెద
అష్టాక్షరి నామజపం నిరతము నే చేసెద
ఇహపర సుఖదాయకా ఇందిరా రమణా
జాగు నోపలేను స్వామి వర్షించునీ కరుణ

Wednesday, January 2, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సాయి అనే నామమెంతొ హాయి
సాయిసాయి సాయిసాయి సాయి
అణువణువున క్షణక్షణమున సాయి
నాలోను నీలోను కొలువుదీరెనోయి

1.ప్రతి పని నువు మొదలుపెట్టు సమయాన
సాయిని తలచినంత తొలగు ఆటంకాలు
ప్రతిఫలమేదైనగాని కార్యాంతాన
సమర్పించు సాయికి ఆ శుభాశుభాలు
మాటల్లో సాయి పాటల్లో సాయి
సాయిసాయి సాయిసాయి సాయి

2.నువు పలికే ప్రతి మాట సాయితోనె అనుకో
నువుచేసేది సాయి సేవగ భావించుకో
ఎదురయ్యే ప్రతివారిని సాయిగ తలపోయి
తప్పులైన ఒప్పులైన సాయికే ధారపోయి
సుఖదుఃఖాలు సాయి ఇహపరాలు సాయి
సాయిసాయి సాయిసాయి సాయి
మెడవొంపులోనా ఒక కుంపటి
కౌగిలింతలోను మండుతోంది కొలిమి
ఒళ్ళంతా వెచ్చదనం స్పర్శంతా కమ్మదనం
తపనలింక పెంచుతోంది వణుకుతున్న తమకం
తీయనైన బాధ ఏదో గొణుగుతోంది గమకం

1.చలి గాలి లోను సెగరేగుతోంది
వదులుతున్న ఊపిరి సైతం నెగడు కాగినట్టుంది
లతల్లాగ మారినాయి అల్లుకున్న దేహాలు
ఎవరుఎవరమో తెలియని వింతవింత వైనాలు
కుంచెగా మారుతు మోవి గీసెనెన్నొ చిత్రాలు
తడిమిన తనువణువణువు చేసెనెన్నొ చిత్రాలు

2.తుదిఏదొ మొదలేదో ఎరుగలేని మైకాలు
దారితప్పి చేరుకునే దివ్యమైన లోకాలు
అద్వైతమంటే సులువుగానె బోధపడింది
అర్ధనారీశ్వరతత్వం అనుభవైకవేద్యమైంది
మదనుడైన నేర్చుకొనే కొత్తకొత్త పాఠాలు
ఎంతసేపు రాసినా ఒడవని రసకావ్యాలు