Sunday, February 28, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: జన సమ్మోహిని


జటాఝూటధర నీలకంధరా

జంజాటములను పరిహరించరా

జడదారి జ్వాలి జంగమదేవరా

లంపటములనిక సడలించరా

భంభం మహాదేవా నమః శంభో సదాశివా


1.సతిపార్వతితో అతులిత దాంపత్యం

ఐనా యోగివి నువు అను నిత్యం

సుత ద్వయముతొ సహా కుటుంబం

నీదొక యోగ భోగ వింత కదంబం

భంభం మహాదేవా నమః శంభో సదాశివా


2.తామరాకు సరి ఈ సంసారం 

నను అవనీ ఒక బిందు తుషారం

కలతల బ్రతుకే కల్లోల సాగరం

కడతేరనీ నీవే నావై కైవల్య తీరం

భంభం మహాదేవా నమః శంభో సదాశివా

 https://youtu.be/cutA5IWMO7g

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:పహాడి


రాసకేళి వేళ వనమాలి 

నా మానసమే తేలితేలి

శిఖిపింఛ మౌళి నా జీవనమాలి


మన మేనుల మిథున శైలి

నేను వెన్నెలా నీవు జాబిలి

చిలికింది సరసరవళి మురళి


నను మథించరా గిరిధరా

నన్నుధరించరా వసుంధర ధరా


1.విచ్చిన పొన్నాగలు నా తపనలు

రెచ్చిన మిన్నాగులు నా తమకాలు

మచ్చిక చేసుకోర లచ్చిమి పెనిమిటి

మెచ్చెద నను జేర్చగ వెచ్చని నీ కౌగిటి


నను మథించరా గిరిధరా

నన్నుధరించరా వసుంధర ధరా


2..వలువలు తొలగించు రయమున

మురిపించు ముద్దుల సాయమున

నిను నేనెరిగెడి శుభసమయమున

ఓలలాడించు ఆనందతోయమున


నను మథించరా గిరిధరా

నన్నుధరించరా వసుంధర ధరా

https://youtu.be/AipzL7z-R6k?si=Q--C3qYHFeSpwpmS

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:సిందు భైరవి

దయమానితి వేల శ్రీపతి,వేంకటా చలపతి
నిన్నే నా దైవమని నమ్మితి నా నెరనమ్మితి
అరిషడ్వర్గాలకు అతీతుడే కదా పరమాత్ముడంటే
కినుక ఏల నాపైన తండ్రివి నీవని భావించుకుంటే
వీథుల పాల్జేయ బాధల పడద్రోయ ధర్మమా
నీవే శరణన్న నన్ను లక్ష్యపెట్టకున్న న్యాయమా

1.అవకాశమెందుకిచ్చెదవు నిను నిందాస్తుతిజేయ
ప్రయోగించనేల ఈ సుతునిపై నీ మహామాయ
సుఖములెవరు బడసిరిమును నిను కొలిచినవారు
పడరాని పాట్లు పడి కడకు నీ కడ కడతేరినారు
బతుకంతా వెత చెంది ఛిద్రమాయె నా బొంది
ఉద్ధరించ తక్షణమే పరికల్పించు నాంది

2.చెఱసాల పాలాయిరి కృష్ణావతారాన నీ తల్లిదండ్రులు
కొఱతవేయబడినాడు రామదాసు కట్టినీ గుడీగోపురాలు
నిత్య దరిద్రులైనారు నిను నుతించి పోతన శేషప్పలు
అన్నిఉన్నట్టే ఏమీ లేనట్టే  ఎందుకు చేసావు మా జీవితాలు
వరములీయకు సరే నను సదా నీ సేవలొ తరించనీ
రాజును చేయకుమానే నను నీ బంటుగనే అంతరించనీ


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అతను:  రోజూ చూసే రోజానే...

నీవల్లె నీ నవ్వల్లె అపురూప పువ్వయ్యింది


ఆమె:ఎపుడూ పలికే మాటలే..

నీ వల్లే నీ మనసల్లే అబ్బురమైన కవితయ్యింది


అతను: పల్లవి నువ్వైతే.. నీ చరణం నేనౌతా

ఆమె: మువ్వవు నువ్వైతే..మంజుల సవ్వడి నేనౌతా


అతడు:1.)నీ హృదయపు ద్వారానికి

వాడని మామిడి తోరణమౌతా

నీ  అధరాల ముంగిలిలో

రాలిన ముత్యాల ముగ్గునౌతా

నీ పాపిటి సింధూరం నా అక్షరం

నీ పాదాల పారాణిగా నే సుస్థిరం


ఆమె:2.)నీ మగటిమి సంకేతపు

కౌగిటిలో నే సాంతం కరుగుతా

నీ కండలు నాకండదండ 

నిశ్చింతగ బతుకంతా చెలఁగుతా

నీ కోఱమీసం నాకయస్కాంతం

నీ ఓరచూపు నాకింద్రజాలం