Monday, December 12, 2022

 

https://youtu.be/SJq072qQE5k?si=iD2VOKewt-LSAdv5

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మతమొకడికి గతమొకడికి

ప్రాంతీయ ఊతమింకొకడికి

జనహితమెవరికీ పట్టదు ఎప్పటికీ

నలుగుతోంది నాదేశం నేతల మధ్య

నవ్వులపాలౌతోంది బూతుల మధ్య


1.తాతలు తాగిన నేతుల  సంగతులే

చేజేతులారా చేజార్చుకున్న అధిపతులే

సత్తువకొరవడినా వింత వారసత్వ ఒరవడి

ఎందుకు కొఱగాక తందనాలాడే చతికిలబడి


2.మసిబూసి మారేడు కాయజేసి కాజేసి

మంచి మనుషుల మధ్యన విద్వేషాలే రాజేసి

అరచేత స్వర్గం చూపించేసి మోచేయినాకించేసి

వ్యాపారుల పాలైనా రాజకీయాల ముసుగులేసి


3.కొట్టిన ఉట్టిని పంచిపెట్టలేక బుట్టదాఖలాజేసి

పట్టుబట్టి ఊపిరి బిగబట్టి ఆశావాదులనంత పోగేసి

కాళ్ళక్రింద నేలకదుల్తున్నా గాలిలో గారడీలు చేసి

ఉన్నదీ సాధించుకున్నదీ కుక్కలు చించే విస్తరి చేసి

https://youtu.be/ghffvMxFri8?si=wh9YMoxFwbcBbEup


 17) గోదాదేవి పదిహేడవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:భీంపలాస్(అభేరి)


తిరుప్పావై వ్రతమొనర్చు తరుణులము

వ్రతఫలితము మాకొసగగ మీరే శరణము

గోపకుల గోపాలకుల ఏలికా

నందగోప స్వామీ మేలుకోఇక

ఏలోటు రానీయక మమ్మేలే మారాజా

మాకు మేలుకూర్చగా మేలుకో రవితేజా


1.అన్నపానాదులకు ఉన్ని వస్త్రాదులకు

కొదవలేని విధముగా మము కాచే నేతకు

యదుకుల మానినీ యశోదా భామామణీ

దంపతులిరువురు  మేలుకూర్పరో మేల్కొని


2.త్రివిక్రముడిగా మూడడుగులతో ఈ జగతిని

ఆక్రమించిన శ్రీకృష్ణ పరమాత్మా వదులు నిద్రని

రత్నకంకణధరా బలరామా విని మా మనవిని

మేలొనర్పు మాకు తమ్మునితో సహా మేల్కొని


https://youtu.be/5xQ-0-Y2fXo

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఖరహరప్రియ


కచ్ఛపి వీణా మంజుల వాద వినోదిని

ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి

శ్రీ విద్యా ఆత్మవిద్య పరవిద్యా దాయిని

వందే భారతీ తవ చరణారవిందమే శరణాగతి


1.మూలాధార స్వాధిష్ఠాన 

 మణిపూరచక్ర   ప్రేరేపణి

అనాహత  విశుద్ధి సహిత 

ఆజ్ఞా చక్ర జగృత కారిణి

సహస్రార చక్ర సిద్ధి ప్రదాయిని


2.సప్త స్వర వర సంధాయిని

సప్తవర్ణ సంభావిత జనని

సప్త చక్రానుగ్రహ మేధావిని

సప్తధాతుయుత దేహ విదేహిని

సప్తజన్మ కృత దోషనివారిణి వాణీ

 

https://youtu.be/uFPlWTxTDeE?si=26D-47FgY53xp0ah

16) గోదాదేవి పదహారవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: ధర్మవతి


నీదెంతటి భాగ్యమో  కక్షావేక్షకా

నందగోప  మందిర సంరక్షకా

సుందర కుడ్యాలు చెక్కణాల సౌధ ద్వారపాలకా

సుప్రభాత సేవకై స్వామిమేలుకొలుపు మా వేడుక

వేడుచుంటిమి దారివిడువు ఏ మాత్రం మమ్మాపక


1.శ్రీవ్రత దీక్షాదక్షులము మేము ముముక్షులము

యదు ముదితలము గోవిందుని కొలిచే బేలలము

నీలమణుల రుచిర దేహుడు కృష్ణుడంపె ఆహ్వానము

మురళీధరుడే వరమీయగ బాస చేసె నిన్నటి దినము


2.నీలమేఘశ్యాముని ఈవేళ నిద్రలేపుదామని

వనితలమంత గూడి తిరుప్పావై వ్రతాచరణకని

శుభోదయాన ఈ శుభసమయాన గానము చేయబూని

వచ్చితిమిటకు వారించకు మము తలుపులు తెరువగ మాని

 https://youtu.be/W5qjut6NROY


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లోకమంతా నిదురలో జోగుతున్నవేళ…

మౌనాన్ని జోకొడుతూ మన కలయిక ఓ కల 

జ్ఞాపకాలు కొన్ని  కలబోసుకొని

అనుభూతులెన్నో నెమరేసుకొని


1.తారాడిన తారా తారా-దూరాలు దాటుకొని

వెన్నెల జల్లులలో తడిసి- జాబిలిని చేరుకొని

అలవాటుగా మాటల మల్లెలనే వాటేసుకొని

నవ్వులని నంజుకొంటూ సమయాన్ని జుర్రుకొని 

చూపుల తాంబూలంతో పెదవులెరుపు చేసుకొని


2.అలక పానుపు దులిపేసి-ఆనందపు దుప్పటి వేసి

అలుపుదీరే ఉపాయమేదో -మేనంతా శోధించేసి

వద్దన్నదల్లా వద్దకే లాక్కొని ముద్దునే ముద్దుచేసి

వలపు తలపులు తీసేసి హాయికే హద్దులు చెరిపేసి

మధురమైన తీరాలనే చేరు కోరిక తీరాలనే కృషిచేసి

 https://youtu.be/gyeNGVuwIx8

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తచ్చాడుతుంది ఏదో ఒకభావం మది మాటున

పెనుగులాడుతుంది బయట పడగ ఒక్క ఉదుటున

ప్రతి పాట ప్రతిపూట మారుతుంది సవాలుగా

తనకు తానే ప్రత్యేకమై అనుభూతికి ఆనవాలుగా


1.ఎదను కదిలిస్తుంది ఒక దృశ్యం తనదైన ముద్రతో

ప్రతీకలేవో కదిలివచ్చి వరుసకడతాయి ఆర్తితో

పదాలన్ని పదిలంగా అందగించుకుంటాయి పాటలో చోటుకై

పల్లవొకటి తళుకుమని పొడసూపుతుంది చరణాలకు బాటయై


2.తొలి అడుగు పడడమే తరువాయి ఆగదు నడక 

వడివడిగా సాగును చరణాలు గమ్యానికి తడబడక

విషయమేదైనా సరే విశ్వాసమేమాత్రం సడలక

సంగీతం ఊతమై ఆహ్లాదమె ధ్యేయమై పుడుతుంది గీతిక