Wednesday, October 16, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హిందోళం

బద్దకం దుప్పటి తొలగించు
పొద్దున్నే ఉషస్సు నాస్వాదించు
ప్రకృతితో చెలిమిచేస్తు నడకసాగించు
పరిసరాల పచ్చదనం తనివిదీర పరికించు
శుభోదయం అన్న మాట సాకారం కావించు
ప్రతివారిని ప్రేమిస్తూ చిరునవ్వుతొ పలకరించు
శుభోదయం నీకీదే నేస్తమా నవోదయం మనకిదే మిత్రమా

1.చిన్నచిన్న త్యాగాలతొ మంచితనంనార్జించు
ధనమో శ్రమనో సమయమో కేటాయించు
మనసుంటే మార్గమొకటి ఎదురౌను గ్రహించు
ఈర్ష్యాద్వేషాలు త్రుంచి స్నేహితాన్ని నిర్మించు
ప్రతివారిని ప్రేమిస్తూ చిరునవ్వుతొ పలకరించు
శుభోదయం నీకీదే నేస్తమా నవోదయం మనకిదే మిత్రమా

2.హృదయానికి నాలుకకు దూరాన్నితగ్గించు
అవగతమౌ భావనగా ఎదుటి ఎదకు ప్రవహించు
విశ్వమె నీ సొంతమనే స్వార్థంగా వ్యాపించు
అందరునీ  బంధువులే అనుకొంటూ ప్రవర్తించు
ప్రతివారిని ప్రేమిస్తూ చిరునవ్వుతొ పలకరించు
శుభోదయం నీకీదే నేస్తమా నవోదయం మనకిదే మిత్రమా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నీకూ నాకూ నడుమన నీ నడుమే ఓ వంతెన
ఉండీలేదనిపిస్తూనే ఉడికించే భావన
పిడికెడే ఆ కొలమానం
అది బ్రహ్మ ఇచ్చిన బహుమానం

1.చూపులను మెలితిప్పే సుడిగుండమే నాభి
తాపసులకైనా యమగండమా ఊబి
తరచిచూస్తే ఏముంటుంది బొడ్డుమల్లి వైనం
శోధిస్తే దొరకదు మర్మం ఉల్లి పొరల వైచిత్రం
చీరకట్టు చెలియలికట్ట దాటబోవు కెరటం పొక్కిలి
కోక మబ్బుచాటునుండి తొంగిచూసె తుండి జాబిలి

2.వంపులవయ్యార మొలికే కటి కిన్నెర సాని
మడతల్లో మతలబు చిలికే కౌను కృష్ణవేణి
భరతముని పని నెరవేర్చిన ఇక్కు నాట్యరాణి
హంసకే గురువుగమారిన మధ్యమమొక మహరాణి
మన్మథుడే తడబడినాడు వేయలేక బాణాల్ని
ఏ కోణం తిలకించినా లాగుతుంది ప్రాణాల్ని
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

శ్రేయస్సు కోరే వాడే దేవుడు
యశస్సు పెంచేవాడే దేవుడు
మనస్సుకే ప్రశాంతినే ఒసగువాడు దేవుడు
సన్మార్గము చూపువాడె దేవుడు
ఇన్నిగుణములున్నవాడు ఒకడే గురుదేవుడు
షిరిడిలోన వెలసినా సమర్థ సద్గురుడు సాయినాథుడు

1.కష్టాలనెదుర్కొనే ఆత్మ స్థైర్య మిచ్చేవాడు
పెనుసవాళ్ళు స్వీకరించు ధైర్యముకలిగించువాడు
వేదనలో అండగనిలిచి ఓదార్పు నిచ్చేవాడు
శ్రద్ధాసహనములను సమకూర్చే వాడు
ఇన్నిగుణములున్నవాడు అతడే కదదేవుడు
షిరిడిలోన వెలసినా సమర్థ సద్గురుడు సాయినాథుడు

2.చెప్పడానికంటె ముందు చేసిచూపించువాడు
తనపరభేదమేది కనబఱచనివాడు
మనలోని దక్షతను ప్రకటింపజేయువాడు
కర్మకు తగుఫలితాలను అందజేయువాడు
ఇన్నిగుణములున్నవాడు అతడే కదదేవుడు
షిరిడిలోన వెలసినా సమర్థ సద్గురుడు సాయినాథుడు