Saturday, November 7, 2020


అప్పలమ్మా ఏమని చెప్పనమ్మా

నీ తనువున ఎన్నెన్ని గొప్పలమ్మ

మనసేదోచేసే ఒప్పులకుప్పలమ్మా

వయసును కాల్చేసే నిప్పులమ్మా


1. నవ్వితె మ్రోగేను గుండెలో డప్పులమ్మ

   నీ వాలుచూపుతో వేవేల తిప్పలమ్మా

  బ్రహ్మచర్యాని కెన్ని ముప్పులమ్మా

  చేయకతప్పదెన్నొ నీకై అప్పులమ్మా


2.నీవెంట పడగ అరిగేను చెప్పులమ్మా

నువు కాదంటే ఉడకవెవరి పప్పులమ్మా

నీ అందాలు ఊరించే అప్పాలమ్మా

నిను విసిగిస్తే కాయాలి నా తప్పులమ్మా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


(యువతకు ఇది బొరుసు వైపే..!

బొమ్మవైపు ఉంది మూడు సింహాల చిహ్నం..!!)


గడిపినంతసేపే బ్రతుకు

దొరికినంత వరకే మెతుకు

హితబోధలు పనికిరావు నేటియువతకు

ఖర్మకు వదిలేస్తేసరి మనశ్శాంతి మనకు


1.విద్యలొ ఉన్నతులే వివేక మితిమతులు

ఉద్యోగం నిర్లిప్తతె విచక్షణా రహితులు

భవితపట్ల బెరుకు లేదు తెలియదు పరిమితులు

వైఫల్యం ఓర్వలేక ఏతావతా తథాగతులు


2.ఆశలేమొ నింగిలో సంపాదన ఉట్టిలో

పొదుపు మాటేమొగాని అదుపేది ఖర్చుల్లో

ఓపిక ఊసేలేక విలాసాలు అప్పులతో

నిన్నచేదు రేపులేదు ఈనాడొక్కటే లెక్కలో



చరాచర జగత్తు నీవె వేంకటేశా

నిరామయ నిరంజన నిర్మల వేషా

కౌస్తుభ వక్షాంకిత మణిమయభూషా

వైజయంతి మాలాలంకృత సర్వేశా

అంతరింప జేయి ప్రభూ మన మధ్య దూరము

అంతర్యామీ నను చేర్చు స్వామీ భవసాగరతీరము


1.మంజుల రూపము నీ మంజుల విగ్రహం

మంజుల వదనము నీ మంజుల వీక్షణం

మంజుల హాసము నిత్య మంగళ కరము

మనుజులకొక వరము నీ అభయకరము

అంతరింప జేయి ప్రభూ మన మధ్య దూరము

అంతర్యామీ నను చేర్చు స్వామీ భవసాగరతీరము


2.నిను మోహించనీ మహా శివుడేడి విశ్వాన

నీ మాయకు లోబడని నరవరుడేడి లోకాన

జగన్నాటకంలో నడుపు నాపాత్రను  నీ వైపు

శరణాగతి నొసగెదవని  తట్టితిని నీ తలుపు

అంతరింప జేయి ప్రభూ మన మధ్య దూరము

అంతర్యామీ నను చేర్చు స్వామీ భవసాగరతీరము

 రచన,స్వరకల్పన&గానండా.రాఖీ


మనది కానిదేదీ మనదసలే కాదు

మనకు చెందే ప్రతీది మనది కాకపోదు

ఇచ్చిపుచ్చుకున్నప్పుడె గౌరవము మర్యాదా

తేరగ పొందేదేదైనా ఒంటికి పడుతుందా

ఇంట ఇముడుతుందా

పైవాడు చూస్తాడు జమాఖర్చులు

కక్కించిమరీ సరిచేస్తాడన్ని లెక్కలు


1.పుణ్యమాశించి చేసేది దానము

సానుభూతితో వేసేది బిచ్చము

ఆపన్నులనాదుకొనట వదాన్యత

మనవంతు అందజేస్తె అది చందా

పైవాడు చూస్తాడు జమాఖర్చులు

కక్కించిమరీ సరిచేస్తాడన్ని లెక్కలు


2.కనుగప్పి చేసేది దొంగతనం

అడ్డగించి దోచేది అది దోపిడి

అవసరార్థమిచ్చేది చేబదులు

వడ్డీ చెల్లించి తీర్చేవి  ఋణాలు

పైవాడు చూస్తాడు జమాఖర్చులు

కక్కించిమరీ సరిచేస్తాడన్ని లెక్కలు


3.వస్తుసేవల తగు చెల్లింపే ధర

సంతృప్తితొ ఇచ్చేది నజరాన

ఆవకాశవాది కిస్తే శాపాలమూట

దబాయించి దండుకుంటె మామూలట

పైవాడు చూస్తాడు జమాఖర్చులు

కక్కించిమరీ సరిచేస్తాడన్ని లెక్కలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తెలుసుకో సోదరా-ప్రమద ఎంతటి ప్రమాదమో

ఎరగరా నేస్తమా -అతివ ఎంతటి అపాయమో

రంగులు చూసి పొంగులు చూసి పొంగిపోమాకురా

కలలలొ తేలి మత్తులొ మునిగి చిత్తైపోమాకురా


1. కాల్బంతి ఆడుతుంది నీ గుండెనె  బంతిగా

    పీకికుప్ప పెడుతుంది నీ మనసునె బొమ్మగా

    అమ్మాయే ముంచుతుంది నిను నిలువెల్లా

    అమ్మాయలొ పడ్డావా బ్రతుకు తల్లక్రిందుల్లా


2.అరిటాకువు నీవె సుమా అంగననే కంటకం

    నీ భవితను వండుతుంది డోకొచ్చే వంటకం

    నిలువుదోపిడే చేసి నిలబెడుతుందీ నిను నడి వీథిలో

    ఇంతైనా బుద్దిరాక తగలడుతుంది నీ మది తన యాదిలో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చేదైన నిన్నటి అనుభవం గుణపాఠమై

మధురోహల రేపటి శిఖరమే గమ్యమై

సాగనీ ఈనాటి నీపయనం నిరాటంకమై

ఈ ప్రశాంత ప్రభాతమే సుప్రభాతమై

నా ప్రబోధ గీతమై


1.ఎన్నుకునే అంకురమే నాణ్యత గలదై

నాటుతున్న నేలయే సారవంతమై

చెదరని బెదరని నీ కృషియే ప్రావీణ్యత గలదై

వెలయించనీ నీ దీక్షావృక్షం సత్ఫలితాలనే సఫలమై

ఈ ప్రశాంత ప్రభాతమే సుప్రభాతమై

నా ప్రబోధ గీతమై


2.మార్గమే కఠినమైనా నిర్గమ దుర్గమమైనా

అడుగెయ్యి ఒడుపుగా మడమతిప్పకుండా

మలుపులు గోతులు దారంతా మామూలే

నిశ్చయం ఊతమై ధైర్యమే నేస్తమై గెలుపే ధ్యేయమై

ఈ ప్రశాంత ప్రభాతమే సుప్రభాతమై

నా ప్రబోధ గీతమై