Saturday, July 24, 2021


మొకమే చూపించవు

మనసే ఎరిగించవు

ఐనా చిత్రమే అంతర్జాల స్నేహితము

ఎంతటి గమ్మత్తో మనకున్న బంధము


1.కానుకలడుగుతావు మొదటి పరిచయంలోనే

బహుమతి కోరుతావు తొలి పలకరింపులోనే

కొనిపెట్టమంటావు కంచిపట్టు చీరలనే

తెచ్చిపెట్టమంటావు బంగారు నగలనే

ఏ అధికారముందో నిస్సిగ్గుగ కోరుటకు

ఆత్మగౌరవం లేదో  నోరువిప్పి అడుగుటకు 


2.కాకమ్మ కథలు చెప్పి అనారోగ్యమంటావు

పసివారి పేరు చెప్పి డబ్బులడుగుతుంటావు

అప్పుగానె ఇమ్మని బ్రతిమాలుతుంటావు

బదులుగా దేనికైన తయారౌతుంటావు

బంధుత్వం ఏముందని చనువు చూపుతావు

చుట్టెరికం కలుపుకొని చొరవతీసుకుంటావు


మంజులవే మంజరివే మంజుల మంజరి నీవే

లాలసవే మదాలసవే సదా నా శ్వాసవు ధ్యాసవు నీవే

నాలో సరికొత్తగా మొలకెత్తే  మధుర భావం నీవే

కలలోను తలపులలోను చెలఁగే అపురూప రూపం నీదే


1.పలురకాల విరులే విరిసే ఆమని  నీవే

పలుకు తేనె వానలు కురిసే నందనవనివే

పలువరుసలొ తళుకులు మెరిసే మౌక్తిక హారానివే

పలువురు నీ సౌందర్యానికి పరవశించు అబ్బురానివే


2.హరి మోహినియై అనుకరించే నీ అందచందాల్ని

హరివిల్లే నీమేను వర్ణించలేను నేను నీ సోయగాన్ని

హరి వంటి కటి నీది నా పిడికిటిలో పట్టే పాటిది

హరి హరికి హరిణమవడవే నీ తనువుకు పరిపాటది


https://youtu.be/c7othpA665Y?si=pvTYcrdNPwcBm33S


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం :రేవతి


పరమ శివమ్ నమామి పరమగురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

నమోస్తుతే దత్తత్రేయం సద్గురుమ్

ప్రణతోస్మి మాతఃపితరమ్ పావన జన్మ గురుమ్

గురుపౌర్ణమాస్యాం ప్రణామ్యహం నిజగురుమ్ సకలగురుమ్


1.సముద్ధరించే నా సద్గురుడు ఏచోట  గుప్తమై ఉన్నాడో

భవజలధిని దాటించే భవ్యగురుడు ఎప్పుడు ప్రాప్తుడౌతాడో

భవతారకముపదేశించే ఆత్మగురుడెలా అనుగ్రహించేనో

చేయి పట్టినడిపించే చైతన్య గురుడు నన్నెప్పుడు చేరేనో

ప్రణతోస్మి మాతఃపితరమ్ పావన జన్మ గురుమ్

గురుపౌర్ణమాస్యాం ప్రణామ్యహం నిజగురుమ్ సకలగురుమ్


2.ఏ సేవలు చేసి నా గురుదేవుని మెప్పునిపొందాలో

గురుదక్షిణ ఏదొసగి నా గురునాథుని సత్కరించాలో

తలలోనాలుకలా గురు కనుసన్నలలో నిరంతరం మెలగాలి

ప్రాణాలైదు గురుపరమే చేసి నా అత్మ సమర్పణ చేయాలి

ప్రణతోస్మి మాతఃపితరమ్ పావన జన్మ గురుమ్

గురుపౌర్ణమాస్యాం ప్రణామ్యహం నిజగురుమ్ సకలగురుమ్