Wednesday, August 14, 2019


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:సరస్వతి

నా కలమున కొలువు దీరు - కలహంస వాహినీ
నా గళమున సుధలు చిలుకు- కళ్యాణీ శ్రీవాణీ
అనవరతము నినుకొలిచెద- కలలను నెరవేర్చవే
అక్షరముగ నా బ్రతుకును-కడతేర్చవే, నీదరి జేర్చవే

1.నా ప్రాణదీపమే నీరూపము
నాలో చైతన్యమెనీ అస్తిత్వము
నా ఊపిరి నీవీణా మృదునాదము
నా ఎదనినాదమే నీ స్మరణము
సప్తస్వర వరదాయిని సామగాన వినోదిని
సాష్టాంగవందనాలు సారస్వతపుర రాణీ.గీర్వాణీ

2.నా కవనము నీభావన
పదపదము నీకే నివేదన
ప్రతిగీతము నిను నుతించు కీర్తన
నా కావ్యమల్ల నీకే సమర్పణ
విద్యా విశారదా వినతులందుకో
మాతా సరస్వతి ప్రణతులందుకో


వెదకబోయిన తీగవీవే
ఎదను కదిలించిన  అనురాగ మీవే
విగతజీవికి బ్రతుకు నిచ్చే సుధవు నీవే
మోడువారిన జీవితానికి తొలకరివి నీవే,రసఝరివి నీవే

1.నా ఎడారి దారుల సరోవరానివే
నా శార్వర యామినిలో నిగారానివే
నా చింతను తీర్చెడి చింతామణివే
నా మనాది మాన్పెడి ఔషధానివే
నన్ను అలరించెడి అలివేణివే,పూబోణివే

2.నా తలపుల వెలిసేటి ఇంద్ర ధనుసువే
నా ఊహల వెలిగించే తొలి రుచస్సువే
నా స్వప్నలోకాల సౌందర్య దేవతవే
ఆనంద తీరం చేర్చే దిక్సూచి నీవే
నన్ను మురిపించెడి నవమోహినివే,ప్రియరాగిణివే
లఘు రూప కవిత
చెప్పగలిగితేనె ఘనత
సాంధ్రీకృత భావుకత
గుండె గుండెతో జత

1.పరిమాణం పిడికెడంత
అనుభూతులు విశ్వమంత
హృదయమే ఒకవింత
లఘురూప కవితకు
ఎదయే ప్రామాణికత

2.అర్థము అంతరార్థము
కదిలించెడి పరమార్థము
లఘుకవితకు మూలము
సూక్ష్మంలో మోక్షము
లఘుకవితా లక్ష్యము

3.ఏ పేరుతొ పిలిచినా
పద నిర్మితి ఏదైనా
పదిమించని పంక్తులు
మితిమీరని జటిలతలు
రసగుళికలు లఘుకవితలు