Friday, November 18, 2022

 

https://youtu.be/_xNBxT9BET0?si=GIuY_sKvN6318vKn

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మోహన


శ్రీ నివాసం నీ హృదయాన

నీ నివాసం మా హృదయాన

నీవుండేది తిరుపతి కొండనా

బండబారిన మా గుండెనా

తండ్రీ వేంకటేశ భక్తపోషా

కృపా విశేషా శ్రీశా సర్వేశా


1.నవ్వే… బ్రతుకు బండికి

నొగలే విరిచేస్తావు,చక్రపు శీలను తీసేస్తావు

ప్రశాంత సరోవరాన

అశాంతి రేపుతావు అలజడి సృష్టిస్తావు

అర్థం పర్థం ఉంటే గింటే నీకే తెలియాలి

చీకూ చింతా మాకంటించి నీవే మురియాలి


2.మా మానాన మమ్మెపుడూ

మననీయ వేలనో పడద్రోసెద వేవేళనో

విషాదాలనే కుమ్మరించి

వినోదింతువేలనో విపరీతమతి యేలనో

ఇస్తే గిస్తే చచ్చేదాకా హాయిగా ఉండే వరమివ్వు

ఇహము పరము నీ చేరువకే మము చేరనివ్వు

 https://youtu.be/h8C6gOlxdwM

రచన,స్వరకల్పన&గానం:డా. రాఖీ


సోకేను చందన గంధం నీవున్న తావులో

తాకేను దవన సుగంధం నీమేను రేవులో

చెలీ సఖీ ప్రియా పారిజాత పరిమళమే నీ నగవులో

మనోహరీ  ప్రేయసీ గులాబీ గుభాళింపే నీ కురులలో

మత్తేదొ కలిగించి గమ్మతు చేస్తుంది

మనసు వశ పరచుకొని ననుచిత్తు చేస్తుంది


1.చీకటిలో దాక్కున్నా పట్టిస్తుంది

 నీ ఒంటి నంటుకున్న ఘుమఘుమ వాసన

నీరాకను సైతం తెలుపుతుంది 

దవ్వున నువ్వున్నా మొగిలి తావి నీ తనువున

మత్తేదొ కలిగించి గమ్మతు చేస్తుంది

మనసు వశ పరచుకొని ననుచిత్తు చేస్తుంది


2.మోహాన్ని కలిగిస్తుంది

నీ దేహం వెదజల్లే  కస్తూరి సౌరభం

మైకంలో ముంచేస్తుంది

నీ మెడవంపు విరజిమ్మే జవ్వాజి పరివాసం

మత్తేదొ కలిగించి గమ్మతు చేస్తుంది

మనసు వశ పరచుకొని ననుచిత్తు చేస్తుంది

 

https://youtu.be/KBfUzqwpWUo

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రేపంటూ ఉంటుందో ఉండదో

మనమంటూ ఉంటామో ఉండమో

ఉన్నంత సేపే ఈ ఆపసోపాలు

చేజారిపోయిందా మేనే బుగ్గిపాలు

స్నేహించుదాం ప్రేమించుదాం

మమతనే పంచుదాం

స్పందించుదాం నందించుదాం

నవ్వుతూ జీవించుదాం


1.సేకరించుతూనే బ్రతుకంతా తేనెటీగలౌతున్నాం

అనుభవించు వేళసైతం ఆర్జనకే తగలేస్తున్నాం

వినోదించలేక ప్రతినిమిషం వ్యర్థంగా గడిపేస్తున్నాం

విలువైన కాలాన్నీ వృధాగా వెళ్ళ బుచ్చుతున్నాం

ఆటల్ని ఆడుదాం పాటల్ని పాడుదాం

సరదా సరదాగా ఉందాం


2.తిరిగి కోరితే సాధ్యం కాదు గతం గతః

భవిష్యత్తుకు రూపులేదు ఎండమావి తరహా

మంచి తరుణం రానేరాదు ఈ క్షణం మినహా

ఆహ్లాద భరితంగా జీవిద్దాం పదిమందితో సహా


తరియించుదాం మనం తరియింజేద్దాం

అంతరాలనే అంతరింపజేద్దాం

 

https://youtu.be/BjwlVDRePYI?si=EqjCFiFe2G3uLCzn

రచన,స్వరకల్పన&గానం:డారాఖీ


చేసిన బాసలు ఆడిన ఊసులు 

రేపిన ఆశలు అడియాసలాయే

ఉసూరని ఉత్సాహమే నీరసమాయే

ఉవ్విళ్ళూరే ఉబలాటమే కరిగి కన్నీరాయే


1.గోరంత ఔనంటే కొండంత సంబరమాయే

మనసే స్వేచ్ఛగ ఎగిరిన పావురమాయే

నీ వాలకం నాకెపుడూ ఓ మహామాయే

చెప్పిన మాట తప్పగ అంతలోనే ఏమాయే


2.చిన్న చిన్న ఆనందాలు నీ వల్లే నీవల్లే

చింతల చీకట్లకైతే నీ నవ్వులు వెన్నెల్లే

ఊపిరులున్నంతదాకా నాకూరట నీవేలే

తేలికగా నను తీసుకోకు నా ప్రాణం నీవేలే