Friday, January 31, 2020

మూగవోయెనేలా నా మానసవీణ
రాగాలు మరిచిందేమో తన జీవితాన
మౌన భావాలే మదికి చేరేలా
కనులైన ఈవేళ ఎరుకపరచవేలా

1.మూలనే పడిఉందో తీగలే తెగిఉందో
శ్రుతులనే మరిచిందో ఒంటిగా వగచిందో
మధుర నాదాలే మాయమైపోయే
రసమయమౌ రావాలే దూరమైపోయే

2.అందలేని స్వర్గాలూ నిజంకాని స్వప్నాలూ
చెదిరిన తన ఊహలూ కరిగిపొయ్న కల్పనలూ
కలతలన్ని నలతలుగా యాతనపడుతోందో
కదలలేక మెదలలేక చతికిలపడిపోయిందో
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

విశాల గగనంలో  నీవూ
సాహితీరంగంలో నేనూ
రవివి నీవూ కవిని నేనూ
వెలుగులు పంచుతూ
మానవత పెంచుతూ

1.తరువుల ఎదగుదలకు నీవే ఊతమై
పశుపక్ష్యాదులకు జీవన దాతవై
నరజాతి మనుగడకే అపర విధాతవై
జగానికంతటికీ నీవే అధినేతవై
సూర్యనారాయణా వరలుతున్నావు
నిత్యపారాయణా చెలఁగుతున్నావు

2.నవరసాల మురిపించు నేస్తమై
సమసమాజ నిర్మాణాసక్తమై
వర్ణాభివర్ణిత యుక్త ప్రయుక్తమై
నిత్యకర్మానురక్త వాఙ్మయవేత్తనై
వాగ్గేయకారుడిగా మనగలుగేవాడనూ
సారస్వతవనమందున విరినైనాడనూ

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అతను: నా గాన కోకిలా గారాలు పోకిలా
రాగాల పల్లకిలో ఊరేగని నన్నిలా
ఆమె: నా వెండి వెన్నెలా  ఆమబ్బుల చాటేలా
కురియవే బ్రతుకంతా ప్రేమరుచిని చాటేలా

అతను:1.కిసలయాల మిసమిసలు నీ కోసం దాచా
ఆరారుకారులూ నిన్ను మాత్రమే తలచా
ఎడారిలో వరదల్లే నీ గానం అలరించు
ఏడాది పాటూ... అది నిన్నే తలపించు

ఆమె: కలువనై ఎన్నటికైనా నిను కలువగ జూచా
గ్రహణాలూ అమాసలెన్నో ఆర్తితో సహించా
నీ అమృతకిరణాలే నా పంచప్రాణాలు
కార్తీక పున్నమలెపుడూ నాకు వేణుగానాలు

అతను2.పట్టుబట్టి పాడమంటే బెట్టుచేతువేలనో
ప్రాధేయపడుతున్నా కనికరించవేలనో
గీతాలకు నేనెపుడూ ముగ్ధుడనై పోతాను
సంగీతమంటే చెలీ చెవికోసుకుంటాను

ఆమె:కోయిలకూ జాబిలికీ పొత్తుకుదురుతుందా
గీతమే నాకు ఊతం అందమే నాకు శాపం
అతను:చంద్రికకు గీతికకూ లక్ష్యం ఆహ్లాదమె కాదా
అభిమానమె కొలమానం అనుభూతియె బహుమానం
ఏం తింటున్నావో ఏం నంజుకుంటున్నావో
ఏం జుర్రు కుంటున్నావో ఏమాస్వాదిస్తున్నావో
మరులు మాగబెట్టి ఉంచా విందుకోసం
పరువమే పలావు చేసా ఇందుకోసం
సొగసులన్ని వండివార్చా నీకోసం
వలపులన్ని వడ్డిస్తా ఈ మధుమాసం

1.గోముగా చూసేచూపు గోంగూర పచ్చడి
ప్రేమగా నవ్వే నవ్వు ఉల్లి పెరుగు పచ్చడి
అలకనంత ఊరబెట్టి ఆవకాయ పచ్చడి పెట్టా
బిడియాన్ని పక్కనపెట్టి బిరియాని చేసిపెట్టా
సొగసులన్ని వండివార్చా నీకోసం
వలపులన్ని వడ్డిస్తా ఈ మధుమాసం

2.నిండు మనసుతో నేను బెండకాయ వేపుడు చేసా
మిసమిసనా వన్నెలతో సొరకాయ కూర చేసా
వంపుసొంపులన్నికూర్చి గుత్తివంకాయ వండా
కరకరమని నమిలేలా మిరపకాయ బజ్జీ వేసా
సొగసులన్ని వండివార్చా నీకోసం
వలపులన్ని వడ్డిస్తా ఈ మధుమాసం