Friday, November 29, 2019

రేపటి నిర్వేదం విస్మరించి
తీరని మీ  స్వప్నం ఫలించి
ఫించనే ఆసరాగా హాయిగా బ్రతుకే సాగాలి
ఉద్యోగజీవిత అనుభూతులను నెమరేసుకోవాలి
పదవీ విరమణ తదనంతరమూ ఆనందంగా గడపాలి
అభినందనలు నీకివే మిత్రమా
శుభాకాంక్షలివిగో నా నేస్తమా

1.జీతం కోసమే పనిచేసినా
జీవితాంతం కర్తవ్యానికె కట్టుబడినారు
ఉద్యోగ ధర్మమే ఐనా
ప్రజలకు వీలైనంతగ సేవచేసినారు
యాజమాన్యపు అంచనాలను మించిపోయారు
ఉన్నతపదవులనెన్నెన్నో అధిరోహించారు
మీ నిబద్ధతకు జోహారు మిత్రమా
మీ సౌమ్యతకు జేజేలూ నేస్తమా

2.బాధ్యతలన్ని నెరవేర్చుకొని
కుటుంబానికే అండగ నిలిచారు
కఠినంగా వ్యవహరించినా
ఏ కల్మషాలను ఎరుగని వారు
స్నేహానికెంతగానో విలువిచ్చారు
ఆటుపోట్లనెన్నో తట్టుకున్నారు
మీక్రమశిక్షణకే జోహారు మిత్రమా
మీ విజ్ఞతకే జేజేలు నేస్తమా

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:భూపాలం

మేలుకొలునవదేమి స్వామీ
మేము పాడే మేలుకొలుపులన్నీ వృధానా ఏమీ
ఉన్నావో లేవో అనెడి శంక మా కిపుడింక
ఉండీమిన్నకుంటూ చూడవేమో మా వంక
తిరుమలా తిరుపతీ శ్రీ వేంకటేశా
శిథిలమైనా మా గుండియ నీకోవెల కావడం ఎలా

1.శచీపతిచే వంచనకు గురియైన ఆ అహల్య నాదరించలేదా
సీతామాతను చెఱబట్టిన రావణుడినీ మట్టుబెట్టలేదా
వేచిచూచిన శబరిని బ్రోచితివన్నది కట్టు కథేనా
స్త్రీ పక్షపాతివే నీ ప్రతీ అవతారమునందునా
ఉదాసీనమేలయ్యా కలి సుదతుల కడగండ్ల ఎడల
తిరుమలా తిరుపతీ శ్రీ వేంకటేశా
ఊరకుండిన నేరమౌను నీదే ఓ శ్రీనివాసా

2.దుశ్శాసన దుర్యోధనాదుల తుదముట్టించలేదా
కీచకుడి పీచమణచగ భీముడికి తోడై నిలువగలెదా
ద్రౌపదిని పదేపదే ఆదుకొన్నది నిజంకాదా నీవెనన్నది
కుబ్జనొక స్పర్శతో సుందరిగ నీవేగద మార్చినది
నిర్లక్ష్యము నీకేల కలి  కోమలాంగుల కాపాడగ
తిరుమలా తిరుపతీ శ్రీ వేంకటేశా
ఊరకుండిన నేరమౌను నీదే ఓ శ్రీనివాసా
పోయేప్రాణం మనదే-జరిగే నష్టం మనదే
అవమానాలు మనకే-అత్యాచారం మనకే
అవకాశాలే ఇవ్వకూడదు దొంగనాయాళ్ళకు
అడుసుతొక్కి వగచకూడదు కడుగ నీళ్ళకు
జాగ్రత్తలనే మరువకూడదు పొరపాటుగానైనా
నిర్లక్ష్యం అసలేకూడదు  ఏమరుపాటుగనైనా

1.కురచైన దుస్తులతో ఎందులకా ప్రదర్శనలు
భారతీయ కట్టుబొట్టు జగతికి ఆదర్శాలు
విప్పికుప్పబోసాక పశువాంఛే పెట్రేగదా
అందాలనారబోస్తే వెర్రే శృతిమించదా
మగమనసే ఒక వానరము-
అదుపుతప్పు  ప్రతినరము
మృగాలనే రెచ్చగొట్టి  లబోదిబో మనడమెందుకు
పడతికి ప్రతిగా ఏ పసిదాన్నో బలిఎందులకు

2.విచక్షణను కోల్పోవడమే వైపరీత్య కారణము
మత్తులో మైకంలో వావి వరస మరవడము
విదేశీ వికృతమోజులొ విలువలనే కోల్పోవాలా
అంతర్జాల మాయకు లోబడి కామంతో చెలరేగాలా
స్త్రీ స్వేఛ్ఛకు అవధులు లేవా
సమానతకు పరిధులు లేవా
ఆత్మరక్షణ కాయుధముంటే ఎన్నైనా చెప్పవచ్చు
డేగకన్ను పహరా ఉంటే విచ్చలవిడి విహరించవచ్చు

Thursday, November 28, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మనసాయె మనసాయిపై
షిరిడీ పయనమాయె తలపంత తానై
జయజయసాయీ జగద్గురుసాయీ
మాతండ్రి సాయీ మమతల సాయీ

1.పావన గోదావరిలో స్నానము చేసి
పూలమాలలు ప్రసాదాలు కొనుగోలు చేసి
తోటి భక్తులతొ సాయి లీలల నెమరేసి
ఓపికగా వరుసలొ నడవగ సమాధి కేసి
సాయి రూపమును దనివారచూసి
తెచ్చిన కాన్కల నర్పించేము మురిసి
జయజయసాయీ జగద్గురుసాయీ
మాతండ్రి సాయీ మమతల సాయీ

2.ధునిలో విభూతి నుదుటనబూసీ
తరలగ ద్వారకమాయీ కేసి
అడుగడుగున సాయి అడుగులు తలదాల్చి
సాయీబోధలు మననము జేసి
లేండీవనమున సంచరించి
తరియించెదము సాయి దీవెనలొంది
జయజయసాయీ జగద్గురుసాయీ
మాతండ్రి సాయీ మమతల సాయీ

Tuesday, November 26, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:హిందోళం

శుభోదయం వాట్సప్ సఖులకు
శుభోదయం ముఖపుస్తక నేస్తాలకు
శుభోదయం మిథ్యా ప్రపంచ ప్రముఖులకు
శుభోదయం బంధు మిత్రాదులకు,సహచరులకు
శుభోదయం శుభోదయం శుభోదయం

1.గతి తప్పని మీ నిత్యకర్మలకు శుభోదయం
ప్రగతి చేకూర్చే ప్రణాళికలకు శుభోదయం
సతీ సుతుల ఎడల మీ బాధ్యతకు శుభోదయం
మతిగలిగిన మీ ఆరోగ్య విషయ శ్రద్ధకూ శుభోదయం
శుభోదయం శుభోదయం శుభోదయం శుభోదయం

2.సాటి మనిషి పట్లమీ మానవతకు శుభోదయం
చేయదగిన మీ చిరు సాయానికి శుభోదయం
నవ్వుతు పదిమందికి పంచే నవ్వులకు శుభోదయం
విశ్వజనీనమైన మీ ప్రేమకూ శుభోదయం
శుభోదయం శుభోదయం శుభోదయం శుభోదయం

Monday, November 25, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:తోడి

ఎచటనున్నది భువన విజయము
ఏదీ అభినవ శ్రీకృష్ణ దేవ
రాయల విజయనగరము
రాజులూ మహరాజులేరీ
ఏరీ కళాపోషకులెచటగలడా భోజరాజు
ఆదరణకు నోచని కళాకారులెందరో
ప్రతిభకు గుర్తింపులేని కవిపుంగలెందరో
మరుగున పడి మగ్గుతున్న సంగీత స్రష్టలెందరో

1.ఎదురయ్యే అనుభవాలే సమసమాజహితాలై
ఎదపొందే అనుభూతులె కవితలు గీతాలై
ప్రతిక్షణం ప్రసవించే సృజనకారులెందరో
జనరంజకమొనరించే సృష్టికర్తలెందరో
ఆశించరే కానుకలను శభాషనెడి ప్రశంసలనె
ఊహించనూలేరు కప్పేదుప్పట్లని కొట్టగచప్పట్లనే

2.గజారోహణాలెక్కడ గండపెండేరాలెక్కడ
స్వర్ణకంకణాలెక్కడ సత్కారసభలెక్కడ
పత్రికలలో అచ్చైతే అదే కీర్తికిరీటం
కవిత చదువ వేదికపై అవకాశమె పురస్కారం
పైరవీలస్థాయి లేక అందుబాటునందలేని ప్రవీణులెందరో
పక్షపాత వాత పడి ప్రభుత వరకు చేరలేని ధురీణులెందరో

Sunday, November 24, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:రాగమాలిక

తప్పదు నరుడై పుట్టిన పిదప
అరిషడ్వర్గపు పీడన
అనుభవైకవేద్యమే మనుజులకు
పంచేంద్రియ ఘర్షణ
యోగిపుంగవులకే కష్టసాధ్యము
స్థిరచిత్తపు ఏకాగ్రత
మనోనిగ్రహానికి ఏకైక మార్గం
వైరాగ్య యోచనతో సాధన                            (సారమతి రాగం)

1.కలికీ కనకాలే కలికాలపు మాయలు
సౌఖ్యాలు వైభోగాలే భ్రష్టత్వ కారకాలు
త్యజించ గలిగినప్పుడే తాపసులకు తాదాత్మ్యం
భ్రమరకీటక న్యాయంతోనే భువిభ్రమలకు అంత్యం
రాగద్వేషాలకు కాగలిగితె అతీతులం
రాజయోగమార్గాన పొందగలము కైవల్యం        (అభేరి రాగం)

2.పూర్వకర్మననుభవించడం ఆచరణీయం
నిత్యకర్మానుష్ఠానం గృహస్తు శిరోధార్యం
వర్ణాశ్రమధర్మాల ధర్మవర్తనం అనుసరణీయం
మర్కటకిషోర న్యాయంతోనే మహా ప్రస్థానం
అన్యధా నాస్తి శరణ తత్వ భక్తి
కర్మయోగమార్గాన అందించును ముక్తి              (మోహన రాగం)

3.ఆత్మపరిశోధనలో అన్వేషణ నిరంతరం
ఏకం సత్విప్రా బహుదావదంతి వేదాంతం
త్వమేవాహం భావనలో తత్వమసియె గమ్యం
ఏకమేవా ద్వితీయం బ్రహ్మయనే ఎరుకయె సోహం
నళినీదళగత జలమతి తరళ భంగి స్థితప్రజ్ఞత్వం
జ్ఞానయోగమార్గాన ప్రసాదించు మోక్షం              ( రేవతి రాగం  )
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:శంకరాభరణం

త్రిపురాంతకా గరళము మ్రింగే నరుడను
త్రియంబకా మానవుడను ప్రకృతి హరుడను
త్రిగుణాతీతా మనిషిని భూలోకనాశకుణ్ణి
త్రికాలాధీశా మనుజుణ్ణీ కాలహరుణ్ణి
పాహి పాహి మహాదేవా
దేహిదేహి సుజ్ఞానము జగద్గురుదేవా

1.త్రికరణశుద్ధిగా నెరనమ్మితిరా
త్రిదళబిల్వపత్ర అర్చన జేసెదరా
త్రిశూలధారీ సతతము కాపాడరా
త్రిలోక హితమును చేకూర్చరా
పాహి పాహి మహాదేవా
దేహిదేహి సుజ్ఞానము జగద్గురుదేవా

2.త్రిపుర సుందరీ మనోహరా
త్రివిక్రమ ప్రపూజితా జితేంద్రియా
త్రేతాగ్ని నేత్రా పవిత్రా అత్రివరదా
త్రిజన్మ పాపకర్మ నిశ్శేష హారకా
పాహి పాహి మహాదేవా
దేహిదేహి సుజ్ఞానము జగద్గురుదేవా

Saturday, November 23, 2019

నా ఊహలు మల్లెపూలు
నీ తలలో తలపులలో
నా ఊసులు విరజాజులు
నీ కలలో కల్పనలో
నా బాసలు బంతిపూలు
ఈజన్మలో ఏడేడు జన్మల్లో
పరిమళాలు వెదజల్లుతోంది ప్రేయసీ
మనప్రేమ వనమంతా  విరగబూసీ

1.నా భావన కలువలు
నీ కన్నుల్లో పున్నమి వెన్నెల్లో
నా నందివర్ధనాలు
నీ పెదవుల్లో ముసిముసినవ్వుల్లో
నా స్మృతి మందారాలు
నీ బుగ్గల్లో నునులేత సిగ్గుల్లో
నా స్మరణ దవనాలు
తనువంతా తన్మయమయ్యేంత

2.నా ధ్యాస చేమంతులు
నీమేని ఛాయలో వింతైన మాయలో
నా ధ్యానపారిజాతాలు
నీ తమకంలో ప్రణయమైకంలో
నా జ్ఞాపక రోజాలు
నాపై మోజుల్లో అన్నిరోజుల్లో
నీ విరహ అగ్నిపూలు
ఆరారు ఋతువుల్లో మన రతిక్రతువుల్లో




రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:ఆనంద భైరవి

ఉగ్రమూర్తీ మాయ'మ్మా
భద్రకాళీ మా తల్లీ
విజయవాడ కనకదుర్గా
అలంపురం జోగులాంబా
వేములాడ రాజేశ్వరీ మాజననీ
శ్రీ రాజ రాజేశ్వరీ మా మాతా
తల్లీ నీకు పబ్బతులు-అమ్మా నీకు చేజోతలు

1.నిత్యము కాపాడే కలకత్తా రుద్రకాళీ
నిరతము కరుణించే మా లష్కరు మహంకాళీ
బదామిలో వెలసినా వనశంకరీ దేవీ
కళూరులో నెరిసినా మూకాంబికా మాతా
మనసున్న మధురా మీనాక్షీ
మముగన్నా తల్లీ కంచీకామాక్షీ
అమ్మా నీకు వందనాలు తల్లీ నీకు దండాలు

2.కాశీలో నెలకొన్న దయామయీ విశాలాక్షి
ఉజ్జయినిలొ కొలువున్న శక్తీ మహాకాళి
శ్రీ గిరిపై అలరారే శ్రీ భ్రమరాంబికా
శ్రీకాళ హస్తిలోని జ్ఞాన ప్రసూనాంబికా
కొల్హాపురిన వెలుగొందే తల్లీ మహాలక్ష్మి
బాసరలో భాసిల్లే శ్రీ జ్ఞాన సరస్వతీ
జననీ నీకు జేజేలు  తల్లీ నీకు హారతులు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:సింధుభైరవి

వేంకట రమణా సంకట హరణా
కరుణాభరణా దురిత నివారా
పన్నగ శయనా పంకజ చరణా
దీనావనా పరమ పావనా

1.జగన్నాథ పురుషోత్తమ సంకర్షణా
ధర్మ సంస్థాపనార్థా దశావతార ధరా
శిష్టపాలనా లక్షిత దుష్ట దానవ సంహరణా
భవబంధవిమోచనా భక్త పోషణా

2.ఈప్సితార్థ దాయకా యశోభూషణా
గరుడగమన గజవరదా ఆశ్రిత జన రక్షకా
మానినీ ద్రౌపదీ మాన సంరక్షకా
కలియుగ నిజ దైవమా శ్రీమన్నారాయణా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చెలి సోగ కన్నుల కాటుకే
వగలొలికె వలపు కాటుకే
నను దాచిపెట్టి మది చాటుకే
మంత్రించి రప్పించె తన చోటుకే

1.అక్షరశరములు సంధించి
హృదయములో నను బంధించి
వంపుసొంపులను వడ్డించి
ఆకలి తీర్చె అధరములందించి

2.సరస రుచులను రంగరించి
సరికొత్త సరసాల పాఠాలు నేర్పించి
భువిలోనె స్వర్గాలు చూపించి
కైవల్యమిచ్చింది కౌగిలిపంచి
ఆశవు  నీవే-ధ్యాసవు  నీవే
ఆయువు పెంచే సంజీవనివే..
నామనసున ఇక దేవత నీవే
నాపెదవులపై ఒక పాటవి నీవే
నా పంచ ప్రాణాలూ నీవే-నా ఏడు జన్మలూ నీవే

1.పౌర్ణమి చంద్రుని చందం –అగుపించే నీ ప్రియ వదనం
   ఉదయించే భానుడి బింబం - తలపించే  నుదుటన తిలకం
   సృష్టిలోని అందాలన్నీ నీ రూప లావణ్యాలు
   క్రీ గంటి చూపుకే నీ పాదాక్రా౦తాలు
   చెలీ నా పంచ ప్రాణాలూ నీవే-నా ఏడు జన్మలూ నీవే

2.కొండవాగు నడకల్లోనా నీ నడుము వంపులు
  కడలి అలల తరగల్లోనా నీ నవ్వుల సొంపులు
  తలపులోకి నీవు రాక క్షణమైనా గడిచేనా
  యముడు వచ్చి పిలిచిన గాని  నా తనువు విడిచేనా
  చెలీ నా పంచ ప్రాణాలూ నీవే-నా ఏడు జన్మలూ నీవే

Thursday, November 21, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:శివరంజని

గుండె పెకిలించినా-పీకనులిమేసినా
ఉండదేమొ ఇంతటి ఈ బాధ
చెలి చేయిజారినంత వ్యధ
కాలమా ఏమినీ మాయాజాలం
కనులు సంద్రాలయ్యే ఈ ఇంద్రజాలం

1.తొలిచూపుల ఆ శుభవేళ
ప్రేమ మొలకెత్తిన నిమిషాన
లెక్కవేయలేదు ఏజాతకాలు
ఎంచిచూడలేదు కులమతభేదాలు
సమాజానికెందుకో చెప్పలేని ఉత్సాహం
ఈ పెద్దలకెందుకో మొత్తుకునే రాద్ధాంతం
నిలువునా కాల్చేసినా-కడుపులో కత్తిదించినా
ఉండదేమొ ఇంతటి ఈ బాధ-చెలి చేయిజారినంత వ్యధ

2.ఊరికెంతెంతొ  కడుదూరానా
బ్రతకనీయరామీరు మమ్ము మా మానాన
విడదీయగలరేమో మా ఇద్దరి తనువులను
వేరుచేయసాధ్యమా ఏకమైన మనసులను
గడపాల్సిన రోజుల్లో విషాదాన్ని నింపుతారు
పండంటి జీవితాల్లో దుఃఖాన్ని వంపుతారు
విషము మ్రింగించినా-గొంతు ఖండించినా
ఉండదేమొ ఇంతటి ఈ బాధ-చెలి చేయిజారినంత వ్యధ
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:ఉదయ రవి చంద్రిక

ఎక్కడచూసినా మిక్కిలి చక్కదనం
నీ తనువే ప్రేయసీ జక్కనచెక్కిన శిల్పం
నొక్కులున్న చెంపలు-చిక్కిన నడుమొంపులు
చెలీ నీవే స్వప్న సుందరీ-సఖీ నీవే పుష్ప మంజరి

1.అపురూప శంఖమేమో నీ కంఠాన
పూర్ణకలశాలు నీ విశాల వక్షాన
కిన్నెరసాని హొయలేమో నీకటి వలయాన
అహో బిలమెదురాయే ఉదరావర్తనాన
నూగారు మార్గమాయే అడుగిడ స్వర్గాన
చెలీ నీవే స్వప్న సుందరీ-సఖీ నీవే పుష్ప మంజరి

2.కోడెనాగు బుసలేమో వాలుజడ కదలికల
ఇసుకతిన్నెలేమో వెన్నులోయ అంచుల
హంసల దండు నిన్ను అనుసరించేలా
అమృతమంతా నీ మధుర అధరాల
చంద్రికాపాతమంతా రెండునయనాల
చెలీ నీవే స్వప్న సుందరీ-సఖీ నీవే పుష్ప మంజరి
రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:లలిత

నమ్మితే నష్టమేమిటీ
సాయీ నినువేడితే కష్టమేమిటి
చీకటైన బ్రతుకులకు వెలుతురు నీవని
మండుతున్న గుండెలకు వెన్నెల నీవని
జయహో సూర్య తేజా జయహో యోగిరాజా
జయహో శీతకిరణా జయహో సాయినాథా

1.విశ్వాసమె నా శ్వాస
నీ ఎడల గురి నా ఊపిరి
నా హృదయమే ద్వారకమాయి
నా జీవితమే నీకంకితమోయీ
జయహో సూర్య తేజా జయహో యోగిరాజా
జయహో శీతకిరణా జయహో సాయినాథా

2.నీ నామమె స్మరణీయం
నీ చరణమే   సదా శరణం
నీ బోధలే ఆనుసరణీయం
నీ మార్గమే ఆచరణీయం
జయహో సూర్య తేజా జయహో యోగిరాజా
జయహో శీతకిరణా జయహో సాయినాథా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మధ్యమావతి

నీతో నీవే ఉన్నావు
అనంతయానం చేస్తున్నావు
పుట్టకముందూ పోయిన పిదప
భువిన ఉన్నఈ నాలుగు నాళ్ళు
భావించరా నేస్తం ప్రతి వాళ్ళూ నీ వాళ్ళు
గడిపేయరా సంతోషంగా బ్రతికినన్నాళ్ళూ

1.ఉండబోవు ఉదయాస్తమయాలు
కానరావు రోదసిలో నదీనదాలు
గమ్యం తెలియని దీర్ఘ ప్రయాణం
చూట్టూ చీకటి అంతా ఏకాంతం
ఆకలి దప్పుల ఊసేలేదు రుచికీ పచికీ దిక్కేలేదు
కాలాన్నెపుడూ జుర్రుకో అనుభూతులనే నంజుకో

2.అందమైన నీరూపం ఉండబోదు ఆత్మకు
పంచేద్రియ పరితాపం కలుగబోదు జీవికి
పలికేందుకు ఎవరూ లేక పిచ్చిలేసిపోతుంది
నీ అధీనంలొ నువ్ లేకా విసుగు ఆవరిస్తుంది
కనిపించని దైవమేదో కనికరించి తీరాలి
క్షణం వృధా పరుచుకోక అనుభవించగలగాలి

Tuesday, November 19, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:అమృత వర్షిణి

వెన్నెలే ఘనీభవించి
మోవిలో ద్రవీకరించి
కన్నుల్లో ఆసాంతం కురిపించి
చేసాడు సాయమెంతొ నిను నాకందించి
బ్రహ్మకెపుడు అందుకే వందనమందు శిరసువంచి

1.కమలాలే నయనాలుగ రూపొందించి
అమృతాన్ని అధరాల్లో కూర్చిఉంచి
కపోలాల రోజాలవన్నెలుపంచి
తీర్చిదిద్దాడు నిన్నెంతో నన్ను కనికరించి
అందుకే నాకెపుడు ప్రియదైవమె విరించి

2.గోదావరి నే నీ ఎదగా మలిచి
కృష్ణవేణి వడ్డాణంగ నడుమున బిగించి
హిమనగములు మేరుగిరులు ఇరుదెసల పొదిగించి
సృష్టించి వరమొసగెను విధాత
అందుకే ఆస్వామికి నా చేజోత
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:కానడ

తాళను నేనిక బాలా,వరాల జవరాలా
ఈవేళనూ నీ రూపుగనిన ఏ వేళనూ
మనజాలను నువువినా విరహసెగలను

1.నీ అంగాంగం మదనకేళీ లీలా విలాసం
నీ మేను ఏడాది పొడుగూ మధుమాసం
నీ తనువు బృందావన యమునావిహారం
నీ దేహమే ఇహపర సుఖకర కైవల్య సారం

2.ముట్టుకుంటె పట్టులాంటిది నీ స్పర్శ
ముద్దెట్టుకుంటే మధువుతీరే ఆ నషా
ముద్దవనీ తడిసి నీ చెమటల వర్షానా
మునిగిపోనీ నను అగాధ జలధులలోనా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మాయామాళవ గౌళ

పురుష పుంగవులం
పేరుకే పురుషోత్తములం
పెళ్ళాడే వరకు తల్లిచాటు పిల్లలం
మూడుముళ్ళు మగువ కేసి
సంకెళ్ళు వేసుకునే మగలం
మృగతృష్ణకు వగచే బాటసారులం
భార్యా బాధితులం

1.శాంతి గురించి ఎరుగని వాళ్ళం
ఏ జ్యోతి వెలగని బ్రతుకులం
వెన్నెల కోసం చూసే చకోరులం
సూర్యకాంతమంటి అయస్కాంతానికే-
బంధీలం జీవిత ఖైదీలం.

2.కొడుకుగా తండ్రిగా సోదరునిగా
చీచా మావా బావా లైన బహురూపిగా
మేకపోతు గాంభీర్యం ఆహార్యంగా
యుగాలుగా దగాపడిన మగజాతికే
వారసులం నామమాత్రపు సరసులం

Monday, November 18, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:అఠాణా

ప్రకృతికీ పడతికీ ఎంతటి పోలిక
అందుకేగా సృష్టికే అతివ ఏలిక
లలనలోన అణువణువు
జగతిన సుందర తావు 
కవులెంత వర్ణించినా
జిలుగులెపుడు తరిగిపోవు

1.కృష్ణవేణి సింగారం-తరుణి శిరోనయగారం
గోదావరి గంభీరం-సుదతి వదన సౌందర్యం
ఉషఃకాల రవిబింబం-రమణి నుదుటి సింధూరం
కుసుమ సమకోమలం-కలికి మేని లావణ్యం

2.హిమగిరి తగు  ఔన్నత్యం-హేమ హృదయ వైశాల్యం
కేసరి సరి వయ్యారం-నెలత కటి లతా తుల్యం
ఘన జఘన విన్యాసం-నితంబినీ అతులిత లాస్యం
పల్లవ పద సదృశ మానం-మంజరి మంజీర ధ్వానం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మోహన

సౌందర్యోపాసన
సరస హృదయ భావన
సొగసుల ఆరాధన
మనసుకెంత సాంత్వన
సుందర దృశ్యాల ఆస్వాదన
పూర్వజన్మ పుణ్య వశానా

1.బ్రహ్మ సృజనకు విలువను ఇచ్చి
అందగత్తెల సొబగుల మెచ్చి
మురియని మది ఏమది సమాధి
పులకించని మతి నిజమైన చితి
సుందర దృశ్యాల ఆస్వాదన
పూర్వజన్మ పుణ్యవశానా

2.పరస్పరం పడతీ పురుషులు
అనుక్షణం వలపుతొ ఆకర్శితులు
భేషజాల ముసుగులు ఏలా
గుంభనాల లొసుగులె చాలా
సుందర దృశ్యాల ఆస్వాదన
పూర్వజన్మ పుణ్య వశానా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:భీంపలాస్

దోసిటిలో కాసిన్ని నీళ్ళుతెచ్చి
అభిషేకించగా నను నీవు మెచ్చి
మహాలింగ శంభో చూడునన్ను కనువిచ్చి
కనికరించరా ప్రభో నీ అక్కున ననుజేర్చి

1.తిన్నడు చేసినా పున్నెమేమిటో
తిన్నగ కైలాసవాసమొసగినావు
కరినాగులూ మరి సాలెపురుగూ
చేసిరే పూజలని మురిసినావు
ఆపాటిచేయదా నా నోటి పాట
దూర్జటీ నుదుటికంటి జగజ్జెట్టి శరణంటీ

2.లక్ష్మీపతి కమలాక్షుడు దీక్షగా
నిను లక్ష కమలాల అర్చన జేసే
రావణబ్రహ్మ కుక్షినరములతో
రుద్రవీణమ్రోగించి నిను తృప్తిపరచే
మామూలు మానవుణ్ణి నినునమ్ముకున్నవాణ్ణి
మహాదేవ పంచాక్షరి మాత్రం జపియించువాణ్ణి

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
అరిచిమొత్తుకొంటోంది ఆరాటపు అంబులెన్సు
వాహనాలకేదీ కామన్ సెన్సు
ఏనాటికి తీరేనో ట్రాఫిక్ న్యూసెన్సు
చేష్టలుడిగి చూస్తోంది గవర్నెన్సు

1.రూల్సెన్ని పెట్టినా పెనాల్టెంత వేసినా
తిరిగి పోయలేము కదా పోయిన ప్రాణాలని
మనమో మన ఆప్తులో ప్రమాదంలొ గాయపడితె
 ఓర్చుకోలేము కదా ఏ అవాంతరాలని
మరుగున పడిపోయిందా సివిక్ సెన్సు
ఆశించినామంటే అత్యాశే సిక్త్ సెన్సు

2.అత్యవసర వాహనాల ప్రాముఖ్యత ఎంతటిదో
ఫైర్  పోలీస్ వైద్యశాఖల విలువ ఏపాటిదో
ఉన్నంతలొ చోటిచ్చి మార్గాన్ని సుగమ పరచి
సహాయపడలేమా సహానుభూతి వ్యక్తపరచి
మరిచామా మనలోని మానవతా ఎస్సెన్సు
ఉంచగలిగితే చాలు మమనసుని ప్రెసెన్సు




Wednesday, November 13, 2019

నమ్మితినయ్యా నెమ్మనమ్మున
మా అమ్మను అన్నిట నమ్మినట్లుగా
అడిగితినయ్యా ఆదుకొమ్మని
మా నాన్నను యాగితొ అడిగినట్లుగా
కడుపునింపకా తప్పదునీకిపుడు
కలియుగవరదా వేంకటరమణా
కోరినదొసగకా గతిలేదిప్పుడు
కమలనాభా స్వామీ కరుణాభరణా

1.క్షణము విత్తము క్షణము చిత్తము
నా బ్రతుకే నువు రాసిన పొత్తము
భక్తపాలకా భవబంధమోచకా
శరణాగత వత్సల మోక్ష దాయకా
కడుపునింపకా తప్పదునీకిపుడు
కలియుగవరదా వేంకటరమణా
కోరినదొసగక గతిలేదిప్పుడు
కమలనాభా కరుణాభరణా

2.లిప్తపాటె గద మనిషి జీవితం
అంతలోనే నీ జగన్నాటకం
కేళీలోలా శ్రితజనపాలా
దురితనివారణ ధూర్తశిక్షకా
కడుపునింపకా తప్పదునీకిపుడు
కలియుగవరదా వేంకటరమణా
కోరినదొసగక గతిలేదిప్పుడు
కమలనాభా కరుణాభరణా

మౌనమె నా భాష
నగవే నా కవనం
చూపులు ఒలుకును కరుణరసామృతం
మానవతే నా హృదయధ్వానం

1.మనిషికి మనిషికి మధ్యన ఎందుకు
అపరిచిత భావనలు
భూగ్రహవాసులమేకదా దేనికి
వైరులమన్న యోచనలు
నేడోరేపో ఏక్షణమో ఎప్పటిదాకో
చెల్లగ నూకలు
ఉన్నన్నాళ్ళు తిన్నదరుగక
కాలుదువ్వడాలు
నా ఊపిరి వేదమంత్రం
నా గమనం భవ్యమార్గం

2.వేదించి పీడించి మ్రింగుడెందుకు
నెత్తుటికూడు
తేరగవచ్చినదేదైనా బిచ్చంతో
సరి ఏనాడూ
మిద్దెలు మేడలు ఏవైతేం
నీవా ఆస్తిపాస్తులు
ఆరడుగులలో కప్పెడినాక
నేలపాలే అస్తికలూ
నా గీతం తత్వసారం
నా లక్ష్యం స్నేహతీరం

రాగం:యమన్ కళ్యాణి


అడుగడుగూ నీ సంకల్పం
ప్రతిపదమూ నీ నామజపం
సద్గురు సాయినాథా
నీవేలేనా గతము భవిత వర్తమానము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

1.నా బ్రతుకున ఎలా ప్రవేశిస్తావో
దేనికొరకు నను నిర్దేశిస్తావో
ఏ పనినాకు పురమాయిస్తావో
ఏదిశగా నను నడిపిస్తావో
అంతానీదే భారం
జీవితమే నీ బోధలసారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

2.సచ్చరిత్ర నాతో చదివిపిస్తావో
సత్సంగములో నను చేర్పిస్తావో
షిరిడీకెప్పుడు  నను పిలిచేవో
నీదయనెప్పుడు కురిపించేవో
అంతానీదే భారం
జీవితమే నీ బోధలసారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి




Monday, November 11, 2019

ఎక్కడో బ్రతికి ఉంది నేస్తమా
పూర్తిగా చావలేదు మిత్రమా
కొస ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది
జీవించడానికే తాపత్రయ పడుతోంది
తట్టిలేపవేమి తమ్ముడా నీలోని మానవతని
చైతన్యపరచు అన్నయ్యా నీలోని మమతని

1.పుట్టినదాదిగా కరడుగట్టి లేముకదా
ఏబడిలోనూ కాఠిన్యం నేర్పరుగా
మనసుపెట్టి కాస్తచూస్తె కరుణ పొంగి పొరలదా
సహానుభూతితో అభ్యర్థన అర్థమవదా
దువ్వవేమి సోదరా నీలోని మానవతని
బుజ్జగించు చుట్టమా నీలోని మమతని

2.ఒడ్డున ఉన్న నీకు మునకలేయ వెత తెలియున
కడుపునిండి ఉన్న నీకు ఆకలి కత నెరుగుదువా
ఎడారి దారిలో కన్నీటికీ కరువే
నెలజీతగానికీ దినంగడపడం బరువే
అహమింక మాని నీవు  వదాన్యుడవనిపించుకో
విశాల హృదయంతో మాన్యుడిగా మసలుకో

Sunday, November 10, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:శివరంజని

నిన్నటిదాకా నీవెవరో నేనెవరో
అపరిచితులమైన మనము ఎవరికి ఎవరమొ
ఏ జన్మ బంధమో కలిపింది ఇద్దరినీ
ఇలా ప్రేమ బంధమై మనల ముడివేసింది

1.నదిలాగ సాగే నన్ను కడలికడకు చేర్చింది
గొంగళిపురుగైన నన్ను సీతాకోకచిలుకగమార్చింది
ఆలింగనమ్ముతో నిన్నాదరించానే
పూవుగామారి నా మకరందము పంచానే
ఏ జన్మ బంధమో కలిపింది ఇద్దరినీ
ఇలా ప్రేమ బంధమై మనల ముడివేసింది

2.కాలమాగిపోయింది మనం కలుసుకున్న క్షణంలో
ప్రకృతే స్తంభించింది పరస్పరం నిరీక్షణంలో
సంగమాలు సంభవించి సంభ్రమానికి లోనైనాను
ఎడబాటు సడలగనే ఎదలయతో లయమైనాను
ఏ జన్మ బంధమో కలిపింది ఇద్దరినీ
ఇలా ప్రేమ బంధమై మనల ముడివేసింది



చిన్నమొలకకూ లేవు రామచిలకకూలేవు
వాన చినుకుకైన లేవు వాగువంకకింకలేవు
నీకేలనో ఓమనిషీ ఇంతటి ఈర్ష్యాద్వేషాలు
నీకెందుకో ఓ నరుడా ఈ అసూయా మోసాలు

1.నీకు లేక వగచేవు అదియే  ఒక వ్యధ
సాటివారు కలిగి ఉంటె ఓర్వలేనిదొక బాధ
నీ కళ్ళమంట వల్ల నీవే దుఃఖింతువు
నీ కడుపుమంట నీకే దహన హేతువు
కడలి కెప్పుడూ లేవు ఖంబుకెంతయూ లేవు
నీకేలనో ఓమనిషీ ఇంతటి ఈర్ష్యాద్వేషాలు
నీకెందుకో ఓ నరుడా ఈ అసూయా మోసాలు

2.ప్రతిభను ఈసడిస్తె నీకొరిగే దేమిటి
గుర్తింపును నిరసించే సంస్కారమేపాటిది
సూర్యునిపై ఉమ్మితే పడుతుంది నీపైనే
విద్యుత్తుని ముట్టకుంటె ఎప్పటికీ నీకు హానె
చెట్టుచేమకూ లేవు కొండకోనకూ లేవు
నీకేలనో ఓమనిషీ ఇంతటి ఈర్ష్యాద్వేషాలు
నీకెందుకో ఓ నరుడా ఈ అసూయా మోసాలు

Saturday, November 9, 2019

వెతికితి నీకై ఎన్నిచోట్లనో
శోధించగ పడితిని ఎన్నిపాట్లనో
మోహన కృష్ణా తీర్చర నా జీవనతృష్ణా
రాధారమణా కరుణా భరణా

1.వెన్నను దోచే కన్నయ్య వని
గొల్లవాడనల్లా తిరుగాడితిని
వలువలు దాచే కిట్టయ్యవని
చెఱువుల గట్టున నే దాగితిని
మనసు నవనీతమైతె చాలను
మర్మము నంతలొ నే మరచితిని

2.గర్భగుడిలో కొలువుందువని
వడివడి ప్రతిగుడి కడకేగితిని
యమునా తటిలొ వ్యాహళికని
వెడలితివని నేనట జనితిని
మది మందిరమై మనినచాలను
నియమము నేలనొ ఎరుగనైతిని

Friday, November 8, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:చిత్తరంజని

వాడని మల్లెలు నా అక్షరాలు
అల్లినీకు సమర్పింతు జీవనమాలలు
కొడిగట్టని ప్రమిదలు నా పదములు
ప్రణమిల్లి విరజిమ్మెద గీతాల వెలుగులు
నిలువనీ నీ ఎదపై శ్రీనివాస నను సదా
చెలగనీ నా ప్రభలే వేంకటేశ నీ ముంగిట

1.అన్నమయ్య కీర్తనలట వింటినే ముప్పదిరెండువేలని
ఎన్నగ నా వెన్నని భావించి స్వీకరించు ఈకొన్నే వెన్నని
ఎంత సమయమిస్తివని నను బాధల పాల్జేసి నవ్వుకొని
నమ్మిధారపోస్తిని స్వామీ నీకిక  జన్మే కైంకర్యమని
నిలువనీ నీ ఎదపై శ్రీనివాస నను సదా
చెలగనీ నా ప్రభలే వేంకటేశ నీ ముంగిట

2.ఉన్నదనీ లేదనీ చెప్పలేను నీదయ నా పైన
 మన్నన సేయవయా ఇకనైనా పన్నగ శయనా
కన్నతండ్రినీవని తలవకపోతినా ఎన్నడైనా
కడుపున పుట్టితివని ప్రభూ చేరదీయనైతినా
నిలువనీ నీ ఎదపై శ్రీనివాస నను సదా
చెలగనీ నా ప్రభలే వేంకటేశ నీ ముంగిట



రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:కళావతి

ఓంకారమె నీ ఆకారం శంకరా
ఝేంకారమె నీ ప్రాకారం అభయంకరా
ఆదిమధ్యాంతరహితము నీ తత్వము పరమేశ్వరా
మహాలింగ శంభో సాంబ సదాశివ విశ్వేశ్వరా
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

1.నీ మంద హాసమె మధుమాసం
ప్రజ్వలితమౌ ఫాలనేత్రమే గ్రీష్మం
ఝటా జూటమున గంగధారగా వర్షం
కాలస్వరూపా ప్రకృతి పార్వతి నీలొ సగం
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

2.నీ శిరసున వెలిగే శరజ్యోత్స్నలు
నీ చల్లని చూపులె హేమంతాలు
నశ్వరమౌ సృజనయే శిశిరము
ఋతంబరా నీ కార్యమె జనన మరణ భ్రమణం
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ



Thursday, November 7, 2019

"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి,
దేశభాషలందు తెలుగు లెస్స."

తెగులు తగులుకున్నది తెలుగు తల్లికి
తెల్లబోయిచూస్తున్నది కన్నవారి చేష్టలకి
పరభాషా వ్యామోహపు పైత్యములో
తెలుగుభాష చెప్పరాని దైన్యములో
మనతెలుగు భాష అనాథగా జగన్నాటకంలో
మన ఆంధ్రభాష సమాధిగా  అగాధమౌ జలధులలో

1.'అమ్మ'ను మమ్మీగా మార్చినపుడె తొలిగాయం
నాన్నను డాడీగా పిలిచినపుడె దయనీయం
అన్యపదము లాదరించు వైశాల్యము తెలుగుది
ఉన్నప్రథను విస్మరించు వైకల్యము తెలుగులది
మనతెలుగు భాష అనాథగా జగన్నాటకంలో
మన ఆంధ్రభాష సమాధిగా  అగాధమౌ జలధులలో

2.అందలాలనెక్కించి పట్టం కట్టబెడితె
ఎంతటి ధర్మమో ప్రజల మీద వాడ 'బడితె'
యథా రాజా తథా ప్రజా ఆనాటి మాట
ప్రజాశ్రేయమే కదా ప్రజాస్వామ్య ప్రగతి బాట
మనతెలుగు భాష అనాథగా జగన్నాటకంలో
మన ఆంధ్రభాష సమాధిగా  అగాధమౌ జలధులలో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:శుభ పంతువరాళి

నిద్రలేని రాత్రులెన్నో నీకోసం ధారపోసా
నా మనః సాగరాన్ని ఎంతగానొ మథనం చేసా
కవనామృతభాండం కోసం అనవరతం పరితపించా
ఎంత సుధను పంచానో మోహినికే ఎరుక
నిర్లక్ష్యపు గరళాన్ని దిగమ్రింగుతు నే బ్రతికా

భారతీ నీ అందియలే నా ఎదలో మ్రోగనీ
శారదా నీ దీవెనతో నా కలమే సాగనీ,నా కలనెరవేరనీ

1.కదిలించిన ప్రతివస్తువును కవితగా రాసేసా
భిన్నమైన అభిమానులకై పలువిధముల రచనలు చేసా
రంజింప జేయడమే లక్ష్యంగా నే తలపోసా
మానవతే పరమావధిగా గీతాలను నే కృతిచేసా
భారతీ నీ అందియలే నా ఎదలో మ్రోగనీ
శారదా నీ దీవెనతో నా కలమే సాగనీ,నా కలనెరవేరనీ

2.సుందరమౌ చిత్రాలుగా నా పాటలనే మలిచా
శబ్దార్థ కౌశేయములతొ అలంకరింప జేసా
ప్రాసల పసిడి నగలతో నిన్ను తీరిచి దిద్దా
అక్షరమే దైవంగా అను నిత్యం నే కొలిచా
భారతీ నీ అందియలే నా ఎదలో మ్రోగనీ
శారదా నీ దీవెనతో నా కలమే సాగనీ,నా కలనెరవేరనీ

Wednesday, November 6, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నిర్లక్ష్యం మాత్రమేనా విధినిర్వహణ
నిబద్ధతా రహితమా కర్తవ్య పాలన
ఈసడింపు అవసరమా ఎదుటివారి ఎడల
సహానుభూతి ఆచూకే దొరకదు ఏ కోశానా
అధికారం అనుభవించు ఉద్యోగులారా
స్థానబలం కలకాలం సాగదనీ మరిచారా

1.ఉద్యోగ భద్రతతో విర్రవీగుతారు
పనిజాప్యతా లక్షణంతొ చెలరేగుతారు
హాజరైతే చాలుకదా నెలజీతం ఖాతలో
ఆకాస్త పని చేసినా ఆమ్యామ్యా కొరకేగా
ఆపన్నుల కన్నీటితొ ఆస్తులు కూడబెట్టి
గోచీకీ నోచకా చితిచేరక తప్పదుగా

2.పదవి ముసుగు తొలగించి పౌరునిగా యోచించు
కార్యార్థుల కడగండ్లను నీవిగా భావించు
పరిధి మించి సహకరించ ప్రతి క్షణం ప్రయత్నించు
దాటవేయ దగినవైతె నియమాలను సడలించు
అభిమానం చూరగొంటె అంతకన్న తృప్తేది
సేవయె పరమార్థమైతె  కర్మకన్న హాయేది

Tuesday, November 5, 2019

ప్రియంకరీ శుభంకరీ
శాంకరీ అభయంకరీ
కనకదుర్గే శూలధరీ
ఇంద్రకీలాద్రి వసతే మారీ
మహిషాసుర సంహారీ
నమోస్తుతే ఆనందకరీ

1.విశ్వ నాయకి విజయ దాయకి
కరుణామృత ప్రసన్న ముఖీ
త్రిమూర్తి పూజిత త్రిగుణాతీత
పాలయమాం శ్రీ అష్టభుజి

2.ఆత్మజ్ఞాన వరదే మాత
పరమాద్భుత పరదేవత
అతులిత మహిమాన్విత నగజాత
భజామ్యహం నీలలోహిత






Monday, November 4, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఆఖరి చుక్కలు మధువున అతిమధురం
చరమాంకంలో  క్షణంక్షణం మనిషికి అపురూపం
చేజారిపోనీకు అనుభూతుల మణిహారం
తిరిగిరాదు కరిగిన కాలం అనుభవించు జీవితం

1.మీనమేషాలు లెఖ్ఖిస్తే - ఉన్నది కూడ ఊడుతుంది
చాదస్తాలను సాగదీస్తే -అసలుకు ఎసరే వస్తుంది
మంచో చెడో మనసుకు తోచిందేదో ఇపుడే చేసెయ్
 ఎదుటివాడికి హానిచేసె యోచనలన్ని మానేసెయ్
ఎంతైదూరమైనా చాపు నీచేతి చూపుడువేలు
ఎవరిముక్కును తాకనట్లుగా చూసుకుంటె అదిచాలు

2.యోగాచేస్తే బెటరేకానీ అన్నీ తినడం యోగమోయి
ఆరోగ్యానికి బ్రతుకెర వేస్తే అదే చోద్యమోయి
ఎలాగుతప్పవు శరీరానికి ముదిమి మరణాలు
యవ్వనదశకే మనసును వదిలెయ్ ఎందుకు కారణాలు
బిడియం వడియం మడిచేసి కట్టిన మడినే విడిచేసెయ్
ఆనందోబ్రహ్మ అన్నదే పరమపథమ్మటు అడుగేసెయ్

మళ్ళీ మళ్ళీ నిన్ను నే మళ్ళి చూసా
కళ్ళల్లోనె పర్మనెంటు టెంటు వేసా
చూపులతో నే లౌ మెసేజ్ లెన్నొ చేసా
నా గుండెలోతుల్లొ నిన్ను దింపివేశా
ఓ చెలీ మనోహరీ కమిటవ్వడం మినహా నీకులేదు దారి
మై డియర్ మైస్వీట్ హార్టంటు నన్ను పిలువు ప్యారీ

1.క్యాంటీనులోనే  కాపుకాసినాను-
మ్యాట్నీ షోకు టిక్కెట్స్ బుక్ చేసినాను
పోదాము లవ్లీ లాంగ్ రైడ్ జల్దీ రిసార్ట్ లో గడుపగా
మేఘాలతేలి స్వర్గాలు తాక రాకెట్ల బైకే నడుపగా
ఓ చెలీ మనోహరీ కమిటవ్వడం మినహా నీకులేదు దారి
మై డియర్ మైస్వీట్ హార్టంటు నన్ను పిలువు ప్యారీ

2.డొంట్ కేర్ ఎవ్రీబడి మనది వేరే లోకం
లీస్ట్ బాదర్ మై సఖీ చెప్తున్నా వెల్ కం
వచ్చేయి నచ్చాక రిస్ట్రిక్షన్సె ఒగ్గేయ్ ప్రేమకై స్వేఛ్ఛగా
నో పెయిన్స్ ఆల్ గెయిన్స్ కలిసుందాం మనస్సాక్షిగా
ఓ చెలీ మనోహరీ కమిటవ్వడం మినహా నీకులేదు దారి
మై డియర్ మైస్వీట్ హార్టంటు నన్ను పిలువు ప్యారీ

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
గానం:రాఖీ

కోడె త్రాచు కోరిక
కవ్వించకు ప్రేమిక
సయ్యాటలు చాలిక
మురిపించర  చంపక
నా తనువున ప్రతి అణువూ మధూలిక
అధర విరుల మకరందము గ్రోలిక

1.విరహ సెగల వగలనోప
నే వేచిన అభిసారిక
నాసొంపుల వంపులన్ని
మథించరా కందర్పకా
పరిష్వంగ పంజరాన
నేనే నీ రాచిలుకా
స్వర్గసుఖము వేరేలా
మది మిథునమె కులుకా

2.ఇరుమేనుల రాపిడిలో
ఇంధనమే కాలము
పరస్పరం ఒకవరమై
జతలేక మనజాలము
ఎంత లాఘవమ్ముతో
వేసావో ప్రేమగాలము
నీ మంత్రదండముతో
చేసావు ఇంద్రజాలము

Sunday, November 3, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హంసనాదం

(కార్తీక సోమవారపు గీతార్చన)

అణువణువూ నిను వర్ణించితిని
ఆపాద మస్తకం కీర్తించితిని
ఇహపర దైవం నీవని ఎంచితి
ఈశ్వరా నాలోనిను దర్శించితి
ఉమాపతే నన్నుద్ధరించరా
ఊహాతీతము నీ తత్వమురా

1.ఋతంబరా ఋషి ముని సేవిత
కౄరకర్మలన్ని నాలొ పరిహరించరా
నా క్ఌఏశములను నాశమొందించరా
ఎటులనేమెప్పింతును ఏకామ్రేశ్వరా
ఐహికాముష్మికాభీష్టదాయకా హరా
ఒకపరి నే ఓలలాడ నామనవిని ఔననరా
అంతఃకరణనాక్రమించరా చంద్రశేఖరా

2.నీ గుణ గణముల నే ప్రణుతించితి
నీ మహిమలు పలువిధముల పొగడితి
నీ ఉత్సవాల పరమార్థం నే ప్రవచించితి
నీ క్షేత్రాల ప్రాశస్త్యం ప్రస్తుతించితి
కైలాస వైభవం వక్కాణించితి
నీకుటుంబ సభ్యుల  నుతియించితి
నేనెరిగిన సారమంత కవితగా పాడితి

ప్రాధాన్యతలే వేరాయే
తెప్పను కాల్చిన తీరాయే
దిక్కేలేకా ఏదైనా ఒకరాయే
నిన్నటి నేస్తం నేడు పరాయే
సంద్రపునీటిని తాగినమేఘం
వర్షం కురియక ఎంతటి ద్రోహం

1.రచ్చను గెలిచే పిచ్చి క్రమంలో
ఇంటికి చిచ్చును రగిలించడమా
ఆటను నెగ్గే ఆరాటంలో
ప్రత్యర్థులనే పరిమార్చడమా
నీడను ఇచ్చే వటవృక్షం
ఊడలనురిగా మార్చుటె లక్ష్యం

2.గుంతల చింతల చింతన లేక
ఒంటెద్దు పోకడ బండికి హితవా
మేసే ఊసే  ఒకటే ధ్యాస
గుడ్డెద్దు చేలుకు చేటే అవదా
కమ్మే చీకటె  అయోమయం
ఎరుగదు మూసుకపోయిన నయనం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మాల్కోస్

ఎదలో ఏదో అలజడి
నీ తలపుల్లో నే చిక్కుబడి
చేసావేదో చేతబడి
చేష్టలుడిగా నీ పాలబడి
బ్రతుకిక నీకే కట్టుబడి
మనుగడ నీకిక లోబడి

1.కవ్విస్తుంటే తడబడి
ఆరిందేనా గొంతు తడి
చేయకు ఇంకే గారడి
భవితే నాకిక గడిబిడి
బ్రతుకిక నీకే కట్టుబడి
మనుగడ నీకిక లోబడి

2.కడితిని మదిలో నీకుగుడి
వేసా మనసుతొ మనసు ముడి
చిక్కితి చిక్కుల చిక్కుబడి
వేడిని తాళక నిను వేడి
బ్రతుకిక నీకే కట్టుబడి
మనుగడ నీకిక లోబడి

Friday, November 1, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:కళ్యాణి

కన్నీటికి విలువీయి కాస్తైనా
ఏకైక నేస్తమదియే ఏనాటికైనా
ఏకోరసః కరుణ ఏవ ఏ బ్రతుకు నాటికైనా
బాధాపరితప్తమైనదే ఏ హృదయమైనా

1.బెంగపడకు కారిపోతే నీ అశ్రుధారలు
చింత పడకు తరుగుతాయని భాష్పజలనిధులు
తోడుతున్నా కొలది ఊరుతుంది ఎద చెలమె
సజలనయనాలతో  ఊరడిల్లుతుంది ప్రతి గుండె

2.నేత్ర సలిలమెంతో పవిత్రమైనది
గంగాయమునల్లా వెతల కడిగివేస్తుంది
ఆర్ద్రతే నోచకపోతే అదికూడ మనసేనా
బింకంగా బాధ భరిస్తే సమస్యలే సమసేనా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం :మధుకౌఁస్

యంత్రాలతొ సావాసం చేసి
యాంత్రికంగ మారాడు మానవుడు
అనుభూతుల ఊసే లేక
కృతకంగా బ్రతుకీడ్చేను నరుడు
స్పందనే లేక బండబారింది మనిషిగుండె
ఆనందపు లోతుల నెరుగక
పైపైని మెరుగులకే సంతృప్తి పడుచుండె

1.అందచందాలమర్మం కరతలామలకమాయే
వంపుసొంపులన్నీ అంగడిలో ప్రదర్శితమాయే
ఎక్కడుంది గుంభనము సృష్టికార్య విధానము
స్త్రీపురుష దేహస్పర్శలో లుప్తమాయె పులకరము
సిగ్గు బిడియము లాలిత్యమూ గగన కుసుమాలే
విశ్వాసము నిజాయితీ అందని ద్రాక్ష ఫలములే

2.హక్కులు బాధ్యతలే., అనుబంధం మాయమాయే
స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలే .,కట్టుబాట్లు శూన్యమాయే
మానవీయ బంధాలన్నీ ఆర్థికపరమైపోయే
సమాజంలొ  విలువలకు తిలోదకాలైపోయే
అమ్మా నాన్న అనురాగం దొరకని యోగమాయే
అందరూ ఉన్నాగాని అనాథగా బ్రతుకాయే