Friday, November 1, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:కళ్యాణి

కన్నీటికి విలువీయి కాస్తైనా
ఏకైక నేస్తమదియే ఏనాటికైనా
ఏకోరసః కరుణ ఏవ ఏ బ్రతుకు నాటికైనా
బాధాపరితప్తమైనదే ఏ హృదయమైనా

1.బెంగపడకు కారిపోతే నీ అశ్రుధారలు
చింత పడకు తరుగుతాయని భాష్పజలనిధులు
తోడుతున్నా కొలది ఊరుతుంది ఎద చెలమె
సజలనయనాలతో  ఊరడిల్లుతుంది ప్రతి గుండె

2.నేత్ర సలిలమెంతో పవిత్రమైనది
గంగాయమునల్లా వెతల కడిగివేస్తుంది
ఆర్ద్రతే నోచకపోతే అదికూడ మనసేనా
బింకంగా బాధ భరిస్తే సమస్యలే సమసేనా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం :మధుకౌఁస్

యంత్రాలతొ సావాసం చేసి
యాంత్రికంగ మారాడు మానవుడు
అనుభూతుల ఊసే లేక
కృతకంగా బ్రతుకీడ్చేను నరుడు
స్పందనే లేక బండబారింది మనిషిగుండె
ఆనందపు లోతుల నెరుగక
పైపైని మెరుగులకే సంతృప్తి పడుచుండె

1.అందచందాలమర్మం కరతలామలకమాయే
వంపుసొంపులన్నీ అంగడిలో ప్రదర్శితమాయే
ఎక్కడుంది గుంభనము సృష్టికార్య విధానము
స్త్రీపురుష దేహస్పర్శలో లుప్తమాయె పులకరము
సిగ్గు బిడియము లాలిత్యమూ గగన కుసుమాలే
విశ్వాసము నిజాయితీ అందని ద్రాక్ష ఫలములే

2.హక్కులు బాధ్యతలే., అనుబంధం మాయమాయే
స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలే .,కట్టుబాట్లు శూన్యమాయే
మానవీయ బంధాలన్నీ ఆర్థికపరమైపోయే
సమాజంలొ  విలువలకు తిలోదకాలైపోయే
అమ్మా నాన్న అనురాగం దొరకని యోగమాయే
అందరూ ఉన్నాగాని అనాథగా బ్రతుకాయే