Monday, January 7, 2019

నా దేశం  హిమవన్నగ సమున్నతం
నా దేశం గంగా యమునా నదీ పునీతం
నా దేశం చతుర్వేద యుత సకల శాస్త్ర సంశోభితం
నా దేశం తలమానికమౌ నాగరికత గల భారతం
జై హింద్ జై హింద్ జైహింద్ జై హింద్

1.పరదేశీయుల దండయాత్రలకు చెక్కుచెదరని దేశం
పరవ్యాపారుల మాయోపాయపు పాలనలో చిక్కిన దేశం
ఆటుపోట్లు చెలరేగిన గాని సంస్కృతి చెదరని దేశం
వెన్నుపోట్లు కడు తగిలినగాని భారతీయతను బాయని దేశం
జై హింద్ జై హింద్ జైహింద్ జై హింద్

2.గోవును సైతం తల్లిగ తలచే జీవకారుణ్య దేశం
తల్లి దైవమని నిత్యం కొలిచెడి మానవతాసందేశం
పలు కుల మతముల  మనుగడ గలిగిన సమైక్య దేశం
భిన్నత్వంలో ఏకత్వంగా అలరారే విశిష్ట విశాల దేశం
జై హింద్ జై హింద్ జైహింద్ జై హింద్

3.భాషలనెన్నో కలిగినగాని భావన ఒకటిగ మసలే దేశం
ప్రాంతాలుగ ఎన్నున్నా ఆసేతు హిమాచల అఖండ దేశం
పురోగామిగా పరుగెడుతున్న ప్రపంచఖ్యాతిగన్న దేశం
నాడు నేడు ఏనాడు జగతికి దీపిక నా దేశం భారతదేశం
జై హింద్ జై హింద్ జైహింద్ జై హింద్