Wednesday, August 7, 2019

భారతీయ మహిళకు నీవే  నిండైన రూపం
సాంప్రదాయ వనితకు నీవే  ప్రతిరూపం
సుష్మాస్వరాజ్ లేక పార్లమెంటు పరితాపం
ప్రజల గుండెల్లో నీవు ఎపుడూ వెలిగే దీపం

1.వాగ్ధాటి గలిగిన న్యాయవాదిగా
విజ్ఞత చూపించెడి రాజకీయవేత్తగా
ఉత్తమ పార్లమెంటేరియన్ గా
మంత్రాంగం నెరపిన కేంద్రమంత్రిగా
ప్రఖ్యాతి నందింతివి సుష్మాస్వరాజ్
జోహార్ జోహార్ నీకిదే సుష్మాస్వరాజ్

2.తెగువకు మారు పేరైన మగువగా
మంచికి మానవతకు తగిన నెలవుగా
తెలంగాణ జనులకు చిన్నమ్మగా
బారతీయ జనతా పార్టీ మణిపూసగా
ప్రఖ్యాతి నందింతివి సుష్మాస్వరాజ్
శ్రద్ధాంజలి నీకిదేనమ్మ సుష్మాస్వరాజ్



నా మనసే కాశ్మీరు షాలువ బాబా
నిన్నంటిపెట్టుకుంటేనే దానికి విలువ
నా తలపే సాయి  నీకు తలపాగా
నీ శిరసు చుట్టుకోవాలి నా జన్మ సార్థకమవగా

1. నా బ్రతుకే  చిరుగుల కఫ్నీ బాబా
నువు ధరించి ఉద్ధరించు ఇకనైనా
నా జీవితమే  భిక్షాపాత్ర సాయీ
అవధరించి స్వీకరించు ఇపుడైనా
నా ఆశలజోలె నీకు అంకితమోయీ
నీ భుజమున నన్నికపై మోయవోయి


2.నా అహమే కొబ్బరి కాయ బాబా
బ్రద్దలవని నీ ముందు యోగిరాజా
నా అరిషడ్వర్గములే సమిధలు సాయీ
భస్మమవగ ధునిలోన కాలనీయీ
పంచేద్రియాలను కట్టడిచేయవోయీ
అవి పంచహారతులై నీకడ వెలుగనీయీ



తెల్లారి పోయింది తెలంగాణ భవితవ్యం
చల్లారిపోయింది ఎగసి పడిన ఉద్యమం
అమ్ముడై పోయినారు అతిరథులెందరో
కొమ్ముకాస్తున్నారు ప్రత్యర్థుల కెందరో
ఎలా సంభవిస్తుంది నా తెలంగాణ
ఎప్పుడు నినదిస్తుందీ రతనాల వీణ

1. తాతలు తాగిన నేతుల సంగతి
నెమరు వేయుటెనా మన సంస్కృతి
బలిదానంచేసిన నేతల సంస్మృతి
వల్లించడమేనా తెలంగాణ ప్రకృతి
బీరాలు పలికినారు ఆరంభ శూరుల్లా
బీరువులై పోయినారు చచ్చు పిరికి పందల్లా
ఎలా సంభవిస్తుంది నా తెలంగాణ
ఎప్పుడు నినదిస్తుందీ రతనాల వీణ

2. చదరంగపు పావులుగా విద్యార్థులు బలైనారు
వైకుంఠపాళి కేళి విషనాగుల చిక్కినారు
ఎలాపోల్చుదామన్నా తక్కువౌను ఉపమానం
రాజకీయాల్లొ లేవు సిగ్గు లజ్జ అభిమానం
తోకముడిచినారు ఏజాతికి చెందనోళ్లై
సొల్లుకార్చుకొన్నారు ఏ నీతికి అందనోళ్లై
ఎలా సంభవిస్తుంది నా తెలంగాణ
ఎప్పుడు నినదిస్తుందీ రతనాల వీణ
కడుపుచించుకొని కన్నది-తెలంగాణ తల్లి
అందుకు చేయాలి -వందనాలు మోకరిల్లి
అమ్మచెఱను వదిలించే –దాకసాగాలి లొల్లి
రక్కైనా చంపుతుంది-ఎదురుతిరిగితే పిల్లి

1. ఉండటానికై గుండెలొ చోటిచ్చింది
బ్రతకడానికై నీకై -బ్రతుకు ధారపోసింది
తార్చకండి తమ్ములార అమ్మను కలనైన
తెగటార్చకండి నేతలార-విలువలనికనైనా

2. సిగ్గుచేటు మనకు మనమె సిగపట్లు పట్టుకుంటె
పండగే సీమాంధ్రకు మనలొ మనం కొట్టుకుంటె
తుమ్మితె ఊడే ముక్కులు మీకిచ్చిన పదవులు
నమ్మితె ప్రాణాలిస్తరు తెలంగాణ ప్రజలు

3. ఉద్యమాన్ని నీరుగార్చె కుట్రలు గమనించండి
తెలంగాణ ప్రజల మధ్య చిచ్చును రగిలించకండి
బెదిరింపులకెప్పుడూ జడిసి తోకముడవకండి
మీకుమీరె వెలకట్టి అమ్ముడై పోకండి

4. శ్రీకృష్ణ సందేశం తెలంగాణ ఇప్పించదు
సీమాంధ్ర మనకెప్పుడు వేర్పాటు తెప్పించదు
కలగన్న రోజొక్కటి మనముందుకు వస్తుంది
నాల్గుకోట్ల గుండెలసడి తెలంగాణ తెస్తుంది
మన నాల్గుకోట్ల గుండెలసడి తెలంగాణ తెస్తుంది

గీతోపదేశం-శ్రీకృష్ణ సందేశం
పోరునాప మనలేదు-వెన్నుచూప మనలేదు
సాగించు వీరుడా కడదాకా రణం
తెలంగాణ సాధన-దా-కా-రణం
జై తెలంగాణ! జైజై తెలంగాణా!!

1. తన పర ఎవరనేది ఎంచకు
యుద్ధంలో అడ్డొస్తే మన్నించకు
యాచించుటకిది కాదు ఒకరు వేయు భిక్షం
ప్రాణాలు ఫణం పెట్టి సాధించు నీ లక్ష్యం

2. మన పరిధిలొ ఉండదు ఏ ఫలితం
నిర్వహించు అనుక్షణం నీ కర్తవ్యం
పూరించు బిగబట్టి సమర శంఖం
ప్రత్యర్థుల గుండెల్లో సడలాలి బింకం

3. కుట్రలు కుతంత్రాలు సాధారణం
మాయోపాయాల వ్యూహాలే కదా రణం
యోధుడికిల ఎప్పుడూ ఉండబోదు మరణం
కోట్లమంది త్యాగమే మనకిక శరణం
తెలంగాణ రాష్ట్రమే విజయ తార్కాణం
మా నెత్తుటి చుక్కలనే విత్తనాలు పాతండి
మొలకెత్తే తెలంగాణ చెట్టు పళ్ల కెగబడండి
రాజకీయ పక్షాల నేతలారా
నరమాంస భక్షకుల దూతలారా
మా శవాలపై పేలాలేరుకొని తినగరండి
మీ పదవీ లాలసలో మనుషులనీ మరచిపొండి

1. పదవీ అధికారం ఇచ్చింది ఈ ప్రజలేగా
ఓటేసి ఎన్నుకుంది తెలంగాణ జనమేగా
ప్రజాభీష్టమే మీరు కాలరాస్తే
తాత్కాలిక హంగులకై ప్రాకులాడితే
ఇచ్చిన అధికారం తిరిగి తీసుకోనుగలరు
ఎక్కించిన మీ గద్దెను ఎలాగైన దించగలరు
కళ్ళిక తెఱవండి కపట నాయకులారా
రాజీనామా చేయండి చపల చిత్తులారా

2. రంగుల జండాలిక పక్కన బెట్టండి
తెలంగాణ సాధనకై తెగువ చూపి కదలండి
విద్యార్థుల పోరుబాట విధిగా ఇక సాగండి
ఉద్యమాన యువతతో చేయిచేయి కలపండి
తెలంగాణ గడ్డమీద నిజంగా పుట్టారా
అమ్మానాన్నలకైన తలకొరివి పెట్టేరా
కళ్ళిక తెఱవండి కపట నాయకులారా
రాజీనామా చేయండి చపల చిత్తులారా
కోట్లమంది కోర్కె తెలంగాణయని తెలుసుకో
పాతిపెడ్తె విప్లవాలు మొలుస్తాయి కాచుకో
తుఫాను ముందుశాంతిదని వెంటనే గ్రహించుకో
రాకూడని యుద్ధానికి రాయబారమిది యనుకో
జై తెలంగాణ!జైజై తెలంగాణా

1. కోట్లమంది ప్రాణాల బేరానికి సరే సరే
హైద్రాబాద్ వదలకుంటె ఎంతకైన తయారే
భాగ్యనగరు లేకుండా తెలంగాణ శవతుల్యం
కోరుకోండి కేంద్రాన్ని అందుకై తగు మూల్యం

2. వక్రభాష్యాలు చెబితె వినుటకెవరు లేరిక్కడ
దొంగలెక్క చిట్టాలు విప్పుటయే తగదిక్కడ
గతంలోని ఆంధ్ర రాష్ట్ర హద్దులకే సిద్ధపడి
అనుబంధం మిగలనీండి అందుకైన తృప్తిపడి
కుక్కతోక పట్టుకొని గోదారి దాటలేము
పిఱికిపంద నావికులతొ తీరాన్ని చేరలేము
స్వార్థపూరిత నేతలతో తెలంగణ తేలేము
నమ్మి వెంట నడిచామా శవాలై తేలేము
కళ్ళుతెరువు తమ్ముడా కుళ్ళుజోలి కెళ్లబోకు
బ్రతుకు తెఱువు లేదేమని కుళ్లికుళ్ళి ఏడ్వబోకు
తెలంగాణ రాదేమని నిన్ను నువ్వు చంపుకోకు

1.చిత్తశుద్ది అంటేనే అర్థమే తెలియదు
ఆడినమాటకు కట్టుబడుట తెలియదు
తీయనైన మాటలతో పబ్బాన్ని గడుపుతారు
అవకాశవాదంతో అందలమెక్కుతారు- మనసొమ్ము మెక్కుతారు
ఎఱిగిమెలుగు తమ్ముడా-ఎదురు నీకు లేదురా
దుష్టశక్తులెదురైనా- నీవు బెదర బోకురా

2.ఏ ఎండ కా గొడుగు- పట్టుటలో నేర్పరులు
రెండేసి పడవల్లో- కాళ్ళుంచు సమర్థులు
మాటమార్చు విద్యలో-వీరికెవరు సాటిరారు
వెన్నుపోటు పొడుచుటలో వీరికెవరు దీటురారు
తెగువ చూపు తమ్ముడా-తెలంగాణ నీదిరా
ప్రజలె నీకు తోడురా-భవితలోకి సాగరా
జై తెలంగాణా! జైజై తెలంగాణా!!
వధ్యశిలలపై వంచినాము తలలు- ఉరికొయ్యలకే తగిలించినాము మెడలు
కాలిబూడిదవుటకేన మా ఒడలు- ఎప్పటికిక కరుగుతాయి మీ యెదలు
అడ్డుతగలకండి సైంధవులారా!- అంతతనం చేయకండి ఆంధ్రులారా! సీమాంధ్రులారా!!

1.దేవుడు వరమిచ్చినా పెంచుతారు అంతరాలు- దేవత కరుణించినా కల్పించుతా రవాంతరాలు
నోటుముందటి మాకూటిని ఎత్తగొట్టుతారు- ఇంకాఏమ్మిగిలిందని ఇల్లు కొల్లగొట్టుతారు
దారి వదలిపెట్టండి దాయాదులారా- తలకొరివిగ మారకండి ఆంధ్రసోదరులార

2.కన్నతల్లుల కడుపుకోత కార్చిచ్చై కాల్చుతుంది- దీనార్తుల గుండె కోత తరతరాలు కూల్చుతుంది
తెలంగాణ యువతరక్తం ఉప్పెనై ముంచెత్తుతుంది- విద్యార్థుల ఆక్రోశం ఉరుమై మిన్నంటుతుంది
తెలంగాణ తథ్యమన్నది సత్యమే అయితే- తాత్సారం చేయ తగదు న్యాయమే ఇది అయితే

3.ఎంతమంది కావాలో తెలంగాణాకోరి బలి- ఎప్పటికిక తీరుతుందో (సోనియా ఆకలి) ఆగని ఈ ఘోరకలి
నరమేధం సాగుతోంది నాన్చే ధోరణిలో- అసంఖ్యాక శిరఛ్ఛేద చింతామణిలో
ప్ర్రాణాలతో బేరమాడినా ఫరవాలేదు- నాల్గుకోట్ల తెలంగాణ వెఱవబోదు

4.శ్రీకాంతులెంత మంది తగుల బడి పోవాలో- వేణుసువర్ణలెందరు మంటలపాలవ్వాలో
అమరవీరులారా ఆగదు మన సమరం- మీ బలిదానాలు వృధాకాని పోరాటం
తెలంగాణ ఒక్కటే మన లక్ష్యం- మీ ఆత్మల సాక్షిగా వెలుస్తుంది మన రాష్ట్రం
మన తెలంగాణ రాష్ట్రం జైతెలంగాణా! జై జై తెలంగాణా!!
నేలకొరిగిన వీరులారా!వందనం వందనం
తలలు తెగిన తమ్ములారా అందుకోండి మా సలాం
తెలంగాణా బిడ్డలారా! మీకు అశ్రుల తర్పణం
తెలంగాణా సాధించగ మేము సైతం అర్పణం

1.మీరు నడిచిన పోరు బాట వదలబోమయ్యా
మీరు చేసిన ఆత్మత్యాగం మరువ బోమయ్యా
తెలంగాణా తల్లికోసం వేల జన్మలు కోరుతాం
తెలంగాణా స్వేఛ్ఛకోసం కోట్లమందిమి పోరుతాం

అస్తమించిన అమరులారా! జోహార్ జోహార్
స్వర్గమేగిన యోధులారా అందుకోండి దిల్ సె ప్యార్

2.నూరేళ్ళ జీవితాలు తృణప్రాయం చేసినారు
ముక్కుపచ్చలారకుండగ మృత్యువొడిలో చేరినారు
కరుడుగట్టిన గుండె కూడ కరిగిపోతుంది
మీరు చేసిన ఆత్మబలికి విలువ వస్తుంది
మా కంటివెలుగై కదలినారు కదన రంగంలో
ఇంటింటి దివ్వెగ నిలువగలరు తెలంగాణా చరితలో

సమరానికి చరమగీతం- ప్రగతికి ఇక సుప్రభాతం
తెలంగాణ సాధించిన జనగీతం
చిరకాల స్వప్నాల సాకారగీతం
జయగీతం-విజయగీతం- తెలంగాణ తల్లికి-ప్రణమామ్యహం
జైతెలంగాణా! జయహో తెలంగాణా!!

1. కలిసిఉంటె-కలదు సుఖము-ఇది స్పష్టం
ఐకమత్యమే- బలమన్నది-అక్షర సత్యం
స్పర్దతే వర్దయా విద్యా అనుసూక్తీ ఒకటుంది
పోటీ ఒకటుంటేనే-మన పటిమను-చాటుతుంది

2. భారతీయులుగ మనం ఒకటిగానె ఉందాం
దాక్షిణాత్యులుగా మన ఐక్యత తెలుపుదాం
తెలుగువాణి ఎల్లప్పుడు గర్వంగా వినిపిద్దాం
తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాల్లో జీవిద్దాం

3. మనుషులుగా మనమెప్పుడు- మానవతను బ్రతికిద్దాం
ప్రాణమున్నజాతిగా -జీవ కరుణ చూపుదాం
బుద్దిజీవులైనందుకు పర్యావరణం కాచుదాం
విశ్వజనీన మైనదైన -ప్రేమను కనబఱచుదాం
గొంగళిలో తింటూ-ఏరబోకు వెంట్రుకలు
మురుగుకాలవలో ఉంటూ-మూసుకోకు నాసికను
రాజకీయనాయకుడా!అమాయకుల మాయకుడా!!
పార్టీ ఏదైనా నీవే ఒక బూటకం-గమనిస్తున్నారు ప్రజలు నీ వింత నాటకం

1. నరంలేని నాలుకనీది-స్థిరమేది నీవెన్నెముకకి
మాట నిలకడేలేదు-ఎప్పటికీ కప్పదాటు
ఊసరవెల్లే నీకంటే ఎతెంతో నయం నయం
గుంటనక్కే ఎఱుగదు నీ మాయోపాయం

2. పదిమందితో తిరిగి –పతివ్రతల ఫోజులు
నిజాయితీ జాడలేని-నికృష్టపు రీతులు
ఎంచగలవు ఎప్పుడు-ఎదుటిపార్టీ తప్పులు
గ్రహించలేవు తొడిగావని-నీవవే చెప్పులు

3. తెలంగాణ కోరుకుంటె-పార్టీలు వదిలిపెట్టు
సభ్యునిగా సైతం-రాజీనామాను పెట్టు
ఉద్యమాన ముందునిలిచి త్యాగాలకు తలపడు
తల్లి ఋణం కాస్తైనా-తీర్చుకొనగ త్వరపడు
రాయబారాలు తగవు-బేరసారాలు తగవు
మీనమేషాలు తగవు-తక్షణ కర్తవ్యం ఒకటే తగవు
తెలంగాణ యువకుడా –తాత్సారాలు తగవు
విద్యార్థి తమ్ముడా-ఉద్యమాల చరిత్రలకు నీవేలే ఆద్యుడవు

1. చింతకాయలే రాలే మంత్రాలు వెయ్యాలి
దెయ్యాన్ని వదిలించగ చెప్పులనే వాడాలి
మంచిగ చెబితే వింటున్నార ఎవరైనా
గుణపాఠం నేర్పించగ నడుంకట్టు ఇకనైనా

2. అమ్మపాలు తాగి రొమ్ముగుద్దకూడదు
తిన్న ఇంటి వాసాలు లెక్కించకూడదు
ఆంధ్రవలసవారంతా జై కొట్టితీరాలి
తెలంగాణ తల్లికి తలలు వంచి మొక్కాలి

3. రోమ్ లో ఉండేవాళ్ళు రోమన్ లాకావాలి
క్షేమాన్ని కోరుకొని మనతొ మమేకమవ్వాలి
తమకోసం శ్రమవలదని ఆంధ్రులకి చెప్పాలి
తమకోసం భయమొద్దని ఆంధ్రులకి చెప్పాలి
సమైక్యవాదమింక సంక నాకి పోవాలి

4. స్థిరపడిన ప్రజలంతా ఆంధ్ర సంగతి మరవాలి
తెలంగాణ బిడ్డలమని కలలొకూడ తలవాలి
ఉద్యమాన పాల్గొని సంఘీభావం చాటాలి
జైతెలంగాణ అంటు గొంతెత్తీ పాడాలి
పుట్టుకతోనే ఉద్యమకారులు పుట్టుక రారయ్యా
తల్లి కడుపులోనుండే నడుములు బిగించి రారయ్యా
ఇల్లు తగలబడి ఒకరు-కడుపులొ కాలి ఇంకొకరు
ఎగబడతారు దిక్కు తోచక-తెగబడతారు ఆకలి తీరక
జై తెలంగాణ! జై జై తెలంగాణా!!

1. చలిచీమలనిఎంచి నలిపివేస్తుంటే-
తప్పదు చావు ఎంతటి సర్పానికైనా
నయవంచనలెప్పూడూ పెంచిపోషిస్తుంటే-
తిరబడి రక్కుతుంది సాదుకునే పిల్లైనా
తయారుచేయకు –సాధనాలనే-మారణాయుధాలుగా
మార్చివేయకూ-శాంతివనాలనే- స్మశానాలుగా

2. మానవత్వమంటూనే పెడుతున్న ఈ మంటలు-
ఎలా రేపకుంటాయి ఈర్ష్యాద్వేషాగ్నులు
సౌభ్రాతృత్వమనే ముసుగుతో దొపిడీలు-
చెప్పకనే చెబుతాయి ఎదలోని కల్మషాలు
కలిసిఉండి అనుక్షణం- కలహించ భావ్యమా
విడివిడిగా ఉండి కూడ-ఆత్మీయత పంచుకోమ

3. ఎదుటివాడి కడుపుకొట్టి-ఏం బావుకొంటారు-
పక్కవాడి నోరు నొక్కి-గొంతు చించు కొంటారు
కూడబెట్తుకున్న ఆస్తి కడదాకా వెంటరాదు-
మేడపైన మేడలేల ఆరడుగుల నేల చాల
ఇకనైనా కళ్ళు తెఱచి దారికాస్త వదలరాద-
తెలంగాణ సాధనకై చేయూత నీయరాద
రాష్ట్రం సాధించకుంటే –మననోట్లో మన్నేరా
పాలన మనదవకుంటే-బానిసోల్ల బతుకేరా
తెలంగాణ తమ్ముడా-తెగువజూపి పోరాడు
తెగేదాక లాగేద్దాం-చీకిపోయింది తాడు

1. ఎన్నాళ్ళని భరిస్తాము-దగాకోరు నాటకాలు
ఎన్నేళ్ళని సహిస్తాము-వంచనలు కుత్సితాలు
ఒకటారెండా ఎన్నెన్నని-వెంచగలము
దశాబ్దాలు గడచినా-ఎంతని మన్నించగలము
ఎన్నైనా చెప్పగలము సుస్పష్ట తార్కాణాలు
ఎన్నైనా చూపగలము నిర్దుష్ట నిదర్శనాలు

2. వద్దువద్దని నెహ్రూ –వాదించినాగాని
మాయచేసి కలిపారు ఆంధ్రులతో ఆనాడు
పడనినాడెప్పుదైన విడిపోవుట సబబని
తేల్చిచెప్పినాడు-క్రాంతదర్శి జవహరుడు
కలతలతోఎన్నాళ్ళు -చేయాలి కాపురాలు
కూలిపోకతప్పదుఇక –శిథిలమాయె గోపురాలు

3. పెద్దమనుషులొప్పందం-కాలరాచినారు
ముల్కీనిబంధనలు-తుంగలోతొక్కినారు
ప్రభుత ఉత్తర్వులన్ని-అటకలెక్కించినారు
సర్వోన్నత తీర్పులన్ని-బేఖాతరు చేసారు
ఇంతకన్న ఏముంటుంది-వివక్ష అంటే
పగలబడి నవ్వొస్తుంది-సమైక్యమంటే

4. ఎవరికేది లాభమో-దాన్నివారు కోరుతారు
అతితెలివిగ ఆంధ్రులెపుడు-మన యింట్లో చొర్రుతారు
ఎవరింట్లో వారుంటే-అందరికీ సంక్షేమం
కలోగంజోతాగినా-అదియేకద ఆనందం
మాటవేరు మనసువేరు-తినేతిండి తీరువేరు
దృష్టివేరు స్థాయివేరు-పండుగ పబ్బాలువేరు
అనుసరించు ఈ మార్గాలు-నిరసన ప్రకటనకు
పాటించు ఈ ధర్మాలు-శాంతియుత పోరుకు
అందరి గమ్యం తెలంగాణా-అంతిమ లక్ష్యం తెలంగాణా

1. లూఠీలు దహనాలు-కావు హర్షణీయాలు
రాస్తారోకొ బందులు-ముందరి కాళ్ల బంధాలు
దాడులు ధ్వంసాలెలా-సమర్థనీయాలు
ఆత్మహత్యలెప్పుడూ-తేవు పరిష్కారాలు

2. ప్రతి విధ్వంసం-ప్రజలకే బహు నష్టం
పన్నులు ధరలు-పెరిగేది సుస్పష్టం
కాకూడదెవ్వరికీ-కంటగింపు మన ఇష్టం
ఈ సంగతి మఱచి పోతె-ఎంతటి దురదృష్టం

3. సత్యాగ్రహములు-అహింసాధోరణులు
తెచ్చిపెట్టాయి-స్వేఛ్ఛాస్వాతంత్ర్యాలు
గాంధేయ వాదములు-సర్వులకామోదములు
తిరుగులేని శస్త్రాలవి-మనకు బ్రహ్మాస్త్రములు

4. నిరశన దీక్షలు-మౌనప్రకటనలు
మానవ హారాలు-నలుపురంగు ధారణలు
కలవుకలవుఎన్నెన్నో-కొంగ్రొత్త రీతులు
ఆవిష్కరించునీవు-విన్నూతన తెన్నులు

5. మన నినాదాల హోరు-దేశమంత మ్రోగాలి
గొంతులన్ని ఒక్కటవ్వ-ఢిల్లీయే వణకాలి
కదంత్రొక్కి అడుగులేయ-భూకంపం రావాలి
కోట్లమంది కోర్కె తెలంగాణయని తెలపాలి
పోరాట పటిమ నీదే- త్యాగాల ఘనత నీదే
ఓ ఉద్యమ కారుడా- తెలంగాణ వీరుడా
జై తెలంగాణా!జైజై తెలంగాణా

1. నివురు గప్పి ఉన్ననీవు-ఆరిపోని నిప్పేగా
అణిగిమణిగి ఉన్ననీవు-నిజమైన ఉప్పెన
నీగుండె బ్రద్దలైతె-పెల్లుబుకును లావా
గొంతెత్తి గర్జిస్తే-భూ కంపాలు రావా
గల్లీ నుండి డిల్లీవరకు-పీఠాలు కదిలి పోవా
జై తెలంగాణా!జైజై తెలంగాణా

2. ఆశయాల సాధనకై -అసువులైన తృణప్రాయం
కాలమెంత గడిచినా –మానకుంది నీ గాయం
ఇకనైనా తెలియజెప్పు-ప్రభుత కొక్క గుణపాఠం
తెలంగాణ తథ్యమన్న-తిరుగులేని నగ్నసత్యం
సత్వరంగ తెలంగాణ ఇవ్వాలన్న సందేశం
జై తెలంగాణా!జైజై తెలంగాణా
పదేపది జిల్లాలు తెలంగాణలో...మన తెలంగాణలో
పదేపదే ఉత్తేజాలు హృదయాలలో..మన హృదయాలలో
ఇదే అదను మేల్కొనగ గ్రామగ్రామం
మేధపదును పెట్టి నడుపు సంగ్రామం
తెలంగాణ వీరుడా!విద్యార్థి తమ్ముడా!!
జై తెలంగాణా!జై జై తెలంగాణా!!

1. తలపండిన భీష్ములను -శిఖండితో గెలవాలి
ద్రోణులనిర్వీర్యులజేయ-బొంకులైన పలకాలి
అలంబసులనెదిరించగ ఘటోత్కచులు కావాలి
కర్ణులను కడతేర్చగ కుట్రలైన చేయాలి

2. గీతోపదేశాన్ని -మరవబోకు ఎన్నడు
పరమశివుడె ఎదురైనా –వెన్నుచూపకెప్పుడు
అర్జునుడై గర్జించు..దుర్జనులను నిర్జించు
పద్మవ్యూహాలున్నా-వరుసబెట్టి ఛేదించు

3. పోరాటానికొకే లక్ష్యం-అదే కదా విజయం
అభిమన్యులకోల్పోయిన -సంయమనం పాటించు
తెలంగాణ సాధనే -ఈ భారతయుధ్ధం
చేయవోయి పార్థుడా-పాశుపతం సంసిధ్ధం
మా గుండె ఒక్కటే- మా మనసు ఒక్కటే
మా మాట ఒక్కటే- మా బాట ఒక్కటే
జై తెలంగాణ- జైతెలంగాణ

1. రంగురంగుల-అంగీలు తొడిగినా
రకరకమ్ముల- దుస్తులు వేసినా
పలువిధమ్ముల-పక్షాలు కలిగినా
వేరువేరుగ-మార్గాల సాగినా
మా కాంక్షఒక్కటే-తెలంగాణా
మా లక్ష్యమొక్కటే-తెలంగాణా

2. మాలొ మేముగా-వాదించుకొన్నను
వ్యక్తిగతంగా-భేదించుకొన్నను
భావసారూప్యత-లోపించి యున్నను
భిన్నమైన ధృవాలని-తలపించుచున్నను
మా వాదమొక్కటే-తెలంగాణా
నినాదమొక్కటే-తెలంగాణా
ఒక్కరు కాదు ఉద్యమమంటే ఉప్పెనరా అది
ఓటమికాదు ఓరిమి అంటే సునామి అవుతుంది
సమిధలు జ్వలియిస్తెనే యజ్ఞం ఫలమిస్తుంది
త్యాగాలకు తలపడితేనే తెలంగాణ వస్తుంది
జై తెలంగాణా జయహో తెలంగాణా

1. తరుణం మనకిది -తప్పని రణమిది -తగ్గకు వెనకడుగేసి
మనుగడ కోసం -చేసే రగడిది - మరలకు వెన్నుచూపి
పిడికిలి బిగియిస్తేనే సంసిద్ధత తెసిసేది
పిడుగులు కురిపిస్తేనే యోధత్వం గెలిచేది

2. మరణం మనిషికి- ఎప్పటికైనా- తప్పనిదే కదా
ప్రాణం పోరుకు -ధారపోస్తే –విలువొస్తుందిగా
ఆత్మహత్యలెన్నటికీ హర్షణీయమే కాదు
సమరంలో అమరులమైనా చిరంజీవులౌతాము

3. స్వాతంత్ర్యానికి చేసారెందరొ బలిదానాలు
స్వేఛ్చా వాయువు పీల్చుటకొఱకే ఊపిరులొదిలారు
ఒక్కమాట పైననే దేశీయులు నిలిచారు
చిత్తశుద్దితోడనే లక్ష్యం సాధించారు

4. గాంధీ మార్గం -అనితర సాధ్యం-తోకముడిచాడు తెల్లవాడు
సత్యాగ్రహమే-ఉద్యమ సూత్రం-వాడిగెలిచాడు మహాత్ముడు
స్పూర్తితో సాగించు చివరి పోరాటం
నేర్పుతో సాధించు తెలంగాణ రాష్ట్రం
ప్రజ్వలించె జ్వాలలకు -బాధ్యులెవ్వరు
రగులుతున్న గుండెలకు -కర్తలెవ్వరు
రేగుతున్న ఆశాంతికీ -నిర్ణేతలెవ్వరు
నోటి ముందటి బుక్కను-ఎత్తగొట్టిందెవ్వరు

1. దశాబ్దాలుగ తెలంగాణ-నణగద్రొక్కిందెవ్వరు
సమైక్యాంధ్ర పేరు చెప్పి- చిచ్చు పెట్టిందెవ్వరు
మాటతప్పి మడమతిప్పి-తోకముడిచిందెవ్వరు
కాలి బ్రతుకులు బూడిదైతె-చోద్యమును చూస్తున్నదెవ్వరు

2. రాజ్యాంగం స్పష్టపఱచినా-రచ్చకీడ్చిందెవ్వరు
ప్రజలు తెలంగాణమన్నా-దాటవేస్తున్నదెవ్వరు
ఆడలేక మద్దెల ఓడు- అంటున్నదెవ్వరు
ఏకాభిప్ర్రాయమెలికతో-చేతులెత్తేసిందెవ్వరు

3. వద్దన్న ఆలితో-సంసారం బలాత్కారమే
కాదన్న వారితో-మనుగడ ప్రశ్నార్థకమే
ఒళ్ళంతా కంపరమైతె-కలయిక కల ఇకనే
మనసులంటు విరిగిపోతే-చెలిమి యిక దుస్సాధ్యమే

4. పాలివారి ఆస్తిని-పంచిమా కిమ్మనలేదు
పక్కవారి నిధులేవి-దోచుకొంటామనలేదు
ఉన్నవారినెవ్వరినీ-వదిలి పొమ్మనలేదు
(మా)తెలంగాణ మాకిస్తే-మీ సొమ్ముపొయ్యేది లేదు
కౌటిల్యతుల్యులైన ఆంధ్రులారా
ధృతరాష్ట్ర ప్రేమచూపు దాయాదులారా
వద్దువద్దు మాకింకా మీతో సహజీవనం
మమ్ము మా మానాన-బ్రతకనిస్తె ముదావహం

1. జలగలై ఎన్నాళ్ళు పట్టి పీడిస్తారు
నల్లులవలె నెత్తురెంత కుట్టి పీలుస్తారు
పరాన్నబుక్కులై ఎంతకాలముంటారు
కల్లబొల్లిప్రేమలెలా-కనబర్చ గలుగుతారు

2. బంధమంటె ఇరుమనసులు ఒకటిగ కలవాలికదా
స్నేహాన్ని ఎదుటివారు ఒప్పుకోవాలికదా
ఏకపక్ష ప్రేమలు ఎంత హాస్యాస్పదాలు
వద్దన్న వనితనే వేధించు చందాలు

3. తెలంగాణీయులు-ఒకరైనా మిము కోరారా
పక్కలోన బళ్లెంలా - భావించకున్నారా
మీకుమీరె తీర్పులిస్తే - అమలుజరిగిపోతుందా
సమైక్యమని వల్లిస్తే - పబ్బం గడిచి పోతుందా
దున్నపోతు ఈనుతుంది మీ మాటల్లో
నోరు నొసలు వేరువేరు-మీ వ్యక్తీ కరణల్లో
పులుముకొన్న చిరునవ్వులు-మీ మొహాలలో
అణువణువు విషమేకద-మీ దేహాలలో

1. హైద్రాబాద్ లోనఎలా -తెలంగాణ ఆంధ్రలు
వస్తే గెలిపిస్తారా-ఆంధ్రకి మా నేతలు
విడ్డూరాలకైనా- ఉండవా హద్దులు
తెలంగాణ వాళ్ళు కాదు-గొర్రెలు ఎద్దులు

2. ఆస్తులిచట లేవంటూ -ఎందుకింత రాద్ధాంతం
అన్నదమ్ములంటూనే-ఎందుకు భీతావహం
నదీజలాలొదరనే-కదా మీ అనుమానం
మిగిలిన మా నీళ్ళన్నీ-మీకే మా బహుమానం

3. ఆంగ్లేయుల పాలనలో-ఆరితేరినారు మీరు
సావాసదోషంలో-తెల్లవారుగ మీరైనారు
కుటిలనీతులెన్నెన్నో-వొంటబట్టించినారు
కార్యాన్ని సాధించగ-ఎంతకైన దిగజారుతారు
ఇల్లేకద అలికినాము ఇప్పుడు
పండుగకై చేయాలి చడీ చప్పుడు-సందడి ఎప్పుడు
తెలంగాణయను ఢిల్లీ ఉన్నది బహుదూరంగా
వడివడిగా అడుగులేసి చేరాలీ సత్వరంగా

1. ఏప్రయోజనాలు -దెబ్బతినకుండ
ప్రజలమనో భావాలు-గాయపడకుండ
మధించాలి మేధావులు పాలకబంధం (కబంధం=కడలి)
అందించాలి తెలంగాణ అమృతభాండం

2. మోసినారు మంధరగిరి ఉద్యమకారులు
మ్రింగినారు హాలాహలం అమరవీరులు
కల్పవృక్షాదులకై ఎగబడతారసురులు
కంటకనిపెట్టాలి-కలరు రాహుకేతువులు

3. అడ్డు తగులుతుంటారు ఎందరో సైంధవులు
ముందడుగే వేయనీరు అడుగడుగున శిఖండులు
ఆరంభశూరత్వం కాకూడదు వీరత్వం
కలసాకారమైన అపుడేకద సంబరం-కడలేనీ సంబరం
నమ్మబోకు తమ్ముడ యే కల్లబొల్లి మాట
వెలువడాలి ప్రత్యేక తెలంగాణ ప్రకటన
పార్లమెంటు భవనమే ప్రత్యక్ష సాక్షిగ
ఉత్తర్వులు రావాలి ఉన్నఫళంగా

1. కసరత్తులు చురకత్తులు -కమిటీలు బూటకములు
వెన్నుపోట్లె అలవాట్లు-వంచనలే రివాజులు
అరచేతిలొ చూపగలరు వైకుంఠాలు
బొందితోనె చేర్చగలరు ...స్వర్గాలు

2. అందితే జుట్టు అందకుంటె కాళ్లు- అవకాశవాద రాజకీయాలు
ఏరుదాటగానే తెప్పను తగలెయ్యడాలు
కంటితుడుపు మాటలు-ఎదలొ కుటిల రీతులు
కబుర్లతోనే కాలం కరుగదియ్యడాలు
సమైక్యాంధ్ర వాదనలో –ఎక్కడుందినిజాయితి
కనబడుతూనే ఉన్నది ఊసరవెల్లుల సంగతి
ఒళ్లుకాలి ఒకడేడుస్తుంటే-ఇల్లుకూడ తగలబెట్టురీతి

1. ప్రత్యేక తెలంగాణ -మ్రింగుడు పడలేక
జై ఆంధ్రా రాయలసీమ అనిబయటకు అనలేక
పూటకో వ్యాఖ్యతో-గంటకో లక్ష్యంతో
తికమక పడుతున్నారు-కక్కలేక మ్రింగలేక

2. అసలుబాధ ఉన్నదంత హైదరాబాదేరా
అందుకే అవుతున్నారు గాబరగాబరా
ఇంతచిన్న సంగతి ఎవరైనా ఎరుగరా
ఎదుటివాడి గుండెకాయ అడిగితే తప్పురా

3. దేశమంతమనదేకద -ఎక్కడైన బ్రతకవచ్చు
ఉద్యోగవ్యాపారాలు-అందరు చేసు కోవచ్చు
వచ్చినోళ్ళు మెల్లెగా- చాపక్రింద నీళ్ళుతెచ్చు
అప్పుడే రేగుతుంది-స్థానికుల్లొ చిచ్చు

4. పార్టీలుమాయమై –ప్రాంతీయత వెల్లివిరిసె
సిసలైన రాజకీయ-మిపుడేకద మనకు తెలిసె
వద్దని వదిలించబోతె -గుదిబండగ ఉంటారట
అన్నమాటవినకుంటే- హానికితలబడతారట